ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత
ప్రాచీన కవుల ప్రౌఢత-సమర్ధత గూర్చి వేనోళ్ల పొగిడిన తక్కువే అవుతుంది. ఛందస్సు శృఖలాలుగా భావించే నవ్య, నూతన, గేయ, భావ కవులు ఈ నాడు మన ప్రాచీన కవుల కవిత్వాన్ని, అందులోని రసాన్ని ఆస్వాదించే స్థితిలో లేరంటే కోపం వస్తుందేమో కానీ కొందరి విషయంలో మాత్రము ఇది అక్షర సత్యం.
యతి, గణముల ప్రాధమిక పరిజ్ఞానం లేనివారు కూడా ఈ రోజుల్లో సుకవులుగా ప్రాచుర్యం పొందటం మన తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం అనుకోవాలా అనిపిస్తుంది. గతంలో నా దగ్గరకి ఒక కవి మిత్రుడు వచ్చి ఏదో సాహితి చర్చ చేస్తున్నాడు. ఇంతలో తానే నాకు కొంతమంది పద్య కవిత్వం వ్రాయమన్నారండి అని అని ఛందస్సు అంటే UUలు II లు పెడతారు అదేనా అన్నాడు. అంతేకాకుండా సుమతి శతకం, వేమన శతకంలోని పద్యాలూ మాములు మనం వ్రాసే గేయాల లాంటివే అని సెలవిచ్చారు. అది విని నేను నిర్ఘాంత పోయాను. ఇక ఉరుకుంటే ఇంకా తన పాండిత్య గరిమ నా వద్ద ప్రదర్శిస్తారని తలచి ఆర్య అవి ఆటవెలదులు, తేటగీతులు అనే దేశీయ ఛందస్సు అని వివరించటం జరిగింది. నాకు తెలిసింది చాలా చిన్ని ప్రపంచం కావచ్చు. ఈనాడు కూడా ప్రాచీన కవుల స్థాయికి తగట్టుగా ధీటుగా కవిత చెప్ప సమర్థులు ఉండవచ్చు. కానీ చాలా మటుకు మిడి మిడి జ్ఞానంతో మన తేట తెలుగును అపభ్రంశం చేసే వారే ఉన్నట్లు తోస్తున్నది. ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే నేను ఇటీవల ఒక చాటు పద్యం చదవటం తటస్తించింది. అది చదివిన తరువాత దానిలో ఆ కవి పలికిన పలుకులు ఒక సమర్ధ కవికి ఆదర్శంగా ఉంటుందని నేననుకున్న ఆ పద్యాన్ని మీకు పరిచయం చేసే ముందు మీకు రెండు పదాల అర్ధం చెపుతాను (మీకు తెలిసే ఉండవచ్చు కానీ తెలియని వారికోసం మాత్రమే)
1) "గడియ" అంటే ఒక కాలం కొలమానం అది మన 24 నిముషాలకు సమానం.
2) "గంటము" అంటే తాటాకు మీద వ్రాయటానికి ఉపయోగించే వక సాధనము అంటే మన భాషలో కలము లేక పెన్ను
ఇక ఆ పద్యాన్ని ఆస్వాదిద్దాము.
గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా
దొడగితినా పఠీలు మని తూలి పడన్ కులశైల రాజముల్విడువకనుగ్రహించి నిరు పేద ధనాధిపు తుల్యు చేతునే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే
ఇక్కడ కవిగారు తాను గడియకు (24 నిముషాలకు ) నూరు పద్యాలూ రచిస్తారట అవి ఎలా వుంటాయో కూడా తెలుపుతూ తన పేరు కూడా తెలియచేసారు అది నడిదము సూరన అట
ఇలా అనేక చాటు పద్యాలు మన తెలుగు నాట వున్నాయి కొన్ని కనుమరుగయ్యాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి