4, నవంబర్ 2020, బుధవారం

రామాయణమ్..189

 రామాయణమ్..189

.............................

భయపడుతూ చెట్లమీదకెక్కుతూ,

 శిఖరాలు దూకుతో వణికిపోతున్న సుగ్రీవాదులను చూసి బుద్దిమంతులలో వరిష్టు డైన హనుమంతుడు ఇలా అన్నాడు .

.

ఇది మలయ పర్వతము ఇక్కడ వాలి వలన ఆపద రాదు 

అయినా అసలు ఆ వాలి ఇక్కడ నీకు కనబడుతున్నాడా ?

నీవు అంతగా వణికి పోవటానికి .అసలు నీవు భయపడటానికి కారణము నాకు తెలియటము లేదు ,

.

నీవు ధైర్యము కోల్పోవటముచేత నీ బుద్ది స్థిరముగా ఉండజాలకున్నది ,నీ వానరత్వమును ప్రకటించుకొనుచున్నావు.

.

నీవు నిశ్చయ బుద్ధితో మనస్సులోని భావములు వ్యక్తము చేసే చేష్టల ద్వారా ఇతరుల అభిప్రాయాలు గ్రహించు .

.

స్థిరమైన ఆలోచన లేని రాజు ప్రజలను పాలింపజాలడు .

,

భయపడే హృదయానికి అనుమానాలెక్కువ!

.

హనుమంతుని మాటలు విన్న సుగ్రీవుడు ఇలా అన్నాడు .

.

నీవన్నది నిజమే !

కానీ పొడవైన బాహువులు,

 చూపరులకు భయముకలిగించి ,

శత్రువుల గుండెలలో దడ పుట్టించే మహా ఆయుధాలు ధరించి కనపడే ఆ మహాపురుషులను చూస్తే ఎవడికి భయము కలుగకుండా ఉంటుంది ? 

.

వాలి ఒక రాజు ! 

రాజుకు ఎవరితో స్నేహమున్నదో ఎవరికి ఎరుక ? వీరు వాలి స్నేహితులేమో? వాలి మేధావి ! మనలను హతమార్చమని వీరిని పంపి ఉండవచ్చుకదా !

.

రాజులను నమ్మరాదు అవకాశము చూసుకొని వారు శత్రువులను దెబ్బతీయుదురు. 

.

కావున హనుమా నీవు సామాన్య మానవుని రూపము ధరించి వారి వద్దకు వెళ్లి వారెవరో తెలిసికొని రమ్ము .


రామాయణమ్ 190

...

సుగ్రీవుడు పంపగా రామలక్ష్మణులు ఉన్నచోటికి ఎగిరి వచ్చాడు హనుమంతుడు.

.

అక్కడ వారికి కనపడని చోటున ఆగి కొంత ఆలోచించి ,వారెవరో తెలియనందున తన రూపము మార్చుకొని సన్యాసి రూపము ధరించి, వినయముగా వారిని సమీపించి నమస్కరించి ,మృదువుగా మనోహరముగా వారిని పలుకరించాడు.

.

మీరు రాజర్షులవలే ఉన్నారు ,దేవతలలాగా కనపడుతున్నారు ,తీవ్రమైన నియమములు పాటించే మునివేషధారణలో ఉన్నారు.

మీ శరీరచ్ఛాయ చాలా శ్రేష్ఠముగా ఉన్నది .

.

మిమ్ములను చూసి ఈ అరణ్యములోని ప్రాణిసంఘాలు భయపడుతున్నవి మీరు ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చారు.

.

మీచూపులు సింహముల వలెనున్నవి ,మీరుధరించిన ధనుస్సులు ఇంద్రధనుస్సులవలె ఉన్నవి.

 శత్రుసంహారము గావించు పరాక్రమముతో శ్రేష్టమైన వృషభములవలే ఉన్నారు.

మీ బాహువులు ఏనుగులతొండములవలె ఉన్నవి.

.

మంచి కాంతి గల మానవశ్రేష్ఠులైన మీరు ఎవరు? రాజ్యార్హతలున్నవారిగా, దేవతాతుల్యులుగా కనపడుతున్నారు .

.

ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చారు.

.

మీ నేత్రములు పద్మముల రేకుల వలె,

బాహువులు దీర్ఘములై పరిఘలవలె,

మూపులు సింహముల మూపుల వలే ఉన్నవి ఎవరు మీరు?

.

ఇంద్రుని వజ్రాయుధములాగ మీ ధనుస్సులు సమున్నతంగా ప్రకాశమానంగా ఉన్నాయి.

.

చూడటానికి అందముగా ఉన్నా మీ అంబులపొదులు కూడా ప్రాణములు తీసే భయంకరమైన బాణములతో నిండివున్నవి.

.

మీ ఖడ్గములు కుబుసము విడిచిన మహాసర్పములవలే ఉన్నవి.

.

నేను ఇంతగా అడుగుతున్నా మీరు బదులు పలుకరేమి .

.

అన్నచే వెడలగొట్టబడిన వానరరాజు సుగ్రీవుడు పంపగా నేను వచ్చినాను .

.

నా పేరు హనుమంతుడు....

.

హనుమాన్ నామ వానరః.

.

.

NB

.

ఇదీ స్వామి తన స్వామి రామునితో మాటలాడిన మొదటి మాటలు.

తనగురించి తాను రామచంద్రమూర్తికి చేసుకొన్న పరిచయం.

.

ఆ సంభాషణలో ఎన్నో విశేషాలు ఉన్నాయి అవి సవివరంగా రేపు విశ్లేషించుకుందాము .

(మొత్తం సంభాషణ అయిన తరువాత.)

కామెంట్‌లు లేవు: