మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...
*అనాది ఆచారానికి వివరణ..*
*(ముప్పై ఐదవ రోజు)*
ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని చెపుతూ శ్రీ స్వామివారు..
"తల్లీ ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా..ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది..అది చెపుతాను శ్రద్ధగా వినండి..ఇందాక మీరు అపవిత్రం అన్నారు గదా..అది ఎందువల్ల వచ్చింది?..మల మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా.. ఈ బహిష్టు సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది కాబట్టి..అప్పుడు ఆ స్ర్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక..ఎక్కువ విశ్రాంతి కలుగ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని పెట్టారు..అలాగే.. ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం..దైవారాధన గదిలోకి..అదేనమ్మా పూజా గృహం లోకి ప్రవేశించడం నిషేధించారు..ఆ మూడురోజులూ పిల్లలకు భర్తకు దూరంగా వుండమని కూడా చెప్పారు..ఆ మలినమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాటు చేశారు..పసిపాపలను, దైవాన్ని అపవిత్రం చేయగూడదనే ఆ నియమం పెట్టారు..శిరస్సు ద్వారా..నోటి ద్వారా..చెవి, ముక్కు, కళ్ల ద్వారా ప్రాణం పోయిందనుకో..అది ఊర్ధ్వ లోకాల ద్వారా పోయినట్లు..నాభి క్రింద రంధ్రాల ద్వారా ప్రాణం పోతే..అది అధో లోకాల ద్వారా వెళ్లిందని అర్ధం.."
"అమ్మా!..ఒక విషయం గుర్తుపెట్టుకో..భగవన్నామోచ్చారణ అనేది అగ్ని లాటిది..అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి..అలా చేయగా చేయగా..ఆ అగ్ని మన మనసునూ..శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి..ఏ మలినమూ అంటకుండా చేస్తుంది..ఆ భగవన్నామోచ్చారణానికి ఒక ప్రదేశం..ఒక బహిష్టు..ఒక అపవిత్రత అనేవి లేవు గాక లేవు!..అందుచేతే సద్గురువులు కోటి జపం..నామకోటి వ్రాయడం లాంటి నియమాలు పెట్టి..ఆ భగవంతుడి నామోచ్చారణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు.."
"ఇప్పుడర్ధమైందా తల్లీ!..నీవు నీ సాధారణ పనులు చూసుకో..నాకు ఆహారం ఎవరిచేతనైనా ఇప్పించు..నేను స్వీకరిస్తాను..నిరంతర నామోచ్చారణ అనే సూర్యడు వెలుగుతుండగా..ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా?..నీ మానసిక జపం నీవు చేసుకుంటూ వుండు!..ఇక పూజ గదిలోకి నీవు ఎలాగూ వెళ్లవు.. ఇందుకోసం నేను మాలకొండ వెళ్ళవలసిన అగత్యం లేదు..శ్రీధరరావు గారూ మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.." అన్నారు..
శ్రీ స్వామివారి వివరణతో ఆ ముగ్గురికీ సందేహాలు తొలగిపోయాయి..శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్లి..ధ్యానం చేసుకోసాగారు.. శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద..వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి..
బొగ్గవరపు చిన మీరాశెట్టి గారి దంపతులు కూడా..వారం లో మూడురోజుల పాటు..శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగుచేయించే పనిలో మొగలిచెర్ల వచ్చి పోతున్నారు...ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయించడం పూర్తి అయింది..
అది నవంబరు నెల చివరి రోజులు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చి రమారమి ఇరవై రోజులు దాటిపోయాయి..చలి కూడా బాగా పెరిగింది..అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుఝామున లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు..వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజూ ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉన్నది..శ్రీ స్వామివారి బోధ పూర్తి అయిన తరువాత..ప్రభావతి శ్రీధరరావు గార్లు..శ్రీ స్వామివారు చెప్పిన విషయాల గురించి తర్కించుకోవటం అలవాటుగా మారింది..
శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు..తమ పూర్వపుణ్యం కొద్దీ..ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగుపెట్టాడనీ..ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యేవరకూ ఇక్కడే బస చేస్తారు కనుక..మరిన్ని మహాద్భుత విషయాలను తెలుసుకొని తరించవచ్చనీ..భావించారాదంపతులు..
కానీ...
దైవ లీలలు మరోలా ఉంటాయి..
శ్రీ స్వామివారు ఆశ్రమ స్థలానికి తరలి వెళ్లడం..రేపు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి