4, నవంబర్ 2020, బుధవారం

శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత  మూక పంచశతి


 శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన


 ఆర్యా శతకం*


🌹35

శ్లోకము:-


*ఉరీకరోమి సంతతమ్ ఊష్మలఫాలేన


 లాలితం పుంసా*


*ఉపకంప ముచితఖేలనమ్


 ఉర్వీధరవంశ సంపదున్మేషమ్ II  


‌భావము:


ఆవిరులు చిమ్ముతున్న ఫాలనేత్రముగల పురుషునిచే నిరంతరము లాలింపబడిన కంపానదీతీరమున తగిన ఆటలాడుకొను పర్వత వంశసంపదకు వికాశము కలిగించిన అమ్మవారిని అంగీకరించెదను.


వివరణ:


ఫాలమావిరులు కలది ఆనగా ఫాలమునందు అగ్ని ఉన్నదని అర్ధం. ఫాలమందు అగ్ని ఉన్నదనగా ముఖమునందు అగ్ని ఉన్నట్లే. కాని అగ్నిర్ముఖమ్ , అగ్నియే పరమేశ్వరుని ముఖమను విషయమూ ఉన్నది.మరియూ ముఖాదింద్రశ్చాగ్నిశ్చ అని పరమేశ్వరుని ముఖము నుండి అగ్ని పుట్టినదని పురుషసూక్తమునందు ఉన్నది.అట్లే పరమేశ్వరుని కన్నునుండి సూర్యుడు పుట్టినాడనియు పురుషసూక్తము చెప్పును.ముఖమంతయూ అగ్నియే కావున కన్నునుండి అగ్నిభేదమైన సూర్యుడు పుట్టుట ఉపపన్నమగుచున్నది. ఆ సూర్యుడు పుట్టుట కుడికన్నునుండి.అందువలన దక్షణాక్షి పురుషోపాసనము, సూర్యోపాసనము సాన్నిహిత్యము కలిగి ఉన్నవి.చక్షురింద్రియము ఒక్కటే రెండు కన్నుల నుండి పనిచేయునట్లు సూర్యుడే సూర్యచంద్రాగ్ని రూపమున శివుని ముఖమునందలి మూడు కన్నులలో పనిచేయుచున్నాడనియూ లేక ఒకే అగ్ని త్రినేత్రములలో సూర్యచంద్రాగ్ని రూపమున పనిచేయుచున్నదనియూ చెప్పవచ్చును.

అందరికీ కన్నులు రెండే ఉండగా శివునకు మూడు కన్నులు ఉన్నవి. మూడవది ఫాలమునందు ఉన్నది.అందరూ అజ్ఞానులు.శివుడు జ్ఞాని. ఫాలనేత్రము అందలి అగ్ని జ్ఞానమునకు ప్రతీకము.యోగ దృష్టిలో జ్ఞానాగ్ని ప్రపంచ ప్రవిలాపమును ఒనరించును.బూడిదచేసినట్లు చెప్పును. ఊష్మమును చిమ్నఫాలము గల పురుషునిచే లాలింపబడుట అమ్మవారి సౌభాగ్యము.మరే పడతికి ఆ భాగ్యము కలుగలేదు.అమ్మవారు పుట్టుటచే పర్వత వంశమునందు ఉపదున్మేషము జరిగినది కావున ఆమెయే ఆ ఉన్మేషముగా చెప్పబడినది.ఒక్కొక్క బాలిక జన్మించిన పిదప ఆ వంశమున ఆ ఇంట సంపద పెంపొందుట జరుగును. హిమవంతుని ఇంట త్రైలోక్య సంపదయే ఉన్మేషమునందినది.

తదుపాసనముచే యోగిలోకము ధన్యమైనది. భ్రూమధ్యమున జ్యోతి దర్శనము యోగులు చేయగలుగుదురు.శివుడు మహాయోగి.అతని ఫాలమున జ్యోతి ఎప్పుడూ దర్శనమిచ్చును.ఆ జ్యోతి దర్శనముచే త్రిపురములైన కారణ,సూక్ష్మ, స్థూలదేహములయందు అభిమానము నశించును.ఆ జ్యోతీరూప కుండలి‌ని శివుడు లాలించినాడు. ఆమే కుండలినీ రూప కామాక్షి.కాంచి దగ్గర కంపాతీరమున విహరించుచున్నది. తొలుత మూలాధారమున కుమారిగా కుండలిని విహరించునని తరువాత పతిప్రియమై సహస్రార చంద్రమండలి శివుని చేరుకొనుననియూ తంత్రములు పేర్కొనును.ఆ కంపాతీర కాంచీఖేలనము మూలాధార తొలితటి విహారములు!. శివుని ఆ లాలనము సంతతము అనగా నిరంతరము!.

{ ఈ శ్లోకమున అమ్మ శివునిచే లాలింపబడినది అని చెప్పబడినది.}


🔱 ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ..


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవస్తు🌹


సశేషం....


🙏🙏🙏

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం*


ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: