https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v
🌸 అమృతం గమయ 🌸
*భక్తుల ముఖ్యలక్షణం*
మనం నిత్యం తెలుసుకుంటున్నటువంటి *భక్తుల ముఖ్యలక్షణాలు* అన్నీ కూడా మనకు శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చినటువంటి సందేశాల ద్వారా మనకు అందించినటువంటి వరాలు. భగవద్గీత పట్టణం చేసిన వాళ్ళందరికీ ఈ పదాలు తెలిసి ఉంటాయి.
*న హృష్యతి - న ద్వేష్టి*
*న శోచతి - న కాంక్షతి*
ఈ నాలుగు పదాలు మనకు భగవద్గీత ద్వాదశోధ్యాయం భక్తి యోగం 17వ శ్లోకంలో కనిపిస్తాయి. ఇప్పుడు వాటి అర్థాన్ని చూద్దాం.
కోరికలు తీరితే, అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సంతోషం. అదే హృష్యతి.
అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా, నష్టం కలిగినా కలిగేది శోకం. అదే శోచతి.
మనకి ఎవరైనా అపకారం చేస్తే అతడిపై ద్వేషం. అదే ద్వేష్ఠి.
మనకు లేనిదాన్ని కోరుకుంటే కాంక్ష, అదే కాంక్షతి.
ఈ హృష్యతి, శోచతి, ద్వేష్టి, కాంక్షతి - ఈ లక్షణాలన్నీ సామాన్యులకే గాని భక్తులకు ఉండవు. ఉండకూడదు. ఉంటే అతడు భక్తుడు కాడు.
మనం సామాన్యులుగా ఉన్నంతకాలం ఈ లక్షణాలు మనలను వదలవు. ఎప్పుడైతే మనం భగవంతుని వైపుకు మరలి, భగవంతునితో సంబంధ బాంధవ్యం ఏర్పరచుకుంటామో, ఆ క్షణం నుండే ఈ అవలక్షణాల నుండి మనకు విముక్తి లభిస్తుంది. అప్పుడు సంతోషంతో ఉప్పొంగిపోవటమో, బాధతో విలవిలలాడి పోవటమో, ద్వేషంతో కుతకుతలాడటమో, కోరికలతో వేగిపోవటమో ఉండదు. భగవంతునితో బంధం పెంచుకుంటే పరితృప్తి - సంతృప్తి.
అలాగే మనం ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నంత కాలం సంతోషం, దుఃఖం, ద్వేషం, కాంక్ష - వీటితో సతమతమౌతూ ఉండాలి. ఒక్కసారిగా ఈ ప్రపంచంతో సంబంధం వదులుకొని పరమాత్మతో సంబంధం పెట్టుకున్నామా? - ఆ క్షణం నుండే మనం ఈ అన్ని అవలక్షణాల నుండి - అంటే కోరికలు (కాంక్ష), దుఃఖం (శోచతి), సంతోషం (హృష్యతి), ద్వేషం (ద్వేష్టి) అనే వాటినుండి విముక్తులమవుతాం. భగవత్ సాన్నిధ్యంలో ఆనందిస్తాం.
దీనికోసం ప్రపంచాన్ని నిషేధించక్కర్లేదు. భగవత్ సాన్నిధ్యంలో, ప్రపంచంలో ఉంటూ నిర్వహించవలసిన విద్యుక్త ధర్మాలను ఆచరిస్తూ సత్య జ్ఞానముతో కర్మలని ఆచరించగలిగేటువంటి పరిపుష్టి లభిస్తుంది.
ఈ లక్షణాలను అలవాటు చేసుకోవడానికి సాధన చేయండి.
-- సత్ చిత్
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్య: స మే ప్రియ:
భగవద్గీత - భక్తియోగం - 17వ శ్లోకం
ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి