🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 70*
*****
*శ్లో: విశ్వా౽మిత్రాహి పశుషు ౹*
*కర్దమే విషమ స్థలే ౹*
*అంధే తమసి వార్ధక్యే ౹*
*దండం దశగుణం భవేత్ ౹౹*
*****
*భా:- "దండం" అంటే కఱ్ఱ అని నమస్కారం అని సామాన్యమైన అర్థాలు. "దండము" అత్యవసరంగా వినియోగించే సందర్భాలు "పది" ఉన్నవని శాస్త్రాలు చెబుతున్నాయి.అవి. 1."వి" :- ఆకాశంలో సంచరించే పక్షులు వివాహాది వేడుకలలో ఆహారపదార్థాలు ముట్టకుండా, రక్షణగా ఒకరు చేత ధరించి నిలబడడానికి. 2."శ్వా" :- స్వైరవిహారం చేసే ఊరకుక్కల దాడి మనపై జరగకుండా ఉండడానికి. 3."అమిత్ర" :- దారి కాచి, ఆకస్మికంగా తెగబడిన శత్రువు నుండి ఆత్మరక్షణచేసుకోడానికి. 4."అహి" :- ఆగమనం కూడా గమనింపజాలని వేగంతో తారసపడిన పామును అదిలించడానికి. 5.పశుషు :- గేదెలు,ఆవులు,గొఱ్ఱెలు, మేకలు మున్నగు జంతువులను కాపలా కాయడానికి. 6. "కర్దమే" :- లోతుపాతులు, ఊబులు గమనిస్తూ, బురద కయ్యలను సుఖంగా , సుకరంగా దాటడానికి. 7. "విషమస్థలే" :- ఎత్తుపల్లాలతో అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశంలో జాగ్రత్తగా నడవడానికి. 8."అంధే" :- తడిమి చూడడమే గాని, తనివితీరా చూడలేని గ్రుడ్డితనములో ఆచితూచి నడవడానికి. 9."తమసి" :- కన్నుపొడుచుకున్నా కనబడని చీకటిలో ముందడుగు వేయడానికి. 10."వార్ధక్యే" :- వయోభారం మీదబడిన వృద్ధాప్యమునందు తడబడకుండా నడవడానికి -ఇలా "కఱ్ఱ" ప్రతి ఒక్కరికి అనివార్యమై పదిరెట్లు ఉపకరణంగా, ఉపయోగకరంగా, ఉంటుంది. కాని లోకంతీరులో పంతులుగారి చేతిలో "కఱ్ఱ" ఉండడం గమనార్హం. "దండం దశ గుణం భవేత్" అనే నానుడి పిల్లల్ని దండించే సందర్భంలో వారి నోటి నుండే వెలువడడం సాంప్రదాయంగా వస్తోంది. మానవ జీవనానుగమనంలో ఇవే గాక మరెన్నో సన్నివేశాలలో "కఱ్ఱ" ఉపయోగం విస్తారంగా కనిపిస్తుంది.*ఓ దండమా ! నీ కో దండం*!
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి