ఒకప్పుడు విశాఖపట్నం పాత పోస్టాఫీసు, కురుపా మార్కెట్,పూర్ణా మార్కెట్, ఎల్లమ్మ తోట(ఇప్పటి జగదాంబ),ఎ.వి.ఎన్. కాలేజి,కె.జి.హెచ్, కాన్వెంట్ జంక్షన్(చావులమదం అనే పిలిచేవారు) వరకే ఎక్కువమంది ఉండేవారు. కురుపాం మార్కెట్,పూర్ణా మార్కెట్ లొ ఒక సామాజిక వర్గం వారు,కూరలు,పళ్ళు అమ్మడంలొ ఏకచత్రాధిపత్యం కలిగి ఉండేవారు. మొదట ఆప్యాయంగా మాట్లాడినా తరువాత బేరాలాడినా కూరగాయలు ఎంచినా "మామిడి పళ్ళు తిన్న మోఖమే ఇది" అంటూ దారుణంగా హేళన చేసేవారు. ఇక విశాఖపట్నంకి ఇప్పుడున్మ రైల్వేస్టేషనును "వాల్తేర్" అని పిలిచేవారు. రెండోది చివరి స్టేషన్ గా "విశాఖపట్టణం" పాత పోస్టాఫీసు దగ్గర సెలక్టు సినిమా టాకీసుకు ఎదురుగా,దగ్గరగా ఉండేది. కురుపాం మార్కెట్ పరిసర ప్రాంతాల వారు ఆ స్టేషనులోనే దిగేవారు. మేము కురుపాం మార్కెట్ దగ్గరున్న పప్పుల వీధికి ఐదవ వీధి గంగాబత్తుల వారి వీధిలొ గరుడావారి సత్రవను నాలుగు పోర్షన్లుగా అద్దెకు ఇవ్వగా ఒకదాంట్లొ ఉండేవారం. కరెంట్ ఉండేది కాదు. కిరోసిన్ దీపం దగ్గరే ఆరవ తరగతి వరకూ చదువుకున్నాం. టౌను హాలు,బీచ్ దగ్గర కావడంతొ ఎక్కువసార్లు అక్కడే ఆడుకునే వారం. కురుపాం మార్కెట్ దగ్గర శంకర విలాస్ ఒక వైపు మరొ వైపు HMV వాళ్ళ గ్రామ ఫోను కంపెనీ అక్కడ కుక్క బొమ్మతొ బోర్డు ఉండేది. కోట వీధిలోంచి వెళితే సముద్రం దగ్గర కొండపై ఉన్న వెంకటరమణమూర్తి కోవెలకు శనివారం తరచూ నడచుకుని వెళ్ళేవాళ్ళం. ఇక కురుపాం మార్కెట్ నుండి పూర్ణా మార్కెట్ కు వచ్చే తోవలొ మలబార్ కేఫ్,విజయా గార్డెన్సు,రూఫ్ గార్డెన్సు వంటి హొటల్సు బాగా ప్రాముఖ్యం గా ఉండేవి. బీచ్ దగ్గర మినర్వా టాకీస్ అనే ధియేటర్ ఉండేది. అందులొ నాగిన్ అనే సినిమా చూసినట్లు గుర్తు. అయితే రాత్రిళ్ళు సినిమాకి వెళ్ళడానికి జంకేవారు. అదే విధంగా ఉప్పుగాలికి ప్రొజెక్టర్ పాడయిపోయేదని అనేవారు. ఇక లక్ష్మీ టాకీస్ కు మంచి చిత్రాలు వచ్చేవి. ముఖ్యంగా విజయా వారి చిత్రాలు. మాయా బజార్,గుండమ్మ కధ అక్కడే చూసాను. అప్పట్లొ డబ్బులిస్తే గేట్ మేన్ ఇంటర్వెల్ లొ వదిలేసేవాడు. సగం సినిమా చూసి ఆనందపడేవారం. అలాగే ప్రభాత్,సరస్వతి ధియేటర్లు చాలా ఫేమస్. లీలామహల్ లొ కేవలం ఇంగ్లీషు,హిందీ చిత్రాలే ఆడేవి. అంతవరకూ బెంచి,చేరబడే బెంచి,కుర్చీ,బాల్కానీలొ మంచి సౌకర్యమైన కుర్చీలు ఉండేవి. కాని రామకృష్ణా,అలంకార్ ధియేటర్లు ప్రారంభమై అన్ని తరగతులలోనూ కుర్చీలు ప్రారంభమయాయి. పూర్ణా మార్కెట్ కు దగ్గరగా పూర్ణా టాకీసు ఉండేది. ఈ ధియేటర్లొ మధ్యలొ పెద్ద స్తంభాలు ఉండేవి. అలాగే విజయాటాకీసు ఉండేది. వర్షం పడితే ధియేటర్లొ కాళ్ళకింద నీళ్ళు వచ్చేసేవి. ప్రభాత్ లొ ఎక్కువగా నవయుగా డిస్ట్రిబ్యూషన్ సినిమాలు కనుక ఎ ఎన్ ఆర్ చిత్రాలు వచ్చేవి. రామకృష్ణాలొ నర్తనశాల,లవకుశ వంటి చిత్రాలు, అలంకార్ లొ ఆరాధన వంటి చిత్రాలు గొప్ప వసూళ్ళు సాధించాయి. సినిమాకి వెళితే సిగిరెట్ కంపే. ఎ.సి.లు ఉండేవి కావు. మొదటి,రెండొ ఆటకు తలుపులు తీసేసేవారు. కరెంటుపోతే కొంతసేపు చూసి పాస్ ఇచ్చి మరునాడు రమ్మనేవారు. ఇక అప్పుడు అన్నీ ప్రయివేట్ బస్సులే. రూట్ నెంబర్ 13 పాత పోస్టాఫీసు నుండి ఎ వి ఎన్ కాలేజి,కెజి హెచ్,ద్వారకానగర్(ప్రస్తుత డైమెండ్ పార్కు) నుండి రైల్వేస్టేషన్,కాన్వెంట్ వరకూ నడిచే పెద్ద రూటు బస్సు. యూనివర్సిటికి నెం.10 బాగా ప్రసిద్ది. కె జి హెచ్ కు దగ్గరగా ఉన్న "రామకృష్ణా లంచ్ హొమన" భోజనానికి చాలా ప్రసిద్దిగా ఉండేది. చడగాస్ హోటల్ లొ పేపర్ దోశ అప్పట్లొ ప్రత్యేక ఆకర్షణ,కొబ్బరి చట్ని సూపర్. అక్కడ టిఫెన్ తినడానికి జనం టేబుళ్ళపై తాళాలు పెట్టి రిజర్వు చేసుకుని బయట వెయిట్ చేసేవారు. టిఫెన్ హోటళ్ళకు ఉడిపి హోటల్సు చాలా ప్రసిద్ది. లోపలకు వెళ్ళగానే అగరుబత్తి సువాసనలు మహత్తరంగా ఉండేవి. కాఫీ ఇత్తడి లేదా స్టీల్ గ్లాసు దానికింద ఒక గిన్నెతొ ఇచ్చి క్రిందనుండి మీదకు పోసి చల్లార్చి ఇచ్చేవారు.(మిగిలిన జ్ణాపకాలు మరొసారి)...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి