4, అక్టోబర్ 2024, శుక్రవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 26

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 26 వ భాగము*

💙💙💙💙💙💙💙💙💙💙💙💙


పద్మపాదుని తీర్థయాత్రలు:

పద్మపాదాచార్యునికి శృంగగిరిలో ఉండగా తీర్థయాత్రలుచేయాలనే  అభిలాష కలిగింది. శ్రీశంకరాచార్యుని అనుమతి కోసం వారిని అడిగాడు. శంకరుడు యాత్రలో అనుసరించ వలసిన పద్ధతులు, జాగ్రతలు వివరంగా బోధించారు పద్మపాదు నికి. ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య మధ్య మధ్య గల పుణ్యతీర్థములలో గ్రుంకులిడుతూ దేవుళ్ళను, మహాత్ము లనూ దర్శించుకొంటూ సాగుతోంది పద్మ పాదుడు, కూడా వచ్చిన సహశిష్యుల ప్రయాణం.

శ్రీకాళహస్తికి చేరుకొన్నా రు. శ్రీ (సాలె పురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఈశ్వరుని అర్చించి ముక్తిని పడసిన మహాక్షేత్ర మది. పంచమహా భూతములు, పంచ లింగములుగా మారినవి. జలలింగము జంబు కేశ్వరములోను, అగ్నిలింగము అరుణా చలములోను, ఆకాశ లింగము చిదంబ రమున, వాయు లింగము శ్రీకాళహస్తిలోను, పృథివీలింగము కంచిలోను వెలసి యున్నవి.ఈ క్షేత్రంలో అగస్త్యముని తపస్సు చేయగా బ్రహ్మమెచ్చి, స్నాన పాన యోగ్య మైన సువర్ణముఖరీ నదిని ప్రసాదించిరని ప్రతీతి. ఆ నది నగరం ప్రక్కగా ప్రవహిస్తుంది. గర్భగుడిలోనికి గాలి చొరదు. మూల విరాట్టుకు పైభాగమున ఒక జ్యోతి వెలిగించ బడి ఉంటుంది. అది సదా కదలుతూనే ఉంటుంది. అది వాయులింగ మనుటకు చిహ్నము. అచ్చట ఈశ్వరునికి, జ్ఞాన ప్రసూనాంబకు మ్రొక్కి కాంచీ క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. పృథివీలింగము వెలసిన పుణ్యక్షేత్రము కంచి. ఇందున్న ఈశ్వరుని ఆమ్రాధీశ్వరు డని, ఏకాంబరేశ్వరు డని పిలుస్తారు. మామిడి చెట్టు క్రింద వెలసిన లింగం కావున ఆమ్రాధీశ్వరు డను పేరు వచ్చింది. ఆ చెట్టు నీడనే పార్వతీదేవి తపస్సు చేసిందట. అమ్మవారిని కామాక్షి అంటారు. ఈ చోట నూట ఎనిమిది శివక్షేత్రములు, పదునెనిమిది విష్ణుక్షేత్రములు కలవట. కామాక్షి అమ్మవారికి మూడు కన్నులుండుటచే త్రినేత్రిణి అని పిలుస్తారు. మధ్య కన్ను అగ్ని, మిగిలిన రెండు కళ్ళూ సూర్యచంద్రులు.


కంచి నుండి బయలుదేరి పుండరీక క్షేత్రము వెళ్ళారు. శివుడు నాట్య మాడు తున్నపుడు జటాజూటము విసరగా అందుండి గంగ హద్దు మీరి క్రిందపడిందని దానిని 'శివగంగ' అంటారు. పద్మపాదు డు ఆ పవిత్రమైన శివగంగలో స్నానం చేసి నటరాజస్వామిని దర్శించుకొన్నాడు. తరువాతి క్షేత్రము కావేరీ తీరమున గల శ్రీరంగము. శ్రీరంగనాధ స్వామిని దర్శించుకొని వెళ్ళుతుండగా దారిలో వారికి పద్మపాదుని మేనమామ ఊరు తగిలింది.


పద్మపాదుడు వస్తున్నాడని మేనమామ బంధు మిత్రులతో సహా అమితానంద భరితుడై చూడవచ్చెను. చాల కాల మయింది పద్మ పాదుని చూచి. వారు చాలా సంతోషంతో “యతి వర్యా! మిమ్ములను ఇంత కాలానికి చూడగలి గాము. మీరు సన్న్యాసము స్వీకరించి నారని మాకు తెలిసింది. మీ ఆశ్రమమే గొప్పది. మీరు సదా విరాగులై దైవ చింతనతో ఇహదు:ఖాలకు దూరంగా స్వేచ్ఛగా ఉంటారు. మేము ఆలుబిడ్డల పోషణతో ఈ జంఝాటంలో పడి కొట్టు మిట్టాడుతూ ఉంటాము. మా పాపముల నుండి కాపాడి మాకు జ్ఞానము ప్రసాదించ గల దిట్టలు మీరు. మమ్ము కరుణించండి. మాకు జ్ఞానం ప్రసాదించండి" అని వేడుకొన్నారు.


టీకాగ్రంధము:

మేనమామ పద్మపాదుని తన ఇంటికి భిక్ష ఇవ్వడానికి తీసికొని వెళ్ళాడు. శిష్యులతో సహా భిక్ష ముగించుకొన్న తర్వాత మేనమామ పద్మ పాదుని వద్ద నున్న గ్రంథాన్ని చూచి అది యేమి గ్రంథమని అడిగాడు. పద్మపాదుని మేనమామ మహా విద్వాంసుడు  కర్మిష్ఠి. మీమాంసా మత స్థుడు. ఆ పుస్తకాన్ని చూడగానే అది చాలా ప్రభావవంతమైన అద్వైతతత్త్వ ప్రతిపాద క మని గ్రహించాడు. అది శ్రీశంకరాచార్యులు వ్రాసిన భాష్యమునకు పద్మపాదుడు వ్రాసిన టీకాగ్రంథము. మేనమామకు అప్పుడు ఒక దుర్బుద్ధి పుట్టినది. ఈ గ్రంథము వ్యాప్తి చెందితే తమ మతానికి తీరని దెబ్బ తగులు తుంది. దీనిని వెలుగు లోనికి రానీయకుండా అంతం చేయాలి. లేని సంతోషము ఉత్సాహం  తెచ్చుకొని తానా గ్రంథం చదవాలని ఆసక్తిగా ఉందని తనకు ఇవ్వమని అడిగాడు మేనమామ. సరే నని సేతుయాత్ర ముగించు కొని వచ్చేవరకు భద్రంగా కాపాడమనీ మరీమరీ మేనమామ ను హెచ్చరించి వెళ్ళాడు పద్మపాదుడు. పద్మపాదుడు అక్కడి నుండి సేతుక్షేత్రం దర్శించడానికి బయలు దేరాడు. లంకా పట్టణాన్ని ముట్టడించి రావణ సంహార నిమిత్తమై శ్రీరామ చంద్రుడు వారిధిపై వారధి నిర్మించిన పుణ్యభూమి అది. సేతునిర్మాణం అయ్యాక వానరసేనతో లంకపై దండెత్తి వెళ్ళిన స్థల మది. అచ్చట రామలింగేశ్వరాలయము, దర్భ శయనం చూడవలసినవి. సముద్రాన్ని ఎట్లు దాటాలని ఆలోచన చేసిన చోటది. శ్రీరాముడు దర్భలపై శయనించిన చోటు. తిరిగి వెనుకకు ప్రయాణ మయ్యాడు పద్మపాదుడు శిష్యుల తో కూడి. తన మేనమామ ఊరు చేరుకొన్నాడు. అనుకున్న కుట్ర ప్రకారం గ్రంథాన్ని దగ్ధం చేసేశాడు. అనుమానం రాకుండా ఆ గ్రంథం ఉంచిన ఇల్లును కూడా గ్రంథంతో బాటు దగ్ధం చేశాడు. ఎంతో శ్రమపడి వ్రాసిన గ్రంథమది. దానికి చింతించడం గతజల సేతుబంధనం కదా మరల వ్రాయవచ్చు ననుకొన్నాడు. కపట భావాలతో గ్రంథం కాలిపోయినందుకు విచారం నటిస్తున్న మేనమామతో ఇలా అన్నాడు: “నారాయణా! చింతించకు. నీవేమి చేయగలవు? దైవవిధి అలా ఉంది. మరల వ్రాసుకొందునులే” అని ఊరుకో బెట్టాడు. మళ్ళీ గ్రంథాన్ని యధా తథంగా వ్రాయడం మొదలు పెట్టాడు. అది చూచిన మేనమామ అచ్చెరువంది మరింత క్రూరంగా ఆలోచన చేశాడు. ఇంటికి భిక్షకు పిలిచి మందులు కలిపిన భోజనం పెట్టాడు. ఆ భిక్ష తర్వాత పద్మపాదుని మేధ దెబ్బ తిన్నది. గ్రంథరచన ఆగి పోయింది.


*పద్మపాదుడు గురువు కడకు రాక:*


శ్రీ శంకరాచార్యుడు కేరళ దేశములో ఉన్నాడని తెలిసిన పద్మపాదుడు హుటా హుటిని వారి కడకు శిష్యసమేతంగాచేరాడు. శంకరాచార్యుడు కూడ తన ప్రియశిష్యుని రాకకు ఎదురు చూస్తున్నారు.  వారు పద్మపాదుని చూడగానే ఆనంద పడ్డారు. యాత్రావిశేషాలు గురువు గారికి విన్నవించాడు:


“గురుదేవా! వివిధమైన పుణ్యతీర్థాలలో స్నానమాడి, ఆయా పవిత్రక్షేత్రములలోని దేవతామూర్తులను దర్శించి పులకితుడ నైనాను. మీ కరుణా కటాక్షములే నన్ను ఈ యాత్రలను ఎంతో సఫలీకృతం చేశాయి. ఎందరో ద్వైతవాదుల తోను, వైష్ణవ శైవ తీవ్ర మతస్థులతోను తలపడ వలసిన సమయాలలో మీ శుభాశీస్సులే నన్ను సరియైన దారిలో నడిపించాయి. నాపై మీకు గల అపారదయ తో నాకు ముమ్మారు సూత్రభాష్యం పాఠం చెప్పారు. ఆ భాష్యపాఠాలే నాకు పరమతవాదుల తోడి చర్చా యుద్ధాలలో శార్జ్ఞ  కోదండము వలె ఉపయుక్తమైంది. కాణాదులతోను, వైశేషిక దార్శనికుల తోను బాహాబాహీ పోరు తటస్థించింది. కాపీలులతో కలియబడ వలసి వచ్చింది. ఇక సాంఖ్యులు ప్రశ్న పరంపరలు కురిపిం చారు. ఆ విధమైన చతుర్ముఖబంధనం నిర్మించినా, మీ కరుణతో ప్రస్థాన త్రయమనే వజ్రాయుధం తో నిర్భయంగా పోరు సలిపి జయశ్రీని చేపట్టితిని. ఇది అంతయు మీ సేవా ఫలము. మీ దివ్యాను గ్రహము. ఈ విజయ పరంపర అంతయు మీదే. ఇదే మీకు వినమ్రుడనై మీకు పాదాక్రాంతుడనై అర్పిస్తున్నాను" అని విన్నవించాడు పద్మ పాదుడు. మరల మాట్లాడుతూ “దారిలో నా మేనమామ ఊరు చేరినపుడు వానితోను, ఆ పురవాసులతోను సంభాషించాను. మా మేనమామ కర్మమార్గ గామి. ప్రసిద్ధుడైన ప్రభాకరుని శిష్యుడు. అతనిని కూడ ఒప్పించి అద్వైత మతస్థుణ్ణి చేశాననిపించింది. దురదృష్ట వశమున నేను తమ దయతో వ్రాసిన టీకా గ్రంథము వాని ఇంటితో బాటు దగ్ధమైపోయింది. తరువాత అతని వైఖరి మాటలను బట్టి నాకు అనుమానము కలిగింది. గ్రంధం దగ్ధం అవ్వడం అతడు కావాలని చేసిన దుశ్చర్యయే అని తట్టింది. తరువాత ఆతడు నాకు ఇచ్చిన భిక్ష తీసికొనిన వెంటనే నాకు జడత్వము కలిగి రచనకు భంగ మేర్పడింది. నా లోపమేమైనా చేసిన పాపమో దీనికి హేతువు కావచ్చు. అవతారమూర్తీ! శరణు!" అని గురువులకు జరిగిన ఉదంతాన్ని నివేదించాడు.

శ్రీపద్మపాదాచార్యులు చెప్పినది విన్న శ్రీశంకరస్వామి అతనితో ఈ విధంగా పలికారు: “పద్మపాదా! దైవవిధి దాట నెవ్వరి తరము? అందువల ననే కర్మలు జాగ్రత్తతో ఆచరించమన్నారు. వానియందెట్టి లోపమున్నను తత్ఫలితము అనుభవించక తప్పదు. ఇదంతయు మనస్సు లో నిడుకొనియే సురేశ్వరుని అందుకు నియమించితిని. ఎవరి కర్మ ఎవరి కెఱుక? బుద్ధిమంతుడు కడచిన కష్ట పరిస్థితికి వగవడు. నీవు దిగులు పడకు. ఇదివరలో నాకు ఐదు పాదాలు చదివి వినిపించావు. జ్ఞాపకమున్నది. నేను చెబుతా వ్రాసుకో!" అని స్వామి అద్భుత మేధాశక్తితో ఉన్నది ఉన్నట్లుగా ఒక్క అక్షరం విడువకుండా టీకా గ్రంధములోని పంచ పాదుకలను తిరిగి వ్రాయించారు.


*కేరళ రాజు:*


శ్రీ శంకరుడు పూర్వాశ్రమంలో పిన్న వయస్సులో ఉండగా కేరళదేశపు రాజు స్వామిని దర్శించుటకు వచ్చాడు. ఆ తరుణంలో శంకరునికి రాజు తాను వ్రాసిన మూడు నాటకములను చదివి వినిపించాడు. ఈ విషయం మనం మొదట్లో ముచ్చటించు కొన్నదే. రాజు రచించిన నాటకాలు శంకరునకు నచ్చాయి. ఆనాటకాలు కారణాంతరముల వల్ల దగ్ధమై పోయాయి. శ్రీ పద్మపాదుని దగ్ధమై పోయిన గ్రంథాన్ని స్వామి తిరిగి తన జ్ఞాపకశక్తితో వ్రాయించారన్న వార్త విని కేరళ రాజు కూడ ఆశతో స్వామిని దర్శించాడు. రాజశేఖ రుడు వందనములు అర్పించి నిలబడి యుండెను. శంకరుడు కుశలప్రశ్నలు తర్వాత 'నీ నాటకములు బాగా ప్రచారములో ఉన్నవా? అని రాజును అడిగారు. రాజశేఖ రుడు ఖిన్నుడై అంజలి ఘటించి, "స్వామీ! దైవవిధి అటులున్నది కాబోలు. అగ్నిలో బడి నా నాటకములు కాలి పోయాయి. తమ అనుగ్రహం ఉంటే తిరిగి అవి దక్కునేమో!” అని ప్రార్థించాడు.


ఒకసారి ఎన్ని ఏండ్ల పూర్వమో విన్న ఆ రాజు రచించిన మూడు నాటకాలను తన అపూర్వమైన జ్ఞాపక బలంతో జ్ఞప్తికి తెచ్చుకొని రాజుతో తిరిగి వ్రాయించారు. అచ్చెరువుతో శంకరులకు వందనములు అర్పించి ‘తమ దాసుణ్ణి నన్ను శాసించండి' అని వేడుకొన్నాడు రాజశేఖరుడు. జనానురంజకంగా ధర్మపాలన చేయమని రాజుకు చెప్పారు యతీంద్రులు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్యచరితము*

*26 వ భాగము సమాప్తము*

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కామెంట్‌లు లేవు: