29, జులై 2021, గురువారం

ఓ కథ* శ్రమజీవులు

 ఓ కథ*

     (రచయిత/త్రి పేరు తెలియదు)

        *🌹 శ్రమజీవులు 🌹* 


"మమ్మీ ! స్కూలు బస్ వచ్చే టైమయ్యింది. నా టై కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?" అడిగింది ఆరో తరగతి చదువుతున్న కూతురు.


"వస్తున్నా తల్లీ, ఇదిగో అన్నయ్య లంచ్ బాక్స్ సర్దుతున్నా!" వంటింట్లోంచి బదులిచ్చింది సుధ.


"మమ్మీ! నా ఉతికిన సాక్స్ ఎక్కడ పెట్టావు? త్వరగా రావాలి, ఆటో వచ్చే టైమయ్యింది" అరుస్తున్నాడు ఏడో తరగతి చదువుతున్న కొడుకు.


"వస్తున్నా నాన్నా! ఇదిగో చెల్లాయ్ టై కనబడటం లేదు. వెతుకుతున్నా."


"సుధా! బాత్రూమ్ లో కొత్త సోప్ పెట్టలేదా?" పిలుస్తున్నాడు భర్త వెంకట్.


"ఆ తెస్తున్నానండీ, ఇప్పుడే పిల్లల్ని పంపించి, లోపలికి వచ్చాను" బదులిచ్చింది సుధ.


"ఇదిగో సుధా! ఈరోజు ఆఫీసుకు కొంచెం ముందుగా వెళ్లాలి. టిఫిన్, లంచ్ బాక్స్ లు సర్దేయ్. నీకు కూడా బ్యాంక్ టైం అవుతోంది కదా ! నువ్వు కూడా తయారవ్వు" అని చెప్పి, డ్రెస్ చేసుకోవడానికి లోపలికి వెళ్లాడు వెంకట్.


"అలాగేనండీ" అంటూ ఆ పనిలో మునిగి పోయింది సుధ.


వచ్చిన రెండు రోజుల నుంచీ, తన కూతురు చేస్తున్న అష్టావధానం గమనిస్తోంది, పక్క గదిలో పేపర్ చదువుకుంటున్న సుధ తల్లి సుభధ్ర.


"ఇదీ అమ్మా వరుస. ఇక్కడ ఇంటిపనీ, అక్కడ బ్యాంక్ పనితో నిజంగా ఒత్తిడి పెరిగి, టెన్షన్ వచ్చేస్తోదనుకో. పోనీ ఉద్యోగం మానేద్దామా అంటే, ఇంటికోసం తీసుకున్న అప్పు నిప్పులా భయపెడుతోంది. పోనీ పనిమనిషిని పెట్టుకుందామా అంటే, వాళ్ళు వస్తారా, రారా అని ఎదురు చూడ్డానికే కాలం సరిపోతుంది, అంతే కాదు వాళ్ల జీతాల కోసం నేను ఇంకో చోట పార్ట్ టైం జాబ్ చేయాలి. సరే ఈ గొడవలు ఎప్పడూ ఉండేవే కానీ, నాలుగు రోజులు ఉందామని వచ్చావు, హాయిగా రెస్ట్ తీసుకో. సాయంత్రం వస్తా" అంటూ తల్లికి చెప్పి, పక్క వీధిలోనే ఉన్న తను పని చేస్తున్న ప్రైవేటుబ్యాంక్ కి బయలుదేరింది సుధ.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


ఆ రోజు సాయంత్రం, బేంక్ నుంచి ఆలశ్యంగా రావడమే కాకుండా, మొహం వేలాడేసుకుని సోఫాలో కూలబడిన సుధని,


"అమ్మడూ, ఏమయ్యిందే తల్లీ ! అలా ఉన్నావు. ఏం జరిగిందో చెప్పవే?" కూతురు పక్కన కూర్చుని, ఆందోళనతో అడిగింది సుభధ్ర.


"ఏం లేదమ్మా! ఈరోజు బ్యాంక్ లో పని ఎక్కువగా ఉండడం వలన, ఆ ఒత్తిడిలో ఒక ఎంట్రీ తప్పు వేసాను. అది మేనేజర్ కనిపెట్టి సరిచేసి, నాకు చివాట్లు పెట్టాడు" బాధపడుతూ చెప్పింది సుధ.


"ఏంటి మమ్మీ ! ఇంత ఆలశ్యం. ఇంతవరకూ స్నాక్స్ కూడా తినలేదు" కంప్లైంట్ చేసింది, పక్క గదిలోంచి వచ్చిన కూతురు.


"బ్యాంక్ లో పనిఒత్తిడి వలన ఆలశ్యం అయ్యింది తల్లీ! అయినా అమ్మమ్మనడిగి ఏవైనా తినలేకపోయారా?"


"నువ్వు లేకుండా ఎప్పుడైనా ఏదైనా తిన్నామా?" సూటిగా అడిగాడు కొడుకు.


"అయ్యయ్యో, అలాగా! ఇప్పుడే తెస్తా ఉండండి" అంటూ లోపలికి వెళ్లింది సుధ.


ఈ సంఘటనలు చూసిన తరువాత, తను తిరిగి వెళ్లబోయే ఈ రెండు రోజుల్లో ఈ ఇంటికి చేయవలసిన ప్రక్షాళన గురించి ఆలోచనలో పడింది సుభద్ర.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


మర్నాడు సాయంత్రం, తను రాసిన ఓ కధకు తుది మెరుగులు దిద్దుతున్న సుభద్ర, ఫోన్ రింగ్ రావడంతో,


"చెప్పవే అమ్మడూ! బ్యాంక్ నుంచి బయలు దేరుతున్నావా?" అడిగింది సుధను.


"లేదమ్మా! ఈ రోజు సాయంత్రం డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకున్నాం. ఆఫీసు అవ్వగానే ఆయన ఇక్కడికి వస్తానన్నారు. అందుకే మేము రావడం కొంచెం ఆలశ్యం అవుతుంది. పిల్లలకి ఏం కావాలో చూడమ్మా!"


"సరేకానీ, డాక్టర్ దగ్గరకు దేనికే? " గాభరాగా అడిగింది సుభద్ర.


"కంగారు పడకు. నీకు నిన్న చెప్పానుగా! ఈ మద్యన కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటోందని ! అందుకే ఓ సారి చూపించు కుందామని వెళ్తున్నాం" అంటూ ఫోన్ పెట్టేసింది సుధ.


ఫోన్ పెట్టేసిన సుభద్ర, ఈ రోజే తన పథకం అమలు చేయాలని ఓ నిశ్చయానికి వచ్చేసింది.


"అమ్మమ్మా! మమ్మీ ఇంకా రాలేదా, ఈ రోజు కూడా? " అడిగారు స్కూలు నుంచి వచ్చిన పిల్లలు.


"మీ మమ్మీకి ఒంట్లో బాగోలేదర్రా! పాపం పని ఒత్తిడిలో నలిగి పోతుంది కదా ? అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లింది. మీరు కొంచెం కోపరేట్ చేస్తే మీ మమ్మీ త్వరగా కోలుకుంటుంది" బిక్కుబిక్కుమంటూ చూస్తున్న పిల్లలతో చెప్పింది సుభద్ర.


"మేము ఏం చేయాలి అమ్మమ్మా, చెప్పు చేస్తాం!" అన్నారు ముక్తకంఠంతో.


"నాకు తెలుసుర్రా! మీరు మంచి పిల్లలని. ఏం చేయాలంటే........" అంటూ పిల్లలకు విడమరిచి చెప్పసాగింది సుభద్ర.


  **** 🌷 **** 🌷 **** 🌷 ****


పిల్లలతో కబుర్లలో మునిగిపోయిన సుభద్రకు అల్లుడు, కూతురు వచ్చిన అలికిడి వినబడడంతో హడావుడిగా గది లోంచి బయటకు వచ్చి,


"ఎలావుందే అమ్మడూ! డాక్టర్ గారు ఏమన్నారు?" ఆందోళనగా అడిగింది.


"కంగారు ఏమీ లేదు అత్తయ్య గారూ! నీరసానికి మందులు రాసారు. వీలైతే మెడిటేషన్ చేయమన్నారు" చెప్పాడు అల్లుడు.


అంతా విని, కూతురు వద్దకు వచ్చి,


"అమ్మడూ, రాత్రి పడుకునే ముందు ఓసారి నా గదిలోకి రావే, కొంచెం మాట్లాడే పని ఉంది నీతో" కూతురు భుజంమీద చెయ్యి వేసి, అనునయస్తూ చెప్పింది సుభద్ర.


"అలాగే అమ్మా! నువ్వేమీ గాభరా పడకు" అంటూ తల్లికి చెప్పి వంట గదిలోకి వెళ్లింది సుధ.


 **** 🌷 **** 🌷 **** 🌷 ****


"అమ్మా! ఇంకో వారం రోజులు ఉండవచ్చు కదా? ఎప్పుడూ చెప్పులో కాళ్ళు పెట్టుకుని మరీ వస్తావు. సరేకానీ, చెప్పు ఎందుకు రమ్మన్నావు?"తల్లి పక్కన కూర్చుని అడిగింది సుభద్ర.


"నీ గురించి చెప్పి, అల్లుడు గారు రమ్మంటే వచ్చాను గానీ, నీకు తెలియంది ఏముంది? అన్నయ్య ఆరోగ్యం సరైనది కాదు కదా? సరే అసలు విషయానికి వస్తా. ఈ ఒత్తిడి అనేది ఓ జబ్బూ కాదు, అలాగని అంటురోగమూ కాదు. ఇది మన సృష్టించుకున్నదే. అందుకే దీని నివారణ కూడా మన చేతుల్లోనే ఉంది. అలాగని, డాక్టర్ గారు ఇచ్చిన మందులు, సలహాలు మానేయమని చెప్పడంలేదు. వాటితో పాటు ఈ జపమాల అనే పద్ధతి పాటిస్తే, ఈ ఒత్తిడి, అనవసరపు ఆందోళనలు దూరమవుతాయి" చెప్పింది సుభద్ర.


"ఊరుకో అమ్మా! ఈ జపాలూ తపాలు చేసే సమయం ఎక్కడుంటుందే? దేవుడుకి ఓ నమస్కారం పెట్టడానికే సమయం దొరకడం లేదు" కొంచెం విసుగ్గా చెప్పింది సుధ.


"అయ్యో, జపమాల అంటే జపం కాదే. ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడే నాలుగు పద్ధతులలోని మొదటి అక్షరాలే ఈ జ,ప,మా,ల . కిందటి సంవత్సరం మీ వదిన ఇలాగే బాధపడుతూంటే ఈ పద్ధతి చెప్పాను. వెంటనే ఆచరణలో పెట్టడంతో, ఇప్పుడు ఆ ఒత్తిడి అధిగమించి హాయిగా ఉంది."


"ఔనా ? ఆ జపమాల పద్ధతి ఏమిటో నాకూ చెప్పవే" తల్లి ఒడిలో తల ఆనించి ముద్దుగా అడిగింది సుధ.


📍"అయితే విను. ఇందులో మొదటి పద్ధతి *జ* న భాగస్వామ్యం: 

అంటే మనం చేసే పనిలో కొందరికైనా భాగస్వామ్యం కల్పించాలి. అన్నీ మనం ఒక్కరమే చేద్దాం అనుకోకూడదు. మీ ఇంట్లో చూడు, పిల్లల స్కూలు యూనీఫారాలూ, వాళ్ల టిఫిన్ బాక్సులు సర్దడం, కడగడం అన్నీ నువ్వే చేయాలా? పాపం, చిన్న పిల్లలు, వాళ్లని ఇప్పటినుంచీ కష్టపెట్టడం ఎందుకని నువ్వు అనుకోవచ్చు. కానీ, వాళ్లు ఎదుగుతున్నారు, రేపో మాపో పై చదువుల కోసం హాస్టళ్లలో ఉండవలసి రావచ్చు. అప్పుడు నువ్వు అక్కడికి వెళ్లి చేయలేవు కదా? అందుకే వాళ్ళ పనులు వాళ్లను చేసుకోనివ్వాలి. అప్పుడు నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న ఆమె మొహంలో ముప్పై సంవత్సరాలు ఉపాధ్యాయవృత్తి చేసిన తల్లి కనపడింది, సుధకు.


ఆశ్చర్యంగా వింటున్న సుధ వైపు చూస్తూ, చెప్పసాగింది సుభద్ర.


📍"ఇక రెండో పద్ధతి 

*ప* నికి సమయనిర్ధేశం:

అంటే, ప్రతీ పనికి మనం ఓ నిర్ధిష్ట సమయం కేటాయించుకోవాలి. నీ విషయానికి వస్తే, నేను కొన్ని విషయాలు గమనించాను. పొద్దున్నే లేవగానే ఆ ఫోన్ తీసి వాట్సప్ మెసేజులు చూడడం అవసరమా ? అందులో ఏదో ఓ చెత్త మెసేజ్ ఉంటుంది. ఇంక ఆ రోజంతా దాని గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు. అందుకే రోజుకు నాలుగు సార్లు, అంటే ఉదయం టిఫిన్ చేస్తూ, మధ్యాహ్నం లంచ్ టైములో, సాయంత్రం ఇంట్లో కాఫీ తాగుతూ, రాత్రి పడుకోబోయే ముందు.. ఇలా సమయం కేటాయించుకో. 


అలాగే, రాత్రి టీవీ చూస్తూ మర్నాడు ఉదయానికి కావలసిన కూరలు తరుక్కోవడం, రాత్రి భోజనాలు అయిన తరువాత ఆ పాత్రలు మర్నాడు ఉదయం వరకూ ఉంచకుండా రాత్రి పడుకునేముందే కడుక్కోవడం, ఇలా సమయ పాలన చేయడం వలన మర్నాడు ఉదయానికి నీకు కొంచెం పని ఒత్తిడి తగ్గుతుంది" చెబుతున్న తల్లి మొహంలో ఓ మోటివేటర్ దర్శనమిచ్ఛాడు సుధకు. 


ఆశ్చర్యంగా చూస్తున్న కూతురు వైపు ఓ సారి చూసి, తిరిగి చెప్పడం మొదలెట్టింది సుభద్ర.


📍"ఇక మూడోది, అతి ముఖ్యమైనదీ

*మా* నసిక స్థైర్యం. 

ఇది ఉంటే చాలు, ఒత్తిడి ఏం ఖర్మ, మనం దేనినైనా జయించవచ్చు. మిన్ను విరిగి మీదపడినా కానీ చలించకుండా, ధైర్యంగా ఎదుర్కొనేలా ఉండాలి. ఏ కష్టం వచ్చినా, కృంగిపోకుండా, నేను దీనిని ఎదుర్కొన గలను అని గట్టిగా పిడికిలి బిగించి మనసులో అనుకో. నీలో ఆత్మ విశ్వాసం పెరిగి, ఒక విధమైన ధైర్యం వచ్చేస్తుంది.   


ఇది లేకపోవడం వల్లనే చిన్నపాటి అప్పులు చేసి, అప్పులవాళ్ల ఒత్తిడి భరించలేక మీ నాన్న మీ చిన్నతనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ధైర్యం ఉంది కాబట్టే నేను చదువుకుని, టీచర్ ఉద్యోగం తెచ్చుకుని, అన్నయ్యను, నిన్నూ చదివించి ఈ స్థితికి తెచ్చాను" అని చెబుతున్న తల్లిలో ఓ సైకాలజిస్టు దర్శనమిచ్చాడు సుధకు.


📍ఇక ఆఖరుది 

*ల* క్ష్యం మీద దృష్టి. 

అంటే మనం ఏం పని చేస్తున్నామో దాని మీదే దృష్టి కేంద్రీకరించాలి. మాటవరసకి ఒక బస్సు డ్రైవర్ స్టీరింగ్ ముందు కూర్చోగానే, అతని లక్ష్యం ప్రయాణికులని క్షేమంగా గమ్యం చేర్చడం. అందుకే అతని దృష్టి రోడ్డు మీదే ఉండాలి. అలాకాక, ఉదయం ఇంట్లో జరిగిన సంఘటన గురించి ఆలోచించా డనుకో, అరవై మంది ప్రాణాలు గాల్లో కలిసినట్లే. 


నిన్న బ్యాంకు లో నువ్వు చేసింది అదే, ఏదో ఆలోచిస్తూ, ఆ ఒత్తిడిలో తప్పుడు ఎంట్రీ వేసావు. అలా కాకుండా లక్ష్యం మీద దృష్టి పెట్టి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. అందుకే పని మీద దృష్టి పెట్టమనేది.


అంతెందుకు, చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత, గ్యాస్ స్టవ్ ఆపామా? ఇంటి తాళం సరిగ్గా వేసామా అని అనుమాన పడి ఆ ఒత్తిడితో అసలు వెళ్లిన పని మీద దృష్టి పెట్టకుండా ఇంటికి వచ్చి చూసుకొనేవరకూ బిక్కు బిక్కు మంటూ ఉంటారు. అలా కాకుండా తాళం వేసినప్పుడు కొంచెం దృష్టి పెట్టడం కానీ లేదా ఆ సమయంలో ఏదో ఒక సంఘటన అంటే 'పాపం రామారావు కి ఎలా ఉందో' అనో లేదా 'ఆ వీధి కుక్క ఎలా అరుస్తోందో'..ఇలా ఏదో ఒకటి అనుకుని ఆ పని చేసామనుకో. అప్పుడు మనకి ఆ అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి, ఒత్తిడికి దూరం అవుతాం" చెబుతున్న అమ్మ, గీతోపదేశం చేస్తున్న గీతాచార్యుడులా కనిపించింది సుధకు.


"అమ్మా, చక్కటి విషయాలు చెప్పావు. నువ్వు చెప్పిన జపమాల పద్దతి ఇప్పటి నుంచే ఆచరిస్తాను" అంటూ తక్షణ కర్తవ్యంగా సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి, తల్లి వద్దే పడుకుండి పోయింది సుధ.


  ****🌷 ****🌷 ****🌷 ****


ఉదయమే లేచి బ్రష్ చేసుకుని, కిచెన్ లోకి వచ్చిన సుధ, అక్కడ సింక్ లో గిన్నెలు కడుగుతున్న కూతురు, డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని బెండకాయలు తరుగుతున్న కొడుకు, కాఫీ పెడుతున్న భర్తను చూసి, 

"ఏమిటి షడన్ గా ఈ మార్పు" అని అడిగింది ఆశ్చర్యపోతూ.


"చూడు సుధా! అత్తయ్య గారు చెప్పిన జపమాలలోని మొదటి పథకాన్ని, మా వంతుగా మేము అమలుపరుస్తున్నాం. మిగతా మూడు పథకాలు ఫాలో అవ్వడం ఇక నీ చేతుల్లో ఉంది" చెబుతున్న భర్తని ఆశ్చర్యంగా చూస్తూ, ఒత్తిడిని జయించిన మొహంతో, పిల్లలను దగ్గరకు తీసుకుంది సుధ, మనసులో తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తనుకూడా రెడీ అయి ఉద్యోగానికి వెళ్ళింది .


  .... 🌷.... 🌷.... 🌷.... 🌷....

   

ఇప్పటికీ భర్త/తండ్రి కష్టపడి సంపాదిస్తుటే వారికి ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించకుండా టీవీల ముందు గానీ, సెల్ ఫోన్ లోగాని, భక్తి వంకతో పూజ గదిలో గాని యోగా, ధ్యానం అనిగాని... సమయం వ్రుదా చేసి కాలక్షేపం చేస్తూ ఇంటిపనికి ఒకరు, వంటపనికి ఒకరు, తోటపని ఒకరు, పాచిపనికి ఒకరు, కారు తుడిచేవాడు ఒకడు, దానిని నడపటానికి ఒకడు. అని దర్పం చుబిస్తు.. శరీరానికి వ్యాయామం లేక, కనీసం చమట కూడా పట్టే పరిస్తితి లేకుండా... వాళ్ళ ఒళ్ళు వాళ్ళే మోయలేక వాళ్ళ పిల్లలని ఎత్తుకోవటానికి పనిపిల్లలను పెట్టుకొని, వాళ్ళు మాత్రం కుక్కపిల్ల ఎత్తుకొని వాకింగ్ పేరుతో తిన్నది అరిగేవరకు రొడ్లవెంట తిరిగే వారు ఉన్న ఈ రోజుల్లో. .. 

వేడినీళ్లు చన్నీళ్ళు అన్నట్లుగా, రూపాయికి మరొక రూపాయి కుడబెట్టటానికి శ్రమించే ప్రతిఒక్క మహిళా శ్రమజీవి కి.. పాదాభివందనం🙏🙏


*(మహిళా ఉద్యోగినులకు అందరికీ అంకితం)*


   💥 సర్వేజనాః సుఖినోభవంతు

కామెంట్‌లు లేవు: