3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

అమృతం గమయ

 🌸 అమృతం గమయ 🌸


*అమృత జ్ఞానం - ఆత్మజ్ఞానం*


ఇక్కడ ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. రాత్రి తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళు పడుకోవడం. ఎన్నాళ్ళిలా? 

ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం. 

తాగిందే తాగుతున్నాం. తిరిగిన వీధుల్లోనే తిరుగుతున్నాం. 

అదే మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని పడుకుంటున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం. అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. దుఃఖం తొలగడమూ లేదు. 

ఏమాత్రం అర్దంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది. ఇందులో అంత ఆశ్చర్యపడాల్సింది మాత్రం ఏముంది. ఇక్కడ పుట్టే ప్రతిదీ ఒకనాటికి తప్పక నశిస్తుంది. 


నిత్యం కొందరు జన్మించడం మరికొందరు మరణించడం అనేది లోకంలో కనిపిస్తున్నదే. మరి ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? నాలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా నాకు ఎక్కడినుంచి వచ్చింది? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని ఒక ప్రక్క తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను. 


చాలా డబ్బు సంపాదించాలి. దాన్ని భద్రంగా దాచుకోవాలి. అందరికంటే పెద్దవాణ్ణి అయిపోవాలి అని. ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.


నా దుష్ట తెలివితేటలతో జీవితమంతా శ్రమించి ఎంత సంపాదించినా మరణంతో అదంతా ఇక్కడ వదిలెయ్యాల్సిందే గదా. ఇక్కడ వదిలెయ్యాల్సిన దానికోసం నేనెందుకు ఇంత ఆరాటపడుతూ, ఆయాసపడుతూ సంపాదిస్తున్నాను? 


అలా అని ఎందుకనుకోవాలి ఇదంతా నా వారి కోసం గదా అనుకుందామనుకుంటే! నా వారు అనేదానికి ముందే నేను ఉండి ఉండాలి కదా! నేను లేకుండా నా వారు అనేవారు ఎక్కడనుంచి వస్తారు. ఆ “నేను” అంటే ఎవరు. అసలు “నేను” అనేది నాలో దేనిని? ఇలా నేనెవరో నాకే అర్ధం కానప్పుడు ఇక నావారు అనేదంతా ఏంటి? పిచ్చి మోహం కాకపోతే! నావారు సంగతి సరే! అసలు నేనెవరివాడిని? నన్ను మా వాడు అనుకున్నవాళ్ళు ఇప్పుడెక్కడ ఉన్నారు? వారు లేరు. కొన్నాళ్ళ తర్వాత నేను ఉండను. ఇక నా వాళ్ళు అనుకునేవాళ్ళు మాత్రం ఇక్కడెన్నాళ్ళు ఉంటారు. 


ఈ నేను నాది అనుకునేదంతా ఒక నాటికి కాలం చేతిలో మింగబడబోయేదే గదా.


నిన్నటి వరకు పెద్ద వీరుడు, శూరుడు, ధనవంతుడు అనిపించుకున్నవాడు నేడు విగత జీవుడై పాడెమీద నిస్తేజంగా వెల్లికిలా పడుకుని మౌనంగా స్మశానానికి పయనమయిపోతున్నాడు. 


అక్కడ గుప్పెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోతున్నాడు. 


ఈ శరీరాల యొక్క అంతిమ సత్యం గుప్పెడు బూడిదే కదా.


ఈ మాత్రం దానికి ఇక్కడ ఇంతటి మోహం, ఇంతటి స్వార్ధం, ఇంతటి దుఃఖమా? ఇదంతా ఎంతటి బాధాకరం. 


ఇది బహు విచిత్రంగానూ, అయోమయంగానూ ఉంది. కాసేపు ఇదంతా ప్రక్కన పెడితే...


మరి ఇక్కడ జీవించి ఉన్న కాలంలో దేన్ని పొందితే ఈ జీవితం ముగిశాక కూడా అది నాతోపాటే వస్తుంది? 


అలాంటిదేదయినా అసలు ఇక్కడ ఉందా? 


అలాంటిది ఏదో ఒకటి ఇక్కడ తప్పక ఉండే ఉండవచ్చు. 


అలా కాకపోతేగనక ఈ జన్మించడం అనే శ్రమ నాకు ఎందుకు ఉంటుంది. 


ఏదో ఒక ప్రయోజనం ఇక్కడ ఉండి ఉన్నందునే బహుశ నేను ఇక్కడ జన్మించి ఉంటాను. 


అయితే అది ఏదో సంపాదన పిచ్చిలో పడి పొర్లాడుతున్న ఇప్పటి నా దుష్ట బుద్ధికి తెలియడంలేదు. 


కానీ అది నేను తప్పక తెలుసుకోవాలి. 


ఎలా తెలుసుకోవాలి? 


బహుశ అది తెలిసిన మహాత్ములను నేను తెలుసుకోగలిగితే అప్పుడు ఆ సత్యాన్ని వారిద్వారా నేను తెలుసుకోవచ్చు. 


సర్వం ఎరిగినవారు ఈ లోకాలలో ఎక్కడో ఒకచోట తప్పక ఉండే ఉంటారు. 


ఎలాగయినా సరే అది ఎంతటి శ్రమ అయినా సరే నా ఈ జీవితం మొత్తం కరిగిపోయినా సరే ఈ శరీరం కూలిపోయేలోపల ఆ మహాత్ములను నేను తప్పక చేరుకుంటాను. 


కాబట్టి ఇప్పటినుంచి ఇక నా పని వారిని గుర్తించడమే.


వారిని గుర్తించి వారిని ప్రార్ధించి వారినుంచి తెలుసుకోవాల్సిన ఆ సత్యాన్ని తెలుసుకుంటాను. 


ఆ తర్వాత మిగిలిన జీవితమంతా అది పొందే ప్రయత్నం చేస్తాను. 


ఒకవేళ ఈ జన్మలోనే గనక ఇది జరక్కపోతే నేను మళ్ళీ మళ్ళీ ఈ లోకాలలోకి శరీరాలతో రావలసి ఉంటుంది. 


అయితే ఇప్పటిలా ఈ మానవదేహాన్ని తర్వాత రాబోవు జన్మలలో కూడా నేను పొందగలను అనే నమ్మకం ఏముంది? 


ఏ పశు, పక్షి, కీటకం లాంటి దేహాలు గనక నేను పొందితే ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి? 


ఆ దేహాలు లోకంలో అందరికీ తిరస్కారమైనవే కదా!


ఆ దేహాలతో నన్నెవరు దగ్గరకు రానిస్తారు? 


అప్పుడు ఇక ఆ దేహాలతో నాకు ముక్తి ఎలా లభిస్తుంది. 


కాబట్టి ఇప్పటివరకూ వృధా అయిన కాలం ఏదో వృధా అయింది. 


ఇక ఇప్పటినుంచి ఒక్క క్షణం కూడా ఆలస్యంగాని, వృధాగాని కానివ్వకుండా జ్ఞానులకొరకు తీవ్ర ప్రయత్నం చేస్తాను అనుకుంటూ తనలో ఒక దృడ సంకల్పాన్ని ఏర్పరచుకుని మహాత్ముల కొరకు లోకాన్ని జల్లెడ పడుతున్నాడు. 


శాశ్వతమయిన ఆత్మ శాంతి కొరకు లోకం అంతా అలా మాసిన బట్టలతోనే మహాత్ముల కొరకు గాలిస్తూ తిరుగుతూనే ఉన్నాడు. 


ఎక్కడయినా ఎవరయినా పెడితే అంత తింటున్నాడు.


లేకుంటే మార్గమధ్యంలోని పంట కాలువలలోకి దిగి గుక్కెడు నీళ్ళు గొంతులో పోసుకుని శక్తిని కూడదీసుకుంటూ మళ్ళీ మహాత్ముల కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాడు. 


మానవుడు దేనికొరకు తీవ్రమయిన ప్రయత్నం చేస్తే అతడు దాన్ని తప్పక పొందుతాడు అనేది సృష్టి ప్రారంభంలో సృష్టికర్త ఏర్పరచిన ఒక నియతి. 


అందువల్ల అతడి మహాప్రయత్నం అనే తీవ్ర అన్వేషణ ఫలించి అతడి ప్రశ్నలకు సమాదానం చెప్పగలిగే గురువు ఒకనాటికి అతడికి లభిస్తున్నాడు. 


అలా అతడికి లభించిన గురువు అతడి దుఃఖం మొత్తం తొలగించడానికి చెప్పే జ్ఞానమే ఆత్మ జ్ఞానం. 


ఆత్మ స్వరూపులయిన తామందరూ ఈ ఆత్మ జ్ఞానం మీదే మనస్సు పూర్తిగా పెట్టి ఆచరణలోకి దిగవలసి ఉంటుంది.


*ప్రశాంతంగా, ఆనందంగా ఉండండి. సత్యజ్ఞానం కలిగి ధర్మయుత కర్మ చేయండి. నేను మీతో ఉన్నాను - సత్ చిత్*

కామెంట్‌లు లేవు: