17, మే 2024, శుక్రవారం

సిరికొలువు

 _*సిరికొలువు*_


_*(తిరుచానూరు శ్రీ క్షేత్ర మహిమ)*_

 *18.భాగం* 


_*శ్రీ వైకుంఠంలో పరంధాముడు*_


ఇంత ప్రత్యేక దృష్టితో బ్రహ్మసృష్టించిన భూలోకాన్ని ఇతర లోకాలకంటే మిన్నగా శ్రద్ధగా ప్రేమగా పోషించ సాగినాడు పరంధాముడైన 

శ్రీ మహావిష్ణువు. 


వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుని ఆదేశం మేరకు ఎందరో పరమ యోగులు, మరెందరో మునులు, ఋషులు లోకకల్యాణం కోసం తప మాచరిస్తూ వుండినారు. ఎట్టి ఒడుదుడుకులు లేకుండా కొన్ని వేల ఏండ్ల కాలం గడిచిపోయింది.


ఇలా ప్రశాంతంగా తపస్సులు చేసుకుంటున్న ఋషీశ్వరులకు తమ ధ్యానంలో కొన్ని అమంగళ దృశ్యాలు గోచరించాయి. అనేక ఈతి బాధలు, అతి వృష్టి, అనావృష్టి, భూకంపాలు, జలప్రళయాలు, 


జంఝూమారుతాలు భయానకమైన రోగాలు ఇవన్నీ భూలోకాన్ని చుట్టుముట్టినట్లు, వీటితోపాటు రక్కసుల బెడద దాపురించినట్లు భీతిని కలిగించే భయానక ఘట్టాలు ఆ తపోమూర్తులకు కన్పించాయి. 


వీటన్నింటి నుండి బయటపడలేక సతమత మవుతున్న భూలోక మానవులు నిస్సహాయంగా, సహాయం కోసం, చేయూతకోసం నింగివైపు అర్రులు చాస్తూ వుండిన సన్నివేశాలు, ఆ మహనీయు లకు కన్నులకు కట్టినట్లు గోచరించినాయి.


"దీనికి పరిష్కారం ఏమిటి? భవిష్యత్తులో మానవుడు వైకుంఠానికి గాని, కైలాసానికి గాని వెళ్లి నేరుగా 

శ్రీ మహావిష్ణువుతో, పరమశివునితో మొరపెట్టు కోగలడా? సాధ్యం కాదే! మరి వారికి ఏది దారి? భవిష్యత్తులో రాబోయే విపత్తులనుంచి మానవుని ఎలా రక్షించాలి. దీనికి పరిష్కారం ఒక్కటే. 


మనం అందరం త్రిమూర్తుల దగ్గరికి వెళ్లి మొరపెట్టు కోవడమే. వేరే మార్గం లేనే లేదు" అంటూ భూలోకంలోని తపస్సంపన్నులైన ఋషివర్యులందరూ, దేవతలతో పాటుగా అందరూ నేరుగా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లారు.


"ఔనౌను! మీరంటున్నది నిజమే. దానికి పరిష్కారం శివుడు చెప్ప గలడేమో' అంటూ అందరినీ కైలాసానికి పిలుచుకువెళ్లాడు బ్రహ్మదేవుడు.


బ్రహ్మాది దేవతలతో వచ్చిన ఋషీశ్వరులను చూచి వారు చెప్పింది సావధానంగా విని ఇలా అన్నాడు పరమశివుడు. “నిజమే మీరు చెప్పింది సత్యం. భవిష్యత్కాలంలో వచ్చే ఇక్కట్లను పోగొట్టి లోకకల్యాణం చేకూర్చగల నిత్య కల్యాణ చక్రవర్తి ఆ 

శ్రీ మహావిష్ణువు ఒక్కడే. 


అన్నింటిని పరిష్కరించి, దారి

చూపించగలవాడు ఆ వైకుంఠ వాసుడు ఒక్కడే. కనుక అందరం కలిసి అక్కడికే వెళదాం పద" అంటూ అందరినీ వైకుంఠలోకానికి పిలుచుకువెళ్లాడు.


ఈశానాది దిక్పాలురు, బ్రహ్మాది దేవతలు, ఎందరో మహనీయులయిన తపస్సంపన్నులు ఎందరోవచ్చి శ్రీ వైకుంఠనాథుని దర్శించి మొరపెట్టుకొన్నారు. 


అతి తొందరలో ఏవేవో విపరీతాలు కలుగుతున్నట్లుగా దృశ్యాలు గోచరిస్తున్నా యని, దానికి పరిష్కారం చూపించి, లోకక్షేమం కలిగించ గలిగినవాడవు నీ వొక్కడవే స్వామీ! అంటూ సాగిలబడినారు, దండ ప్రణామాలర్పించినారు.


అందుకు భూరమానాథుడైన 

శ్రీ మహావిష్ణువు ప్రశాంత గంభీరంగా వారిని పరికించి చూస్తూ, దేవతలారా! ఋషీశ్వరులారా! ఆందోళన అవసరమే లేదు.నన్ను దర్శనం చేసుకొన్నారు కదా! 


ఎలాంటి దుర్నిమిత్తాలైనా, తొలగుతాయి. అష్టకష్టాలు కూడా తొలగుతాయి, సమస్త కల్యాణ పరంపరలు సిద్ధిస్తాయి.మీరన్నట్లుగా, రాబోయే కాలంలోబలహీనులు, అలసులు, అల్పా యుష్కులు, నిరంతర లౌకిక వ్యాపారమగ్న మానసులైన మానవులు ప్రత్యక్షంగా వైకుంఠానికి వచ్చి నన్ను దర్శనం చేసుకోలేరు. 


నన్నే కాదు, వారు ప్రత్యక్షంగా, కైలాసానికి గాని, బ్రహ్మలోకానికి గాని రాలేని అసమర్థులుగా వుంటారు. అందుకే భవిష్యత్తులో ఈవిపరీతార్థాలు చోటు చేసుకుంటాయి. మహనీయులారా! మీ మీ ధ్యానంలో గోచరిస్తున్న ఇక్కట్లు మానవులకు కలగకుండా చేయాలి. అందు ఒక్కటే మార్గం వుంది. 


నేను అవతరించడం ఒక్కటే. భూలోకంలో అవతరించి కలియుగాంతం వరకు ప్రత్యక్షంగా దర్శనమివ్వాలి. దర్శించిన వారిని అందరిని తరింపచెయ్యాలి. వారి ఆపదలన్నింటిని తొలగించాలి. 


వారిచేత తృణమో, పణమో దానంగా స్వీకరించి వారి వారి కోరిక లన్నింటిని తీర్చాలి. ఇవే అప్పటి నా అవతారలక్ష్యాలు కావాలి. అప్పుడే మీకు కనపడిన దుర్నిమిత్తాల ప్రభావం వుండదు. ఉన్నా పనిచెయ్యదు.


అయితే నేను భూలోకంలో అవతరించడానికి గాను శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి ఇరువురూ అత్యంత ప్రధాన భూమికను కూడ నిర్వహించవలసివుంది. అంతేగాక ఆయా అవతార సమయాల్లో, నాతో పాటు లోక కల్యాణానికి భక్త రక్షణకు, శ్రీదేవి భూదేవు లిరువురూ అమూల్యమైన పాత్రను పోషించారు. 


అసలు శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి లేకుండా రాబోయే నా అవతారాలు నిర్వీర్యములు, నిష్ప్రయోజనాలు. వారు లేని నా అవతారం ఊహించడం కష్టం, గడచిన యుగాల్లో అన్ని అవతారాల్లో నా వెంట శ్రీలక్ష్మి, భూలక్ష్ములు వచ్చారు. కాని రాబోయే విశిష్టమైన అవతారాల్లో శ్రీలక్ష్మి, భూలక్ష్ములు ఇరువురూ నా కంటె ముందుగా భువిలో అవతరిస్తారు. ఆ తరువాతే వారి కోసం నేను అవతరిస్తాను. వారిరువురి పాత్ర అత్యంత ఆవశ్యకము.భూలోకవాసులకు అరిష్టాలను, అనిష్టాలను తొలగిస్తూ, అభిష్టాలను కలిగిస్తూ లోకానికి క్షేమాన్ని కలిగించే అవతారాలకు దేవర్షి అయిన నారదమునీంద్రులు కూడ కొంత దోహద పడతారు. అంటూ నారదుని వైపు ఒక్క క్షణం పాటు దృష్టి సారించి శ్రీమన్నారాయణుడు అందరితో ఇలా అన్నాడు.


"ఓ దేవతలారా! పరమయోగులైన మహనీయులారా! మీరందరూ ఎంతమాత్రం ఆందోళన లేకుండా నిశ్చింతంగా మీ మీ లోకాలకు వెళ్లండి. అందరూ లోక క్షేమాన్ని కోరుతూ తపస్సులు చెయ్యండి. ధ్యానాలు నిర్వహించండి. 


యజ్ఞాలు, యాగాలు చెయ్యండి. మీ భయాలు తొలగుతాయి. సర్వత్ర శుభపరంపరలు కలుగుతాయి. తద్వారా నిత్యకల్యాణం పచ్చ తోరణంగా అలరారుతుంది. అంతవరకు మీరందరూ నిరీక్షించండి! ఇక మీరందరూ క్షేమంగా వెళ్లిరండి అంటూ వీడ్కోలు పలికినాడు.అందరు వారి వారి లోకాలకు మరలి వెళ్లినారు. కొన్ని వేల సంవత్సరాల కాలం ఇట్టె గడిచిపోయింది.


 *గోవిందా గోవింద గోవిందా!!!!*

కామెంట్‌లు లేవు: