4, నవంబర్ 2020, బుధవారం

*హిందూ ధర్మం - 36*

 *హిందూ ధర్మం - 36*


ప్రకృతి వనరులు అంటే గనులు, బొగ్గు, వజ్రాలు లాంటివే అనుకోకండి. నీరు, గాలి కూడా ప్రకృతి వనరులే. నీటి నుంచి, బొగ్గు నుంచి ఉత్పతి చేస్తున్న విద్యుత్తు కూడా ప్రకృతి వనరే. మరి మనం నీటిని పొదుపుగా వాడుతున్నామా? ఆ నీటి నుంచి ఉత్పతి అయిన విద్యుత్తును పొదుపుగా ఉపయోగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మాకు బిల్లు కట్టే స్థోమత ఉందండి, అందుకే మాకు విద్యుత్ పొదుపు చేయవలసిన అవసరం లేదనంటారు ఒకాయన. దానికి మన సంస్కృతి ఒక్కటే జవాబు చెప్తుంది.


మీరు ఈ ప్రకృతి వనరులకు డబ్బు చెల్లించలేరు. అవి అమూల్యమైనవి. మీరు డబ్బు చెల్లిస్తున్నది దాని ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకే. అది ఉత్పత్తి, సర్ఫరా చేయడానికి అవుతున్న ఖర్చుకు మాత్రమే మీరు మూల్యం చెల్లిస్తున్నారు, అంతే. కానీ నిజానికి మీరు కానీ, ఆ కంపేనీలు కానీ ప్రకృతి వనరులకు యజమానులు కారు, అవి ఎప్పటికి మీవి కావు. మీకు వాటిని మీ అవసరానికి మాత్రమే వాడుకునే అవకాశం మాత్రమే ఉన్నది. ఆహారం విషయంలో కూడా అంతే. మీకు అవసరమంతమేరకు తినే అవకాశమే ఇచ్చాడు కానీ ఆహారాన్ని వృధా చేసే అధికారం భగవంతుడు ఇవ్వలేదు. 


మనం దేవుడి పేరును అడ్డం పెట్టుకుని ప్రకృతిని కలుషితం చేసినా దాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా కాదు, ఇలా కాదు అంటూ మనలని మనం సమర్ధిచుకునే ప్రయత్నం చేస్తున్నామే తప్ప, పైవాడిని మాత్రం ఒప్పించలేం. ఈ సృష్టిలో మానవులకు జీవించే అధికారం ఎంత ఉందో, ఇతర జీవాలకు అంతే అధికారం ఉంది. మనం వాటి ఆవాసాలను, ఉనికిని నాశనం చేయడమంటే వాటి అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవడమే. ఈ సృష్టికి అధికారి అయిన ఈశ్వరుడి నుండి మీరు బలవంతంగా అధికారం లాక్కుంటున్నారు, ఆయన సర్వాధికారాన్ని వెక్కిరిస్తున్నారు, ఆయన ఇచ్చిన స్వేచ్చను దాటిపోతున్నారు, ఆయన చెప్పిన పరిమితులను ఉల్లంఘిస్తున్నారు. అది స్తేయం. అంటే అధర్మం. అలా కాకుండా ఆయన చెప్పినట్టుగా జీవించడం, మీకు ఏ వస్తువు అంతవరకు అవసరమో, అంత వరకే వాడుకోవడం, దేన్నీ కలుషితం చేయకపోవడం, మీ పరి ధిని గుర్తించి అంతవరకే పరిమితం కావడం అస్తేయం. అదే ధర్మం.

కామెంట్‌లు లేవు: