4, నవంబర్ 2020, బుధవారం

17-08-గీతా మకరందము

 17-08-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - అందు సాత్త్వికాహారమునుగూర్చి వచించుచున్నారు–


ఆయుస్సత్త్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః | 

రస్యాస్స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాస్సాత్త్వికప్రియాః || 


తాత్పర్యము:- ఆయుస్సును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగ వృద్ధినొందించునవియు, రసముగలవియు, చమురుగలవియు, దేహమందు చాలకాలము యుండునవియు, మనోహరములైనవియునగు ఆహారములు సత్త్వగుణముగలవారికి ఇష్టములైయుండును.


వ్యాఖ్య: - జనులయందు సత్త్వగుణ మభివృద్ధినొందునపుడు ఇట్టి యాహారము వారికి రుచించునని భావము. అనగా కారముతోను, పులుపుతోనుగూడినదియు, రాజసికమైనదియు లేక తామసికమైనదియు నగు ఆహారము వారికెన్నడును ప్రీతికరము కానేరదు. పైనదెల్పిన సాత్త్వికాహారమే వారికి ఇష్టముగనుండును. ధ్యానాదుల కిట్టి యాహారము మిక్కుటముగ అనుకూలించును. ఆహారవిషయము పరమార్థరంగమున ఎంతయో ముఖ్యమైనది. కనుకనే శ్రీకృష్ణమూర్తి గీతలో పెక్కుచోట్ల దానిని గుఱించి ప్రస్తావించుచువచ్చిరి. కావున ముముక్షువులు ఆహారసంయమము ఏదియో చిన్నవిషయమని తలంపక, బ్రహ్మమార్గమున కీలకస్థాన మాక్రమించియున్నదానినిగ అద్దానిని భావించి సాత్త్వికాహారమునే సేవించుచురావలెను.

ప్రశ్న:- సాత్త్వికాహార మెట్టిది?

ఉత్తరము:- (1) ఆయుస్సును, మనోబలమును, శరీరబలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని లెస్సగ అభివృద్ధినొందించునదియు (2) రసము గలదియు (3) చమురుతో గూడినదియు (4) దేహమునుందు చాలకాల ముండునదియు, మనోహరమైనదియు సాత్త్వికాహార మనబడును. కావున విజ్ఞు లట్టి యాహారమునే సేవించవలయును.

కామెంట్‌లు లేవు: