*శ్రీ ఆది శంకరాచార్యచరితము 30 వ భాగము*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
పరమేశ్వరుని తెలియ జేయుటకు మాటలు చాలవు, మనసున భావించుటకు శక్యం కాదు. అట్టి పరమాత్మ సచ్చిదా నంద స్వరూపమై ప్రకాశించుచున్నది. శివుణ్ని ఉపాసించుటకు యోగ్య మైన విభూతి, రుద్రాక్షలను ధరించ వచ్చును. ప్రమాణ రహితము లైనవి విడనా డండి.'అని ఉపదేశించారు.
అంతలో మరియెక లింగధారి లేచి, 'స్వామీ! లింగధారణ నిషేధమను చున్నారు. అద్దానిని మే మెన్నటికీ సహించ జాలం. తామట్లనవలదు. ధారణకు ఆధారములు ప్రబలంగా నున్నవి. ఒకప్పుడు దేవత లకు త్రిపురాసురులకు గొప్ప పోరు సంభవించి నది. అందు దేవతలు అసమర్థులయ్యారు. అప్పుడు వాళ్ళందరు సమావేశమై త్రిపురాసురులను సంహరించుటకు ఉపాయమాలోచించారు. అగ్ని చంద్ర, విష్ణువులను ప్రతిష్ఠించారు. ఆ ముగ్గురి చేత ఒక బాణాన్ని సృష్టింపజేశారు. అది బహు బరువుగను, బలముగను తయారైంది. అట్టి దాన్ని ఎత్తడం వాళ్ళకసాధ్యమైంది. దాన్ని ఎత్తేవారెవరా యని ఆలో చించగా రుద్రుడందులకు సమర్ధుడని నిర్ణయించి వారందరు పరమశివుని ప్రార్థించారు. వారి మొరాల కించి రుద్రుడు ప్రత్యక్షమై తానొక వరమును కోరు కొందుననగా దేవతలం గీకరించారు. 'పశువులకు పతిని కావాలి' అని రుద్రుడు వ్యక్తం చేశాడు. అప్పుడు దేవతలందరు పశువులైనారు. రుద్రుడు పశుపతి యైనాడు. దేవత లప్పుడు భక్తితో పశుపతి చిహ్నాలను ధరించారు. అంతట పరమశివుడు మేరువును విల్లుగను, వాసుకిని నారిగను, భూమిని రథముగను, సూర్యచంద్రులను చక్రము లుగను వేదాలనుగుఱ్ఱము లుగను, బ్రహ్మను రథ సారధిగను నియమిం చాడు. అట్టి సమయ మందు దేవతలు స్తోత్రం చేయుచుండ పరమశివుడు రాక్షనులను సంహరించాడు. కనుక లింగం మొదలై నవి ధరించడం భావ్యమే కదా! పరమశివుని సేవకు లగుట చేత వారి యందు మాకుండేభక్తిని పురస్క రించుకొని వారిని గౌరవిం చుటకు శివచిహ్నాలను ధరించి యున్నాము. ఇది తప్పా? ప్రభువులు ధరించే ఆయుధాలు వారి యెడ నుండే భక్తికొలది సేవకులు ధరించడం లోకాచారమై యున్నది కదా!' అని శ్రీ శంకరాచార్యులకు వివరించాడు.
లింగధారి చెప్పినదంత యు శ్రీశంకర పాదులు చక్కగా విని 'భక్తాగ్రగణ్యా! నీ వాడు మాటలకు విలువ లేదు. త్రిపురాసుర వధలో దేవతలు లింగధా రులయ్యారన్న విషయం ఏ గ్రందమందును కానరాదు. అది ఎంత మాత్రము నిజంకాదు. విభూతి, రుద్రాక్షలు ధరించారంటివి. అది సమంజసముగ నున్నది. ప్రమాణ రహిత మైనది సత్యమనుటకు ఆస్కారమేది? కనుక లింగ ధారణ నిరాధారము,నిష్ప్రయోజనమును. భక్తి, శ్రద్ధ,ధ్యానం మొదలైనవాని వల్ల ఆత్మను తెలిసికోమని సత్యోపనిషత్తు తెలుపు చున్నది. శూలం మొదలైన చిహ్నధారణ జ్ఞానార్జనకు హేతువని ఎక్కడా చెప్పి యుండలేదు. ముక్తికి మార్గం జ్ఞానార్జన పరమ శరణ్యం. చిహ్నధారణ శరీరమునకు బాధ కలుగ డంతప్ప వేరు ప్రయోజనం కానరాదు.
రాజచిహ్నములను సేవకులు ధరించడం లోకాచారమైనచో మాత్రం చామరం మొదలైనవి ధరించుటలేదే! అట్టివి సేవ కులు ధరించ వచ్చునా? కనుక పరాత్పరుని చిహ్నా లను ధరించడం బరువు చేటు! భక్తాగ్రగణ్యా! పరమ శివునకు పన్నగములు భూషణములుగా నున్నవి కదా! భక్తులు పాములను ధరించరేల? త్రాటిని జూచి పామనుకొని భయపడే మానవులు నాగధరులగు దురా! కావున పరమేశ్వర చిహ్నాలను ధరించడం భక్తులకు పాడి గాదు. ఇవి పామర చేష్టలు! అవి విడనాడి వేదోక్తమైన కర్మల నాచరించుడు! మీ మీ చిహ్నములను పరమేశ్వరు న కర్పణ చేయుడు. 'నేనే ఇదంతా చేస్తున్నాను' అను బుద్ధిని వీడి ఆత్మ సంయమనం అలవాటు పరచుకొనుడు. దానివలన కలిగే జ్ఞానంతో ముక్తిని బడయగలరు!' అని శ్రీ ఆచార్యస్వామి వివరించారు.
అంతట విపక్షశూలుడను లింగధారి శ్రీ శంకరాచార్య స్వామి వచించినది సత్య మని నమ్మి నిష్కల్మష హృదయుడై వారి పాదము లపైబడి శరణు వేడు కొన్నాడు. బంధుమిత్రుల తో అద్వైతము నవలం బించుటకు విపక్షశూలుడుకృతనిశ్చయుడైనాడు. ఆవిధంగా శ్రీశంకరాచార్య స్వామి కాంచీపుర మందు శివమతస్థులనందరినీ అద్వైతులను గావించి అచ్చోటు వీడి కొలది దినములలో అనంతశయ న క్షేత్రం చేరుకొన్నారు.
అనంతశయన క్షేత్రము:
శ్రీశంకరాచార్య స్వామి అనంతశయన క్షేత్రం ప్రవేశించి అందు వేంచేసి యున్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుచు విష్ణుభక్తుల లోపాలను సవరించుచు ఒక నెలరోజు లపాటు నివసించారు. తిరువనంతపురము, త్రివేండ్రము అని అనంత శయన క్షేత్రమునకు పేరులు. ఈనాడు అది కేరళ రాష్ట్రమునకు రాజధానీనగరమై ప్రకాశించుచున్నది. ఆనాడ చ్చట నున్నవారందరు విష్ణుభక్తులు. వారలు ఆచార వ్యవహారములను బట్టి ఆరు రకములుగా నున్నారు. వైష్ణవులు, భక్తులు, భాగవతులు, పాంచరాత్రులు, వైఖాన సులు, కర్మహీనులు అనునవి వైష్ణవశాఖలు. శ్రీ శంకరాచార్య స్వామి వచ్చారన్న వార్త వినుటతో వారందరుచూడవచ్చిరి. శ్రీ ఆచార్యపాదులు వారలతో కుశల ప్రశ్నలు గావించారు. వారలలో విష్ణుశర్మ లేచి శంకరాచార్యులతో,
'స్వామీ! వాసుదేవుడు శ్రీ రామావతారము, కృష్ణావ తారము ఎత్తియున్నారు. మేమందరం మూఢుల మైనను వాసుదేవుని ఉపాసించుటవలన పవిత్రులమై విష్ణు సాలోక్య ము పొందుచున్నారము. పూర్వమందు కౌండిన్య మహర్షికి సాక్షాత్కరించిన అనంతపద్మనాభుని మిగుల భక్తితో సేవించు చుంటిమి. ప్రతి నిత్యము మేము చేయుచున్న పని అదియే.
మాలో కర్మఠులు, బృహ్మగుప్తులు, జ్ఞానులు మొదలయిన వారందరం ఇచ్చోటనే ఉండి కర్మలు చేస్తూ జ్ఞానార్జన చేయుచు న్నాము.' అని విన్నవిం చాడు.
శ్రీఆచార్యస్వామి, విష్ణుశర్మ పలుకులు విని జ్ఞాన లక్షణము ఎట్టిదో వివరిం చమన్నారు. "స్వామీ! పరాత్పరుని ప్రమేయం లేనిదే గడ్డి పరకైనను కదలలేదు. అట్టి పరాత్పరు ని పాదపద్మములే శరణని విశ్వసించి మౌనం వహించి యుండడమే స్థిరమైన జ్ఞాన" మని విష్ణుశర్మ శంకరులకు జవాబిచ్చాడు.
శ్రీ ఆచార్యపాదులు వాని అజ్ఞానమునకు జాలినొంది, 'నాయనా! బ్రాహ్మణుడు జన్మచేత శూద్రుడు. కర్మ చేత ద్విజుడగు చున్నాడు. ద్విజుడు మూడు వేళలా సంధ్యావందన మాచరించ వలెను. త్రికాలముల యందు అగ్నిని పూజిం చాలి. ఇట్టి కర్మలు బ్రాహ్మణుడు విధిగా చేయవలెనని శ్రుతి ఘోషించుచున్నది. సంధ్యా వందనం చేయనిచో ప్రత్యవాయ దోషం సంభ విస్తుంది. వేదవిహితము లైన కర్మల నాచరించిన సకలశుభములు పొందు చున్నాడు. అట్లాచరించని వాడు సకల దుఃఖములకు లోనగుచున్నాడు. ఇది మనువు శాసించినది. మనువు శాసించిన నిత్య కర్మలను ఆచరించని వాడు జీవకోటి యున్నంత వరకు నరకమును పొందు చున్నాడు. యతులు కర్మలు చేయనక్కర లేదని తలంచకు. స్నానం, జపం, తపం, దేవతార్చన వారల కు విహితములు, సర్వ సంగ పరిత్యాగులయిన సన్న్యాసులకే కర్మలు విధించ బడినప్పుడు ఇతరుల విషయం వేరుగ వచించవలెనా? బ్రాహ్మణు డు విధికర్మల నాచరించని నాడు వాని బ్రాహ్మణ్యం మంట గలసిపోతుంది. ఏ కొంతకాలమైనను కర్మను విడనాడినచో భ్రష్టుడై యమయాతనలకు లోను గావలసినదే' అని విష్ణు శర్మాదులకు ఉపదేశం చేశారు.
*పంచాయతన పూజ:*
శ్రీశంకరపాదులు విష్ణుభక్తు లను మంచి మార్గమందు ఉంచనెంచి, ‘మానవులై జన్మించి నందుకు జ్ఞానము నార్జించుకొని ముక్తి నొందు టయే పరమావధి. దాని నెట్లు పొందవలెనో తెలిసి కొనుడు. పరమేశ్వరుడు, విష్ణువు, ఆదిత్యుడు, పార్వతి, గణపతి అనువా రైదుగురు దేవతలు, వీరం దరు ఉత్తమోత్తములు. మీరందరు ఈ పంచదేవతా పూజను ప్రారంభించుడు. ఏ కోరికలు మనసు నందు తలంచక బ్రహ్మార్పణ బుద్ధితో అర్చించు కొనుడు. తద్వారా మీ మీ అంత:క రణలు పరిశుద్ధమై మీకును, పరాత్పరునకును అభేదముదయించును. అందులో మీకు గల అజ్ఞానం మాయమై 'నేనేపరమాత్మను' అనే నిశ్చయజ్ఞానం కలుగును. అదియే మోక్షము. అట్టి ముక్తి కలుగుట కనేక కారణము లున్నవి. చెప్పెదను ఆలకించుడు.
జీవేశ్వరాభేదం దృఢంగా నమ్మునప్పుడే లింగదేహం నశించును. ఆ స్థితిలో సంకల్పములు మొలక లెత్తుటకు ఆస్కారం కాన రాదు. అట్టి నిస్సంకల్ప స్థితిలో మాయా వరణలు తొలగుటతో ఆత్మ దేదీప్య మానంగా ప్రకాశించును. దానినే శాశ్వతానందస్థితి లేక శాశ్వతమైన ముక్తి యందురు.' అని తత్త్వము నొకించుక ఉపదేశించారు.
శ్రీఆచార్యస్వామి వెదజల్లిన తత్త్వ రహస్యబీజములు విష్ణుశర్మాదులలో నాటు కొని మొలకలెత్తినవి. నాటినుండి వారందరు పంచాయతన పూజ ప్రారంభించి, ఆయన శిష్యవర్గమంతా శంకరులు చెప్పినచొప్పున చేయుచు, నిత్యం మృత్తికాస్నానము లాచరించుచు, భస్మ చందనములతో త్రిపుండ్ర ములను ధరించుచు, నియమనిష్ఠలు గలిగి ప్రవర్తించుచు జ్ఞానార్జన చేసికొనిరి.
బృహ్మగుప్తుడను వైష్ణవ మతకర్మఠుడు పేరొందిన భక్తుడు. విష్ణుభక్తులకు శంకరులు బోధించిన దంతయు శ్రద్ధగానాలకించి శ్రీశంకరపాదులను సమీపించి, 'యతిశ్రేష్ఠా! నమస్కారములు! మేమందరము స్మృతులలో తెలిపిన ప్రకారము కర్మల నాచరిం చుచున్నాము. అట్లు సత్కర్మల నాచరించుచు పద్మనాభస్వామి వారి క్షేత్ర మందు నివసించు చున్నాము' అని నివేదించుకొన్నాడు.
శ్రీశంకరాచార్యులు బృహ్మ గుప్తుని విధానమును విని, మీరందరు నిర్మలమైన మనసుతో పరమేశ్వరా ర్పణ భావంతో భక్తిశ్రద్ధలు గలిగి పంచాయతనపూజ సల్పుకొనుడు. జీవుడు, ఈశ్వరుడు అను భేద భావం లేకుండ జేసి కొనుచు సూక్ష్మ దేహానికి లోనుగాక, అజ్ఞానమును పారద్రోలి శాశ్వతానందము ను పొందుడు! అని వెలువరించుటతో బ్రహ్మ గుప్తాదులు సంతసించి, అనేక నమస్కారము లర్పించి నిర్మల చిత్తుల య్యారు. ఆ నాటి నుండి వారు అద్వైతులై స్థిరమైన ఆనందమును పొందు మార్గము నవలంబించారు.
పిమ్మట భాగవత శాఖకు చెందినవారు శ్రీ ఆచార్య పాదునితో ముచ్చటించ నుద్యుక్తులయ్యారు.
భాగవతశాఖకు చెందిన విష్ణుభక్తు డొకడు శంకరు లకు నమస్కరించి, 'వేదములలో ఎన్నివిధాల పుణ్య మార్జించు కొను విధానములు తెలుపబడి యున్నవో అవన్నియు విష్ణుమూర్తిని స్తుతించుట వలననే కలుగుచున్నవి. అందువల్లనే మేమందరం విష్ణువును కీర్తించడమందే నిమగ్నులమై శంఖం, చక్రం మొదలయిన చిహ్నాలను అంకితం చేసికొని కంఠాన తులసిమాలలు అలంక రించుకొని ఊర్థ్వపుండ్రాలు ధరించుచున్నాము. కావున ముక్తి మా అరచేతులలో నున్నది. ఇంక మాకు చింతా చీకూ అన్నది లేదు.' అని తన మతధర్మములను వివరించాడు.
శ్రీఆచార్యస్వామి భాగవతుని విధానము విని, 'భక్తులారా! విష్ణువు నాలుగు రకముల మూర్తులుగలిగియున్నాడు. అందొకటి గగనము వలె నున్నది. అది చెప్పుటకు గాని, తలంచుటకు గాని శక్యం కానిది. దీనినే పరామూర్తి యందురు. అట్టి మూర్తికి ఏవిధమైన చిహ్నములు లేవే! అతడు కేవలం నిర్గుణుడు, నిర్వికారుడు, సర్వవ్యాపి.
అట్టివాని రూపమును ఏవిధముగ ధరించగలరు? రెండవమూర్తి వ్యూహమ ను పేరుతో వెలయు చున్నది. ఇది సర్వాత్మ స్వరూపముగా నున్నది. అట్టి రూపము నెట్లు ధరించు కొనగలరు? ఒక వేళ సమర్థత గలదందురా, అట్లయిన ఆయన యొక్క ఒక చిహ్నము చేత శిరస్సు మొదలుకొని పాదాల వరకు కాల్చుకొనుడు! అప్పుడు మీకు తప్పక ఈ శరీరం విడచిన తరువాత వైష్ణవత్వమును పొంద గలరు. ఇది దుస్సాధ్యం గదా! మూడవమూర్తి మీనాది అవతారమూర్తు లు. దీనికే విభూతి యనిపేరు. ఈ చేప మొదలయినవి లోహంతో తయారు చేసుకొని దానిని కాల్చి శరీరం మీద గుర్తులు పెట్టుకొనుడు. నాల్గవ మూర్తి అర్చామూర్తి. ఇవి రాళ్ళతో తయారు కాబడును. శిలారూపాన్ని మీమీ శరీరాలయందు చిహ్నాలుగా ధరించెదరా? శంఖచక్రాలపేరుతో కాల్చు కోవడమేల? లోహాదులతో తయారైనవే ధరించిన సమంజసంగా నుండు నేమొ! భాగవతులారా! శంఖచక్రాంకితాలు పాషండమతమునకు చెందియున్నవి. పరాత్ప రుని ప్రీతికొరకు సత్కర్మల నాచరించుడు. కర్మఫలితం పరాత్పరునకు అర్పణ చేయండి. అట్లాచరించిన పరిశుద్దులగుదురు. అద్వైత తత్త్వ వేత్త యగు పరమగురువు నాశ్రయించి వారి తత్త్వోప దేశాలను పొందుడు. అప్పుడు కర్మ బంధములు తొలగి మోక్షమును బడయగల' రని గంభీరోపన్యాస మిచ్చారు.
*కాలడి శంకర కైలాస శంకర*
*శ్రీ ఆది శంకరాచార్యచరితము*
*30 వ భాగముసమాప్తము*
💕💕💕💕💕💕💕💕💕💕💕💕
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి