7, డిసెంబర్ 2020, సోమవారం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమహాత్మ్యము 



సూతు డారీతి మునులకు శుభము నిచ్చు 

చిన్మయంబైన కథనంత చెప్పి పిదప 

సత్యనారాయణస్వామి సద్వ్రతంపు 

విభవ మీరీతి వివరించె విబుధులకును    178


"పరమ దుర్లభంబు పావన మైనట్టి 

సత్యవ్రతము నెవడు సల్పి భక్తి 

పుణ్యకథను వినునొ పుడమిపై నాతండు 

పొంది సంపదలను పొందు ముక్తి        179


సత్యనారాయణ సద్వ్రత క్రతువు 

నియమ నిష్ఠలతోడ నెఱవేర్చి పిదప 

పావన వ్రతకథన్ భక్తి యుక్తముగ 

విమలమౌ మదితోడ వినుచుండు నట్టి 

మధుర మానసులైన మనుజవర్యులకు 

భక్తితత్పరులైన భాగవతులకు 

భవబంధముల నుండి పార ద్రోలియును 

శ్రీసత్యదేవుడు చేకూర్చు ముక్తి 

అమరు దీర్గాయువు యాయురర్థులకు 

అధికార్థములు గల్గు యర్థార్థులకును 

ధర్మార్థములు గల్గు ధర్మార్థులకును 

వినయసంపద గల్గు వినయార్థులకును 

బుధపుత్రులుదయించు పుత్రార్థులకును 

సకల సంపదలొచ్చు సంపదార్ధులకు       180


కడు సమస్యలతోనుండు కలియుగమున 

సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

కామితంబుల దీర్చెడి కల్పతరువు 

ముక్తిమార్గంబు చూపెడి ముఖ్యపథము   181


విశ్వవ్యాపకుడైన శ్రీవిష్ణుమూర్తి 

కలియుగంబున భకుల కాచి బ్రోవ 

వివిధ రూపంబు లందున వెల్గుచుండు 

అందు యీ సత్యరూపమె యమిత ఘనము 182


సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

చేయుటకు శక్తి లేకను  చేయకున్న 

చేయుచుండెడి వారల చెంతకేగి 

వ్రతము జూచిన కాదేని కథను వినిన  183


సత్యనారాయణస్వామి సత్యమునను 

సర్వ పాపంబు లన్నియు సమసి పోయి 

పుడమియందున సుఖములు పొంది యంత 

పరమ పదమును జేరేరు బడసి ముక్తి "  184


ముని సూతుడు నైమిశమున 

శౌనక మునిసంఘములకు సత్యవ్రతంబున్ 

వినిపించెను యారీతిగ 

మనమున యత్యంత తోష మలముకొనంగన్ 185


సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

వినియు శౌనక మునులంత వివరముగను 

యవధి లేనట్టి యానంద మనుభవించి 

వినయప్రణతులు దెల్పిరి విష్ణువునకు      186


                         శుభము 

                   మంగళమ్ మహత్ 



       ✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: