29, జులై 2021, గురువారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అమ్మాయి పెళ్లి..*


మొగలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద అప్పుడప్పుడూ వివాహాలు జరుగుతూ ఉంటాయి..శ్రీ స్వామివారి సన్నిధిలో వివాహం చేస్తే తమ బిడ్డల భావి జీవితం సుఖంగా సాగిపోతుందని కొందరు..శ్రీ స్వామివారి దయవల్లే తమకు సంతానం కలిగింది కనుక, ఆ సంతానం యొక్క వివాహాలు కూడా ఇక్కడే జరిపితే..వాళ్ళ మీద కూడా స్వామివారి కృపా కటాక్షణాలు వుంటాయని మరికొందరూ..శ్రీ స్వామివారి వద్దే వివాహం జరిపించుకోవాలని మొక్కుకునేవారు ఇంకొందరూ..ఇలా కారణాలు ఏవైనా..శ్రీ స్వామివారి మందిరం వద్ద వివాహాలు చేసుకుంటూ వుంటారు..


రెండు సంవత్సరాల క్రిందట ఇద్దరు పెద్దవాళ్ళు మా దగ్గరకు వచ్చి.."మా పిల్లవాడికి పెళ్లి నిశ్చయం అయింది..వచ్చే నెలలోనే ముహూర్తం.. వివాహాన్ని స్వామివారి సన్నిధిలో చేయాలని నిర్ణయం తీసుకున్నాము..ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఏమైనా నిబంధనలు ఉన్నాయా?.." అని అడిగారు..వివాహం చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి ల తాలూకు వయసు ధ్రువీకరణ పత్రాలు కావాలని..ఇద్దరిలో ఏ ఒక్కరు మైనర్ అయినా ఇక్కడ వివాహం చేసుకోవడానికి అంగీకరించమనీ..చెప్పాము.."ఆ ఇబ్బందేమీ లేదు..ఇద్దరూ ఇరవై నాలుగేళ్ల పై బడిన వారే.." అని చెప్పి..ముహూర్తం రోజుకు వస్తామని చెప్పి..రెండు గదులు తమకు కేటాయించమని చెప్పి వెళ్లారు..


అనుకున్న ప్రకారమే ముహూర్తం రోజుకు ఆ పెళ్లి బృందం శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చారు..పెళ్లికూతురు తల్లిదండ్రులిద్దరూ ముందుగా మందిరం లోనికి వచ్చి.."అయ్యా..ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటాము..ఈరోజు మా అమ్మాయి పెళ్లి జరగడానికి స్వామివారి దయ కారణం.." అన్నారు..లోపలికి వెళ్లి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు..మరి కొద్దిసేపటికల్లా.. పెళ్లి జరిగిపోయింది..వధూవరులను తీసుకొని మందిరం లోనికి వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నూతన దంపతులు నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చేసారు..


"మాకు పెళ్ళైన ఆరేళ్ళ దాకా బిడ్డలు పుట్టలేదు..మొగలిచెర్ల లో ఒక స్వామివారు సిద్ధిపొందారు..అక్కడికి వెళ్లి మొక్కుకోండి..మీకు సంతానం కలుగుతుందని మా ఊళ్ళో పెద్దలు చెపితే..ఇక్కడకు వచ్చాము..ఐదురోజుల పాటు నిద్రచేసాము..ఆ తరువాత సంవత్సరానికి ఈ అమ్మాయి పుట్టింది..స్వామివారి ప్రసాదం అనుకున్నాము..కానీ పుట్టిన తరువాత ఈ పిల్లకు ఐదేళ్ల వయసు దాకా మాటలు రాలేదు..డాక్టర్లకు చూపించాము..ఫలితం లేదు..మళ్లీ స్వామివారి వద్దకు వచ్చి వేడుకున్నాము..మా దుఃఖాన్ని ఆ స్వామి గ్రహించాడేమో..మరో మూడునెలలకు మాటలు వచ్చాయి..బడికి పంపించాము..బాగానే చదువుకున్నది..డిగ్రీ పూర్తిచేసింది..పెళ్లి చేద్దామని సంబంధాలు చూసాము..మూడేళ్ల పాటు ఒక్క సంబంధమూ కుదరలేదు..నాలుగు నెలల క్రిందట అమ్మాయిని తీసుకొని ఒక శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి నిద్ర చేసి, "స్వామీ! అమ్మాయికి పెళ్లి కుదిరితే..నీ సమక్షం లోనే వివాహం చేస్తాము.." అని మ్రొక్కుకున్నాము..పది రోజుల్లోనే ఈ సంబంధం వచ్చింది..చిత్రమేమిటంటే..అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఇక్కడే వివాహం చేయాలని మొక్కుకొని ఉన్నారట..మమ్మల్ని అడిగారు..అంతకంటే కావాల్సింది ఏమున్నదని మేమూ సంతోషంగా ఒప్పుకున్నాము..అబ్బాయి బెంగుళూరు లో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు..ఆ కుటుంబం కూడా స్వామివారి భక్తులే..అదే మాకు సంతోషం..మొదటినుంచీ మమ్మల్ని స్వామివారు అన్నివిధాల ఆదుకున్నారు.." అని చెప్పారు..


మరో పదిహేను నెలల తరువాత ఒక ఆదివారం నాడు ఆ దంపతులు తమ కూతురు అల్లుడు.. వాళ్లకు పుట్టిన మగ బిడ్డను తీసుకొని శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆరోజు శ్రీ స్వామివారి వద్ద అన్నదానం చేశారు..వాళ్ల సంతోషానికి కారణం.. ఆ కారుణ్యమూర్తి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడే కదా!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: