4, అక్టోబర్ 2024, శుక్రవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము29

 _*శ్రీ ఆది శంకరాచార్య చరితము29 వ భాగము*_

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


పాశుపతుడు చెప్పిన దంతా శ్రద్ధగా విని, 'శివభక్తులారా! నేచెప్పు నది శ్రద్ధగావినుడు! లోకాలకు మూలకారణ మైన వాడు  ఒక్కడే. ఆయన కన్నగొప్పవాడు వేరొకడు లేడు. వేదము  అటులనే చెప్పుచున్నది. అంతవరకు నాకు సమ్మతమే. వేదమందు ఏది యుండిన దానిని విధిగా నమ్మువాడను. నాకు నచ్చని విషయ ములు మీలోనున్నవి. పరాత్పరుని గూర్చి మీరు పలికిన విషయాలతో నాకేమి విరోధము లేదు. కాని మీరందరు లింగము, శూలము, డమరుక మొదలయిన బాహ్య చిహ్నాలను ధరిస్తు న్నారు. పైగా అట్లు ధరించినందువలన మోక్షం వస్తుందను చున్నారు. అందుకు వేదప్రమాణములు కానరావు. శాస్త్రము నెరిగిన వారెవరూ వేదంలో లేని విషయా లను, ఆచారాలను అంగీకరించరు. బ్రాహ్మణ దేహములను సమస్త దేవతలు ఆశ్రయించుకొని యుండెదరు. అట్టి దేహాలను కాల్చి లింగమని, శూలమని ధరించడం మంచిది కాదు. 


పరమశివభక్తులారా! వేద వేదాంగాలు చదివిన బ్రాహ్మణుని యందు నాభికి పైన సోమపులు, దిగువను అసోమపులు నివసిస్తూ ఉంటారు. శిరస్సు, శిఖ, నుదురు, ముక్కు, చెవులు, కపోలము, నాలుక, గడ్డము, కంఠము, భుజములు, భుజాగ్రములు, అర చేతులు, వక్షము నడుము,  తొడలు, మోకాళ్ళు, మడమలు, పాదములు వీని యందు బ్రహ్మాది దేవత లు, మునీశ్వరులు ఆశ్రయించుకొని యుందురు. స్నానము ఆచరించు నప్పుడు, ఆహార పానీయములు సేవించునప్పుడు వారు సదా సంతుష్టి నొందు చుందురు.' అని బ్రహ్మ అరుణ కేతువునితో చెప్పియున్నాడు. ఇది సత్యమని కూడ వచించాడు. అట్టి పరమ పావనమైన శరీరం కాల్చి ముద్రలు వేయడం ఎంతటి ఘోరాతి ఘోరమో యోచించ లేకున్నారు. అట్లు కాల్చుట వలన ఆయా స్థానాలలో నుండు దేవతలు శపించెదరు. వారు ఆ స్థానాల లోపల ఉండ వీలుండదు గదా! అట్టివాడు అగ్నిలో నున్న కాష్ఠము వలె కాలిపోవుచున్నాడు. కాల్చుకొన్న వానిని చూచినచో సచేలస్నాన మాచరించాలి. లేదా సూర్యదర్శనంచేయాలి.  అప్పుడు గాని పాపం పోదు.


భక్తులారా! బ్రహ్మము అనే వేదాన్ని రక్షించే వాడు గనుక వాణ్ని బ్రాహ్మణుడన్నారు. అలాటి వేదాన్ని దేవత లందరు ఆశ్రయించు కొని యున్నారు. అట్టి బ్రాహ్మణుడు నాశనమై నచో లోకాలు సర్వనాశనం కాకుండ నుండగలవా? తాను వేరు, పరమాత్మ వేరు, అనే భావంతో చేసే ఉపాసన దూష్య మైనది. అట్టిమార్గంలో ముక్తిలేదు. దానికి శ్రుతి ప్రమాణము నున్నది. కర్మ నాచరించుచు, అశాశ్వతమైన జగత్తు ను తెలిసికొని, విరక్తుడై  ఆత్మయందు  అభిలాష గలవాడై యుండ వలెను. కర్మ నొక్క దాన్ని చేసినంత మాత్రాన మోక్షమెన్నటికి రాదు. విరాగియై వేదాలను తెలుసుకొని, ఇతర చింతనలను పూర్తిగ విడనాడి తత్త్వజ్ఞానము నార్జించుటకు పరమ గురువును  ఆశ్రయించ వలయునని శ్రుతి నిష్కర్షగాతెల్పుచున్నది కావున మీరు ధరించే చిహ్నాలను తక్షణం విడనాడి కేవలం జ్ఞానం కోసం పాటు పడండి. తద్వారా ముక్తి లభించును. ముక్తి సుళువుగా లభ్య మయ్యేది కాదు. తత్త్వ విచారణ చేయుట వలన యోగము కలుగును. దాని వలన శోకమోహములు నశించును. అప్పు డాతడు స్థిరమైన ఆనందమును పొందు చున్నాడు. వేదాలు వల్లించినను, దాని అర్ధమును గ్రహించి నను బుద్దిచేత గాని, శాస్త్రాలు చదువుట చేతగాని, మోక్షం లభ్యమయ్యేది కాదు. పరాత్పరుని అనుగ్రహం సంపాదించు కొనవలెను. అట్టివాడు పరమాత్మను తెలిసికొని ముక్తుడు కాగలడు. సర్వాంతర్యామిని తెలిసికొనిన ధీరుడు ముక్తిని బడయ గలడు. అతనికి దుఃఖము లేవీ అంటవు. అతడే నిత్య మైన ఆనందమును పొందగలడు. ఆకసాన్ని చాపచుట్టవలె చుట్ట పెట్ట గలవాడు దుఃఖాన్ని పొందలేడు. ఇది అట్లున్నప్పుడు అజ్ఞానికి దుఃఖం ఎట్లు తొలగును? ఎటు చూచినా మోక్షం కావలయునన్న జ్ఞానం కలిగి తీరవలెను. అందులకు గురుకృపా కటాక్షం కావలెను.' అని శ్రీ శంకారాచార్య స్వామి పాశుపతుల లోపాలను సవరించారు.అట్టి సమయమందు వీరనాయకుడను శివభక్తు డొకడు లేచి,,,,


శ్రీ ఆచార్యస్వామిని సమీపించి అంజలి ఘటించి వినమ్రుడై, "స్వామీ! నీవే శరణ్యం! వేరొక దారి కానరాదు. కరుణించు పరాత్పరా! ఇంతదనుక కూపాంధ కారంలోబడి జ్ఞాన మార్గం తెలియక కొట్టుమిట్టాడుచున్నాము. తమ వాక్సుధా రసమును ప్రసాదిం చుడు. భేదభావం నశించి అద్వైతజ్ఞాన ముదయించినది. నేనే ఆ పరమశివుడను!  నా పూర్వపుణ్య పరిపాకంతో తమ దర్శనభాగ్యం లభ్య మైంది. తాము శివునికన్న పరమైన పరమాత్మ స్వరూపం కలిగి యున్నారు.” అని బహువిధముల స్తోత్రం చేశాడు. అంతట ఆ పరమభక్తునకు శ్రీ శంకరాచార్యస్వామి అభయ ప్రదానం చేశారు. వీరనాయకుని బంధుజనులు,మిత్రులు అద్వైతమందు ప్రవేశ పెట్టబడి నారు. అంతలో లింగధారి యొకడు శ్రీశంకరులను ఎదుర్కొనుటకు ఉద్యుక్తుడైనాడు.


*లింగధారులకు తత్త్వ బోధ:*


పాశుపతుడైన వీర నాయకుడు శ్రీ శంకరా చార్యస్వామికి పాదా క్రాంతుడగుట లింగ ధారులు సహించలేక పోయారు. (శైవులలో లింగధారులొక అంత శ్శాఖ) వాళ్ళలో నుండి తేజోవంతుడొకడు కోప మాపుకోలేక లేచాడు. అతని మెడలో లింగం వ్రేలాడుచున్నది. రుద్రాక్ష మాలలు చాలా అలంక రించుకొన్నాడు.విభూతి రేఖలు మెండుగా ధరించు కొన్నాడు. మీద పడునట్లు ఉరకలు వైచుకొనుచు శ్రీ శంకరాచార్య స్వామిని సమీపించాడు. చూపరుల కాతడు రుద్రుని బోలి యున్నాడు.


'వంచకుడా! ఎంత పని చేస్తున్నావు! లోకాన్ని మోసం చేయుటకై మాయ వేషం వేసికొని పరమ పవిత్రము, పరమ ప్రమాణము అయిన మా శివ మతస్థుని నాశనం చేయుటకు పూను కొంటివా? ఎవ్వడవు నీవు చెప్పు? ఎంతటి మోసగాడివి! నీకంటె వంచకుడు వేరొకడు లేడే! ఎంత పని చేస్తున్నావు!’ 'విను! బ్రాహ్మణ్యం కంటే వైష్ణవ మతం గొప్పది. అంత కన్న శైవమతం గొప్పది. ఇది నారద మహర్షికి బ్రహ్మ వెలువరించిన విషయము.  ఇది నీ వెరుగవా? ఇట్టి పరమ ప్రమాణ ముండగా వీరనాయకుణ్ని గంగలో కలిపివేశావే! ఇంత కన్న ఘోరం మరి యొకటి గలదా! వీరనాయకు డనిన సామాన్య వ్యక్తి  కాడే! సర్వజ్ఞుడు! నీ కేమైన మతి మంద గించిందా? 'నమస్తే' అని వేదమే మహేశ్వరుడే పరమాత్ముడు సుమా! పరమశివుడందరి ముఖాల్లోను, శిరస్సుల లోను, కంఠముల లోను, హృదయముల లోను నివసిస్తూ సర్వాంతర్యామియై వెలయు చున్నాడే! 'సహస్రశీర్షాపురుష: సహస్రాక్ష స్సహస్ర పాత్' అని పురుష సూక్తము అంటున్నది. ఉపనిషత్తులలో గూడ పరమాత్మ పరమేశ్వరు డనియే స్పష్టం చేయ బడింది.'నిత్యానిత్యోహమ్’ (నిత్యము, అనిత్యము నేనై యున్నాను అని వేదము ఉచ్ఛరించు చున్నది. పరమాత్మ నిత్యము. జగత్తు అనిత్యము. ఈ రెండు ఆయనే గనుక నిత్యా నిత్యుడయ్యాడు, ఇది అధర్వవేద మందు స్పష్టంగా పలుకబడు చున్నది.


మహర్షులు పరమ శివుణ్ని అనేకవిధాల ధ్యానించి, పరమశివుడే ధ్యానింపదగిన వాడని నిర్ణయించినట్లు,

శివ రహస్యమందున్నది. కావున మహర్షులు సాక్షులైనారు. శుక మహర్షికి పరమశివుడు జ్ఞానోపదేశం చేసి యుండుటచే శుక మహర్షి మరి యొక సాక్షి. మార్కండేయుని తీసికొని పోవుచున్న యమదూతలను పరమశివుడు శిక్షించగా యమధర్మరాజు స్వయంగా వచ్చి యుండెను. అప్పుడు పరమ శివుడు మార్కం డేయుని రక్షించాడు. అందువలన యమ ధర్మరాజు, మార్కండే యుడు సాక్షులు, విష్ణుమూర్తి వరాహ రూపం దాల్చి పరమశివుని పాదముల అంతును, బ్రహ్మ హంసరూపుడై శిరస్సు అంతమును కనిపెట్ట దరిగానరైరి. వారిరువురు సాక్షులే గదా! కనుక 'ధ్యానింప తగినవా'డని మహర్షులు, 'జ్ఞానదాత' అని శుకమహర్షి, 'భక్తరక్షకు' డని మార్కండేయ యమధర్మరాజులు, 'ఆది మధ్యాంత రహితు' డని బృహ్మవిష్ణువులు తేల్చి యున్నారు. అట్టి గొప్పగొప్ప సాక్ష్యాధార ములుండగా పరమ శివుడు కేవలం పరమాత్మ అనుటకు అనుమానమేల?


శంకరాచార్యా! ముద్రలు కూడదంటావు! తప్తలింగాది ముద్రలు ధరించుకొని, రుద్రాక్ష మాలలు అలంకరించు కొని, విభూతిపూసికొని కృష్ణాజినాన్ని ధరించి, రుద్రపూజ చేస్తూ రుద్రాధ్యాయాన్ని జపంచేస్తూన్న వానికి సర్వపాపాలు పటా పంచలై,పరమపవిత్రుడై పరమశివ స్వరూపము నే పొందుచున్నాడు. రుద్రకాండలో ఈ విషయ మంతయు గలదు చూడుమా! కావున శివచిహ్నాలను ధరించడం కూడును!  పైగా ఇవి ముక్తికి హేతువులని చెప్ప బడింది. అనంతమైన ధర్మార్థకామ మోక్షాలు పొందవలెనన్న పాశు పత వ్రతమును ఆచరించాలి.”


లింగధారి వెలిబుచ్చిన ధర్మాలన్నీ శ్రీ శంకర పాదులు ఆకర్ణించారు. దూషణ భూషణలతో నిమిత్తం లేని వారాయన. తప్పులను సరిదిద్దడమే వారి ధ్యేయం. కఠినంగా పలికిన లింగధారి యెడ ప్రేమ కలిగి,


‘శివభక్తులారా! తత్త్వాన్ని యథాతధంగా తెలిసికొనుడు. మీరు చెప్పిన విషయా  లలో 'తప్త చిహ్న ధారణ' అనుదానికి ప్రమాణం కానరాదు. తప్త తనువనగా కాల్చబడిన శరీరమని మీ యభిప్రాయము. అది సరిగాదు. “తప్త:” అనగా తపింపబడిన 'తను' వనగా శరీరం గలవాడు. అని చెప్పుకోవలెను. 'అతప్తతనువు' అనగా కృచ్ఛచాంద్రాయణాది వ్రతాలుచేయడం వలన శరీరం కృశిస్తుంది. ఆలా కృశించని శరీరం గలవానికి పరమపదం ప్రాప్తించ’దని అర్ధం చెప్పు కొనవలయును. మీ రనుకొన్నట్లు అర్థం చెప్పుకొన్నచో బృహ న్నారదీయ గ్రంథానికి వైరం వస్తుంది. పైకి కనుపించే వేషాలన్నీ డంబాచారములు అనబడును. అవి  కేవలము భ్రాంతి వంతములై యున్నవి.


'శరీరం కాల్చుకొనుట వలన మహాపాపు డగును. ఎట్టి పుణ్య కార్యాలాచరించిన వాడైనను పాపాన్ని పోగొట్టుకొనలేడు. కాల్చుకొనిన చిహ్నాలను ధరించినవాడు అధము డగుచున్నాడు. ఎట్టి ఆచారవంతు డైనను వేదవేదాంగాలు క్షుణ్ణంగా వచ్చినవాడు అయినను కాల్చిన లింగము శూలము మొదలైన చిహ్నము లను ధరించిన పతనాన్ని పొంద వలసిందే అని బ్రహ్మ నారదునకు ఉపదేశం చేసి యున్నాడు.


ఒకప్పుడు గాయత్రీ దేవికిని బ్రాహ్మణుల కును గొప్ప తగవు లాట కలుగగా, అందు మహాదేవికి తీవ్రమైన కోపం కలిగి మీరందరు పాషండులగుదురు గాక! వైదికాచార భ్రష్టులగుదురు గాక! తంత్ర శాస్త్రాన్ని ఆచరింతురు గాక! నీచులై జన్మింతురు గాక! కలియుగ ప్రవేశంతో కర్మభ్రష్టు లగుదురు గాక! వివేకహీను లగుదురు గాక!' అని శపించి, కలియుగం ముప్పది వేల ఏండ్లు గడచిన తర్వాత మీరంతా సర్వ నాశనమై మరల జన్మించి సత్యవ్రతులై తత్త్వజ్ఞానులగుదురు గాక' యని శాపవిమో చనము  అనుగ్రహిం చినది. కావున మీరలు తప్తతనువులంటూ శరీరాలను కాల్చు కోకండి.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము*

*29 వ భాగము సమాప్తము*

🌺🌺🌺🌺🌹🌺🌺🌺🌺🌺🌺🌺

కామెంట్‌లు లేవు: