4, నవంబర్ 2020, బుధవారం

🌻. మధు కైటభుల వధ వర్ణనము - 4 🌻

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 4  / Sri Devi Mahatyam - Durga Saptasati - 4 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 1

*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 4 🌻*


రాజు పలికెను : భగవాన్! మహామాయ అని నీవు చెప్పు దేవి ఎవరు? ఆమె ఎలా ఉద్భవించింది? ఆమె ఏమి చేస్తుంది? ఓ బ్రాహ్మణా! ఆమె స్వభావం ఎటువంటిది? ఆమె స్వరూపం ఎలా ఉంటుంది? ఆమె ఎక్కడి నుండి ఉద్భవించింది? ఇదంతా బ్రహ్మజ్ఞాన వరేణ్యుడవైన నీ నుండి వినగోరుతున్నాను. (59–62)


ఋషి పలికెను : ఆమె నిత్య. ఆమెయే ఈ జగత్తుగా మూర్తీభవించింది. ఈ అంతటా ఆమె వ్యాపించి ఉంది. (63- 64)


కాని ఆమె బహు విధాలుగా ఉద్భవిస్తుంది; అది నేను చెబుతాను, విను! నిత్య అయినప్పటికీ, ఆమె దేవతల కార్యాలను నెరవేర్చడానికి ఎప్పుడు లోకంలో ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆమె ఉద్భవించిందని లోకులు పలుకుతారు. 


కల్పాంతంలో జగత్తంతా ఏకమై ప్రళయజలరాశి రూపంలో ఉండి, భగవంతుడైన శ్రీమహావిష్ణువు శేషతల్పశాయియై యోగనిద్రలో ఉన్నప్పుడు ఘోరరూపులు, విఖ్యాతులు అయిన మధుకైటభులనే ఇద్దరు అసురులు విష్ణుదేవుని చెవిలోని గుబిలి నుండి ఉద్భవించి బ్రహ్మను చంపడానికి యత్నించారు.


 ప్రజాపతియైన బ్రహ్మ విష్ణువు నాభికమలంలో కూర్చొని ఉన్నాడు. ఉగ్రరూపులైన ఈ అసురులిద్దరిని చూచి, విష్ణుదేవుడు నిద్రిస్తుండడం వల్ల ఆయన్ని మేలుకొల్పడానికై, ఆయన నేత్రాలలో వసిస్తున్న  యోగ నిద్రను ఏకాగ్రచిత్తంతో స్తుతించాడు. (65–70)


బ్రహ్మదేవుడు తేజోవంతుడైన విష్ణుదేవుని అసమానయైన దేవిని, యోగనిద్రను, సర్వలోక పాలకురాలిని, జగన్నిర్వాహకురాలిని, ప్రపంచ స్థితిలయకారిణిని -స్తుతించాడు. (71)


బ్రహ్మ పలికెను: “నీవు 'స్వాహా  మంత్రానివి, నీవు 'స్వధా * మంత్రానివి, స్వర్వానికి 4 మూర్తరూపానివి, వషట్కారమూనీవే కదా! సుధవు* నీవు. నాశము లేని శాశ్వతవు, త్రిమాత్రాత్మికవు నీవే. పూర్ణంగా ఉచ్చరించడానికే శక్యంకాని నిత్యస్వరూపిణివైన అర్ధమాత్రవు నీవే. దేవతల తల్లి, పరదేవత అయిన సావిత్రివి నీవే. (72-74)


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: