కుక్కలు కూడా ముట్టవని ఎందుకంటామో తెలుసా !
పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుండేవాడు. బ్రాహ్మణులు నిష్ఠాగరిష్టులై వేదాధ్యయనం చేస్తూ జనహితం కొరకు యజ్ఞయాగాలు తపాలు చేసేవారు. ఈ దేవశర్మ తద్విరుద్ధంగా ప్రవర్తించేవాడు. జూదం వ్యభిచారం మద్యపానం మాంసభక్షణ చేస్తూ దుర్మార్గుల వెంట తిరుగుతూ భ్రష్టుడై సంచరించేవాడు.
అటవిక వనితను పెండ్లాడి పిల్లలను కని వారి పోషణార్థం దొంగతనాలు చేసేవాడు.ఇలాంటి దేవశర్మ ఒకరోజు వేటకై అడవికి పోయినపుడు బాగా మదమెక్కిన ఏనుగు ఇతనిని తరమసాగింది. దానినుండి తప్పించుకోటానికి పారిపోయి ఓ మర్రిచెట్టు చాటున దాక్కొన్నాడు. ఆ బాగా ఊడలుదిగి మూడుయోజనాల వరకు వ్యాపించివుంది. ఎన్నో పశుపక్ష్యాదులు ఆ చెట్టు నీడన సేద తీరేవి.
ఆ చెట్టుమీద నాడిజంఘముడనే పేరుగల కొంగ నివసించేది. నాడిజంఘముడు కొంగ అయినప్పటికి పూర్వజన్మ సుకృతంచేత మానవభాష అతనికి తెలుసు. విరుపాక్షుడనే రాజు ఈ కొంగకు మిత్రుడు. రోజు సాయంత్రం ఇద్దరు కలుసుకొని ఆధ్యాత్మిక చింతన చేసేవారు. నాడిజంఘమునికి పూర్వజన్మలో దేవేంద్రుడు మిత్రుడు కూడా.
ఏనుగు భయంచే నక్కి వణికిపోతున్న దేవశర్మను నాడీజంఘముడు చూచాడు. సహజంగానే మంచివాడైన నాడీజంఘముడు ఆ బ్రాహ్మణుడి భయం పోగొట్టి ఆహారపానీయాలు ఇచ్చి యోగక్షేమాలు అడిగాడు.
దేవశర్మ తాను తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నానని తన కష్టాలు తీరాలంటే ధనం కావాలని చెప్పాడు. నాడీజంఘముడు అతని పరిస్థితికి జాలిపడి రాజైన విరూపాక్షున వద్దకు వెళ్ళి తనపేరు చెప్పి కావాల్సినంత ధనం తెచ్చుకోమని చెప్పాడు.
దేవశర్మ రాజును కలిసి తన పరిస్థితిని చెప్పుకొన్నాడు. దేవశర్మ అబద్ధాలు చెబుతున్నాడని ఆ రాజు సందేహించాడు. దేవశర్మను అనుమానించినప్పటికి ప్రాణమిత్రుడి మాట కాదనలేక అతను మోయనంత ధనాన్ని ఇచ్చి పంపాడు.
కపట బ్రాహ్మణుడు మోయగలినంత ధనాన్ని తీసుకొని మిట్టమధ్యాహ్నానికి మర్రిచెట్టు వద్దకు చేరాడు. ఆ సమయంలో నాడీజంఘముడు విశ్రాంతి తీసుకొంటున్నాడు. దేవశర్మ ప్రయాణబడలికతో అలసిపోయి బాగా ఆకలిమీద ఉన్నాడు. తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనని అటుఇటు చూచాడు. నిద్రపోతున్న కొంగతప్ప ఇతరాలు కనబడలేదు. అంతట ఆ బ్రాహ్మణుడు నాడీజంఘముడి మెడవిరచి చంపి కాల్చుకొని తిని ఆకలి తీర్చుకొన్నాడు.
ప్రతిరోజు సాయంత్రం తన వద్దకు రావాల్సిన నాడీజంఘముడు రాకపోయేసరికి విరూపాక్ష మహరాజుకు అనుమానం వచ్చింది. కారణం కనుక్కొని రమ్మని భటులను పంపాడు. భటులు మర్రిచెట్టు వద్ద చిందరవందరగా పడివున్న కొంగఈకలను గుర్తించి ప్రమాదం జరిగిపోయిందని గ్రహించారు. అందుకు కారణాన్ని ఊహించి ప్రయాసపడుతూ ధనాన్ని మోసుకుపోతున్న దేవశర్మను బంధించి రాజు ముందర హజరుపరిచారు. దేవశర్మ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.
దేవశర్మను బంధించి వేటకుక్కలకు ఆహారంగా పడవేశాడు. దేవశర్మ మిత్రద్రోహి, కృతఘ్నుడని ఆ కుక్కలుగ్రహించి ఆకలిగా వున్నప్పటికి వాడి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
విరూపాక్షుడు, కొంగకు కర్మకాండలు చేయాలనే ఉద్దేశ్యంతో ఈకలను మిగిలిపోయిన ఎముకలను తెప్పించి చితిమీద పేర్చి నిప్పు అంటించాడు. అయినా నిప్పు అంటుకోలేదు.
కర్మకాండల పూజకొరకు తెప్పించిన గోవును అక్కడ అప్పటికే వుంది.లేగదూడ తల్లి వద్ద పాలు త్రాగసాగింది. దూడమూతికి అంటిన పాల నురగ చితిపైనున్న ఈకలు ఎముకలపై పడింది. అమృతతుల్యమైన పాలనురగ పడగానే నాడీజంఘముడు లేచాడు, బ్రతికాడు. రాజు, పరివారం ఎంతో సంతోషించారు. మిత్రులిద్దరు గోమాతకు ప్రదక్షిణచేసి నమస్కరించారు.
జరిగిన సంఘటనను తెలుసుకొని నాడీజంఘముడు ఆ బ్రాహ్మణుని క్షమించాడు. పరివర్తన చెందిన దేవశర్మ విద్యపై దృష్టినిలిపి వేదవేదాంగాలు చదివి నేర్చుకొని శిష్యసమేతంగా ఆ మర్రిచెట్టు సమీపంలో ఆశ్రమం ఏర్పాటుచేసుకొని బాటసారులకు అన్నార్తులకు సాయపడసాగాడు.
కుక్కలు కూడా ముట్టవని మనం ఎందుకు అంటున్నామో అర్థమైంది కదా!
అందుకే మిత్రద్రోహం చేయరాదు.
చేసిన మేలును మరచి కృతఘ్నులుగా మారరాదు.
చేసిన మేలును మరచిపోనివాడు కృతజ్ఞుడు.
చేసిన మేలు మరచువాడు కృతఘ్నుడు.
.......................................................................................................................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి