25, ఆగస్టు 2022, గురువారం

ఆచార్య నాగార్జునుడు

 ఆచార్య నాగార్జునుడు  - 


      నాగార్జునుడు ప్రపంచ ప్రసిద్ది చెందిన మహా పురుషుడు . ఆయన విద్యావేత్త , రసవేత్త , మంత్రవేత్త , తంత్రవేత్త , యంత్రవేత్త , ప్రజావేత్త  మరియు కాయసిద్ధి పొంది జరా మరణాలు ను జయించి అతీంద్రియ శక్తులు సాధించి అదృష్యరుపుడు అయ్యి సంచరిస్తున్న అమరవేత్త. ఆయన జననం గురించి వాదోపవాదాలు ఉన్నా ఆయన పక్కా ఆంద్రుడు అనే వాదన బలంగా ఉంది. 


         గౌరనకవి రచించిన నవనాధ చరిత్ర అనే ద్వీపకావ్యంలో సిద్ద నాగార్జుని చరిత్ర వర్ణింప బడినది. దాని ప్రకారం నాగార్జునుడు ఒక రాజపుత్రుడు. ఒకనాడు వేటకి పోయి విధివశాన సర్పరూపమ్ పొంది మద్దిచెట్టు తొర్రలో దాగినాడు. శాపం నుండి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తుండగా కొంతకాలానికి అటుగా వచ్చిన ప్రసిద్ధ రసశాస్త్రవేత్త మీననాధుడు అనే రసయోగి నాగార్జునిని గమనించి శాపనివ్రుత్తి చేసాడు. ఆనాటి నుండి ఆయన నాగార్జున నామముతో మీననాధ మహర్షికి ప్రియశిష్యుడు అయినాడు. గురువు వద్ద అణిమాది అష్టసిద్దులను అభ్యసించి అదేవిదంగా ఔషద , తంత్ర, మంత్ర , యంత్ర రహస్యాలు అభ్యసించి గురువు ఆనతిమేరకు లోకసంచారానికి బయలుదేరాడు నాగార్జునుడు సిద్ధి పొందడం వలన సిద్ధనాగార్జునుడు అయ్యాడు.


              ఈయన శాతవాహన రాజుల గౌరవం పొంది వారి రాజ్యంలోని నేటి నాగార్జున కొండ వద్ద ఒక మహావిశ్వ విద్యాలయాన్ని స్థాపించి విద్యాబోధన చేశాడు . ఆ సమయంలో శాతవాహన రాజులు ఆర్ధిక ఇబ్బందులకు గురికాగా తన రసవిద్యా నైపుణ్యంతో శ్రీ పర్వతమును బంగారంగా మార్చివేశాడు. అప్పుడు కాళికా దేవి ప్రత్యక్షం అయ్యి సృష్టి స్వభావానికి విరుద్దం అయిన కార్యం తగదు అని వారించగా నాగార్జునుడు మళ్లి ఆ బంగారుకొండ ని రాతికొండగా మార్చివేశాడు . 


              ఆ తరువాత ఈయన టిబెట్ మరియు చైనా మొదలయిన ప్రాంతాలలో పర్యటించి బౌద్ధ సన్యాసిగా అనేకమందికి విద్యాదానం చేశాడు . అచ్చట 200 సంవత్సరాలు గడిపి దక్షిణ భారతదేశంలో మరొక 200 సంవత్సరాలు గడిపి ఆ తరువాత నేటి శ్రీశైలం కొండపైన 120 సంవత్సరాలు గడిపాడు అని టిబెట్ ఆచార్యుడు తారానాధ పండితుడు పేర్కొన్నాడు . 


              మన్దాన భైరవుడు రచించిన ఆనంధకంధం అనే గ్రంథంలో సిద్ధనాగార్జుని వంటి ఎందరెందరో సిద్ధులు , భైరవులు  అతిమానుష ప్రజ్ఞ సంపాదించిన వారై జీవన్మ్రుతులుగా పవన భక్షులుగా గగన వీధుల్లో సంచరిస్తున్నారు అని వివరించబడింది.


  సిద్ధనాగార్జునుడు రచించిన గ్రంథాలు  - 


 *  సుశ్రుత ఉత్తర తంత్రం .


 *  రసవైశేషిక సూత్రం 


 *  లోహశాస్త్రం .


 *  కచ్చపుట తంత్రం.


 *  రస కచ్చపుట .


 *  ఆరోగ్య మంజరి.


 *  యోగాసారం .


 *  రసేంద్ర మంగళం 


 *  రతి శాస్త్రం . 


 *  సిద్ధ నాగార్జునీయం .


          మొదలయిన అధ్బుత గ్రంథాలు రచించారు.


      ఈయన అతి సులువయిన , ఔషద ప్రక్రియలని రూపొందించి ఆనాటి అనేక పట్టణాలలో , గ్రామాలలో ప్రజల ఉపయోగార్ధం ఆ ప్రక్రియలను రాతి పలకాల మీద చెక్కిన్చాడని నేటికి దొరుకుతున్న అనేక శాసనాల వల్ల తెలుస్తుంది.


  

 

కామెంట్‌లు లేవు: