3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

అమృతం గమయ

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v


🌸 అమృతం గమయ 🌸


సాన్నిధ్య సత్సంగలో శ్రీగురు బోధ సారాంశం


*అమృత  బోధ*


నిరంతరం నన్ను ధ్యానించేవారికి నేను ప్రక్కనే ఉంటాను. నా స్పర్శ వారికి తెలుస్తుంది. 

         -------భగవద్గీత.



నీవు వర్తమానంలో ఎదుర్కొంటున్న పరిస్థితులని సృష్టించుకున్నది నీవే అని తెలుసుకో. నీ జీవితంలోని పూర్వ పరిస్థితులలో దోషపూరిత నడవడిక, సత్యదూరమైన తీవ్ర ఆలోచన తరంగాలు, అజ్ఞానంతో చేసే ప్రకృతి విరుద్ధ కర్మలు ఈ వర్తమాన పరిస్థితులకు కారణమని గ్రహించు. నీవు మారాలి. నీకోసం నీవు మారాలి. నేనో, ఇంకెవరో చెప్తున్నారని మారనవసరం లేదు. ఎవరో చెప్తే నేను మారేది ఏంటి అనే అహంకారాన్ని వదిలిపెట్టండి. నేనేం మారనవసరం లేదు మీరే మారండి అంటూ ఎదుటివాళ్లు చెప్పే జ్ఞానాన్ని కనీసం పరిశీలన కూడా చేయకుండా అహంకార ప్రవృత్తితో జీవిస్తూ ఉంటే ఇంక కష్టాలు ఎలా తొలగుతాయి?


కష్టాలతో బాధపడుతూ నీవు సాధారణంగా ఇలా అనుకుంటావు: “పరమాత్ముడు నాకెందుకిలా చేశాడు?”   ఎంత అజ్ఞానం? ఎంత అమాయకత్వం? పరమాత్ముడు మనకి వాటిని ఏమాత్రం కలుగజేయలేదని వెంటనే తెలుసుకో. నీకు, నీ పనులకి నీవే బాధ్యత వహించాలి. నీవు ఒక గోడని గుద్దితే, ఆ గోడ నీకు కష్టం కలిగించాలనుకోదు; కాని నువ్వు నీ చేతిని విరగగొట్టుకోవచ్చు. ఇంత చేసి అజ్ఞానంతో తెలివి తక్కువ తనంతో గోడమీద ఆరోపణ చేస్తే ఫలితం ఉంటుందా?  వివేకాన్ని కలిగి ఉండు.


నేను ఎల్లప్పుడు ధ్యానిస్తున్నా, పూజిస్తున్నా "నన్ను అసలు పట్టించుకోవట్లేదు. కష్టాలన్నీ నాకే వస్తున్నాయి" అని బాధపడేవారు మీలో అనేకమంది ఉన్నారు. 


నిజానికి మీరు ధ్యానిస్తున్నది ఎవరిని? కోరికలని అమితంగా ప్రేమిస్తున్నారు. అందుకే పరమాత్ముడి స్పర్శ తెలియడంలేదు. 


అమ్మని మనం ఎన్నో అడుగుతాం. అన్నీ ఇస్తుందా! ఇవ్వదు. ఎందుకంటే! నీకు ఏది మంచిదో చూసి అది మాత్రమే నీకు ఇస్తుంది. నిన్ను నవమాసాలు మోసి కని పెంచిన అమ్మే నీకు ఏది మంచిదో చూసి ఇస్తుంటే! నీ పుట్టుక కి కారణమైన ఆ పరమాత్ముడికి తెలియదా నీకు ఎప్పుడు ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో! అందుకే నువ్వు కోరింది కాకుండా నీకు తగింది ఏదో, నీకు ఏది మంచిదో చూసి అది ఇస్తాడు. 


నేను విషం త్రాగుతాను అంటే అమ్మ ఊరుకుంటుందా! త్రాగితే చస్తావ్ అని ఆ రూపంలో ఉండేది మరేదో నిన్ను ఏమార్చి ఇస్తుంది. ఇవ్వడం మాములే. కానీ నీకు మేలు చేసేదే కదా ఇస్తుంది. అలాగే పరమాత్ముడు కూడా నీకు మేలు చేసేది మాత్రమే ఇస్తాడు.


క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।

స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి


కోరికవల్ల క్రోధం పుడుతుంది. క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహం వల్ల స్మృతి( జ్ఞాపకశక్తి) చెదురుతుంది. స్మృతి చెదిరితే బుద్ది నశిస్తుంది. బుద్ది నశిస్తే వివేకజ్ఞానం కోల్పోతారు అన్నాడు భగవానుడు. 


ఒకపక్క కోరిక మీద ఉన్న వ్యామోహం వలన క్రోధం పెరిగి విచక్షణ కోల్పోయి కష్టాలని కొని తెచ్చుకుని, మరొకపక్క నిన్నే నిరంతరం ధ్యానిస్తుంటే, నిన్నే తలుస్తుంటే అన్ని కష్టాలు నాకే ఇస్తున్నావు అంటారు తప్పించి తమలో ఉన్న లోపం చూడడంలేదు.  నిజానికి ఇక్కడ మీరు పరమాత్ముడి ధ్యానంలో లేరు. నిరంతరం కోరికల ధ్యానంలో ఉన్నారు. ఎంతటి అజ్ఞానం?  ఎంతటి బుద్ధిహీనత? 


మీరు ఏది కోల్పోలేదు. వచ్చింది గుర్తించడం లేదు. తెలుసుకోండి.


ఈ సత్య జ్ఞానాన్ని గ్రహించి అనన్య భక్తి చేత సమర్పణ బుద్ధితో పరమాత్ముని సేవించండి - అది ధ్యానమైనా, పూజ ఐనా, కర్మ ఐనా, జ్ఞానమైనా, మంత్రమైనా, తంత్రమైనా, మరి ఏదైనా, చివరికి లౌకిక కర్మ ఐనా -  అప్పుడు పరమాత్ముడి దివ్య స్పర్శ అనుభవమవుతుంది. - సత్ చిత్.


అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్


భగవద్గీత  - రాజవిద్యా రాజ గుహ్య యోగం - 22 వ శ్లోకం


సదా నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో ఏకాగ్రమై  నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను.

కామెంట్‌లు లేవు: