9, నవంబర్ 2024, శనివారం

శివమహిమ

 



శివమహిమ!!


విశ్వనాధసత్యనారాయణ!


కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి త

త్ప్రాలేయాచలకన్యకాకుచతటీపర్యంకనిద్రాగతం

బాలోలాగ్రజటాతటీఘటితనాకౌకస్సరిత్కంబు దే

హాలంకారితలేలిహానము వెలుం గర్చింతు విశ్వేశ్వరా!


ఇది విశ్వనాథ సత్యనారాయణగారి శ్రీమద్రామాయణకల్పవృక్షావతారికయందలి రెండవ పద్యం. కైలాసాచలసానువాసము అనగానే నాకు మొదట తెనాలి రామకృష్ణుని ఉద్భటారాధ్యచరిత్రలోని పద్యం  గుర్తొచ్చింది.


* * *


కైలాస-అచల-సాను-వాసము వృష-స్కంధ-అగ్ర-సంస్థాయి తత్-ప్రాలేయ-అచల-కన్యకా-కుచ-తటీ-పర్యంక-నిద్రా-ఆగతంబు ఆలోల-అగ్ర-జటా-తటీ-ఘటిత-నాక-ఓకస్-సరిత్కంబు దేహ-అలంకారిత-లేలిహానము వెలుంగు అర్చింతు విశ్వేశ్వరా


సం అంటే సమ్యక్, బాగుగా. స్థా గతినివృత్తౌ అని ధాతువు, అంటే గమనరహితమైన స్థితి. ప్రాలేయము మంచు. పర్యంకము మంచము. ఓకస్సు అంటే నివాసం. నాకౌకస్సు అంటే స్వర్గము నివాసముగా కల. "ఆలోల"లో లోల కంపిస్తున్న, ఆ స్వల్పత్వాన్ని సూచిస్తుంది. లేలిహానము అంటే పాము (లేలిహానో ద్విరసనో గోకర్ణః కఞ్చుకీ తథా  అని అమరకోశము).


వెలుంగు అన్న పదం ఇక్కడ కీలకం. నిరాకారస్వరూపంగా అర్చించడమన్నమాట. ఎప్పుడైతే ఇలా నిరాకారస్వరూపంగా తీసుకున్నామో అప్పుడు చెప్పేవన్నీ స్త్రీ-పురుష-నపుంసక-లింగాతీతమైన శివలింగానికి సంబంధించినవౌతాయి కదా.


కైలాస పర్వత సానువులందు నివాసమున్నట్టిది. నందీశ్వరునియొక్క భుజములపైన చక్కగా నుండినది. ఆ మంచుకొండ కూతురైన పార్వతీదేవియొక్క పాలిండ్ల ప్రదేశమనే మంచముపై నిద్రను పొందునది. స్వల్పంగా కదులుతున్న జటాజూటపు పైభాగంలో స్వర్గలోకపు నదిని కలిగినట్టిది. దేహాలంకారముగా పామును చేసికొన్నట్టిది.


కైలాసపర్వతసానువులలో నివాసముంటూ, పాముని గంగని ధరించి, నందీశ్వరుని అధిరోహించి, పార్వతీదేవిపాలిండ్లపై నిద్రపోయే స్వరూపంగా కనిపిస్తున్న వెలుగువైన విశ్వేశ్వరా! నిన్ను కొలుస్తాను అని తాత్పర్యం.


                  

   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌾🌾🌾🌷🌾🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: