*మోహముద్గరః(భజగోవిందం)*
12)
*దినయామిన్యౌ సాయం ప్రాతః*
*శిశిరవసంతౌ పునరాయాతః |*
*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః*
*తదపి న ముంచత్యాశావాయుః ||*
*భావము*
కష్టపడి సంపాదించిన అన్నింటిని ఏం చేసి జీవుడు ఒంటరిగా వెళ్ళిపోతాడు ?
పగలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. అయితే రాత్రి కాగానే చీకటి ముంచేస్తుంది. పోనీ ఆ చీకటి అలాగే ఉంటుందా? ఉండదు. ఉదయం అనేది వస్తుంది. వెలుగు రేకలు తెస్తుంది. మధ్యాహ్నం ఉజ్జ్వలంగా వెలుగుతుంది. చివరకు సాయంకాలమనే సంధ్యారాగంలో కలిసిపోతుంది. ప్రతిరోజూ ఇంతే. కాలచక్రంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎక్కడా ఒక్క క్షణమైనా ఆగదు కాలం. శిశిరం, వసంతం గ్రీష్మం అంటూ ఆరు ఋతువులున్నాయి. అవీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కాలచక్రం అలా అలా దొర్లుతుంటూ వెళ్ళిపోతుంది. ఇలా కాలచక్రం దొర్లిపోతూ ఉంటే - అలా అలా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రాణుల యొక్క ఆయుష్కాలం తరిగిపోతూ ఉంటుంది. సంవత్సరాని కొకసారి బర్త్ డే చేసుకుంటాం. అంటే ఆయుష్కాలంలో మరొక సంవత్సరం తగ్గిపోయిందీ అని గుర్తు. కాలం ముందుకు వెళ్తుంటే మృత్యువు దగ్గరకొస్తున్నదని గుర్తు. కాలం కదిలిపోతుంటే భవిష్యత్తు వర్తమానంగాను, వర్తమానం భూతకాలంగాను మారిపోతుంటుంది. కనుక ఏదీ నిత్యం కాదు, శాశ్వతం కాదు.
“కఠోపనిషత్తు”లో నచికేతుడు చెప్పినట్లు ఈ జీవితం అనిత్యమైనది. ఎంత శ్రమపడ్డా, ఎన్ని అనుభవించినా, ఎంత ప్రోగుచేసినా ఒక నాటికి మృత్యువు అనేది అతడి నుంచి అన్నింటిని బలవంతంగా లాక్కుంటుంది. కష్టపడి సంపాదించిన అన్నింటిని విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ దీనంగా, హీనంగా, ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే అతడు తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి సంపాదించుకొన్న సంచిత కర్మల, వాసనల మూటను మాత్రమే. ఎంత శోచనీయం! ఎంత హృదయ విదారకం!
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి