4, అక్టోబర్ 2024, శుక్రవారం

నవరాత్రులు

 నవరాత్రులు - నవ దుర్గలలో దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది.


శైలపుత్రి అమ్మవారి యొక్క ప్రార్ధనా శ్లోకము : 


వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥


కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.


దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది.


 వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.


నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.


.చరిత్ర :


పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.


సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.


తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.


సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.


‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. 


నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి.

కామెంట్‌లు లేవు: