3, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీనాధ కవితా వైభవం!



శ్రీనాధ  కవితా వైభవం!


          శా:  "  కుక్షి ప్రోద్భవ  నిష్ఠుర క్షుధిత దు ష్క్రోధాంధకారంబు నన్ ,


                    జక్షుల్  రెండును  జిమ్మచీఁకటులుగా , సంరంభ  శుంభద్గతిన్ ,


                    బ్రేక్ష ఛ్ఛాత్రులు  భీతిఁబొందఁ , గడు నుద్రేకించి ,హట్టంబునన్ ,


                     బిక్షాపాత్రము  రాతిమీఁద  శతధా  భిన్నంబుఁగా   వైచితిన్ .


                       శ్రీ భీమేశ్వర పురాణము - 2 ఆ:  102 వ  పద్యము. కవిసార్వభౌమ  శ్రీనాధుడు.


           


               కఠిన  పదములకు  అర్ధము: కుక్షిప్రోధ్భవ- పొట్టనుం డిపుట్టిన ;నిష్ఠుర: కఠినముగా; క్షుధిత:  ఆకలిపీడగలిగిన; దు ష్క్క్రోధ :చెడ్డదియైనకోపమనే

; అంధకారంబునన్: చీకటిచేత ; చక్షుల్ రెండును- రెండుకన్నులును : చిమ్మచీకటులుగా- గాఢాంధకారముకాగా ; సంరంభ-తొందరపాటు చే నేర్పడిన; శుంభద్గతిన్- వేగముతో ; ప్రేక్షత్ -చూచుచున్న ;ఛాత్రులు- శిష్యులు ; భీతిఁబొంద-భయపడగా ; కడునుద్రేకించి- మిక్కిలి నుద్రేకముతో; హట్టంబునన్- వీధిలో (రోడ్డుమీద) భక్షాపాత్రము- బిచ్చమెత్తుకొను గిన్నె (మట్టిగిన్నె)  రాతిమీద ; శతధా-నూరుముక్కలుగా:భిన్నంబుగా వైచితిన్-పగులునట్లు నేలకు గొట్టితిని;


           భావము:  కడుపున  నాకలిరేగ నాయాకలి వలన గలిగిన కోపమనే గ్రుడ్డితనమున కన్నులు రెండును మూసుకొనిపోగా(కనులకు చీకటికమ్మ)  కడువేగముగా , పరిసరములందున్న శిష్యులెల్ల  భయమందగా  

మిక్కిలి యుద్రేకముతో  చేతనున్న భిక్షాపాత్రను  నూరుముక్కలగునట్లు  వీధిలో  నేలకు గొట్టితిని; అనిదీని భావము.


                    వ్యాసుడు కాసిని వీడివచ్చుటకు గల కారణమును  అగస్త్యునకు వివరించు సందర్భము. ఒకరు లోకహితార్ధియై వింధ్యపర్వత గర్వముడుప ( అగస్త్యుడు) కాశిని వీడిరాగా, మరియొకరు (వ్యాసుడు) ఆకలి కాగలేక కాశిని శపింప బూని ,పరమేశ్వరాగ్రహమునకు లోనయి కాశిని వీడవలసివచ్చినది. వీరిరువురి కలయిక ఒక అపూర్వము.ఒక దివ్యసందేశము.


              కోపమెంత దుర్గుణమో కదా!  దానికి యాకలియు తోడైనది. ఇంకేమున్నది? పుణ్యాలరాసి కాశిని వ్యాసుడుశపింప బూనినాడు.చివరకు కాశినుండి బహిష్కరింప బడినాడు. వ్యాసునకు మూజురోజులు భిక్షదొరుక కుండుట పరమేశ్వరుని మాయయే!

కాని యతడద్దానిని తెలిసికొనలేక పోయినాడు.


                         వ్యాసు డెట్టివాడు? పరమ సంయమి.తపస్వి . విజ్ఙాని, మహఋషి. అట్టియుత్తముడే  ఆకలి ,కోపములకు లొంగి పామరుని వలె ప్రవర్తించెను. కారణము? కోపము.కోపమెంతచెడ్డది?. దానిని అందరూ జయింప వలెనని  దీని సందేశము.


                  రామాయణ కావ్యం సుందరకాండలో  లంకా దహనానంతరం  హనుమంతు డెంతో విచారిస్తాడు. "కోపంతో యెంతపనిచేశాను.లంకంతా కాల్చేశాను. సీతామాత కేమైనా ప్రమాదం కలగలేదుగదా! కోపాన్ని జయించినవారు యెంత ఘనులోగదా! .కోపం చాలా చెడ్డది.దానివల్ల యుక్తాయుక్తములు మరచిపోతాం. కాబట్టి దానికి దూరంగా ఉండాలి అని"- నిజమే!


                   వ్యాసుని కోపావేశాన్ని ,ఆఉద్రేకాన్ని , ఆరౌద్రమూర్తిని ,శ్రీనాధమహాకవి  ఈపద్యంలో  ఆరభటీ వృత్తితో నిరూపించాడు. కఠిన సమాన పదజాలం, పెద్దపెద్ద సమాసాలు ఆరభటీ వృత్తికి పోషకాలు. ఈవిధంగా ఈపద్యంలో భయానక రసాన్ని పోషించి శ్రీనాధుడు

తన రసోచిత రచనను మనకు చవి చూపాడు.కోపంకూడదని  సందేశించాడు. 


                                                                స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: