4, నవంబర్ 2020, బుధవారం

కధ

 #Inspiration story...


#హైటెక్‌సిటీ చెంతన ఓ బస్తీలోని ఇరుకు గదిలో నివాసం. తండ్రి కూలీ. తల్లి హౌస్‌కీపర్. వీరి అబ్బాయి #నర్సింహ  ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.


సున్నాల్లేని గోడలు, గొళ్లాల్లేని తలుపులు... ఇరుకిరుకు గదులు, సమయానికి రాని మాస్టార్లు, నాణ్యతలేని మధ్యాహ్న భోజనం... అరకొర చదువులు... ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ గుర్తుకువచ్చే దుస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నుంచి కూడా విశేషమైన విజయాలు పుట్టుకొస్తాయి. అలాంటి విజయం సాధించిన బాలుడు నర్సింహ... ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ‘ఇంటలిజెన్స్’ ముందు దిగదుడుపే అని నిరూపించాడు. రూ.లక్షలు చెల్లించి చదివే విద్యార్థులతో పోటీపడి గెలిచాడు. అది కూడా తెలుగు మీడియం విద్యార్థులను అనుక్షణం భయపెట్టే ఆంగ్లభాషా ప్రావీణ్యంలో...


ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా పోటీలలో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో నర్సింహను ఎంపిక చేస్తే... ఏకంగా విజేతగా నిలిచి నర్సింహ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల అక్షరాలతో పదాలను కూర్చడం, ఉచ్ఛరించిన ఆంగ్లపదాల స్పెల్లింగులు కరెక్ట్ చేయడం... వంటి విభిన్న రకాల అంశాలతో నిర్వహించిన ఈ పోటీకి నగరానికి చెందిన దాదాపు అన్ని టాప్ క్లాస్ కార్పొరేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ల్యాప్‌టాప్‌పై సమాధానాలు ఇస్తూ నర్సింహ ముందు వరుసలో నిలిచాడు.


చివరకి... మాదాపూర్‌లోని మహీంద్రా సత్యంలో  అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’ ఫైనల్స్‌లో అందర్నీ తోసిరాజని... అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరఫున ప్రైమరీ స్కూల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశంసా పత్రం, మెమొంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని సైతం దక్కించుకున్నాడు.


మట్టిలో మాణిక్యం .. ఎందరికో స్ఫూర్తి దాయకం ...


భళా నర్సింహా! భళా..👏👏

#inspiration

కామెంట్‌లు లేవు: