*దశిక రాము*
*మహాభారతము*
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
121 - విరాటపర్వం.
కౌరవవీరులంతా అర్జునుని చేతిలో పరాజితులై పారిపోతుంటే, భీష్ముడు గమనించి, సింహనాదం చేస్తూ తన శంఖాన్ని పూరించాడు. అర్జునుని ముందు నిలబడ్డాడు.
భీష్ముడు అర్జునినిపై మొదటగా 8 బాణాలువేసి పోరు ప్రారంభించాడు. అర్జునుడు వాటిని యెదుర్కొని, తాతగారిని యెక్కువసేపు శ్రమపెట్టడం యిష్టంలేక, రెండు చేతులతో బాణాలు ప్రయోగిస్తూ, గాండీవాన్ని మండుతున్న కొలిమిలా ప్రకాశింపజేశాడు. భీష్ముని గొడుగును చ్ఛిద్రం చేసాడు. సారధిని, అశ్వాలను గురిచూసికొట్టి గాయ పరిచాడు. ఇంకొకబాణంతో భీష్ముని సువర్ణభరితమైన, తేజోవంతమైన ధనుస్సును ఖండించాడు. వేరొక ధనుస్సు తీసుకుని అర్జునునికి యేమాత్రం తీసిపోకుండా పోరు సలుపసాగాడు కురువృద్ధుడు.
ఒక అద్భుత సంగ్రామంగా యిరువురిపోరు సాగింది. ఒకదశలో అర్జునుడు పై చేయికాగా, పదిబాణాలతో, అర్జునుడు భీష్ముని వక్షస్థలం పై కొట్టాడు. ఆదెబ్బకు భీష్ముడు చలించి రధం పట్టుకుని నిశ్చలంగా నిలబడిపోయాడు. అది గమనించి, అప్పటికే గాయపడిన అతని సారధి, రధాన్ని దూరంగా తీసుకునిపోయాడు.
ఆ పరిస్థితిలో, దుర్యోధనుడు పెద్ద శంఖనాదంతో అర్జునుని పైకి రధం పోనిచ్చాడు. వస్తూనే, బాణంతో అర్జునుని నుదిటిపై కొట్టి,అర్జునుని గాయపరిచాడు. దుర్యోధన, ధనంజయుల యుద్ధం భీకరంగా సాగుతున్నది. దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు, అన్నకు సాయంగా ఒక మదపుటేనుగుపై వచ్చాడు. ఒకే ఒక దెబ్బతో, వికర్ణుని యేమీ చెయ్యకుండా, అతని మదపుటేనుగు కుంభస్థలం పగిలేటట్లుఒక బాణం వేసి, దానిని కుప్పకూల్చాడు. వికర్ణుడు భీతావహుడై, దూరంగా పారిపోయి, వివింశతి అనే వాడి రథమెక్కి తలదాచుకున్నాడు.
అర్జునుడు నిరంతరంగా సాగుతున్న పోరుకు యిక అడ్డుకట్ట వెయ్యాలని, మిక్కిలి కోపంతో, దుర్యోధనుని రొమ్మును గురిచూసి, ఒకేఒక్క బాణం వేసాడు. ఆ చుట్టుప్రక్కల గుమిగూడిన దుర్యోధనుని సైన్యాన్ని కూడా, ఒక్కరినీ వదలకుండా, బాణాలతో బాధించి, వారిని పరుగులు పెట్టించాడు.
అర్జునుని ఉగ్రరూపం చూసి, భయపడి పారిపోతున్న దుర్యోధనుని సమీపించి, సింహనాదం చేస్తూ అర్జునుడు, 'ఓరీ కపట రాజనీతివిశారదా ! దుర్యోధనా ! పిరికిపందలాగా యుద్ధం నుండి పారిపోతున్నావా ? దమ్ముంటే నిలిచి పోరాడు. నీకు దుర్యోధనుడు అని నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు సార్ధకమవ్వాలంటే, నాతో పోరాడు. యద్ధంనుండి పారిపోయేవాడికి దుర్యోధన నామమెందుకు? ఇప్పుడు నిన్ను రక్షించేవారు యెవరూ యిక్కడలేరు. నీప్రాణాలు నాగుప్పిటిలో వున్నాయి. శకునిమామను సహాయం తెచ్చుకుని మాయాద్యూతం ఆడి నీప్రాణాలు దక్కించుకుందామనుకుంటున్నావేమో ! ఇక్కడ పరాక్రమం ప్రధానం. జూదమిక్కడ ఆడలేవు. కాచుకో ! ' అని అస్త్రసంధానం చెయ్యగానే, పారిపోతున్న దుర్యోధనుడు బిక్కచచ్చి మళ్ళి వచ్చి యుద్దానికి నిలబడ్డాడు. ఈలోగా మిగిలిన వారు గాయపడిన దేహాలతోనే వచ్చి దుర్యోధనుని ప్రక్కన నిలువగా, యుద్ధం ముగించే క్రమంలో వారి బాణాలు ఎదుర్కుంటూ, అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు, అక్కడ వున్న వారందరు సమ్మోహనాస్త్రం ప్రభావం వలన విచలిత మనస్కులై, స్పృహతప్పి పడిపోయారు.
రాకుమారి ఉత్తర, కౌరవవీరుల రంగు రంగుల తలపాగా కుచ్చులు అడిగిన విషయం మదిలో కదలగా, అర్జునుడు ఉత్తరకుమారునితో, ' ఉత్తరా ! అదుగో అటుచూడు, ఆ తెల్లని తలపాగాతో వున్నవారు ద్రోణాచార్యులు. పసుపుపచ్చని వస్త్రమువాడు కర్ణుడు, నీలివస్త్రాలతో వున్నవారు అశ్వద్దామా, దుర్యోధనుడు. వారు స్పృహ నుండి లేవకుండా, త్వరగా వెళ్లి, వారి తలపాగా కుచ్చులను ఖండించుకురా ! నీచెల్లెలి కోరిక మేరకు. పొరబాటున కూడా భీష్మాచార్యుని వద్దకు వెళ్ళకు. ఆయనపై, నా సమ్మోహనాస్త్రం పని చెయ్యదు. ఆయన కేవలం నిద్ర నటిస్తున్నాడు, ఆ అస్త్రంపై గౌరవంతో. ' అని విశదంగా జాగ్రత్తలు చెప్పి పంపించాడు.
చెప్పిన విధంగానే ఉత్తరుడు వడివడిగా రధం పైనుండి దూకి, వారి రంగురంగుల తలపాగా కుచ్చులను కోసి, భీష్ముని వద్దకు వెళ్లకుండా తిరిగివచ్చి, రధం యెక్కాడు. సమ్మోహనాస్త్రం వ్యవధి అయిపోగానే, భీష్ముడు ముందుగా లేచి, అర్జునునితో పోరుకు సిద్ధమయ్యాడు. ఈలోపు దుర్యోధనాదులు కూడా లేచారు. జరిగినది యేమిటో, తెలియక, ' తాతా ! అర్జునుడు ఒక్కడూ అలా యెలా నిలువగలిగాడు, మిమ్ములను తప్పించుకుని. నాకేమయ్యింది యేదో మగత కమ్మినట్లయింది.' అంటూ హడావుడి చేయసాగాడు.
భీష్ముడు చిరునవ్వుతో, ' దుర్యోధనా ! విలువైన అస్త్రవిద్య, మేటియోధుడు ప్రదర్శిస్తే దాని ప్రభావం అలాగే వుంటుంది. మీ అందరి శక్తియుక్తులూ యెందుకూ కొరగాకుండా పోయాయి. మీరు స్పృహ కోల్పోయినపుడు, కిరీటి, మీమీద యే దారుణకార్యమూ వొడిగట్టకుండా, కేవలం మీ తలపాగాల కుచ్చులు మాత్రం కోసి, మీ పరాజయాన్ని తెలియజెప్పాడు. పాండవులు ధర్మపరులు కాబట్టే, అతడు మనలను వధించకుండా వదిలిపెట్టాడు. జరిగిన పరాభవం చాలు. ఇక హస్తినకు తిరుగుప్రయాణం కండి, అందరూ. వారి గోసంపదనను వదలిపెట్టండి. ' అని సూచించాడు భీష్ముడు. అందరూ ఆమోదయోగ్యంగా, అక్కడనుంచి హస్తినకు మరలారు.
వీడ్కోలుగా అర్జునుడు భీష్మునికి, ద్రోణునికీ శిరస్సు వంచి నమస్కరించి, అశ్వద్దామా, కృపాచార్యులకు వందనబాణాలు సమర్పించాడు. దుర్యోధనుని రత్నఖచితమైన, మణిమయ కిరీటాన్ని, ఒకేబాణంతో, దుర్యోధనుని ఓటమి సూచకంగా, తుత్తునియలు చేసాడు. విజయసంకేతంగా, విజయుడు, దేవదత్తాన్ని అతి పెద్దగాపూరిస్తూ, శత్రువుల పరాభవాన్ని జగత్తుకు తెలియజేసాడు.
కౌరవులు వెనుదిరగగానే, ' ఉత్తరకుమారా ! మన గోసంపదతో విజయులమై విరాట నగరం చేరుకోవచ్చు. నీ తండ్రిగారికి మా మారువేషముల గురించీ, నా యుద్ధకౌశలం గురించీ నీవేమీ ప్రస్తావించకు. ఆయన నీవలననే విజయం సిద్ధించిందని అనుకుంటూ వుంటారు. అలాగే ఆనందించనీ !. నిదానంగా తెలుసుకుంటారు. ' అని ఉత్తరకుమారునికి చెప్పి, రధాన్ని జమ్మిచెట్టు వద్దకు తీసుకువెళ్లి, ఆయుధాలను మళ్ళీ అక్కడే వుంచి, తాను బృహన్నల రూపంలో రథసారధిగా కూర్చొనగా, ఉత్తరుడు రధమధిరోహించాడు, వీరుని స్థానంలో. ' విజయా ! నేను అల్పుడను. నీవు అనన్య సామాన్య పరాక్రమశాలివి. నీముందు, నేను యుద్ధం చేసి విజయం సాధించానని నా తండ్రిగారికి, అబద్ధం చెప్పలేను. నేనుమౌనంగా వుంటాను. నీకు తోచిన విధంగా నాన్నగారికి వివరించు, ఇక్కడ జరిగింది. ' అని యెంతో అమాయకంగా, వినయంగా ఉత్తరకుమారుడు, విజయునితో అన్నాడు.
గోగణం ముందు కదులుతుండగా, రధం విరాటనగరం వైపు సాగిపోతున్నది.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి