4, అక్టోబర్ 2024, శుక్రవారం

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 25

 *శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 25 వ భాగము*  

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦


ఆనందగిరి ఒకనాడు గురువుల కౌపీనములు శాఠీలు శుభ్ర పరచుటకు తుంగా తీరానికి వెళ్ళాడు. పని పూర్తి కాలేదు. ఈ లోగా కూడా వచ్చిన సహ శిష్యుడు ఆనందగిరిని తొందర చేశాడు పాఠానికి వేళ అవుతోందని. తన పని అయ్యే దాకా వేచి ఉండమని ఆనందగిరి కోరినా ఆ శిష్యుడు ఉండక విడచి వెళ్ళాడు. అక్కడ భాష్య పాఠాన్ని ఆరంభించడానికి శంకరుడు, శిష్యులు ఆసీనులై ఉన్నారు. గురువులు ఆనందగిరి లేకపోవడం చూచి అతని కోసం వేచి ఉందామని పాఠం మొదలు పెట్టలేదు. "ఆనందగిరి తుంగభద్రా నదికి శాఠీలు శుభ్ర పరచడానికి వెళ్ళాడు. అతడు వచ్చుటకు ఆలస్య మగుతుంది” అని శిష్యులు గురువు గారిని పాఠం ప్రారంభిం చమని కోరారు. పద్మపాదుడు తన మాట గురువు మన్నించునని ఎంచి “గురుదేవా! ఆనంద గిరికి ఈ పాఠములు అత్యంత అవసరమా? ఈ గోడ ఎంతో అతడంత. మీకు తెలియని విషయమా!” అని విన్నవించాడు. వారి అందరి అజ్ఞానము, అహంకా రము చూచిన శంకరాచార్యునకు వారికి కనువిప్పు కలిగించాలని నిశ్చయిం చారు. వారి అపార కరుణా సంపత్తితో ఆనందగిరిని ఆ క్షణంలో మార్చివేశారు. అతని లోని అంధకారం మటుమాయ మైనది. పదునాలుగు విద్యలలో ఒక్క క్షణంలో నిష్ణాతు డయ్యాడు! తత్త్వ విచారము కరతలా మలక మయింది. గురుదేవుని స్మరిస్తూ తొందరగా అడుగులు వేస్తూ ఆశ్రమం చేరుకొన్నాడు. వచ్చీ రాగానే ఈ శ్లోకాలు వినిపించాడు:


*"భగవన్ను దధౌ మృతి జన్మ జలే,* 

*సుఖదుఃఖ ఝషే పతితం* *వ్యధితమ్  కృపయా శరణాగత ముద్ధర మా,మనుశాధ్యుపసన్న మనన్యగతిమ్||*


"ఈ విధంగా పలికి గురువు సన్నిధానంలో నిలబడి తనకు తెలిసిన తత్త్వ రహస్యాన్ని నివేదిం చాడు. అది విని నిర్విణులయిన శిష్య గణం తాము ఎంత తక్కువ శ్రేణిలో ఉన్నారో అర్థం చేసి కొని గురుకరుణ దీటు లేనిదని ఆనందగిరిని గౌరవాదర దృష్టితో చూశారు. తోటక వృత్తములతో వేద తత్వాన్ని అంత చక్కగా విశ్లేషించిన ఆనందగిరికి 'తోటకాచార్యుడు' గా నామకరణం చేశారు శంకరస్వామి!


*శ్రీ శంకరాచార్యుల శిష్యులు నలుగురు:*


పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరాచార్యుడు, తోటకాచార్యుడు. 


ఒకరిని మించిన వారొకరు. శ్రీమహావిష్ణువు చతుర్భుజాలతో ధర్మార్థకామమోక్షములనే నాలుగు పురుషార్థాలను ధరిస్తాడంటారు. శ్రీశంకరాచార్యుడు నాలుగు వేదాలను నాలుగు భుజాలుగా ధరించాడు. నిష్కామకర్మ యోగము, ధ్యానయోగము, భక్తియోగము, జ్ఞానయోగము అనునవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యము లనే నాల్గు మోక్షాలను ఇచ్చేవి. చతురాననునకు సనక, సనందన. సనత్కుమార, సనత్సుజాతులనే నలుగురు కుమారులు. శంకరులకు నాలుగు మహావాక్యాలను పాలించే నలుగురు శిష్యులు నాలుగు బాహువులుగా భాసిల్లారు.


*‘నైష్కర్మ్యసిద్ధి'*


శృంగగిరిలో ఉండగా సురేశ్వరాచార్యుడు శంకరాచార్యస్వామి దగ్గరకు చేరి పాదాభి వందనము చేసి "స్వామీ! నాకొక ఉద్గ్రంథమును వ్రాయాలని కోరిక ఉన్నది. మీఆజ్ఞ సెలవియ్యండి” అని చెప్పాడు. శంకరుని హృదయము ద్రవించి తాను రచించిన సూత్ర భాష్యములకు వార్తికములు వ్రాయ మన్నాడు. దానితో సురేశ్వరాచార్యుని ఆనందానికి పట్టపగ్గము లు లేవు. ఈ వార్త విన్న శిష్యులు ఆ నిర్ణయానికి సుముఖులుగా లేరు. సూత్రభాష్యాలకు వార్తికాలు వ్రాయడ మంటే మాటలా? అసలు ఆ భాష్యాలను అర్థం చేసికొనడమే అసాధ్యం. ఇక వార్తికాలు రచించగల సామర్థ్యము మాటలతో వస్తుందా? తమలో తాము చర్చించుకొని శంకరులను చేరి ఈ విధంగా విన్నవించారు: "స్వామీ! సురేశ్వరా చార్యుడు నిన్న మొన్నటి వరకు కర్మలో మునిగి యుండి పరమాత్మ తత్త్వాన్ని కాదన్నవాడు. వాద సమరంలో మీచే విజితుడై మార్గాంత రము లేక విధిగా సన్న్యాసస్వీకారము చేసినవాడు. పూర్వ వాసనలు ఊరక పోగలవా? మా అందరి అభిప్రాయము సురేశ్వరుని పాలబడిన అధ్యాత్మ తత్త్వమునకు ముప్పే గాని మేలు జరగదని భావిస్తున్నాము. తరువాత మీ దయ” అని వినయంగా విన్నవించుకొన్నారు.


శంకరులు ఆలోచనలో పడ్డారు. ఈలోగా హస్తామలకాచార్యుడు వచ్చి గురువులకు వందనము చేసి ఇట్లా చెప్పాడు: “జగద్గురో! పద్మ పాదుడు బ్రహ్మచర్యాశ్రమములో నుండి నేరుగా మీ దగ్గరకు వచ్చి శిష్యుడై వేదవేదాంగాలను క్షుణ్ణంగా ఆకళించుకొని సర్వమూ తెలిసిన వాడు. వార్తిక రచన అతని చేతిలో కడు సమర్థంగా జరుగ గలదు. మీరు ఎరుగనిది లేదు. ఒకవేళ అతడు కాదను కుంటే తోటకాచార్యుడే ఇందుకు సర్వసమర్థుడు” అని విన్నవించి వెళ్ళి పోయాడు. తరువాత వచ్చిన పద్మపాదుడు శంకరులను కలసి వందనము చేసి, వార్తిక రచనకు హస్తామలకుని పేరు సూచించి అతడు వ్రాస్తే 'బంగారమునకు పరిమళం అబ్బినట్లుం టుంది' అన్నాడు. శంకరాచార్యుడు ఆ మాట విని "పద్మపాదా! నీవన్నది నిజం.నీకు తెలుసును. అతడు బాహ్యప్రపంచం తో సంబంధం లేని వాడు. పుట్టిననాటి నుండి జడుడై యున్నపుడు అతని తండ్రి నా కడకు వచ్చి వానికి జ్ఞానభిక్ష ప్రసాదించమని అర్థించాడు" అనగా పద్మపాదుడు “గురువర్యా! అంతటిలో అతనికి అంత జ్ఞానం ఎలా లభించింది? ఆశ్చర్యం గా ఉంది.” అని శంకరుని ప్రశ్నించాడు. అప్పుడు శంకరాచార్య స్వామి హస్తామలకుని పూర్వగాథ పద్మపాదు నికి ఈ విధంగా తెలియజేశారు.


“ఒకప్పుడు యమునా నదీ తీరాన సిద్ధు డొకడు పరమాత్మ తత్త్వమందే విహరించే వాడు ఉండేవాడు.


రెండేండ్ల ప్రాయము కల తన కొడుకుని తీసికొని ఒకామె నదీతీరానికి వచ్చింది. చంకలో నున్న బిడ్డను సిద్ధుని దగ్గర  ఉంచి బిడ్డను చూస్తుండమని సిద్ధునికి చెప్పి నదిలోనికి స్నానానికి దిగింది. సిద్ధునకు ప్రాపంచిక స్పృహ లేదు కాబట్టి ఆమె మాటలు చెవికి వినబడ్డా సిద్ధుని మనస్సుకు అందలేదు. తప్పటడుగులు వేసు కొంటూ పిల్లవాడు మెలమెల్లగా నీటి లోనికి జారి మునిగి పోయాడు. ప్రాణాలు పోయిన తరువాత నీళ్ళపై తేలింది పిల్లవాని శవం. తల్లి స్నానం చేసి వచ్చేలోగా జరిగిపోయిన ఘోరం చూసి తల్లి లబో దిబో అని ఏడ్వడం మొదలు పెట్టింది. సిద్ధుని ముందు శవాన్ని ఉంచి ఎలాగైనా బ్రదికించమని దీనంగా వేడుకొంది. ఈ లోగా సిద్ధునికి తెలివి వచ్చింది. చూచి జాలి పడ్డాడు. కాని ఏమి చేయగలడు? చచ్చిన బిడ్డను బ్రతికించడం సాధ్యమైన పనియేనా! ఏమీ చేయలేక తల్లి దు:ఖం పోగొట్టుదా మన్న సంకల్పంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. యోగశక్తితో బాలుని మృతకళేబరంలో ప్రవేశించాడు. పిల్లవాని కి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు. ఆ బాలుడే మన హస్తామలకుడు" అని చెప్పి మరల ఇలా అన్నారు శంకరులు: “అలాంటి వాడు హస్తామలకుడు. అతడికి లోకంతో పరిచయం పూర్తిగా మృగ్యమే! వార్తికాలు వ్రాయడానికి పనికి రాడే! పైగా మండన మిశ్రుడు సామాన్య పండితుడు కాడే! ఇక వేరొకడు కానరాడ  య్యెనే!" అప్పుడు శిష్యులు శంకరునితో "స్వామీ! ఇది మహా కార్యము. మీరు తొందర పడకండి" అని వేడు కొన్నారు. సరే నన్నారు గురువు. ఆ తరువాత సురేశ్వరుని కలిసికొని శంకరుడు 'సూత్రభాష్యాన్ని వ్రాయడం మానుకో. దానికి బదులు నీ స్వతంత్ర రచనగా ప్రపంచానికి పనికివచ్చే ఒక ఉద్గ్రంధాన్ని వ్రాయి' అని ఆదేశించారు. వార్తిక రచనకు అవరోధం కలిగినా ఒక మహా గ్రంధాన్ని రచించమన్న గురుదేవుని ఆజ్ఞ శిరసా వహించి ఆ పనికి ఉపక్రమించాడు సురేశ్వరుడు. అనతి కాలంలో పూర్తి చేసి గురుదేవునికి చూపాడు. శంకరుడు ఆ రచనను ఆమూలాగ్రం పరిశీలించి మెచ్చి శిష్యులకు చూడమని ఇచ్చారు. ఆ గ్రంధం సామాన్యమైనది కాదని, ఆధ్యాత్మిక తత్వాన్ని విపులీకరిస్తూ ముక్తిపథానికి యుక్తియుక్తముగా చక్కని బాట వేసిన గ్రంధమని కొనియాడ బడుచున్న ఆ గ్రంధమే 'నైష్కర్మ్యసిద్ధి' అన్న సార్థక నామంతో ఈ నాటికీ యతి లోకానికి శిరోధార్యమై ఉన్నది. 


ఈ గ్రంధం తరువాత సురేశ్వరాచార్యుడు తనకు సూత్రభాష్యా లకు వార్తికాలు రచించే అవకాశం దక్క నీయ లేదన్న కోపంతో 'ఎంతటివాడైనా బ్రహ్మసూత్రాలకు వార్తిక గ్రంధరచన చేసినచో అది నశించు గాక!' అని శపించాడు. తర్వాతి కాలంలో శంకరుని ఆదేశాను సారమే బృహదారణ్య కోపనిషత్తుకు, తైత్తిరీయ ఉపనిషత్తుకు శంకరులు వ్రాసిన భాష్యాలకు వార్తికాలు వ్రాశాడు.


పద్మపాదుడు సూత్ర భాష్య టీకా గ్రంధాన్ని వ్రాసి శంకరాచార్యులకు సమర్పించాడు. మొదటి భాగానికి 'పంచపాదిక' అని, రెండవ భాగానికి ‘వృత్తము' అని పేరు పెట్టాడు. 


పంచపాదికను ఆమూలాగ్రం గురువుకు చదివి వినిపించాడు. ఈ భాగానికి చిరతరకీర్తి కలుగుతుందని శంకరులు అనుగ్రహించారు. దానితో ఆవిధంగా సురేశ్వరుని శాపం పరిహరింప  బడింది. శంకరుడు హస్తామల కాచార్యుని పిలిచి అతనిని కూడా అద్వైత ప్రచారమునకు అనువైన గ్రంధాలను వ్రాయమని ప్రోత్స హించారు.


ఒకనాడు సురేశ్వరుని పిలిచి “సురేశ్వరా! నీవు మరల ఈ లోకంలో 'వాచస్పతి' అనే పేర జన్మించి భామతీ వ్యాఖ్యానము అను పేర సూత్ర భాష్యమునకు వార్తిక గ్రంథమును వ్రాస్తావు. అది వేదాంతులకు చాలా ఆదరణీయ మవుతుంది".


*ఆర్యాంబ అవసానదశ:*


శ్రీశంకరుని తల్లికి వృద్ధాప్యం వచ్చింది. శరీరపాటవం తప్పు కొన్నది. నిత్యకృత్య ములు స్వయంగా చేసుకోలేకపోతోంది. జ్ఞాతులు ఆమెను ఎంతో భక్తితో చూచుకొంటున్నారు. వేళకు తప్పకుండా స్నానం చేయించి మంచి బట్టకట్టి భోజనం తినిపిస్తు న్నారు.పుణ్యకథలు వినిపిస్తున్నారు. మలమూత్ర విసర్జనలు మంచం దగ్గరే జరుగుచున్నవి. తన స్థితి తెలిసి కొని ఇక ఎక్కువ రోజులు జీవించనని ఒకనాడు మనస్సులో తలచు కొంది తనయుడు ఇచ్చిన మాట. 'నన్ను తలచిన మరు క్షణం నీ దగ్గర ఉంటానమ్మా! అని శంకరుడు చెప్పిన సంగతి. నాకు ఏ కొరతా లేకుండా అన్నీ అమరుస్తున్నారు నాయనా! నీ చేతులలో వెళ్ళిపోవాలన్న కోరిక తప్ప నాకే కోరికా లేదు' ఇలా మంచం మీదనే ఉండి చీకటి పడిన తరువాత తలపోసింది. అదే తలపుతో ఆ రాత్రి చాలా సేపు నిద్ర పట్టక తెల్లవారు ఝామున కునుకు పట్టింది. ఆ రాత్రి శృంగగిరిలోనున్న శంకరాచార్యునికి నిద్ర రాలేదు. కోడి కూసిన సమయంలో తల్లికి ఇచ్చిన మాట స్పృహకు వచ్చింది. తన తల్లికి అవసాన సమయం వచ్చిందని గ్రహించాడు. ఆలస్యం చేయకూడదనుకొన్నాడు. ఒక్కసారిగా యోగశక్తితో వాయుమార్గాన వచ్చి తల్లిపాదాల దగ్గర వాలాడు. కళ్ళు తెరచి చూడగానే కనిపించిన శంకరుని చేరదీసికొని ఆమాత కౌగిలించు కొన్నది. "అమ్మా! నీ కోరిక ప్రకారం నేను వచ్చాను. నీకుకావలసి వన్నీ తీరుస్తాను. బెంగ వలదు” అని తల్లికి ధైర్యం చెప్పాడు శంకరుడు. అతని మాటలలోని ఆంతర్యం ఎరిగిన ఆర్యాంబ నాయనా! ఎన్నాళ్ళకు నిన్ను చూస్తున్నాను! నిన్ను చూడాలన్నదే నా కోరిక. తండ్రీ! ఈ శరీరం పని చేయడం లేదు. శక్తి ఉడిగింది. లేవలేకు న్నాను.


ఈ కాయంఎన్నాళ్ళుమన్నుతుంది? ఇంక విడిచి వేయాలి. నీ చేతులతో దీనిని బూడిద చేయి. జ్ఞానబోధ చేసి అందర్నీ తరింప జేస్తున్నావట. నాకుకూడ పుణ్య లోకాలకు పోవాలని ఉన్నది. ఆ భాగ్యం నీ వల్లనే చేకూరుతుంది” అని పలికింది ఆర్యాంబ.


శంకరుడు సంగాన్ని వీడినా సత్యాన్ని వీడ లేదు. లోకంలోని వారందరినీ తల్లులుగా భావించిన శంకరుడు ఆర్యాంబను జగన్మాత గా భావించాడు. తన తల్లికి పునరావృత్తి రహితమైన పరమపద సిద్ధి కలిగించడం తన ధర్మం. అప్పుడు పరాత్పరుని గూర్చి ధ్యానం చేశారు. అపుడు పరమేశ్వరుడు సపరివారుడై వచ్చాడు ఆమెను తీసికొనే సంకల్పంతో. అప్పుడు ఆర్యాంబ “నాయనా! వీళ్ళు మరోలా ఉన్నారు. నాకు విష్ణులోకానికి వెళ్ళాలని ఉంది” అని కోరుతుంది. వెంటనే శంకరుడు శ్రీకృష్ణుని మదిలో నిల్పుకొని ప్రార్థించాడు. ఆర్యాంబకు అప్పుడు లభించింది శ్రీమహావిష్ణు దర్శనం.చతుర్భుజుడై శంఖ చక్ర గదా శార్ఞ ఖడ్గధారియై వైజయంతీ మాల కంఠాన మెరయగా శేషతల్పుడై మహాలక్ష్మీ సహితుడైన శ్రీహరి! పార్శ్వముల నుండి భూదేవి, నీలాదేవి వింజామరలు వీస్తున్నారు. ఆర్యాంబ తన అభీష్టసిద్ధిగా వైకుంఠవాసురాలైంది. జగజ్జననికి చేసిన వాగ్దానములో మిగిలినది దహన సంస్కారము. "శంకరా! నీవు యతివి. నీకు కర్మ చేయనర్హత లేదు. కావలసిన వారము మేము ఉన్నాము కదా! విద్యుక్తంగా మేమే ఆ కార్యం నిర్వహిస్తాము. నీవు తొలగు అని జ్ఞాతులు, బంధువులు నివారించ ప్రయత్నం చేశారు.వారికి సమాధానంగా “నారాయణ స్వరూపులారా! సన్న్యసించుటకు ముందే నేను ఈమెకు వాగ్దానము చేసి యున్నాను. అది నా ధర్మము. పైగా ఈ జగన్మాత కోరిక కూడా. లేకున్నచో జరిగే ధర్మ అతిక్రమణమే నివారింపదగినది. నన్ను నమ్మి ఈ నా విధి నిర్వహణ ధర్మానికి తోడవ్వండి” అని వారందరికీ నచ్చజెప్పాడు. కాలడి లోని ఇంటి వెనుక దొడ్డి భాగములో చితి పేర్చి, దానిపై తల్లి భౌతిక కాయాన్ని అమర్చి, తల్లి కుడి భుజమును మధించాడు. అందు నుండి అగ్ని పుట్టు కొచ్చినది. యధావిధిగా అగ్ని సంస్కారము పూర్తి అయింది. కాలడి వాసులు మొదటిలో వైరుధ్యం చూపినా తరువాత నేటికీ ఈ పద్ధతినే పాటిస్తున్నారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము* 

*25 వ భాగము సమాప్తము*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

కామెంట్‌లు లేవు: