🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 102*
*****
*శ్లో:- ధనంజయే హాటక సంపరీక్షా ౹*
*రణాంగణే శస్త్ర భృతాం పరీక్షా ౹*
*విపత్తి కాలే గృహిణీ పరీక్షా ౹*
*విద్యావతాం భాగవతే పరీక్షా ౹౹*
*****
*భా:- లోకంలో సామాన్యంగా పరీక్ష అంటే భయపడని వారుండరు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఇది తారసపడుతుంది. అలాంటి పరీక్షకు గురియై, భాసించగల సందర్భాలు పరిశీలిద్దాం.1. "అగ్ని పరీక్ష":- బంగారాన్ని అగ్నిలో కాల్చి, పుటపాకం పెడితేనే అది ఆభరణాల తయారీకి అర్హమౌతుంది. సుతారంగా సుత్తి దెబ్బలు తిని, నిగ్గుతేలి నగల రూపేణ అందరి మనసులను దోచుకుంటూ, తన ధగధగలతో మురిపించి మరపింపజేస్తుంది. 2. "రణ పరీక్ష":- శస్త్రాలు, అస్త్రాలు ధరించిన వీరుడు ఘోరమైన రణరంగంలో ధైర్య సాహసాలతో, అరివీరులను చీల్చి చెండాడి, విజయాన్ని, లేదా వీరస్వర్గాన్ని అలంకరించినపుడే అతని వీర్యము ,శౌర్యము లోకానికి వెల్లడి అవుతాయి. 3."విపత్ పరీక్ష":- గృహనిర్మితి, పిల్లల పెండ్లి, ఋణబాధ,చుట్టాల తాకిడి, తీవ్రమైన జబ్బులు, ఇంటిగుట్టు ఇత్యాది విషమ పరీక్షల్లో తట్టుకుంటేనే గృహిణి ఓర్పు,నేర్పు లోకానికి తెలుస్తాయి. .4. "విద్వత్ పరీక్ష":- పండితులు, విద్వాంసులైన వారికి భాగవత స్వాధ్యాయ ప్రవచనాలే నిక షోపలము. భాగవతకథా గానము, భగవన్నుతి, తత్త్వవిచారణలో అతని గల పరిపక్వత, పారమ్యమే అతని పాండితీ ప్రాభవానికి, ప్రకర్షకు గీటురాయి. కాన బంగారానికి అగ్ని, వీరునికి రణము, గృహిణికి విపత్తు, పండితునికి భాగవతము వారి వారి శక్తిసామర్ధ్యాలకు అసలు, సిసలు పరీక్షలని, నెగ్గితేనే విజేతలుగా రాణిస్తారని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి