17, మే 2024, శుక్రవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 

*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*373వ నామ మంత్రము* 


*ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః*


కామేశ్వరునకు జీవనాడి వంటి పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కామేశ్వర ప్రాణనాడీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః*

 అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించు సాధకులు ఆ తల్లి కరుణచే భౌతికపరమైన శాంతిసౌఖ్యములతోబాటు, ఆముష్మికపరమైన అభీష్టముల సిద్ధి లభించును.


పరమేశ్వరి శంకరుని జీవనాడి వంటిది. *శంకరుడు భయంకరమైన విషమును మ్రింగినను మరణమును పొందలేదు. దానికి కారణము నీ తాటంకముల మహిమయే గదా* అని శంకరభగవత్పాదులవారు తమ సౌందర్య లహరిలో ఇరువది ఎనిమిదవ శ్లోకంలో ఇలా అన్నారు:


*సుధామప్యఅర్ధము్య - ప్రతిభయ జరమృత్యు హరిణీం*

*విపద్యంతే విశ్వే - విధి శతమఖాద్యా దివిషదః |*


*కరాలం యత్ క్ష్వేలం - కబలితవతః కాలకలనా*

*న శంభోస్తన్మూలం - తవ జనని తాటంక మహిమా॥*

 

దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడా నిరోధింప బడును.


 ఓ పరమేశ్వరీ! బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ముసలితనాన్ని, మృత్యువును జయించాలని అమృతాన్ని సేవించారు. కాని ప్రయోజనం లేకపోయింది. వారందరూ ప్రళయకాలం వేళ కాలధర్మాన్ని పొందుతున్నారు. కాని అమృతమును కాకుండా మృత్యుతుల్యమైన,అతి ఉగ్రమైన, కాలకూట విషాన్ని మింగిన నీ భర్త పరమశివుడు మాత్రం ప్రళయకాలమందు కూడా కాలధర్మం చెందక కాలాతీతుడై, మృత్యుంజయుడైనాడు.దీనికి కారణం ఏమిటంటే తల్లీ...అదంతా పరమ పవిత్రమైన, పతివ్రతమైన నీయొక్క చెవికమ్మల ప్రభావమే కదా!


తల్లీ! బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల సకల దేవతలూ భయంకరమైన జరామృత్యువులను హరించే అమృతాన్ని గ్రోలి ప్రళయకాలంలో మరణిస్తున్నారు. అతిభయంకరమై లోకాలను దహించే కాలకూటమనే మహావిషాన్ని భక్షించిననూ నీ పతి శంభుడికి (శివుడికి) మరణం సంభవించలేదు. ఇందుకు ముఖ్యకారణం నీ చెవులకు భాసిల్లే రత్నతాటంకాల (రత్నాల కమ్మల) ప్రభావమే కదా! (నీ తేజస్సు మహిమ అంత అద్భుతమైనదని భావము).


తాటాకు, తాళి, తాటంకములు ఇవన్నీ తాటి ఆకు లో నుంచి వచ్చిన పదములు. తాటంకములు అంటే చెవి కమ్మలు.  ఇవి మంగళ సూచకములు. పూర్వపు రోజులలో తాళి, తాటంకములు అన్నీ తాటి ఆకుతో చేసినవే. తాళ పత్రములు అంటే తాటి ఆకులు, వీటి మీదనే మన శాస్త్రములన్నీ మనకు అందించ బడినాయి. కాగితము లేని రోజులలో ఈ తాళ పత్రములనే వాడే వారు. వాటినే తాళ పత్ర గ్రంథములు అని వాటిని పిలిచేవారు. పూర్వపు రోజులలో మరియు ఇప్పటికీ భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవము ఈ తాటాకు పందిళ్ల క్రిందనే జరుగుతుంది. విసన కర్రలు కూడా ఈ తాటాకు తోనే చేస్తారు. ముఖ్యముగా శ్రీ రామ నవమి నాడు ఈ విసన కర్రల వినియోగము చాలా ఎక్కువగా వుంటుంది. తాటాకుతో చేసిన విసనకర్రలను పేద బ్రాహ్మణునికి దానం ఇస్తే మహా పుణ్యము. వడ పప్పు, దక్షిణ తాంబూలములతో తాటాకు విసన కర్రలను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం నేటికి ఆచారముగా వున్నది. 


చెవులలో ఈ తాటాకును దూర్చుకొని ఆభరణముగా కూడా వాడే వాళ్ళు.  అలా వచ్చినవి ఈ తాటంకములు. చెవి కమ్మలు. చెవికి పెట్టుకొనే ఆభరణములు.


తమిళనాడు లోని జంబుకేశ్వరం. ఒకప్పుడు జంబు మహర్షి ఇక్కడ తప మాచరించి శివుణ్ణి పూజించి నందువలన ఈ ఈశ్వరుణ్ణి జంబుకేశ్వరుడు అని అందురు. ఇది ఆపోలింగము.  శివ లింగము వున్న భాగములో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది. జంబుకేశ్వరం లో అమ్మ వారు అఖిలాండేశ్వరి ఉగ్రకళతో చాలా భయంకరముగా ఉండేదని, తలుపులు తీయడానికి కూడా అర్చకులు భయపడుతూ వుండేవారు అని, కొంతమంది ఆమె ఉగ్రకళకు గురి అవుతూ వుండేవాళ్ళు అని పెద్దలు చెబుతూ వుండేవారు. ఇదే విషయాన్నీ వారు ఆచార్యులు వారు అక్కడకు వచ్చినప్పుడు విన్నవించుకొన్నారు. జగద్గురువులు అమ్మను ప్రార్ధించి అమ్మ యొక్క ఉగ్రకళను ఆవాహన చేసి శ్రీచక్ర రూపములో తాటంకములు చేయించి అమ్మ వారికి కర్ణాభరణములుగా అమ్మ వారికి సమర్పించినారు. అచ్చటనే వినాయకుడ్ని కూడా స్థాపించినారు అని పెద్దలు చెబుతూ వుంటారు. అప్పటి నుంచి అమ్మ ఉగ్ర రూపము పోయి సౌమ్యవతి అయినది అని కూడా చెబుతూ వుంటారు. ఇప్పటికీ అమ్మ వారి తాటంకములను తీయాలంటే మెరుగు కోసము  కంచి కామ కోటి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమమును వారి చేతుల మీదుగా నిర్వర్తిస్తారు అని అంటారు. అంత గొప్ప శక్తి వంతమైనవి అమ్మవారి తాటంకములు. మాంగల్య బలము తక్కువగా   వున్న వాళ్ళు అక్కడకి వెళ్లి అమ్మ యొక్క తాటంకములను దర్శించి వస్తే  దోషము పోతుందని గట్టి నమ్మకము. నిజము కూడా. 


ఇదే విషయాన్ని పోతనగారు తన భాగవతంలో ఇలా చెప్పారు:


*క.కంద పద్యము*


మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!


ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.


(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. 


అమ్మవారి మంగళ సూత్రము ఒక్కటేకాదు, ఆ తల్లి ధరించిన తాటంకముల మహిమకూడా హాలాహల భక్షణానంతరం శివునికి మరణము లేకుండా.చేసినది. గనుకనే ఆ తల్లి *కామేశ్వరప్రాణనాడీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు

*ఓం కామేశ్వర ప్రాణనాడ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐



*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*833వ నామ మంత్రము*


*ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః*


ఏబదియొక్క పీఠములు (మాతృకావర్ణాధిదేవతల) స్వరూపిణిగా విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *పంచాశత్పీఠరూపిణీ* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి మానవజన్మకు, మానవేతర జన్మకు గల భేదము, మానవజన్మను పొందినందుకు ఆ పరమేశ్వరి నామమంత్రస్మరణతో కైవల్యమునందడానికి గల మార్గము ఆ తల్లి అనుగ్రహము వలన తెలియును.


జగన్మాత ఏబదియొక్క శక్తిపీఠముల స్వరూపిణిగా విరాజిల్లుతున్నది అని భావము. 


*పంచాశత్పీఠ* యనగా ఏబది (50) మాత్రమే యథార్థమైన అర్థము. కాని ఏబదికి దగ్గరగా ఉన్నసంఖ్య ఏబది ఒకటిని గ్రహించినచో ఈ నామ మంత్రమునకు సరైన భావము మనకు తెలియును. భాస్కరరాయలు వారు ఏబది ఒకటి అని తీసుకోవడానికి చాలా ప్రమాణాలు తెలియజేశారు. కాని, కొన్ని ప్రమాణములను మాత్రమే గ్రహించి వివరణచేయు ప్రయత్నము జరిగినది.


దక్షయజ్ఞంలో సతీదేవి భర్త అయిన పరమేశ్వరునకు అవమానం జరిగి, సతీదేవి ఆత్మత్యాగముచేయగా, పరమేశ్వరుడు సతీదేవి దేహంతో ప్రళయతాండవము ప్రారంభించాడు. లోకాలు ఆ రుద్రుని తాండవమునకు తల్లడిల్లిపోతుంటే, నారాయణుడు తన సుదర్శనంతో సతీదేవి దేహాన్ని ఖండించగా, ఆ ఖండములు *ఏబది ఒక్కచోట* పడి, శక్తిపీఠములుగా వెలసినవి. గనుక శ్రీమాత *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది.


జగన్మాత అకారాది క్షకారాంత మాతృకా వర్ణరూపిణి. మాతృకా వర్ణములు ఏబది ఒకటి (51) *అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ అం అః క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష)*. ఈ అక్షరములకు అధిదేవతలు (శక్తిలు) గలరు. వారు నెలకొని యున్న ప్రతీ ఒకటి ఒక్కొక్క శక్తి పీఠమై విలసిల్లుచున్నవి. అటువంటి ఏబదిఒక శక్తిపీఠముల స్వరూపము తనదిగా భాసిల్లు పరమేశ్వరి *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది🙏🙏🙏


ఈ అధిదేవతలకు, మనదేహంలో ఉన్న షట్చక్రములకు, లలితాసహస్ర నామస్తోత్రంలోని కొన్ని శ్లోకములతో సమన్వయించి ఇక్కడ వివరణ చేయబడినది.


*శ్రీలలితా సహస్ర నామస్తోత్రంలోని*


98వ శ్లోకము:-


*విశుద్ధచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా|*


*ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమన్వితా॥98॥*


99వ శ్లోకము:-


*పాయసాన్నప్రియా త్వక్-స్థా పశులోక భయంకరీ|*


*అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ॥99॥*


కంఠస్థానమునందున్న విశుద్ధిచక్రములో పదహారు (16) దళముల పద్మము మధ్యగల కర్ణికలో *డాకినీదేవి* ఏకముఖముతో పాటలవర్ణము (ఎరుపు-తెలుపు కలిసిన వర్ణము) లో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని చర్మధాతువు (త్వక్) నందు శక్తిని ప్రసాదించును. పాయసాన్నము అనిన ఈ దేవతకు ఇష్టము. ఈ విశుద్ధిచక్రంలోని పదహారు దళములందు గల పదహారు దేవతలు *డాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పదహారు మంది మాతృకావర్ణములలోని *అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఐ ఒ ఔ* అను పదహారు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. అమృతా, 2. ఆకర్షిణి, 3. ఇంద్రాణి, 4.ఈశాని, 5. ఉమా, 6. ఊర్థ్వకేశి, 7. ఋద్ధిర, 8. ౠకార, 9. ఌకార, 10. ౡకార, 11. ఏకపదా, 12. ఐశ్వర్యా, 13. ఓంకారి, 14. ఔషధి, 15. అంబికా, 15. అఃక్షర.


100వ శ్లోకము:-


*అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా|*


*దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాది ధరా రుధిర సంస్థితా॥100॥*


101వ శ్లోకము:-


*కాళరాత్ర్యాదిశక్త్యౌఘ వృతా స్నిగ్ధౌదన ప్రియా|*


*మహావీరేంద్రవరదా రాకిణ్యంబా స్వరూపిణీ॥101॥*


హృదయస్థానము నందున్న అనాహతచక్రములో గల పండ్రెండు (12) దళముల పద్మము మధ్యగల కర్ణికలో *రాకినీదేవి* రెండు ముఖములతో శ్యామలవర్ణము (ఎరుపుతో కూడిన నలుపు) లో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని రక్త ధాతువు నందు శక్తిగా ఉన్నది. నేతితో కలిపిన అన్నము ఈమెకు ఇష్టము. ఈ అనాహతచక్రంలోని పండ్రెండు దళములందు గల పండ్రెండు దేవతలు *రాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పండ్రెండు దేవతలు మాతృకావర్ణములలోని *క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ* అను పండ్రెండు అక్షరములకు అధిదేవతలు. వారు 1. కాళరాత్రి, .2. ఖాతీత, 3. గాయత్రి, 4. ఘంటాధారిణి, 5. ఙామిని, 6. చంద్ర, 7. ఛాయా, 8. జయా, 9. ఝంకారి, 10. ఙ్ఞానరూపా, 11. టంకహస్తా, 12. ఠంకారిణి.


102వ శ్లోకము


*మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా|*


*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా॥102॥*


*రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా|*


*సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ॥103॥*


నాభిస్థానమునందున్న మణిపూరచక్రములో పది దళముల పద్మమందలి మధ్య కర్ణికలో *లాకినీదేవి* మూడు ముఖములతో ఎరుపు వర్ణములో విరాజిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని మాంసధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు బెల్లము కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈ మణిపూరచక్రంలోని పద్మమునకు పది దళములు ఉంటాయి. ఈ పది దళములందు గల పది దేవతలు *లాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ పది దేవతలు మాతృకావర్ణములలోని *డ ఢ ణ త థ ద ధ న ప ఫ* అను పది అక్షరములకు అధిదేవతలు. వారు :- 1.డామరి, 2. ఢంకారిణి, 3. ణామిరి, 4. తామసి, 5. స్థాణ్వి, 6. దాక్షాయిణి, 7. ధాత్రి, 8. నందా, 9. పార్వతి, 10. ఫట్కారిణి


104వ శ్లోకము


*స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా|*


*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణాఽతిగర్వితా॥104॥*


105వ శ్లోకము


*మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా|*


*దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ॥105॥*


ఉదరస్థానము నందున్న స్వాధిష్ఠానచక్రములో ఆరు దళముల పద్మమునందు మధ్య కర్ణికలో *కాకినీదేవి* నాలుగు ముఖములతో పచ్చని వర్ణములో భాసిల్లుచున్నది. ఈ దేవత మనశరీరంలోని మేధస్సు ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పెరుగు కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈపద్మములోని ఆరు దళములందు గల ఆరు దేవతలు *కాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ ఆరు దేవతలు మాతృకావర్ణములలోని *బ భ మ య ర ల* అను ఆరు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. బందిని, 2. భద్రకాళి, 3. మహామాయ, 4. యశస్విని, 5. రమా, 6. లంబోష్టితా.


106వ శ్లోకము


*మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రాఽస్థి సంస్థితా|*


*అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా॥106॥*


107వ శ్లోకం (మొదటి పాదం)


*ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ|* (107వ శ్లోకం, మొదటిపాదము)


పిరుదుల స్థానమునకు పైన, జననేంద్రియ స్థానమునకు క్రిందను గల మూలాధార చక్రములో నాలుగు దళముల పద్మమందలి కర్ణికలో *సాకినీదేవి* నాలుగు ముఖములతో దూమ్ర వర్ణములో భాసిల్లుచున్నది. ఈ తల్లి మనశరీరంలోని అస్థి (ఎముకల) ధాతువు నందు శక్తిగా ఉన్నది. ఈమెకు పప్పు కలిపిన అన్నము అనిన ఇష్టము. ఈ మూలాధార చక్రంలోని పద్మమునకు నాలుగు దళములు ఉంటాయి. ఈ నాలుగు దళములందు గల నాలుగు దేవతలు *సాకినీ* దేవతను సేవిస్తూ ఉంటారు. ఈ నాలుగు దేవతలు మాతృకావర్ణములలోని *వ శ ష స* అను నాలుగు అక్షరములకు అధిదేవతలు. వారు:- 1. వరదా, 2. శ్రీ, 3. షండా, 4. సరస్వతి.


107వ శ్లోకం (రెండవ పాదము)


*ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా॥107॥* (రెండవ పాదము)


*మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా|*


*హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ॥108॥*


భ్రూమధ్యమునందు గల ఆఙ్ఞా చక్రము. ఇది గంగ, యమున, సరస్వతి సంగమ స్థానము. ఇడ, పింగళ, సుషుమ్నసంగమ స్థానము, వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి సంగమస్థానము, చంద్రఖండము, సూర్యఖండము, అగ్నిఖండము సంగమ స్థానము, చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము సంగమ స్థానము. 

ఇక్కడ గల ద్విదళ పద్మమునందు హాకినీ దేవి రూపములో భ్రూమద్యస్థానమందున్న ఆఙ్ఞా చక్రములో రెండు దళములుగల పద్మము యొక్క కర్ణిక యందు ఆరు ముఖములతో శుక్ల (తెల్లని) వర్ణము కలిగి భాసిల్లుతున్నది.

ఈ దేవి మజ్జ (ఎముకల మద్య ఉండు) ధాతువు నందు శక్తి రూపమై ఉంటుంది. ఈమెకు పసుపుఅన్నము (పులిహోర) అనిన ఇష్టము. ఇక్కడ హంసవతీ, క్షమావతి అను ఇద్దరు శక్తి దేవతలు హాకినీ దేవిని సదా సేవిస్తూ ఉంటారు. భ్రూమధ్యమునందు *హ క్ష* అను అక్షరములతోబాటు మధ్య *ళ* (ద్రవిడభాషల ప్రకారము) అను అక్షరముగూడ గలదని కొందరు పండితులుచెబుతుంటారు.


ఇంతవరకూ మనం తెలుసుకున్న వివరముల ప్రకారం



విశుద్ధి చక్రంలో - 16


అనాహత చక్రంలో - 12


మణిపూర చక్రంలో - 10


స్వాధిష్ఠాన చక్రంలో - 6


మూలాధార చక్రంలో - 4


ఆజ్ఞా చక్రంలో - 2


*వెరసి 50 అక్షరములు, 50 దేవతలు*


(కాని ఆజ్ఞా చక్రంలో హ, క్ష అను అక్షరముల మాత్రమేగాక ద్రవిడ భాషలప్రకారం మధ్యలో *ళ* అను అక్షరం కూడా తీసుకొనవచ్చునని విజ్ఞులు వివరించారు) 


*గనుక వెరసి అక్షరములు 51* గా భావించవచ్చును.


వీటినే *పంచాశత్పీఠములు* అందురు. ఆయాపీఠములలో ఆయాదేవతల రూపంలో పరమేశ్వరి విరాజిల్లుతున్నది గనుక అమ్మవారు *పంచాశత్పీఠరూపిణీ* యని అనబడినది.


ఇక్కడ ఒక సందేహం రావచ్చు. విశుద్ధిచక్రం నుండి క్రిందికి వచ్చి మరల ఆజ్ఞాచక్రమును చెప్పుకొనుటలో ఔచిత్యమేమిటి అనగా, ఇక్కడి వివరణ: 


మాతృకావర్ణ వివరణ *అ* కారం నుండి ప్రారంభ అయినది గనుక, కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రం నుండి వివరణ ప్రారంభమయినది. భ్రూమధ్యంలో గల ఆజ్ఞాచక్రంలో గల *హ క్ష* అను అక్షరములు చివరలో చెప్పబడినవి గనుక మూలాధార చక్ర వివరణ అయిన తరువాత ఆజ్ఞాచక్రవివరణ చెప్పబడినది.


వేరొక కారణమేమిటి అంటే - కంఠస్థానములో నున్న విశుద్ధిచక్రము ఆకాశతత్త్వము, తరువాత అనాహతచక్రము వాయుతత్త్వము, ఆ తరువాత మణిపూర చక్రము అగ్నితత్త్వము, స్వాధిష్ఠాన చక్రము జలతత్త్వము, మూలాధార చక్రము పృథ్వీతత్త్వము. అందుచే పంచభూతముల క్రమం ప్రకారం ఈ వివరణలో విశుద్ధిచక్రం నుండి ప్రారంభించడమైనది. చివరగా వివరించిన ఆజ్ఞాచక్రము మనస్సుకు సంబంధించినది. శరీరంలోని పంచభూతములను నియంత్రించేది ఆజ్ఞాచక్రము. అందుచే వివరణ ఈ క్రమంలో జరిగినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: