27, ఆగస్టు 2021, శుక్రవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

 *27.08.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - రెండవ అధ్యాయము*


*జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*2.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*దేహేంద్రియప్రాణమనోధియాం యో జన్మాప్యయక్షుద్భయతర్షకృచ్ఛ్రైః|*


*సంసారధర్మైరవిముహ్యమానః స్మృత్యా హరేర్భాగవతప్రధానః॥12239॥*


దేహమునకు జనన మరణములు, ప్రాణములకు ఆకలిదప్ఫులు, మనస్సునకు భయము, బుద్దికి తృష్ణ, ఇంద్రియములకు శ్రమ - అనునవీ సాంసారిక ధర్మములు. ఉత్తమభక్తుడు భగవంతుని స్మరించుటలో తన్మయుడై పదేపదే సంభవించుచుండెడి ఈ సాంసారిక ధర్మములను సరకుగొనడు.


*2.50 (ఏబదియవ శ్లోకము)*


*న కామకర్మబీజానాం యస్య చేతసి సంభవః|*


*వాసుదేవైకనిలయః స వై భాగవతోత్తమః॥12240॥*


మనస్సునందు విషయభోగేచ్ఛలు, కర్మప్రవృత్తి, వాటికి మూలమైన వాసనలు లేనివాడు, పరమవిశ్వాసముతో పూర్తిగా వాసుదేవునే శరణుజొచ్చినవాడు, భగవద్భక్తులలో ఉత్తముడు (భాగవతోత్తముడు).


*2.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*న యస్య జన్మకర్మభ్యాం న వర్ణాశ్రమజాతిభిః|*


*సజ్జతేఽస్మిన్నహంభావో దేహే వై స హరేః ప్రియః॥12241॥*


దేహమునకు సంబంధించిన ఉత్తమ కులమునందు జన్మ, తపస్సు మొదలగు కర్మలు, బ్రాహ్మణాది వర్ణములు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు, దేవమనుష్యత్వాది జాతులు మొదలగు వాటివలన అహంభావము లేనివాడు భగవంతునకు మిక్కిలి ఇష్టుడు అనగా భగవదనుగ్రహమునకు పాత్రుడు.


*2.52 (ఏబది రెండవ శ్లోకము)*


*న యస్య స్వః పర ఇతి విత్తేష్వాత్మని వా భిదా|*


*సర్వభూతసమః శాంతః స వై భాగవతోత్తమః॥12242॥*


దేహమనందును, సంపదలయందును 'ఇది నాది, ఇది పరునిది' అను భేదభావములేకుండా 'సకల పదార్థములును పరమాత్మ స్వరూపమే' అని భావించు సమబద్ధి గలవాడును, ఎట్టి సంఘటనలు తటస్థించినను జితాంతఃకరణుడై ఏ మాత్రమూ చలింపక శాంతచిత్తుడై యుండువాడును, భగవంతునకు ఎంతయు ప్రీతిపాత్రుడును, అహంకార మమకారములు లేనివాడును భాగవతోత్తముడు.


*2.53 (ఏబది మూడవ శ్లోకము)*


*త్రిభువనవిభవహేతవేఽప్యకుంఠస్మృతిరజితాత్మసురాదిభిర్విమృగ్యాత్|*


*న చలతి భగవత్పదారవిందాల్లవనిమిషార్ధమపి యః స వైష్ణవాగ్ర్యః॥12243॥*


చిత్తము వశము చేసికోలేని దేవతలు మొదలగువారందరు శ్రీహరి పాదపద్మములను అన్వేషించెదరు. కాని, వారికి అవి దుర్లభములు. భాగవతోత్తముడు అట్టి దివ్యపాదారవిందములనుండి తన మనస్సును అరక్షణమైనను మఱల్పక సతతము వాటి సేవలలోనే నిరతుడైయుండును. అట్టివానికి త్రిలోకరాజ్యాధికార సంపదను ఇయ్యజూపినను వాటివైపే చూడక అతడు భగవత్స్మరణ యందే నిమగ్నుడై యుండును. అట్టివాడు వైష్ణవాగ్రగణ్యుడు.


*2.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*భగవత ఉరువిక్రమాంఘ్రిశాఖానఖమణిచంద్రికయా నిరస్తతాపే|*


*హృది కథముపసీదతాం పునః స ప్రభవతి చంద్ర ఇవోదితేఽర్కతాపః॥12244॥*


భగవంతుని పరాక్రమము సాటిలేనిది. ఆ స్వామియొక్క పాదాంగుళుల నఖకాంతులనెడి చంద్రికల ప్రసారములచే శరణాగతులైన భక్తులయొక్క తాపత్రయములు పూర్తిగా అంతరించిపోవును. అప్పుడు వారు అనుభవించెడి ఆనందము అపరిమితము. అట్టి శరణాగతుల హృదయములయందు మరల కామక్రోధాది శత్రువులకు తావుండదు. చంద్రోదయ మైనంతనే విరబూసిన పండువెన్నెలల చల్లని కాంతులకు సూర్యకిరణ తాపములు ఉపశమించునుగదా!


*2.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*విసృజతి హృదయం న యస్య సాక్షాద్ధరిరవశాభిహితోఽప్యఘౌఘనాశః|*


*ప్రణయరశనయా ధృతాంఘ్రిపద్మః స భవతి భాగవతప్రధాన ఉక్తః॥12245॥*


తుమ్మినా, దగ్గినా, ఆవులింత వచ్చినా, నవ్వినా, ఏడ్చినా, కూర్చున్నా, లేచినా, రోగము-నొప్పి వచ్చినా వెంటనే భగవన్నామమును స్మరించుట కొందరికి పరిపాటి. ఇట్లే ఏ విధంగానైనా పరవశుడై స్వామిని స్మరించువాని పాపరాశులు పటాపంచలైపోవును. భక్తులు శ్రీహరి పాదపద్మములను ప్రేమభక్తి అనెడు త్రాడుతో కట్టివేసి తమ హృదయమునందు నిలుఫుకొందురు. అట్టి ప్రేమభక్తుని హృదయమును ఆ శ్రీహరియే స్వయముగా విడిచిపట్టడుగాక విడిచిపెట్టడు. అట్టివాడే భగవద్భక్తులలో ముఖ్యమైన వాడగును.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ద్వితీయోఽధ్యాయః (2)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *జనకమహారాజునకును - తొమ్మిదిమంది యోగీశ్వరులకును మధ్య జరిగిన సంవాదమును తెలుపుట - నారదుడు వసుదేవునివద్దకు వచ్చుట* అను

రెండవ అధ్యాయము (2)


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235g

కామెంట్‌లు లేవు: