*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*398వ నామ మంత్రము* 27.8.2021
*ఓం అవ్యక్తాయై నమః*
సృష్టికి ముందున్న స్థితి అయిన అవ్యక్తస్థితిలో ఉన్న జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అవ్యక్తా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం అవ్యక్తాయై నమః* అని స్మరిస్తూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆ అవ్యక్తస్వరూపిణి ఆ భక్తులకు వ్యక్తస్వరూపంగా గోచరించి సకలాభీష్టసిద్ధిని అనుగ్రహిస్తుంది.
బ్రహ్మము అవ్యక్తము. అమ్మవారు అట్టి బ్రహ్మస్వరూపిణి. గనుక అవ్యక్తాయని అనబడినది. అమ్మవారు శక్తిపీఠాలలో వివిధ శక్తిస్వరూపములతో వ్యక్తమౌతున్నది. జ్యోతిర్లింగ స్వరూపుడు అయిన పరమేశ్వరుని వామాంకములో వివిధనామాలతో, వివిధరూపాలతో వ్యక్తమౌతున్నది. గ్రామదేవతగా, కొండదేవతగా వివిధరూపాలలో సమయాచారులకు, వామాచారులకు వారివారి మనోనేత్రాలలో వివిధరూపాలలో వ్యక్తమౌతున్నది. సహస్రనామాలలో శతసహస్ర (అనేక) రూపాలతో ఆ తల్లి వ్యక్తమౌతున్నది. శ్రీచక్రాధిదేవతగా, చతుష్షష్టికోటియోగినీ గణములమధ్య చతుష్షష్టికోటి రూపాలతో అవ్యక్తమౌతున్నది ఆతల్లి. ఈ వ్యక్తస్వరూపాలకు పూర్వము మొట్టమొదటి రూపము అవ్యక్తమే. సృష్టికి ప్రథమసృష్టి మూలప్రకృతియొక్క అవాఙ్మానసగోచరము. మహామాయ. ఇంద్రియములకు గోచరముకాదు. గనుకనే ఆ శ్రీమాత *అవ్యక్తా* యని అనబడినది. పంచకృత్యపరాయణ అయిన ఆ తల్లి ఫ్రళయకాలంలో నామరూపాత్మకమైన జగత్తును తనలో కలుపుకుంటుంది. అన్నీ అస్పష్టమైన పదార్థాలుగా తనలో దాచుకొని *అవ్యక్తా* యని అనబడుచున్నది.
అమ్మవారి సూక్ష్మరూపము బీజాక్షరస్వరూపము. కేవలం భావనామాత్రమై కంటికి గోచరముకాని స్థితిలో ఉండి *అవ్యక్తా* అని అనబడుచున్నది. అమ్మవారు *మూలమంత్రాత్మికా*, *మూలకూటత్రయ కళేబరా* అని అంటున్నాము. అంటే అవ్యక్తమైన సూక్ష్మస్వరూపిణి. ఆ అవ్యక్తమైన సూక్ష్మస్వరూపంలో అమ్మవారి ముఖపంకజము *వాగ్భవకూటము* - *(శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా)*, కంఠమునుండి కటి పర్యంతము *కామరాజకూటము* - *(కంఠాదః కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి)*, కటిభాగము క్రింద నుండి పాదములవరకూ *శక్తికూటము* - *(శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణి)*. సూక్ష్మరూపమంతయూ అవ్యక్తమే. కాబట్టి అమ్మవారు *అవ్యక్తా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అవ్యక్తాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి