*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది రెండవ అధ్యాయము*
*శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షకభటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*42.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ|*
*వధం నిశమ్య గోవిందరామవిక్రీడితం పరమ్॥9895॥*
*42.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*దీర్ఘప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతిః|*
*బహూన్యచష్టోభయథా మృత్యోర్దౌత్యకరాణి చ॥9896॥*
బలరామకృష్ణులు అవలీలగా ధనుస్సును విఱిచిన విషయములను, దాని రక్షణకై తాను పంపిన యోధులను వధించిన సంగతులను కంసునకు తెలియవచ్చెను. ఆ యదువీరుల బలపరాక్రమములకు అతడు ఎంతయు భీతిల్లెను. దుశ్చింతలలో మునిగియున్న ఆ దుష్టునకు నిద్రయే కఱవయ్యెను. కనులు మూసినను, తెరచినను మృత్యుసూచకములైన పెక్కు అపశకునములు గోచరింపసాగెను.
*42.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి|*
*అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా॥9897॥*
నీళ్ళలోను, అద్దమునందును చూచుకొనినప్పుడు వాని ప్రతిబింబమునందు అతనికి శిరస్సు లేకుండ మొండెము మాత్రమే కనబడుచుండెను. ఆకాశమున చంద్రుడు ఒక్కడే ఉన్నప్పటికిని ఇద్దఱుగా గోచరించుచుండెను. అట్లే ప్రతి నక్షత్రము రెండుగా కనబడసాగెను.
*42.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*ఛిద్రప్రతీతిశ్ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతిః|*
*స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనమ్॥9898॥*
వానికి తన నీడయందు శరీరము శిథిలమైనట్లుగ తోచుచుండెను. చెవులలో చేతుల వ్రేళ్ళు ఉంచినప్పుడు ప్రాణములయొక్క శబ్దములు వినబడకుండెను. వృక్షములు బంగారుఛాయలతో ఒప్పుచున్నట్లు కనబడుచుండెను. దుమ్ములమీదను, బురదపైనను అడుగిడుచున్నప్పుడు పాదముద్రలు కనబడకుండెను.
*42.30 (ముప్పదియవ శ్లోకము)*
*స్వప్నే ప్రేతపరిష్వంగః ఖరయానం విషాదనమ్|*
*యాయాన్నలదమాల్యేకస్తైలాభ్యక్తో దిగంబరః॥9899॥*
స్వప్నములలో ప్రేతలను కౌగలించుకొనుచున్నట్లుగను, గాడిదపై ఎక్కిపోవుచున్నట్లుగను, విషమును భక్షించుచున్నట్లుగను చూచు చుండెను. ఇంకను జపాకుసుమమాలను ధరించినట్లుగను, శరీరమునందు అంతటను నూనెను పూసికొనినట్లుగను, దిగంబరముగా ఉన్నట్లుగను తోచసాగెను.
*42.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*అన్యాని చేత్థం భూతాని స్వప్నజాగరితాని చ|*
*పశ్యన్ మరణసంత్రస్తో నిద్రాం లేభే న చింతయా॥9900॥*
ఈ విధముగా అతనికి స్వప్నజాగ్రదవస్థలయందు ఇంకను పెక్కు అపశకునములు పొడసూపెను. ఆ కారణమున అతని చింత అధికమాయెను. మృత్యుభీతి మెండయ్యెను, కంటికి కునుకు లేకుండెను.
*42.32 (ముప్పది రెండవ శ్లోకము)*
*వ్యుష్టాయాం నిశి కౌరవ్య సూర్యే చాద్భ్యః సముత్థితే|*
*కారయామాస వై కంసో మల్లక్రీడామహోత్సవమ్॥9901॥*
పరీక్షిన్మహారాజా! ఆ రాత్రి ఎట్లో గడచెను. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించెను. అంతట ఆ కంసుడు మల్లక్రీడా మహోత్సవమునకై ఆదేశించెను.
*42.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*ఆనర్చుః పురుషా రంగం తూర్యభేర్యశ్చ జఘ్నిరే|*
*మంచాశ్చాలంకృతాః స్రగ్భిః పతాకాచైలతోరణైః॥9902॥*
వెంటనే కొంతమంది రాజోద్యోగులు మల్లరంగమును సిద్ధపఱచి, దానిని చక్కగా అలంకరించిరి. తూర్యధ్వనులు, ఢంకాధ్వనులు మొదలయ్యెను. ప్రేక్షకులు కూర్చుండుటకై మంచెలను నిర్మించి, వాటిని పూలమాలలతోడను, పతాకములతోను, వస్త్రములతోను, తోరణములతోడను అలంకరించిరి.
*42.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్రపురోగమాః|*
*యథోపజోషం వివిశూ రాజానశ్చ కృతాసనాః॥9903॥*
బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలగు పౌరులు, జానపదులు రాజాజ్ఞప్రకారము అందు ప్రవేశించి, తమ తమ స్థానములలో కూర్చుండిరి. ఆహ్వానములపై ఇతరదేశముల నుండి వచ్చిన రాజులు యథోచితముగా ఆసనములను అలంకరించిరి.
*42.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*కంసః పరివృతోఽమాత్యై రాజమంచ ఉపావిశత్|*
*మండలేశ్వరమధ్యస్థో హృదయేన విదూయతా॥9904॥*
కంసప్రభువు రాజసింహాసనముపై ఆసీనుడయ్యెను. మంత్రులను, మండలేశ్వరులును అతని చుట్టును జేరి కూర్చుండిరి. కాని, అపశకునముల కారణముగా అతని మనస్సు మాత్రము ఆందోళనకు గుఱియైయుండెను.
*42.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*వాద్యమానేషు తూర్యేషు మల్లతాలోత్తరేషు చ|*
*మల్లాః స్వలంకృతా దృప్తాః సోపాధ్యాయాః సమావిశన్॥9905॥*
తూర్యాది వాద్యములు మ్రోగదొడంగెను. అప్పుడు మదించియున్న మల్లయోధులు చక్కగా అలంకృతులై, భుజాస్ఫాలన మొనర్చుచు, తమ మల్లాచార్యులతోగూడి అందు ప్రవేశించిరి.
*42.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*చాణూరో ముష్టికః కూటః శలస్తోశల ఏవ చ|*
*త ఆసేదురుపస్థానం వల్గువాద్యప్రహర్షితాః॥9906॥*
చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలుడు మొదలగు ప్రముఖ మల్లయోధులు వినసొంపైన వాద్యధ్వనులకు పొంగిపోవుచు రంగస్థలమునకు చేరిరి.
*42.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*నందగోపాదయో గోపా భోజరాజసమాహుతాః|*
*నివేదితోపాయనాస్త ఏకస్మిన్ మంచ ఆవిశన్॥9907॥*
కంసుని ఆహ్వానముపై వచ్చిన నందుడు మొదలగు గోపాలురు అందు ప్రవేశించి, తాము తీసికొనివచ్చిన కానుకలను ఆ కంసరాజునకు సమర్పించిరి. పిమ్మట వారు తమ కొఱకై ఏర్పాటు చేయబడిన మంచెలపై ఆసీనులైరి.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే పూర్వార్ధే మల్లరంగోపవర్ణనం నామ ద్విచత్వారింశోఽధ్యాయః (42)*
ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, పూర్వభాగమునందలి *శ్రీకృష్ణుడు కుబ్జపై దయజూపుట - ధనుస్సును విరచి, రక్షక భటులను హతమార్చుట - కంసుడు ఆందోళనకు గురియగుట* యను నలుబది రెండవ అధ్యాయము (42)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి