8, మే 2021, శనివారం

పెద్దాడపడుచు

 🌹

*పెద్దాడపడుచు! (పాతకథ)* 

            🌷🌷🌷 

            

కాపురానికి పంపిస్తూ  భారతి వాళ్ళమ్మ భారతికి దత్తాత్రేయుడి కధ చెప్పింది. ఆయన లోకంలో 24 మందిని గురువులుగా స్వీకరించారని.. వారినుండి ఏది చెయ్యాలో.. ఏది చెయ్యకూడదో నేర్చుకున్నారట అని చెప్తూ... అత్తారింట కూడా అందరినీ గురువులు గానే భావించి... హంసక్షీర న్యాయంలో మంచీ కూడా చెడ్డా నేర్చుకోమని పాఠం చెప్పి పంపించింది. . 


ఆయనంటే పరమాత్మ స్వరూపుడు కనుక... తన గురువుల ద్వారా మానవజీవితానికి ఆదర్శమైన మార్గదర్శకత్వాలు ఇచ్చాడు. మరి భారతి మానవమాత్రురాలు! ఎలాంటి గురువులను ఎంచుకుంటుందో ఆ సద్గురువుకే ఎరుక! 


అయితే.... ఆమె తల్లి చెప్పిన పాఠం... భారతి..అత్తవారింటికి వెళ్ళిన మొదటిరోజే ఎదురయింది...... తన పెద్దాడపడుచు రూపంలో! 


           భారతి అత్తగారికి పక్షిణీ రావడంతో... కాపురానికి వచ్చిన కొత్తకోడలికి స్వాగతం చెప్పలేక తమ పక్క మేడలోనే ఉండే ఆమె పెద్దకూతురింటికి పంపారు. 


కాలేజీలో ఆఖరిరోజూ.. పెళ్ళిరోజూ ఒకటే కావడంతో భారతికి పెద్దగా పనిపాటల్లో ప్రావీణ్యం చిక్కలేదు. 


పెద్దాడపడుచు గారింట్లో... ఉషోదయాన..ఇలా స్నానం చేసొచ్చిందో లేదో..." వెళ్ళు! వెళ్ళి ఆ దేవుడు మందిరంలో నిర్మాల్యం తీసి, తడిగుడ్డ పెట్టి తుడిచేసి... ముగ్గుతో శంఖుచక్రాలెయ్యి! సజ్జనిండా పూలుకోసుకురా...! ".... ఒకే వాక్యంలో పది పురమాయింపులు...... పెద్దపులిలాంటి పెద్దాడపడుచు నుండి! 


ఆవిడి మాటలధాటికి చిరుతీవెలా వణికింది భారతి మనసు. భీతహరిణిలా అటూ ఇటూ చూసింది. 


తనకేమీ పట్టనట్టు కొబ్బరి కోరుతున్న ఆడపడుచు కూతురికేసి .. అన్యధా శరణం నాస్తి.. అన్నట్టు చూపులతో అభ్యర్ధించింది. 


. తనకెంతో ఇష్టమైన మేనమామ భారతిని చేసుకోవడంతో.. మనసంతా చేదునింపుకున్న ఆ అమ్మాయి ఏమీ పట్టనట్టు తలతిప్పింది. మారు మార్గం లేని భారతి... ఆ మేడిల్లంతా గాలించి... దేవుడు గది వంటింటి పక్కనే ఉంటుందని గ్రహించి... నాలుక్కరుచుకుని పనికుపక్రమించింది. 


నిర్మాల్యం ... అనే పదాన్ని అనేకవిధాల తనకొచ్చిన సంధులు, సమాసాలు, వ్యుత్పత్యర్ధాలలో పెట్టి, పీకినా .. జ్ఞానోదయం కాకపోవడంతో... అక్కడే ఓ పీటమీద చెంపకు చెయ్యి చేరేసి కూర్చుండిపోయింది. 


ఓ ఐదునిమిషాలకు ఏదో మిషమీద లోపలికొచ్చిన ఆడపడుచు కూతురు వేణి... గీరగా చూస్తూ.." పువ్వులు తియ్యి ముందు"... అని ఓ మాట విసిరి పోయింది. మొట్టమొదటి గురువుకు మదిలో దణ్ణం పెట్టుకుని... సింహాసనంలో...నిన్నటి దేవుడి పువ్వులు తీసింది. 


అదే విధంగా ప్రతి ఐదు నిమిషాలకూ ఆ పిల్ల రానూ.... మరింత విస్సాటంగా మాట్లాడుతూ ఒక్కో టాస్కూ పూర్తి చేయించింది. 

మొత్తానికి దేవుడి సామాన్లతో సహా మిలమిలా తోమింపించి... అవన్నీ సర్ది.. వత్తులూ..ఆవునెయ్యి వేయించి.. దేవుడి గదంతా తడిబట్ట పెట్టించి , నాపసుద్దతో ముగ్గులు పెట్టించి.... మధ్యమధ్యలో విసుగులూ, భారతి అజ్ఞానానికి వినోదం చూస్తూ... పూర్తిచేయించింది. 


" పువ్వులెక్కడ కోయాలి?"... అన్న భారతి ప్రశ్నకి.. " ఏం మీ వూళ్ళో పువ్వులు ఆకాశంలో పూస్తాయా యేంటి? .... అని మహా విరసంగా ప్రశ్న సంధించి ... ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయించి ... అప్పుడు చూపించింది... పెరటితలుపు తీసి... వెనకున్న పూలతోటను! 


       "అబ్బా! ఎంత బాగుందో మీ తోట .."... అంటూ చెంగుచెంగున గెంతుతూ... మందారాలు, నిత్యమల్లి పొదలనూ సుతారంగా ఊపుతూ... వంగుని కుండీల్లో ఉన్న చేమంతులను వేళ్ళమధ్యకు తీసుకుని ఆడిస్తూ... చిక్కని ముదురురంగుల్లో పూసిన  గులాబీల వాసనలు చూస్తూ... చిన్న ధవనం కొమ్మ తుంపి తలలో దోపుకుని... పరవశంతో తిరుగుతున్న భారతి ఆనందానికి అడ్డకట్ట వేస్తూ......." చాల్లే! ముందు పువ్వులు కొయ్యి. మీ పెద్దాడపడుచసలు మంచిది కాదు! ".... కటువుగా.....సమవయస్కురాలయిన తనతో ముదనాపసానిలా మాట్లాడుతున్న వేణి ఒక పజిల్ లా అనిపించింది భారతికి. 


                ఆ తరవాత భారతిని ఒక్కక్షణం కూచోనివ్వలే పెద్దాడపడుచు. 

ఇడ్లీప్లేట్లలోంచి ఇడ్లీలు తీయించింది. రెండు ప్లేట్లలఇడ్లీలు ముక్కచెక్కలయ్యాకా.. తీరువుగా తీసే సులువు చిక్కింది. 

గిన్నెలు సర్దించింది. " అమ్మయ్యా!" అనుకునేలోగా రెండుకేజీల కేబేజీ బుట్ట ముందు పడేసి తరగమని ఇచ్చింది. 


తల్లికి మొక్కుబడిగా ఉప్మాలోకి అల్లం, పచ్చిమిరపకాయ తరిగిచ్చి పారిపోయే రకం భారతి. ఎదురుగుండా ఘనమారణాయుధంలా ఉన్న రెండున్నర అడుగుల కత్తిపీటను చూసి.... మిన్నువిరిగి మీదపడ్డట్టు చూసింది. 


       పెద్దాడపడుచు కరుణించలేదు. అంత భారీమనిషి చులాగ్గా... కింద పీటేసుకుని కూర్చుని... కాబేజీతరిగే సులువు చూపించి.. లేచిందా.. భారతికి కత్తిపీటతో పోయేప్రాణం.. వచ్చేప్రాణంలా ఉంది. 

కాబేజీతో పాటూ ముందుకు జరిగిపోతూ... మొత్తం చక్రబంధంలో అభిమన్యుడిలా....ఆ పెద్ద డైనింగ్ రూమంతా గిర్రున తిరుగుతూ... నేలంతా మల్లెపూలు చల్లినట్టు కేబేజీ తరుగు పోసి... ఎట్టకేలకు ఆఖరి పావుకేజీ తరిగేటప్పటికి.." ఓస్! కేబేజీ తరగడం ఇంత సులువా! " అనేసుకుంది భారతి. 


         ఇంత చేస్తున్నా ఆవిడ నుంచి  ఓ మందలింపు లేదు! మంచిమాటా లేదు. అసలు మనసులో ఏమనుకుంటోందో తెలీదు. 


సాయంత్రం చిన్నకునుకు తీసి లేవగానే.. వేణీ అల్లం, ఏలకులు వేసి టీ పెట్టడం నేర్పించింది. 


అలా మేడమీద బాల్కనీలో కూర్చున్నారో లేరో... ఇలా పెదదాడపడుచు ప్రత్యక్షమై....ఎప్పుడు కొన్నారో మరి... ఓ కేజీ మల్లెపూలు వెదురుజంగిడిలో వేసి ముందుపెట్టి, ఓ చిన్నబేసిన్తో జంతికలు, దారపుండ పెట్టి... లోపలికి చక్కా పోయారు. 


మన భారతిగారికి బడిపాఠాలే కానీ బతుకుపాఠాలు రావుగా! మళ్ళీ వేణమ్మే దిక్కు!


 " అసలు ఏం పెంపకం పెంచింది మీ అమ్మ. ఒక్కపని చేతకాదు! నాకూ, మా ముగ్గురక్కలకూ మా అమ్మ పుట్టినప్పటినుండి పనులు మప్పడమే! ఏమన్నా అంటే... మీ అత్తారిళ్ళలో నాకు మాట రాకూడదే.." అనేది. "వాళ్ళ సంగతేమో కానీ.. నీకన్నా రెండేళ్ళు పెద్దదాన్నా... ఇప్పటికొచ్చి పెళ్ళియోగం లేదు. మా అమ్మకి ఇంజినీర్లే కావాలి. ఇంజినీర్లకేమో రూపసులు కావాలి. మొన్నటి వరకూ మేనమామ ఆశ ఉండేది. ఇప్పుడు అదీ అడుక్కుతింది! "...... భారతికి ఆమె మాటల్లో అక్కసు కన్నా ఆవేదనే కనిపించింది. నిజమే వయసుకు మించిన ఒడ్డూపొడవుతో... కాస్త తీసికట్టు అందమే వేణిది. 


        ఇంతలో స్నానం చేసొచ్చింది పెద్దాడపడుచు. తెల్లని చాకలిస్త్రీ చిన్నపువ్వుల గ్లాస్కోవాయిల్ చీర, చిన్న పువ్వుల జాకెట్టు వేసుకుని... చక్కగా యుడికలోన్ స్ప్రే చేసుకుని, దూమెరుగ్గా క్యుటీకురా పౌడర్ వేసుకుని... నుదుట ఎర్రని సింధూరబ్బొట్టుతో... ఎంత అందంగా ఉందో ఆవిడ. మెడలో నల్లపూసలతో మెలిపడిన బంగారు గొలుసులూ.... ప్రతి కదలికకూ జిగజిగలాడుతున్న నిమ్మగుత్తి రవ్వల బేసరి! 


కొన్ని నగలు వారికోసమే అన్నట్టు అమరుతాయి కొంతమందికి ... అనుకోకుండా ఉండలేకపోయింది భారతి!! 


మల్లెపూలను... సీరియల్ దీపాల్లో అక్కడో దీపం ఇక్కడో దీపంలా అమర్చి...భారతి కట్టిన పూలమాలను ఎగాదిగా చూసి.. వస్తున్న నవ్వు కళ్ళ చివర్లనే ఆపేసి....దాన్నే పదివరుసలు చేసి సిగచుట్టూ చుట్టుకుంది.  


ఎందుకో పనిమీద పొరుగు రాష్ట్రం వెళ్ళిన కొత్తపెళ్ళికొడుకు తన భర్త తలపులతో....ప్రణయశృంగారపు భావవీచికలేవో... ఆ వేసవిసాయంత్రం వేళ భారతి మనసును కమ్ముకున్నాయి. 


        మొత్తానికి మూడురోజుల పెద్దాడపడుచింట ప్రవాసం తరవాత ....అత్తారింట్లో అడుగుపెట్టిన భారతి పైన నేర్చిన పనులన్నిటితో పాటూ... వందకాయ పచ్చి ఆవకాయ కలిపిన అనుభవం, ఏభై మాగాయకాయ ఆల్చిప్పతో గీసి, తరిగి ముక్కలు జాడీకెత్తిన అనుభవమూ వెంటేసుకొచ్చింది. 


        నోరులేని అత్తగారు కోడళ్ళ గీతాలకూ.. నకరాలకూ బుర్రూపుతూ.. ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగనియ్యకుండా... పెద్ద పోలీసులా అడ్డం పడుతుండేది పెద్దాడపడుచు. 


ఆమె చెల్లెళ్ళకూ, మరదళ్ళకూ , కూతుళ్లకూ సమన్యాయంతోనే పనులూ, పురమాయింపులూ, దెప్పుళ్ళూ వడ్డిస్తూ ఉండేది. 


పచ్చని పచ్చి పసుపుకొమ్ములా.... ఇంట్లో శుభకార్యాలకు..వినాయకుడి మీదికట్టడం మొదలు... రాట వేయడమేంటి... పసుపుదంచడమేంటి....ఆఖరి అంకంఅప్పగింతల వరకూ... పార్వతీదేవిలా ఆవిడే నడుం కట్టేది. 


      ఆవిడ ధాష్టీకానికి కడుపులో మంటున్నా... అందరికీ మంచికీ, చెడుకీ ఆవిడే పెద్దదిక్కు మరి. 


భారతికి.. అడపాదడపా ఆవిడనుండి, వేణినుండి... అక్షింతలు పడుతున్నా... అవేవీ మనసులో పెట్టుకోకుండా రియాద్ లో పనిచేసే తన పెద్దనాన్న కొడుకుతో వేణికి సంబంధం కుదిర్చిపెట్టింది. 


           బంధువుల్లో గయ్యాళి, అహంభావి, గర్విష్టి, నోరూ,అతిశయం ఎక్కువ .... వంటి అప్రతిష్టలు మూటకట్టుకున్నా.. ఆవిడను.. భారతి .... తననో ఉత్తమఇల్లాలిగా నిలబెట్టిన గురువుగానే భావిస్తుంది. 


రెండేళ్ళ తరవాత ఉమ్మడినుండి... ఇల్లుకట్టుకుని వేరే వెళ్ళిపోయిన భారతి... అనతికాలంలోనే సమర్ధతలో, కంజాయింపులో... తనవేపు చుట్టపక్కాల్లో "  తన పెద్దాడపడుచు" స్థాయికి ఎదిగిపోయింది... ఎటొచ్చీ వినయసంపన్నత తోడుగా! 


              ప్రతీ వైభవానికీ ఒక అంత్యదశంటూ ఉంటుంది. కాలపరిమితి చెల్లిపోయే రోజు వచ్చి తీరుతుంది. భారతి పెద్దాడపడుచుకు ఆ దశ కోడలు రూపంలో వచ్చింది. 


నలుగురు అమ్మాయిల తరవాత పుట్టిన గారాలకొడుకు, కంటికి దీపం అనుకున్న రమేష్ కు పెద్దాడపడుచు నాలుగేళ్ళు వెతికి.. వూళ్ళుగాలించి తెచ్చిన ...అమ్మాయి రాఘవి! 


కోడలి ఎంపికలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పే ఆవిడా చేసింది. తక్కువింట్లోంచి కోడల్ని తెచ్చుకుంటే అణిగిమణిగి ఉంటుంది. పడుంటుంది... అనుకుంటూ ఆవిడ అడుసులో కాలు వేసింది.


        రాఘవి కూడా అత్తగారిలాగానే ఆలోచించుకుంది. 

చితికిపోయిన ఒకప్పటి సంపన్నకుటుంబీకుల పిల్ల. ఆస్థులు పోయినా భేషజాలు పోలేదు. అహంకారాలూ తగ్గలేదు. డబ్బున్న ఇంట్లో పడితే... తను పుట్టింట్లో చూడని 

వైభవం అత్తింట్లో చూడచ్చనుకుంది. దానికి తగ్గట్టే అత్తగారు చంద్రహారాలు, పలకసర్లు, కాసులపేరు, రవ్వలదుద్దులు, నాలుగుజతల గాజులు పెడితే... చూసుకుని మురిసిపోతూ... తన అందం ముందు ఏ మాత్రం ఆనని , స్థిరమయిన ఉద్యోగం లేని, కాలకి కొద్దిగా అవుటు ఉన్న  రమేష్ ను ఆనందంగా చేసుకుంది రాఘవి... తనకు దక్కబోయే ఐశ్వర్యం గురించి కలలు కంటూ! . 


       పదహారేళ్ళ పండగకే అత్తాకోడళ్ళ ఇరువురి ముసుగులూ తొలిగాయి! ఆశలూ అడియాసలవ్వసాగేయి. తాతలు తాగిన నేతులూ., మీసాల సంపెంగ నూనెలూ మాట్లాడే కోడలూ...., పెట్టినట్టే పెట్టి బంగారాన్ని తన ఇనప్పెట్టెలో దాచుకున్న అత్తా... ఒకరి రంగులొకరు బయటపెట్టుకోసాగారు. 


రమేష్ కు తల్లేమీ కొత్తగా అల్లం అవలేదు. ముందునుండి ప్రతిపైసాకూ తల్లితండ్రుల మీద ఆధారపడే అతను తన ఆర్ధిక  అవసరాలకు తల్లితో తరుచూ గొడవపడుతూ.. అప్పుడప్పుడూ చెయ్యెత్తిన సందర్భాలున్నాయి. 


అతనికి పుట్టుకతోనే నలుగురు అప్పగార్లంటే పరమ ద్వేషం! తనకు ఆస్తి ఏకాండీగా దక్కకుండా.. కట్నకానుకల రూపంలో సగం భోషాణం ఖాళీ చేసారని ఏడుపు. వాళ్ళు కూడా తమ్ముడి వాగుడు భరించలేక పుట్టింటి మొహం చూసేవారు కాదు. ఇప్పుడు రాఘవి సరయిన జోడు రమేష్ కు! 


పెద్దాడపడుచుగారి భర్తగారు ఇంటి యాజమాన్యంమారే సంధికాలంలోనే లోకాన్ని విడిచిపెట్టారు. ఆయన్ని భార్య కొంగుచాటు మనిషి అంటారు... అయితే భారతికి అనిపించేది... భార్య సమర్ధతమీద, భార్య నిర్ణయాల మీద నమ్మకం, గౌరవం ఉన్న మనిషి...ఆయన... అని! 


              మనవల రాకతో పెద్దాడపడుచు స్థాయి మరీ దిగజారింది. 


పాతకాలం సినిమా సెట్టింగ్ లా ఆరోజుల్లోనే ఎంతో అధునాతనంగా ఉండే ఇల్లు... మాలతి, మాధవీలతలు పెనవేసుకున్న అందమైన ఇంటిబయలు క్రమక్రమంగా... కళావిహీనం అయిపోయింది. ...శుచీశుభ్రం లేని రాఘవి పర్యవేక్షణలో! 


కొంతకాలానికి...కొడుకూ- కోడలితో బేంక్ అకౌంట్ల బదిలీ మీద అయిన గొడవలో... వాళ్ళతో నెగ్గలేక... సంతకాలు చేసి మొహానపడేసి... మనశ్శాంతి కోసం కూతుర్లదగ్గరకు వెళ్ళారు పెద్దాడపడుచు! 

 

 "ఆస్థులు కొడుక్కి... బాధ్యతలు మాకా?".... అని అల్లుళ్ళు నిలదీస్తే వెర్రిమొహం వేసి.... ఆఖరి తమ్ముడింటికి చేరారు.... మరదళ్ళందరిలో... భారతే తనను ఆదరిస్తుందని తెలుసామెకు. 


భారతికి.... ఆమెను అలా చూస్తుంటే...... ఏదో మహావృక్షం కూకటివేళ్ళతో కూలిపోతున్నట్టు ఉండేది. 

మిగిలిన వారి వాదన వేరేగా ఉండేది..." అవును మహావృక్షమే! ఆవిడ ఛాయలో... ఆవగింజను కూడా మొలవనివ్వలేదు. మనమంటే ఈమె ఆధిపత్యధోరణికి లొంగాం కానీ... కోడలు బయటది.. ఎందుకు లొంగుతుంది? మంచి శాస్తే చేసింది!"!.... అంటుంటే... " అయ్యో! అత్తమామలు ఏమీ పట్టించుకోకపోయినా.. ఆ ఉమ్మడిలో అందరికీ తీరుతెన్నులు నేర్పించి, పిల్లల పెళ్ళిళ్లు తెమిలించి, పొదుపులు నేర్పించిన మనిషి.. ఈమె! మాట కటువయితేనేం.... మనసు మంచిదే! ఇలా ఆడిపోసుకుంటున్నారు..." అని బాధపడేది భారతి! 


         కొడుకూ కోడలూ వచ్చి బతిమాలి తీసుకుపోయాకా... పెద్దాడపడుచు పూర్తిగా మౌని అయిపోయారు. ఇంటినిండా చేరిన కోడలి పుట్టింటారిది ఇష్టారాజ్యమయినా.. ఆమె మాత్రం ఓ మూలగదికి మకాం మార్చుకుని.. పెడితే తిని.. లేకపోతే మానేసి.. విరాగిలా అయిపోయారు. 


పదిహేనేళ్ళ వయసులో పెళ్ళికూతురుగా వచ్చి... పుల్లా.. పూసా పోగేసికుని అపురూపంగా కట్టుకున్న స్వంత ప్రపంచం... తనముందే తన చెయ్యిజారిపోవడం. ఆమెకు శరాఘాతంలా తగిలింది. 


కొన్ని కోట్లు విలువచేసే ఆ ఇల్లుకూడా కొడుకుపరం చేసి... ఓ పదిలక్షలు కొడుకు కాళ్ళుపట్టుకుని కూతుళ్ళకు ఇప్పించి... పూర్తి అజ్ఞాతాన్ని ఆశ్రయించారు. రాఘవి, రమేష్ బయటప్రపంచంతో ఆమెకు పూర్తిసంబంధాలు తెంపేసారు. 


            శ్రీరామ నవమి దాటిన రెండువారాలకు.. భారతి ఆవకాయ పడేద్దామని ఓ వందకాయ తమ చెట్టుమీంచి దింపించింది. 


కాయలు నీళ్ళల్లో పడేస్తుంటే ఫోన్ మోగింది. " భారతి".... అని నూతిలోండి వస్తున్నట్టు వస్తోంది. అది పెద్దాడపడుచుగారి గొంతుకని గుర్తుపట్టడానికి కొన్ని క్షణాలు పట్టింది. " నన్ను తీసుకుపోవే ఇక్కడనుండి! "..... ఈలోపల ఫోన్ ఎవరో తీసుకున్నారు." పెయింటర్ అప్పారావునమ్మా! పెద్దమ్మగారు పోను అడిగారు! ఇచ్చీసినారు తిరిగి!" అంటూ పెట్టేసాడు. 


       భారతి ఆ కాయలక్కడే పడేసి... భర్తకు ఫోన్ చేసి.. కారు తెప్పించుకుని ఆఘమేఘాల మీద అక్కడికి చేరింది. 

ఇల్లంతా పెయింట్లు వేస్తున్నారు. 


పెద్దాడపడుచు.. మేడమెట్ల పక్కన చిన్న ఇనపమంచం మీద పడుకుని ఉన్నారు. ఉచ్చకంపు కొడుతున్న పక్కబట్టలు. బక్కచిక్కపోయి.... జుట్టంతా జడలుకట్టేసి.. దీనావస్థలో ఉన్నారు. 

డ్రయివర్ ని అక్కడ కూచోపెట్టి... భారతి పైకి వెళ్ళింది. 

రాఘవి అక్కకూతురు పెళ్ళిట పదిరోజుల్లో. పెద్దాడపడుచు గదిలో రాఘవి తల్లీ, అక్కలు కబుర్లాడుకుంటూ మహా సందడిగా ఉన్నారు. 


భారతి రాఘవి, రమేష్ తో పెద్దగొడవే పెట్టుకుంది. రమేష్ తో." నీ కాలొక్కటే అవిటి కాదు.. నీ మనసూ, బతుకూ అవిటే! థూ! దౌర్భాగ్యుడా! "... అంటూ దుమ్మెత్తిపోసింది. 


అంతే పెద్దాడపడుచుకు తన యింటితో శాస్వతంగా బంధం తెగిపోయింది. 

ఆవిడ పోయినా తమకు చెప్పక్కర్లేదని మొహానే తలుపేసింది రాఘవి . 


           భారతి ఇంట్లో డాక్టర్ పర్యవేక్షణలో... ఓ వారంరోజులు సేదతీరింది ఆవిడ. 


ఆవిడకిష్టమైన మైసూర్ శాండల్ సబ్బుతో స్నానం చేయించి.. మెత్తని గ్లాస్కో చీరకట్టి... తెల్లని దుప్పటి పరిచి పడుకోపెట్టేది భారతి. 


         ఆరోజు భారతి మంచి నిద్రలో ఉంది. గుమ్మంలో పెద్దాడపడుచు నిలబడున్నారు. " ఏవిటండి వదినగారూ? ఏమన్నా కావాలా? ... అని అడిగింది . " మల్లెపూలు కావాలే! "! అందావిడ. 


భారతికి పూర్తి మెలుకువ వచ్చింది. లేచి చూస్తే ఆవిడ లేరు. పరిగెట్టుకుని గదిలోకి వెళ్ళింది. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. పక్కనే వెళ్ళి కూర్చుని.. ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలో పెట్టుకుంది. మల్లెలకన్నా మెత్తగా... మంచుకన్నా చల్లగా ఉందామె చెయ్యి! 


            ఫలానా వారింటి పెద్దాడపడుచు గారు పోయారన్న వార్త వినగానే... అపరకర్మలు చేయంచే కోటీశ్వరుడు వామనమూర్తి..., ఆ జిల్లాలో పేరెన్నకగన్న వంటవాడు సత్యనారాయణ... క్షణాల్లో వాలిపోయారు. నలభై ఏళ్ళ క్రితం... పొట్టపట్టుకుని నగరానికి వచ్చిన వారిని ఎందమందికో సిఫారుసు చేసి... జీవితాలు నిలబెట్టిన మహాతల్లి ఆమె. 


" పెద్దమ్మగారో! మాలక్ష్మమ్మగారో! ".... అంటూ తరలి వచ్చిన ఊరిజనం!! 


              కూతుళ్లు పదోరోజుకు కానీ రాలేమన్నారు. 


ఊళ్ళోనే ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళ సమక్షంలో, ఆమె అశేష అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య... ఆమెకిష్టమైన చంద్రకాంత రంగు పట్టుచీర కప్పి...నుదిటన ఇంత బొట్టుపెట్టి... తనొక గురువులా గౌరవించి, అభిమానించిన  తన పెద్దాడపడుచుని ... మల్లెపూలరధంలా సాగనంపింది భారతి!! 


*శశికళ ఓలేటి* 

  11-04-2020

కామెంట్‌లు లేవు: