*శ్రీమద్భాగవతము*
చతుర్థ స్కంధం -15
భూమినిబితుకుట
పుణ్యచరిత్రా! మైత్రేయా! భూమి ఎందుకు గోరూపం ధరించింది? దానికి ఏది దూడ అయింది? పిదుకుటకు తగిన పాత్ర ఏది? దోగ్ధయైన పృథుచక్రవర్తి ఏ పదార్థాలను పిదికాడు? భూమి సహజంగా మిట్ట పల్లాలతో విషమంగా ఉంటుంది కదా! అది సమరూపాన్ని ఎలా పొందింది? ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని ఎందుకు దొంగిలించాడు? అంతేకాక సనత్కుమారుని వల్ల విజ్ఞానాన్ని పొందిన పృథువు ఎటువంటి సుగతిని పొందాడు? పరబ్రహ్మ స్వరూపుడు, పుణ్య శ్రవణ కీర్తనుడు, సర్వేశ్వరుడు, భగవంతుడైన కృష్ణుని ఇతర అవతార పుణ్యకథలను, పుండరీకాక్షుడు పృథుచక్రవర్తి అవతారాన్ని ధరించి గోరూపాన్ని పొందిన భూమిని పిదకడం మొదలైన కథల నన్నింటిని నీవు, విష్ణుదేవునకు భక్తుడనైన నాకు వివరంగా చెప్పు’’ అని విదురుడు ప్రశ్నించాడు. వాసుదేవుని కథలయందు ఆసక్తి కల విదురుని కొనియాడుతూ మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. “ఆ విధంగా బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ప్రజాపరిపాలనా కార్యంలో నియుక్తుడైన పృథుచక్రవర్తి రాజ్యం చేస్తుండగా సారహీనమైన భూమినుండి అన్నం లభింపక పోవడం చేత ఆకలి బాధతో ప్రజలు కృశించిపోయి పృథుచక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు. రాజా! చెట్టు తొఱ్ఱలో పుట్టిన అగ్నిచేత దహింపబడే చెట్టువలె మేము ఆకలితో బాధపడుతున్నాము. రక్షణ కోరేవారికి అభయమిచ్చే నిన్ను శరణు వేడుకుంటున్నాము. రాజా! దయతో మాకు అన్నం పెట్టి రక్షించు’’ అని వినయంతో వంగి నమస్కరించి ప్రార్థించగా…పృథుచక్రవర్తి వారి దీనాలాపాలను విని దానికి తగిన మంచి ఉపాయాన్ని ఆలోచించాడు. వెంటనే త్రిపుర సంహారకుడైన శివుని వలె రౌద్రమూర్తియై వింట బాణాన్ని సంధించాడు. ఈ విధంగా బాణాన్ని సంధించినట్టి…పృథుచక్రవర్తిని చూచి భూమి గోరూపాన్ని ధరించి వణికిపోతూ కుటిలుడైన వేటగానిని చూచి అడవిలోనికి పారిపోయే లేడివలె పరుగెత్తింధి. ఈ విధంగా గోరూపాన్ని ధరించి భూమి పరుగెత్తగా పృథుచక్రవర్తి కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో దానిని వెంబడించాడు. అది దశదిశలలో ఎక్కడికి పోతే అక్కడికి వింటిని ఎక్కుపట్టి దానిని వెంటాడాడు. అప్పుడు మరొక దిక్కు లేక మృత్యువుకు భయపడే ప్రజల వలె భయపడుతూ పరితపిస్తూ భూదేవి పృథువుతో ఇలా అన్నది. “వేనపుత్రా! నీవు ధర్మం తెలిసినవాడవు. ఆపదలో నున్న వారిని ఆదుకొనేవాడవు. మహానుభావుడవు. సకల ప్రాణులను రక్షించడానికి నియమింపబడినవాడవు. అటువంటి నీవు ఆడదాననైన నన్ను చంపడానికి ఎందుకు పూనుకున్నావు? నేను దిక్కు లేనిదాన్ని. ఏ తప్పూ చేయనిదాన్ని. నావెంట ఎందుకు పడ్డావు? ధర్మరహస్యం తెలిసినవాళ్ళు స్త్రీలు తప్పు చేసినా దీనవాత్సల్యంతో చంపరుకదా!” అని చెప్పి భూదేవి పృథుచక్రవర్తితో మళ్ళీ ఇలా అన్నది. రాజచంద్రా! నేను మిక్కిలి దృఢశరీరం కలిగి సమస్త భూజనులకు నావ వలె ఎప్పుడూ ఆధారభూతనై ఉంటాను. ఇటువంటి నన్ను దయమాలి ఖండఖండాలు చేసి చంపుతానంటున్నావు. పుణ్యచరిత్రా! నామీద ఉన్న ప్రజలను నీటిలో మునిగిపోకుండా ఎలా కాపాడుతావు?” అని భూదేవి పలుకగా రాజు ఇలా అన్నాడు. “ఓ భూదేవీ! నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అంతేకాదు, యజ్ఞాలలో హవిర్భాగాలను అందుకొంటూ ధాన్యం మొదలైన వానిని పెంపొందింపకుండా ఉన్నావు. గోరూపం ధరించి తృణభక్షణం చేస్తూ పాలు ఇవ్వకుండా నీలోనే దాచి ఉంచుకున్నావు. పూర్వం బ్రహ్మదేవుడు నీలో సృజించిన ఓషధీ బీజాలను నీ దేహమందే అణచి పెట్టుకొని వెలుపలకు వెలుపలకు రానీయకుండా ఉన్నావు. నీవు మూర్ఖురాలవు. మందబుద్ధివి. ఈ విధంగా తప్పు చేసిన నీ శరీరాన్ని నా బాణాలతో తూట్లు పొడిచి నిన్ను వధిస్తాను. నీ మాంసంతో ఆకలితో మలమల మాడుతున్న ఈ ప్రజల ఆర్తిని తొలగిస్తాను. స్త్రీ వధ దోషం కదా అని అన్నావు. స్త్రీ పురుష నపుంసకులలో భూతదయ లేకుండా తమ పొట్టలు మాత్రమే నింపుకొనే ఎవ్వరినైనా సరే రాజులు చంపవచ్చు. అది వధ కాదు. కాబట్టి దానివల్ల పాపం రాదు. నీవు స్త్రీవైనా గర్వాంధురాలవై కొయ్యబారి ఉన్నావు. మాయా గోరూపం ధరించి పారిపోతున్న నిన్ను నువ్వుగింజలంత ముక్కలుగా నరికి నా యోగప్రభావంతో జీవులను రక్షిస్తాను’’ అంటూ యమునివలె రోష భీషణాకారుడైన పృథుచక్రవర్తిని చూసి భూమి వణికిపోతూ దోసిలి ఒగ్గి ఈ విధంగా ప్రార్థింపసాగింది. “ఓ భూపతీ! నీవు సాక్షాత్తుగా భగవంతుడవు. స్వకీయమైన మాయాగుణం చేత నానావిధాలైన శరీరాలను ధరించి సగుణుడవుగా కనిపిస్తావు. నీ చరిత్ర సంస్తవనీయమైనది. అటువంటి నీవు…నన్ను సకల ప్రాణికోటికి ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లనే నేను నానావిధాలైన ప్రాణికోటిని భరిస్తున్నాను.అది అలా ఉండగా… రాజా! నన్ను నీవే ఆయుధమెత్తి చంపడానికి పూనుకున్నావు. కరుణాసముద్రా! ఇంక నేను ఎవరిని శరణు వేడుకొనాలి? అంతే కాక…ఓ పుణ్యపురుషా! ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచేత ఈ చరాచర ప్రపంచాన్ని సృజించావు. నీవు ధర్మరక్షకుడవు. కొత్త తామరల వంటి కన్నులు కల ఓ ప్రభూ! నీ మాయను లోకులెవ్వరూ జయింపలేరు. నీవు స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచేత సకల లోకాలను సృజింప జేశావు. సౌందర్యమూర్తివైన ఓ పృథు చక్రవర్తీ! నీవు ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్తమందూ వెలుగొందుతావు. ఇంకా మహాభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకార అనే శక్తుల చేత ఈ లోకాలను సృజించి, పెంచి, త్రుంచుతున్నవు. విరుద్ధాలైన శక్తులతో నిండి ఉండే నీకు నమస్కారం చేస్తున్నాను. అటువంటి భగవంతుడవైన నీచేత నిర్మింపబడిన ఈ విశ్వాన్ని సంస్థాపించాలని పూర్వం పూనుకొని…ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తి మహాజలాలపైన నావ వలె నన్ను నిలిపావు. నాపైన ప్రాణులను నిలిపావు. నాపై నున్న ప్రజలను రక్షించటం కోసం పృథు రూపాన్ని ధరించావు. ఈ విధంగా భూభారం వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవల పాలకోసం నన్ను సంహరించాలని భావిస్తున్నావు. రాజచంద్రా! పుణ్యగుణ సాంద్రా! అనద్యుడవు, వేదవేద్యుడవు, విశ్వరక్షకుడవు అయిన నీకిది విచిత్రంగా లేదూ? భగవంతుని మహిమోపేతమైన మాయచేత మోహం పొందిన మనస్సు కలిగిన మావంటి వారికి హరిభక్తుల చర్యలు తెలుసుకోవటం శక్యం కాదు. ఇక శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకొనగలం? అటువంటి యశోనిధులైన జితేంద్రియులకు, మహాత్ములకు మొక్కుతున్నాను” అని ఈ విధంగా కోపంతో పెదవులు అదురుతున్న పృథుచక్రవర్తిని సంస్తుతించి ధైర్యం తెచ్చుకొని భూమి మళ్ళీ ఇలా అన్నది. నిర్మలమైన మనస్సు కల ఓ రాజా! గొప్ప పౌరుషము కలవాడ! నాకు అభయం ప్రసాధించు. ఆగ్రహాన్ని చాలించు. నన్ను మన్నించి దయతో నా విన్నపం ఆలించు. పువ్వులు కందకుండా లోపలి తేనెను మృదువుగా తాగే తేనెటీగ మాదిరి సుజ్ఞాని దేనిని నొప్పించకుండా సారాంశాన్ని, కావలసిన దానిని నేర్పుగా గ్రహిస్తాడు.
క్రోధంతో కాదు ఉపాయంగా కావలసినవి సాధించాలి అంటు పృథు చక్రవర్తితో భూదేవి చెప్తోంది. ఇంకా విను. తత్త్వదర్శనులైన మునులు ఇహపరలలో పురుషులకు ఫలం చేకూర్చే కృషిని, అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను అనుష్ఠించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అటువంటి ఉపాయాలను లెక్క చేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు ఎంత పండితుడైనా అతనికి ఆయాసమే తప్ప ఫలం సిద్ధించదు. వెయ్యి మాటలెందుకు? ఎంతకాలం గడచినా వాని స్థితి అంతే!” అని చెప్పి భూమి మళ్ళీ ఇలా అన్నది.పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన ఓషధులను కలుషాత్ములు, నియమభ్రష్టులు అయిన దుష్టులు భుజించటం చూసి కూడా రాజులు వారిని అడ్డగింపలేదు. అందువల్ల నేను పెక్కుసార్లు దొంగల బాధకు గురియై రక్షణ లేనిదాననై క్రుంగి కృశించిపోయాను. మహారాజా! సాటిలేని యజ్ఞకర్మలు లేకపోవడంతో నేను ఆదరాన్ని కోల్పోయాను. లోకమంతా దొంగలతో నిండిపోగా నేను చూచి…యజ్ఞాలు మొదలైన సత్కర్మలకు ఉపయోగపడే ఆ ఓషధులను చోరులు దొంగిలించకుండా వాటిని మ్రింగినాను. రాజా! అవి నాలో జీర్ణమైపోయాయి. రాజేంద్రా! విను. ఆ ఓషధులను ఒక ఉపాయంచేత మళ్ళీ పొందవచ్చు. ఓ సుచరిత్రా! నీమీద ఉండే ప్రేమచేత ఆ ఉపాయాన్ని నీకు తెలియజేస్తాను. రాజా! నీవు నాకు తగిన దూడను, తగిన పాత్రను, తగిన దోగ్ధను (పాలు పితికే నేర్పరిని) సమకూర్చు. అలా నీవు సమకూర్చినట్లయితే…ఈ ప్రాణులకు ఇష్టమైనవీ, బలకరమైనవీ, దుగ్ధాన్న రూపమైనవీ అయిన కోరికలను ప్రసాదిస్తాను. నా మాటలను గమనించు. మహారాజా! ఇప్పుడు నేను మిట్టపల్లాలతో విషమంగా ఉన్నాను. వానకాలంలో కురిసిన నీరు ఆ వానకాలం గడచిపోయిన తరువాత కూడా భూమిలో ఇంకిపోకుండా అంతటా నిలిచిపోవడానికి వీలుగా నన్ను సమంగా చదును చేయి. మనువుతో సమానమైనవాడా! నా విన్నపం
మన్నించు”. అని ఈ విధంగా భూదేవి పలికిన తియ్యని మాటలను పృథు చక్రవర్తి విని తన మనస్సులో ప్రేమ పొంగులెత్తగా…పృథు చక్రవర్తి మనువును గోవత్సంగాను, తన చేతిని పాత్రగాను చేసి తాను దోగ్ధయై భూమినుండి సకలమైన ఓషధులను పిదికాడు. ఈ విధంగా అతనిపై వాత్సల్యం కలిగిన గోరూప ధారియైన భూమినుండి ఇతరులు కూడా తమ కోరికలను తీర్చుకున్నారు. ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని, దేవతలు ఇంద్రుని దూడగా చేసుకొని బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్య దానవులు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా చేసికొని ఇనుపపాత్రలో సురాసవమయమైన క్షీరాన్ని, అప్సరసలు గంధర్వులు విశ్వావసువును దూడగా చేసుకొని పద్మమయమైన పాత్రలో…మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వమనే క్షీరాన్ని, పితృదేవతలు సూర్యుని దూడగా చేసుకొని ఆమపాత్రలో కవ్యమనే క్షీరాన్ని, సిద్ధులు కపిలుని దూడగా చేసుకొని ఆకాశపాత్రలో సంకల్పనా రూపమైన అణిమాదిసిద్ధి అనే క్షీరాన్ని, విద్యాధరులు మొదలైనవారు కపిలుని దూడగా చేసికొని ఆకాశపాత్రలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మయుని దూడగా చేసుకొని ఆత్మపాత్రలో సంకల్పమాత్ర ప్రభవమూ అంతర్ధాన రూపమూ అద్భుతాత్మకమూ అయిన మాయ అనే క్షీరాన్ని, యక్ష రక్షో భూత పిశాచులు రుద్రుని దూడగా చేసికొని కపాలపాత్రలో రుధిరాస్వరూపమైన క్షీరాన్ని, అహి దందశూక సర్ప నాగాలు తక్షకుని దూడగా చేసుకొని బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, పశువులు ఆబోతు దూడగా అరణ్యపాత్రలో తృణమనే క్షీరాన్ని, క్రూరమృగాలు సింహాన్ని దూడగా చేసికొని స్వకళేబరపాత్రలో మాంసం అనే క్షీరాన్ని, పక్షులు గరుత్మంతుని దూడగా చేసుకొని స్వదేహపాత్రలో కీటకాలు, ఫలాలు అనే క్షీరాన్ని, వసస్పతులు వటవృక్షాన్ని దూడగా చేసికొని భిన్నరోహ రూపమైన క్షీరాన్ని, పర్వతాలు హిమవంతుని దూడగా చేసికొని సానువులనే పాత్రలో నానాధాతువులు అనే క్షీరాన్ని ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం తమలో శ్రేష్ఠులను దూడలుగా చేసుకొని, తమకు తగిన పాత్రలలో, తమకు తగిన క్షీరాలను భూమినుండి పిండుకున్నారు. ఆ ప్రకారంగా క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సములను, పాత్రలను కల్పించుకొని తమతమ కోర్కెలనే వేరువేరు క్షీరాలను పిదుకుకున్నారు. అలా ఆ రాజు కూడ సముచితానందను పొందెను. ఎంతో సంతోషించి అన్ని కోరికలను తీర్చే భూమిని తన పుత్రిగా స్వీకరించాడు. తన వింటికొప్పుతో పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలను పొడి పొడి చేసి…పృథుచక్రవర్తి తన భుజబలంతో నేలంతా సమతలంగా చేసాడు. ఆ ప్రభువు తండ్రి యై ప్రజలకు బ్రతుకు తెరువు కల్పించాడు, శాశ్వత మైన యశస్సు గడించాడు. అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరాలయాలు, వ్రజవాటికలు, ఘోషవాటికలు మొదలైన పెక్కు విధాలైన నివాస స్థానాలను కల్పించాడు.ప్రజలు భయం తొలగి ఆయా నివాసాలలో సుఖసంపదలతో తులతూగుతూ బ్రతుకుతున్నారు. అటువంటి ధర్మమూర్తి అయిన పృథుచక్రవర్తిని కీర్తించడం ఈలోకంలో ఎవరికి శక్యం?
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి