4, నవంబర్ 2020, బుధవారం

జపం, జపమాలలు - ఫలితాలు

 జపం, జపమాలలు - ఫలితాలు


జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

 

జపమాలలు 3 రకాలు

1. కరమాల

అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.


2. అక్షమాల

‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.


3. మణిమాలలు

రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.


ఫలితములు

రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.


జపం 3 విధాలుగా ఉంటుంది


1. వాచింకం

మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.


2. ఉపాంశువు

తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.


3. మానసికం

మనస్సులోనే మంత్రాన్ని జపించడం.

వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.


ఎలా చేయాలి..?

తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.


త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా

తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే


అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.


దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.


గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. 


జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కామెంట్‌లు లేవు: