4, నవంబర్ 2020, బుధవారం

అరణ్యపర్వము-16

 అరణ్యపర్వము-16


పరశురాముని వృత్తాంతం


ఆ తరువాత ధర్మరాజు కళింగదేశంలో ఉన్న వైతరణి నదిని దర్శించారు. అక్కడి నుండి మహేంద్రగిరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న మునులను ” మునులారా! ఇక్కడ పరశురాముడు ఉంటాడు కదా మీరెప్పుడైనా చూసారా? ” అని అడిగాడు. పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు అనే ముని ” ధర్మజా! రేపు చతుర్ధశి మనం ఇక్కడ పరశురాముని చూడవచ్చు” అన్నాడు. ధర్మరాజు ” మహర్షీ! నాకు పరశురాముని గురించి వినాలని ఉంది వివరిస్తారా? ” అన్నాడు. అకృతవర్ణుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం కన్యాకుబ్జం అనే నగరాన్ని గాధిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమెను బృగుమహర్షి కొడుకు ఋచీకుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాధిరాజు వద్దకు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు.


అందుకు గాధిరాజు ” మహాత్మా! ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం తెల్లగా ఉండే వేయి గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతురిని వివాహం చేసుకో ” అని అన్నాడు. ఋచీకుడు అలాగేఅని చెప్పాడు. అతడు వరుణుని ప్రార్ధించాడు. అప్పుడు గంగా నది నుండి వేయి గుర్రాలు ఋచీకుడు కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగా నదికి అశ్వతీర్థం అనే పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి ఋచీకుడు గాధి కూతురిని వివాహమాడాడు. ఒకసారి బృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడలిని దీవించాడు. కోడలిని వరం కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి నాకు ఒక కుమారుడు అలాగే నా తల్లికి ఒక కుమారుని ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు ” మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోడి మీ కోరిక నెరవేరుతుంది ” అన్నాడు.


సత్యవతి, ఆమె తల్లి స్నానం చేసి ఆమె అశ్వత్థవృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున కౌగలించుకున్నారు. ఆ విషయం తెలిసిన భృగువు కోడలితో ” అమ్మా! నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు దారుణమైన క్షాత్రధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు మహా తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని ఔతాడు ” అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనుమడికి రావాలని కోరింది. భృగువు అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే కుమారుని కన్నది. ఆ జమదగ్ని, ప్రసేన జితుడు అనే రాజు కుమార్తె రేణుకను వివాహమాడాడు. వారికి ఋమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే కుమారులు కలిగారు.


ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటికోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆసమయంలో చిత్రరధుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. ఆ రాజును చూచి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జ్ఞమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు. అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమదగ్ని సంతోషించి ” నా మాట మన్నించి నందుకు నీకేమి వరం కావాలి ? కోరుకో ” అన్నాడు. రాముడు ” తండ్రీ ! ముందు నా తల్లిని బ్రతికించండి. తరువాత నా అన్నలను శాపవిముక్తులను చేయండి. నాకు దీర్గాయువు, అమితమైన బలం ప్రసాదించండి. సదా శత్రుజయం ప్రసాదించండి ” అని కోరాడు. జమదగ్ని అతనుకోరిన వరాలన్నీ ఇచ్చాడు.


ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిధి సత్కారాలు చేసాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు. పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకు వెళ్ళాడు. రాముడు ఆసమయంలో ఆశ్రమంలో లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడి పై పగపట్టారు. కానీ అతనిని ఏమి చెయ్యలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంశం చేసి వెళ్ళారు.


రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని కృద్ధుడై ” అనఘుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధి పూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను ” అని ప్రతిజ్ఞ చేసాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరిని సంహరించి ఆ భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగియై మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు ” అని పరశురాముని శిష్యుడైన అకృతవర్ణుడు చెప్పాడు. చతుర్ధశి నాడు పరశురాముని దర్శించి అక్కడి నుండి దక్షిణదిశగా ప్రయాణం అయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరిని దర్శించి అక్కడి నుండి ప్రభాస తీర్థం చేరాడు.

కామెంట్‌లు లేవు: