4, నవంబర్ 2020, బుధవారం

మహాభారతము ' ...67.

 మహాభారతము ' ...67. 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


అరణ్యపర్వం.


తదేకంగా ఊర్వశి నాట్యం చూస్తున్న అర్జునుని చూసి, ఇంద్రుడు, నాట్యాచార్యుడు,  తన అనుచరుడైన  చిత్రసేనుని పిలిపించాడు. ' చిత్రసేనా !   అర్జునుడు మన అతిధి.  ఏదో మనోవ్యాకులతతో వున్నాడు. అతనికి  ఆనందం  కలిగించడం మన కర్తవ్యం.  వెంటనే ఊర్వశిని తన అందచందాలతో  అర్జునుని సంతోషపెట్టమని చెప్పు. '  అని ఆదేశించాడు.


ఊర్వశి వద్దకువెళ్లి చిత్రసేనుడు తాను వచ్చినపని చెప్పాడు.  ఆమె సంతోషంగా అంగీకరించింది.  నా మనసులో మాటే ఇంద్రుడు ఆజ్ఞాపించాడు, యింకా అడ్డేముంది ? అని తనలో అనుకుని, చిత్రసేనుని పంపివేసింది. అర్జునుని యేకాంతంగా కలిసే సమయం కోసం యెదురు చూడసాగింది.  


రాత్రి చంద్రోదయమైంది.  చక్కగా అలంకరించుకుని అర్జునుని శయ్యాగారంలోనికి మందగమనంతో, ప్రవేశించింది ఊర్వశి.  ఊర్వశికి అభివాదం చేస్తూ స్వాగతం పలికాడు అర్జునుడు. ' నేను తమ సేవకుడను. చెప్పండి, ఏమి చెయ్యాలో ' అని చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు అర్జునుడు, ఊర్వశి ముందు.  


అతనిమాటలకు ఊర్వశి ఆశ్చర్యపోయి, తనను అట పట్టిస్తున్నాడు అనుకుని, ' చిత్రసేనుడు పంపగా నేను వచ్చాను.'  అని నర్మగర్భంగా తనకోరిక తెలియజేసింది. ' నేను నాట్యమాడుతుండగా, నీవు కన్నులార్పక నా అందాలు గ్రోలితివని  ఇంద్రుడు గ్రహించి, చిత్రసేనుని ద్వారా నీ వద్దకు నన్నుపంపాడు.   ఆయన ఆజ్ఞ నాకు వరంగా తోచింది.  నీపై మరులు పెంచుకున్న నా తృష్ణ అనే అగ్నికి యీ వార్త ఆజ్యమయ్యింది.  ఇక ఆలశ్యం చెయ్యకు. దగ్గరకు రా ! '  అని ఆహ్యానించింది.  


ఆమె మాటలకు అర్జునుడు, వణికిపోయాడు. సిగ్గుతో తల దించుకున్నాడు.  ' అమ్మా !  నీవు నాకు తల్లిలాంటి దానవు.  నాకు కుంతీ మాద్రీ యెంతో, నీవూ అంతే !  నీవు మా పురువంశానికి తల్లివి.  పురూరవ చక్రవర్తికి భార్యగా, మా వంశోద్ధరణకు తోడ్పడ్డావు.  ఆ జ్ఞాపకాలు నాలో మెదిలి నిన్ను గౌరవభావంతో, నీలో వున్న నాట్యకళా విన్యాసానికి ఆశ్చర్యపోయి అలా చూస్తూవుండిపోయాను.   అంతేకానీ, నాలో యే నీచభావమూ,  నీయందు లేదు. ' అన్నాడు.


' అర్జునా !  యెంత అమాయక ధోరణిలో మాట్లాడుతున్నావు.  మేము అప్సరసలమని నీవెరుగవా?  మాతో రమించడం, తప్పుగాదు.  మేము పూజార్హులం కాదు. మాతో భోగించడమే మాకు ఆనందము.  నేను కామానురక్తనై నీవద్దకు వచ్చాను.  నన్ను నిరాశపరచకు, నీ ధర్మపన్నాలతో. ' అన్నది ఊర్వశి, రోషంగా.   '  అమ్మా !  నా పై కోపించవద్దు.  నేను నీబిడ్డను.  నీవు మా వంశమూలానివి.  నన్ను నీ మాటలతో చిత్రహింస చెయ్యవద్దు. ' అని మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి ప్రార్ధించాడు అర్జునుడు.


అర్జునునిమాటలకు, యింకా ఆగ్రహం తెచ్చుకున్నది ఊర్వశి.   అంతలో దుఃఖించింది. స్వరం గద్గదమైంది. నీతండ్రి ఇంద్రుడు పంపగా వచ్చి, నాకోరిక తీర్చమంటే నీతి వాక్యాలు పలికి, నా కోపానికి గురి అవుతున్నావు.  నీవు ఫలితాన్ని అనుభవిస్తావు. నపుంసకుడవై, సిగ్గు యెగ్గులు తెలియక, ఆడపిల్లల మధ్య, వారితో  ఆటపాటలతో సంచరింతువుగాక ! '   అని అర్జునుని శపించి, కోపంగా తిరిగి వెళ్ళిపోయింది, ఊర్వశి. 


జరిగిన విషయం చిత్రసేనుని ద్వారా ఇంద్రునికి నివేదించాడు అర్జునుడు.  ఇంద్రుడు అర్జునుని పిలిచి,  జరిగిన సంఘటనకు చింతించవలదని, యీశాపం, పాండవుల అజ్ఞాతవాసం సమయంలో అర్జునుని యెవరూ గుర్తించకుండా అక్కరకు వస్తుందనీ, అజ్ఞాతవాసం పూర్తవగానే, మళ్ళీ మామూలు రూపం వస్తుందనీ, శాపం యొక్క అంతరార్ధం చెప్పి, ఓదార్చాడు.    అర్జునుడు కూడా సంతృప్తి చెందాడు.


ఒకనాడు, ఇంద్రునితో అర్ధ సింహాసనం పంచుకుని కూర్చున్న అర్జునుని చూసి, అక్కడకు విచ్చేసిన లోమశమహర్షి,  అర్జునుని అదృష్టానికి అచ్చెరువొందాడు.  అది గ్రహించి ఇంద్రుడు ' మహాత్మా ! ఈ అర్జునుడు యెవరోకాదు.  పూర్వం బదరికాశ్రమంలో నరనారాయణులనే మహర్షులు తపస్సు చేసేవారు.  వారే కృష్ణార్జునులుగా అవతరించి, ధర్మ సంస్థాపన కోసం  భూమిమీద జన్మించారు.  మహర్షీ !  మీరు భూలోకం వెళ్తున్నారు కదా !  అర్జునుని యోగక్షేమాలు పాండవులకు చెప్పి,వారిని సంతోషింపజెయ్యండి. ' అని ప్రార్ధించాడు.  అర్జునుడు కూడా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు.


అర్జునుని యోగక్షేమాలు లోమశమహర్షి చెప్పగా, పాండవులు పరమానందాన్ని పొందారు.  శస్త్ర, అస్త్రాలు సముపార్జనలో వున్నాడని గ్రహించి స్థిమిత పడ్డారు. లోమశమహర్షి వెళ్లి పోయిన కొంతకాలానికి, భీమసేనుడు, మరలా ధర్మరాజుని నిష్టురవాక్యాలతో బాధించ సాగాడు. వెంటనే యుద్ధం ప్రకటించమన్నాడు. ధర్మసూక్ష్మత ప్రకారం క్లిష్ట సమయంలో ఒక దివారాత్రము ఒక సంవత్సరంగా పరిగణించవచ్చు అన్నాడు.  కృచ్రవ్రతమనే ఒక వ్రతం పదమూడు రోజులు ఆచరిస్తే, పదమూడు సంవత్సరాలు గడిచినట్లే అని నచ్చజెప్పి,  ఆ వ్రతమాచరించమని బలవంత పెట్టసాగాడు.  


అలా గాక పదమూడు సంవత్సరాలూ గడిచి మళ్ళీ కౌరవులను కలిసినా, నీకు రాజ్యం వారు యివ్వరు.  మళ్ళీ జూదానికి పిలుస్తారు.  నీవు జూదమాడతావు.  మమ్ములను అరణ్యాల పాలుచేస్తావు.  ఆ విధంగా ప్రతి పదమూడు సంవత్సరాలకూ, కేవలం జూద మాడడం కోసమే మనం నగరప్రవేశం చేస్తాము.  అదే మనకు వ్రాసిపెట్టి వున్నది. '  అని అనేకవిధాల ములుకులలాంటి మాటలతో బాధించసాగాడు.  


ధర్మరాజు, భీమునికి పదమూడు సంవత్సరాలు ఓపిక పట్టమని చెబుతుండగా, బృహదశ్వుడు అనే తపోనిది, వారిని చూడడానికి వచ్చాడు.  ఆ మహర్షిని ధర్మరాజు ఆహ్వానించి, సత్కరించి పూజించాడు.  .  


స్వ స్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.


తీర్థాల రవి శర్మ  

విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం హిందూపురం

9989692844.

కామెంట్‌లు లేవు: