24, అక్టోబర్ 2021, ఆదివారం

ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం

 


ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 


(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 


      3. శ్రీమద్రామాయణం - భూగోళ శాస్త్రం 


    భూమిమీద నదులు, పర్వతాలు, జనావాసాలుగా గ్రామ/పట్టణ/నగరాలు, అరణ్యాలు, గనులు, సముద్రాలు భంటి అన్నిటి వివరాలనీ తెలిపేదే "భూగోళ శాస్త్రం". 


    శ్రీమద్రామాయణంలో కిష్కింధ కాండలో 

  - నలుదిశల వ్యాపించిన భూగోళ వివరాలు అత్యంత విపులంగా వివరించబడ్డాయి. 


    సీతాన్వేషణకై వానరులను నలుదిక్కులకీ పంపుతూ సుగ్రీవుడు, ఒక్కొక్క దిశలోనూ ఏ ఏ ప్రాంతాలు ఉంటాయో చక్కగా వివరించాడు. 

    అందులో కొన్ని భాగాలని ఇప్పుడు చూద్దాం. 


తూర్పు దిక్కు 


    గంగా సరయు కౌశిక యమున మొదలైన నదులూ, 

    యామునగిరి సరస్వతి సింధు శోణ నదీ తీరాలూ, 

    బ్రహ్మమాల విదేహ మాళవ కాశి కోసల మగధ మొదలైన దేశాలూ, 

    వెండి గనులు గల భూములూ, సముద్రాలూ, వాటిలోని పర్వతాలూ, వాటిమధ్య ద్వీపాలయందలి నగరాలూ, 

    ఆవలి తీరంలో ఘృత దధి క్షీర మధురజల సముద్రాలూ, 

    అతినీలలోహిత కిరణరశ్మి ప్రదేశం, లయముఖమనే బడబాగ్ని, 

    ఊర్ధ్వలోకవాసులు భూలోకానికి ప్రవేశించే ద్వారంగా ఉదయాద్రి, 

    ఆ పైన అగమ్యంగా ఉండే విషయాలు వివరంగా తెలిపాడు. 


దక్షిణ దిక్కు 


    నర్మద గోదావరి మహానది కృష్ణవేణి వరద మహాభాగ నదీ తీరాలూ, 

    మేఖల ఉత్కళ దశార్ణ విదర్భ ఋషిక మాహిషిక వంగ కళింగ కౌశిక మొదలగు దేశాలూ, 

    దండకారణ్యం, 

    ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ మొదలైన దేశాలూ, 

    మలయ పర్వతమూ, కావేరి నదీ, అగస్త్య నివాసం, తామ్రపర్ణి నది, 

    సముద్రం - దాని మధ్యలో అంగారక నీడ, 

    కుంజర పర్వతం, భోగవతీ పురం, వృషభ పర్వతం, పితృలోకం, చిమ్మచీకటి అని ఆ దిశలోనివాటి వివరాలు తెలిపాడు. 


పశ్చిమ దిక్కు 


    సౌరాష్ట్ర ప్రాంతాలూ, బాహ్లిక దేశాలూ, శూర భీమ ప్రదేశాలూ, 

    మురచీ పట్టణం, 

    సింధునదం సముద్రాన కలిసే ప్రదేశాన హిమగిరీ, దాని విషయాలూ, 

    సముద్ర మధ్యన 24 కోట్ల గంధర్వుల నివాస స్థానమూ, 

    పారియాత్ర పర్వతమూ, 

    సుదర్శన చక్రంగా "చక్రవంత" పర్వతం, 

     60 వేల బంగారు కొండలూ, వాటి మధ్య పర్వతాలకి రాజైన మేరుగిరి, 

     విశ్వకర్మ నిర్మిత వరుణ నివాస స్థానం, 

     ఆపైన సూర్యప్రకాశంగానీ, ఏ దేశపు సరిహద్దుగానీ కనబడని ప్రదేశమూ అని ఆ దిశలో ఉన్నవాటిని వివరించాడు. 


ఉత్తర దిక్కు 


    మ్లేచ్ఛదేశాలూ, పుళిందుల భూములూ, శూరసేనుల రాజ్యాలూ, 

    ఇంద్రప్రస్థం, కురుక్షేత్రం, మద్రక దేశం, కాంభోజ రాజ్యం, టంకణదేశ ప్రదేశాలూ, చీన పరమచీన భూములూ, 

    హిమవత్పర్వత ప్రాంతాలూ, ఆపైన వంద యోజనాలు కొండలుగానీ - నదులుగానీ - వృక్షాలుగానీ లేని, ఏ ప్రాణీ నివసింపని శూన్యమూ, తరువాత దుర్గమారుణ్యమూ, 

    కైలాస శిఖరం, విశ్వకర్మ నిర్మిత కుబేర భవనమూ, క్రౌంచగిరి, వైఖానసం సరస్సూ  

    ఆపైన సూర్య చంద్ర - నక్షత్ర దర్శనం లేని - మేఘాలు కనబడని - మెఱుపులు వినబడని - కేవలం శూన్యమైన ఆకాశ ప్రదేశమూ, 

    శైలోదకమనే నదీ, ఉత్తర కురు భూములూ - లవణ సముద్రం - దాని మధ్యలో సోమగిరి అనే మహాపర్వతం, 

    దేవతలకు సైతం అసాధ్యమైన బ్రహ్మ - విష్ణు - శంకరుల నివాస స్థానాలూ తెలుపుతాడు. 


దిశా పరిమితులు 


    తూర్పు దిక్కున ఇంద్రుని స్వర్గలోక/ఊర్థ్వలోక మార్గం వరకూ, 

    దక్షిణ దిక్కకు అధిపతి అయిన యముని పితృలోకం వరకూ, 

    పశ్చిమ దిక్కున ఆ దిక్కుకు అధిపతియైన వరుణుని నివాస స్థానం వరకూ, 

    ఉత్తరాన ఉత్తరదిక్కుకు పాలకుడైన కుబేరుని భవనంతోపాటు, త్రిమూర్తుల నివాస స్థానాల వరకూ ఇచ్చిన విశ్లేషణాత్మక వివరణ ఎంతో సమగ్రంగాఅద్భుతమైనదిగా తెలుస్తుంది. 

    నదుల వివరణ భూగోళంలో నీటి వనరులగూర్చి అవగాహన కలిగించేదిగా తెలుస్తోంది కదా! 


    ఆ కాలంలో తెలిపిన వివరాలు, అత్యధిక కాలవ్యవధిలో, కాలక్రమేణ కొన్న మార్పులకు గురవుతాయి. 

    ఆనాటికీ ఈనాటీకీ కాలంలో వ్యత్యాసం అత్యధికం కావడం వల్ల ఈ మార్పులను గణిస్తే, ఆ వివరాలన్నీ చక్కగా సరిపోతాయి. 


ప్రస్తుత భూగోళశాస్త్ర నిర్మాణం


    ఈనాటి కాలంలో కొలంబస్ భారతదేశాన్వేషణకై బయలుదేరి, త్రోవ మారి, అమెరికా చేరుకున్నాడు. 

    అదే ఇండియా అనుకుని భ్రమపడ్డాడు. అది భారతదేశం కాదనుకున్నాక, అక్కడి ప్రజలు రెడ్ ఇండియన్స్ అయ్యారు. 

    అనంతరం వాస్కోడిగామా భారతదేశానికి మార్గం కనుగొన్నాడు. 

    ఈ విధానంలో వెతుకుతూ వెతుకుతూ చిత్రపటాన్ని తయారుచేయడం జరిగింది. 


రామాయణ ప్రత్యేకత 


      కానీ రామాయణం మనకి ఎటువంటి పరిశోధనగానీ - అన్వేషణగానీ అవసరంలేకనే, సమగ్రమైనదీ - పరిపూర్ణమైనదీ అయిన భూగోళశాస్త్రాన్ని చక్కగా అందించింది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: