బడి పిలిచిన వేళ
- బ్రతుకు భయం
విదేశీ మూకీసినిమాలో లాగా..
రంగువెలిసిన పికాసో చిత్రమై..
బడి పిలిచిన వేళ.....
బ్రతుకు భయం నీడలూ జాడలూ!
సున్నపుపెచ్చులు రాల్చే ప్రహరీ నిట్టూర్పులు..
రోజూ వెయ్యిసార్లు కిర్రుమంటూ పిల్లలతో బాటూ
అల్లరిచేసే అతుకుల గేటు !
కుళాయి కుమిలిపోతున్నది బుజ్జిచేతుల స్పర్శ తలుచుకొని..
నేరేడు,బాదం చెట్లూ ఉడతమ్మ
అన్నీ సందడే లేదని గుసగుసలు ఆరునెలలుగా!
పిల్లల్ని చూడకుండానే రిటైర్ అయిపోతానేమోననే బెంగ,
ఎప్పుడూ చిటపటలాడే వాచ్ మెన్ కీ..
బడి గంట తుప్పుపట్టి గంగవెఱ్ఱులెత్తుతుంది!
నల్లబల్ల ముఖం ఇంకానల్లగా పెట్టుకోనీ..
డస్టర్ దుమ్ముకొట్టుకోని..
చాక్ పీస్ల డబ్బా చకితురాలై..
ఆ కపటం లేని చిన్నారుల నవ్వులూ,గోడలూ వినేలా చెప్పే టీచర్ అంకితభావనల స్వర మాధురి!
ఒకవేళ పిల్లలు వచ్చినా కొన్ని గొల్లున నవ్వులూ,కొన్ని తొర్రిపళ్ళ నవ్వులూ.. కొన్ని చెవిలో రహస్యాలు.. కొన్ని తెచ్చిపెట్టుకున్న పిల్లగంభీరతలూ..
ఇదివరకులా కనిపించడం అత్యాశ!బ్రతుకు భయం మాస్క్ రూపంలో.. అడుగుల దూరం మైలుదూరమై మనసు ల్లో !
బడి పిలిచినవేళ ప్రతి టీచర్ సతీ సావిత్రిలా..
తనబడి పిల్లల ప్రాణరక్షణ కోసమే!!ఇదో విషాద పిరియడ్!
వ్యాక్సిన్ వరం కొంగున పడేదాకా.. కోవిడ్ ని గద్దిస్తూ.. అర్థిస్తూ.. !!
********
✍️ ఎం. వి. ఉమాదేవి
నెల్లూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి