4, అక్టోబర్ 2024, శుక్రవారం

శ్రీ ఆది శంకరాచార్య చరితము 27

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 27 వ భాగము* 

🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭


*మధ్యార్జునేశ్వరము:*


శ్రీ ఆచార్యస్వామి కేరళ దేశములో ఉన్నారు. దక్షిణదేశ మందున్న కార్యక్రమం వెనుకబడి యున్నది. ఎంతో మంది శిష్యులు చేరు కున్నారు. పద్మపాదుడు హస్తామలకుడు, తోటకాచార్యుడు కాక శాస్త్రనిష్ణాతులైన వారెందరో శిష్యులు అయ్యారు. వారిలో చిద్విలాసుడు, బుద్ధివృద్ధుడు, భానుమరీచి, విరించిపాదుడు, విష్ణుగుప్తుడు, శుద్ధకీర్తుడు, శుద్ధానందుడు, నమిత్రానుడు మున్నగు వారున్నారు. సుధన్వ మహారాజు పరివారం వెంటబెట్టు కొని యున్నాడు. రామేశ్వర యాత్రకై బయలు వెడలి మార్గ మధ్యమందున్న మధ్యార్జునమనే శివక్షేత్రము చేరుకు న్నారు. ఈ క్షేత్రము మహామహిమతో గొప్ప పుణ్యస్థలమై విరాజిల్లుతోంది. అచ్చోట గల స్వామి వారిని దర్శించిన మాత్రాన సమస్త విద్యలు లభించును. సమస్త పాపములు హరించును. అన్ని కోరికలు నెరవేరును. అట్టి మహేశ్వరుని శ్రీశంకరులు దర్శించు కొన్నారు. అక్కడి భక్తులందరూ ద్వైత మతావలంబులు. ద్వైతమే సరియైన తత్త్వమని గట్టిగా నమ్మినవారు. అద్వైత మతవ్యాప్తి వారికి సుతరామూ కిట్టదు. అందుచే మంచి పట్టుదలతో ఉన్నారు. ఈ శంకరుని వాదాన్ని పూర్తిగా త్రోసిపుచ్చి తమ భావాన్నే స్థిరంగా నిలబెట్టాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు అక్కడి పండితులు. శ్రీశంకరాచార్యస్వామి రాగానే వారితో తీవ్ర మైన వాదాలకుదిగారు.

శ్రీ శంకరాచార్యస్వామి ఆ వాద ప్రక్రియను క్రమ బద్ధం చేసి క్రమంగా వారి సందేహాలకు అన్నిటికి తగిన సమాధానాలు ఇచ్చి, వారు లేవదీసిన అభ్యంతరాలను త్రోసి పుచ్చి, సప్రమాణంగా, సహేతుకంగా, నిర్ద్వం ద్వంగా అద్వైత తత్త్వ పరమార్థాన్ని నచ్చ జెప్పారు. దానితో సరిపుచ్చక ప్రత్యక్ష ప్రమాణము కన్న మిన్న లేదన్న భావంతో స్థానిక దేవతా మూర్తి దిక్కు మొగమై, ఇలా అర్థించారు: 


"పరమేశ్వరా! జ్ఞాన స్వరూపా! జ్ఞానదాతా! ఈ వచ్చిన విద్వన్ము ఖ్యులు ఇంకా సంశయా త్ములై ఉన్నారు. ద్వైతమో అద్వైతమో ఏది నిజమో పోల్చు కోలేక. ఏది సత్యమో భగవన్వాక్కుగా వినా లనిఉంది. అనుగ్ర హించు తండ్రీ!”. 


వెను వెంటనే ఆ దేవాలయములో నున్న లింగముపై ఒక దివ్య కాంతి పుంజము ఉద్భవించి, అందున్న పరమేశ్వరుడు చిద్విలాసవదనుడై కుడి చేయి పైకెత్తి “అద్వైతమే సత్యము! అద్వైతమే సత్యము! అద్వైతమే సత్యము!” ముమ్మారు గర్జించి అదృశ్యుడయ్యాడు. కని విని ఎరుగని ఆ అనుభూతి వారందరిని విభ్రాంతుల్ని చేసింది. శంకరాచార్యునికి జోహారులర్పించి వారి అనుగ్రహం కోరారు. శిష్యగణంతో శ్రీశంకరా చార్యులు బయలుదేరి కొన్ని రోజులకు రామేశ్వరం చేరుకొన్నారు.


*శాక్తేయులు:*


రామేశ్వరములో శక్తి నుపాసించు వారిని శాక్తేయులందురు. వీరిలో వామాచారులని ఒక తెగయున్నది. వారి ఉపాసనలో మద్యము, మాంసము, ముద్ర, మైధునము అను మకార పంచకమును ఉపయోగిస్తారు. శాక్తే యులలో కొందరు వామాచారులు కాని వారున్నారు. లక్ష్మీ ఉపాసకులు, సరస్వతీ ఉపాసకులు, భవానీ ఉపాసకులు, సారస్వతులు అను పలు తెరంగులుగా నున్నారు శాక్తేయులు. వీరందరూ వారి ఇష్ట దేవిని పరాశక్తిగా భావించెదరు. రామేశ్వరప్రాంత మందు శాక్తేయులు కొల్లలుగానుండిరి. వారందరు శ్రీ శంకరా చార్యులు వచ్చారన్న వార్త విని ఒక చోట సమావేశమైనారు. ఆ సమావేశ మందు. 'శంకరాచార్యులు, ఎన్నెన్నిమతాలనో కాదను చున్నారట! ప్రతీ మతమందును తప్పులున్నాయని పలుకు చున్నారట! మన మతాన్ని కూడ నిర్మూలనం చేయాలనే సంకల్పం తోనే మన తావుకు వచ్చారట! ఆయన మతమే గొప్పదట! ఆతడు మన మతాన్ని జయించడం కాదు, మనమే ఆయన కడ కేగి జయించాలి. లేనిచో అడవిలో కాచిన వెన్నెలవలె మన మతం నిరర్ధకం కాగలదు. మనలో మనకున్న మనస్పర్ధలు కట్టిపెట్టి శత్రువును జయించ డంలో ఐకమత్యం వహించాలి. ఆయన కూడ సరస్వతిని ఆరాధించేవాడట. కనుక యతికి అన్య మార్గం లేదు. చూడగా మన మతమును కాదన జాలడు.' అని తీర్మానించుకొన్నారు.


అంతట శాక్తేయులు ధీమాతో బయలుదేరి రామేశ్వరములో

శ్రీ శంకరాచార్యులను దర్శించి సాష్టాంగ వందనాలనుఅర్పించారు.  శంకరాచార్యస్వామి నారాయణ స్మరణలు పలికి కుశలప్రశ్నలు వేశారు. అంతట వారలలో నొకడు లేచి, ‘యతివర్యా! లోకంలో బహుమతాలను మీరు కాదను చున్నారట. మాకు  అందులకు సంతోషమైంది. మా మతము  అట్టిది కాదు. ప్రతీవారు ఆచరించి గౌరవించతగ్గ మా మత మందు మోక్షోపాయ మున్నది' అని విన్న వించిన తరువాత,


'స్వామీ! సకలభూత ములకు తల్లియనునది గలదు. ఆ తల్లిని ఆదిశక్తి యందురు. ఆమె పరమేశ్వరుని కంటె అతీతమైనది లోకాలన్నీ ఆదిశక్తి వల్లనే ఉత్పన్నమగు చున్నవి. ఆమె శక్తిని వర్ణించ ఎవరితరము గాదు. సర్వాధార భూతురాలై అందరి చేతను పూజింప తగి యున్నది. అట్టి పరాశక్తి అంశనే భవానీదేవి యందురు. భవానీ సేవా తత్పరులమై ఆమె అనుగ్రహానికి పాత్రులమై బంగారంతో చేయబడిన ఆమె పాద చిహ్నాలను కంఠమున, భుజముల యందు ధరించుచున్నాము. ఆమెను ఉపాసించిన వారు జీవన్ముక్తు లగుచున్నారు.' అని మరి యొక శాక్తేయుడు శ్రీశంకరులకు వివరించాడు.


అంతలో వేరొకడు లేచి. 'పరాత్పరా! విద్య- అవిద్య ఈ రెండును తెలిసినవాడే జ్ఞాని. అట్టి వాడు మరణము నొందక మోక్షమునే బడయుచున్నాడు. ఆదిశక్తి యొక్క కటాక్షంతో ముక్తి కలుగు చున్నది. కోరిన వారికి ఆమె మోక్షము నిచ్చును. ఓంకారము నుండి అకార, మకార, ఉకారములు ఉద్భవిం చినట్లే లక్ష్మి, భవానీ, సరస్వతులు మువ్వురు ఆదిశక్తినుండి ఉద్భవిం చారు. ప్రకృతి, పురుషుడు వేరు గారు. వారిరువురు ఒక్కటే. సదేవ సౌమ్యాది వేద వాక్యాలు ఇందుకు ప్రమాణములే కదా! ఈ సకల చరాచర ప్రపంచ మునకు సర్వదేవత లకు ప్రభువైన పరాత్పరునకు పరా పరమై జ్ఞానస్వరూపిణి యై చంద్రకాంతి వలె వెలుగునిస్తూంది. యతివర్యా! ఆమహాశక్తి భర్తను తన స్వాధీన మందుంచుకొన్నది. ఆమెయే భవానియై వెలసింది. తామును చాల గొప్పవారే! కావున మాదేవి చిహ్నాలనే ధరించి ఆమెనే ఉపాసించుడు!' అని వచించాడు.


శ్రీ శంకరాచార్యులు వారల విధానము నాలకించి వారల లోపాలను సరిదిద్ద నుద్యుక్తులయ్యారు.


*భవానీ ఉపాసకులు:* 


చిన్నచిన్న లోపములు జ్ఞానాన్ని మరుగుపరచి అంధకారంలో బడ ద్రోయును. చిన్న తప్పునకు పెద్దశిక్ష కూడదని శ్రీ శంకరాచార్యులకు కరుణ కలిగి శాక్తేయుల లోపాలను సరిదిద్దుటకు తలంచి భవానీ ఉపాస కుల నుద్దేశించి: 


“మీరు పలికిన పలుకులు నిజమే! కాని, సకలశాస్త్రముల లోను ప్రకృతికి పరాపర మైన పరమాత్మ యొక్క బోధనల వలన ముక్తి కలుగుచున్నదని నిశ్శంకగా నిర్వచించ బడినది. మోక్ష మనగా మరేమీకాదు, అజ్ఞాన ము నుండి బయట పడుటయే. అనగా ఆత్మను తెలిసికొనుట.  ఆత్మను పరమాత్మగా భావించమని శ్రుతి స్మృతులు ప్రమాణములై యున్నవి. అజామిత్యాది మంత్ర ములలో ఉత్పత్తి లేని మాయా స్వరూపమును వివరించి ఆత్మతత్త్వా న్ని మోక్షం కొరకు విపులముగ తెలియ జేసిరి. కనుక    ప్రకృతి కంటె విలక్షణ మైనది పరమాత్మయని తెలిసి కోవలెను. అట్టి పరమాత్మను ఆత్మగా తెలిసికొనుటయే స్థిర మైన ముక్తియని శ్రుతులు ఘోషించు చున్నవి. ప్రకృతి పర మైన పురుషుని చక్కగా తెలిసికొన్నచో ముక్తి కలుగునని సాంఖ్యులు నిర్వచిం చారు. కనుక ఆలాటి పరమాత్మ జ్ఞానంవల్ల ఈ ప్రకృతిలో నున్న అంటు ఊడి పోయి స్థిరమైన ఆనందమును పొంది ముక్తులగు చున్నారు. ఇదియే యదార్థమైన మార్గము. పరమాత్మకు,పరమాత్మ జ్ఞానం కలవారికి భేదం లేదని ‘బ్రహ్మవిద్బ్ర హ్మైవభవతి’ అని శ్రుతివాక్యము. పరమాత్మ తత్త్వము నెరుగని వాడు ఎన్నటికీ పరమాత్మ కాజాలడు. కనుక మీరందరు ఆత్మతత్త్వాన్ని ఆకళింపు జేసికొనుడు. భవానీదేవిని ఆరాధిం చుటవలన చిత్తశుద్ది మాత్రమే కలుగును. ఆ యమ్మ అద్వైతమునే బోధించును. భవానీ దేవినుపాసించుట వలన ముక్తికలుగదు. కనుక భవానీదేవి చిహ్నాలను విడనాడి ముముక్షువులు కండు' అని భవానీ ఉపాసకుల లోపాలను సరిదిద్దిరి.


శాక్తేయులు, శంకరులు వెలువరించిన తత్త్వమును సావధానంగా విని తమ లోపాలను తెలిసి కొని ఆశ్యర్యపడి తమతమ బాహ్యచిహ్నా లను విసర్జించారు. పిమ్మట లక్ష్మీ ఉపాస కుడు శ్రీ ఆచార్యస్వామికి తమ మత ప్రభావము ను వినిపించుటకై లేచాడు.


*లక్ష్మీ ఉపాసకులు:*


భవానీ ఉపాసకులు తమ లోపాలను సరిదిద్దుకొను విధాన ము లక్ష్మీ ఉపాసకులు విన్నారు. తమ మత ధర్మములను వినవల సినదని కోరగా శంకరులు అంగీక రించిరి.


శంకరస్వామీ! మహా లక్ష్మియే జగజ్జనని, ఆమెయే మొదట వేదములో చెప్పబడి నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొద లైన వారందరు ఆమెలో పుట్టి ఆమె యందు లయమగు చున్నారు. ఆమె సృష్టి, స్థితి, లయాలకు కారకు రాలు. కనుక మోక్షం కావాలని కోరు వారు అందరు ఆ జగజ్జననినే ఆరాధించాలి. 


యతీశ్వరా! పద్మబీజ మాలను, తులసిమాల ను కంఠాన ధరించి, బాహువుల యందు పద్మ చిహ్నాలను,తలను, ముఖమున మంగళ కరమైన కుంకుమను అలంకరించుకొని ఎవరు ఆ మహాలక్ష్మిని ఉపాసించెదరో వాళ్ళకు మోక్షం హస్తామలకం వలె నుండును. తామున్ను మహాలక్ష్మి నే ఉపాసించుడు' అని ఒక లక్ష్మీఉపాసకుడు తెలియ జేసెను.


శ్రీ శంకరులు లక్ష్మీ ఉపాసనా విధానము విని, మీ మతంలో ఎంతో గొప్పతనము లేకపోలేదు. కాని అందొక సత్యాన్ని మాత్రం గ్రహించవలసి ఉన్నది. వినండి! లక్ష్మి ప్రధానమైన పరమాత్మ కానేరదు. సర్వం సృష్టించినవాడు, అద్వితీయుడు, తనకు తానే పుట్టినవాడు, స్వయంప్రకాశం గల వాడు అయిన పరమాత్మ నిర్వికారుడై, నిరంజనుడై, సర్వాంతర్యామియై వెలుగొందుచున్నాడు. ఆ పరమాత్మే నీవై యున్నావు. ఆ పరమాత్మ సదా ఆనంద స్వరూపుడు. జడవస్తువైన ప్రకృతికి ముక్తినిచ్చుటకు సామర్థ్యం ఎన్నడూ ఉండదు. ఈ ప్రకృతికి లోనుకాకుండ, ఆ పరమాత్మను నేనే అని ధ్యానం చేస్తూ మననం చేస్తూంటే, అట్టి సంకల్పం దృఢమైన ప్పుడు ముక్తి తేలికగా లభిస్తుంది.అనిత్యమైన దేవతలను ఆరాధించిన ఊరక పోదు. వారివారి అధీనమందుండే లోకాలను పొందగలరు. కాని ఆ లోకమందు నివాసం మాత్రం శాశ్వతం కానేరదు. చేసికొనిన పుణ్యం క్షీణించుటతో పుణ్య లోక నివాసం సంపూర్తి యగును. అప్పుడు ఒక్క క్షణమచట నుండ వీలుండదు. అంతట మరల మనుజుడై పుట్ట వలసినదే. కనుక అశాశ్వతమైన పదవుల కొరకు ప్రాకులాడక లక్ష్మీదేవీ చిహ్నాలను విడనాడి పరమాత్మ తత్త్వాన్ని విచారణ చేసి జ్ఞానము నార్జించు కొనుడు!' అని శ్రీ శంకరాచార్యులు తత్త్వ రహస్యాన్ని వెలువ రించారు.


శ్రీ శంకరాచార్యులు వెలిబుచ్చిన తత్త్వ విచారణ లక్ష్మీ ఉపాసకులు విని. ‘జగద్గురో! మా లోపాలను తెలిసికొని మమ్ములను పునీతులు చేశారు. మేమంతా ధన్యులం! మాలోపం చిన్నదైనా అది మాకు పెద్దఅడ్డమై ఇంతవరకు అంధకారంలో ముంచింది. మాపాలిట అవతారమూర్తివై ప్రత్యక్షమైనారు. మీ యెదుటనే మా బాహ్య చిహ్నాలను విడనాడు చున్నాము. మమ్ము శిష్యులుగా స్వీకరిం చుడు.' అని వేడు కొన్నారు. అంతలో సారస్వతులు లేచి వారి గొప్పలను వెల్లడించ నుద్యుక్తులైరి.


*కాలడి శంకర కైలాస శంకర* 


*శ్రీ ఆది శంకరాచార్య చరితము*

*27 వ భాగము సమాప్తము*

🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇

కామెంట్‌లు లేవు: