18, మే 2023, గురువారం

హనుమజ్జయంతి ప్రత్యేకం - 7

 ॐ      హనుమజ్జయంతి ప్రత్యేకం  - 7 

    (ఈ నెల 14వ తేదీ హనుమజ్జయంతి) 


VII. హనుమంతుడు - కార్యదీక్ష 


    సముద్రం దాటటం - సీతాన్వేషణ అనే కార్యం హనుమపై పడింది. 

    దానికి సంబంధించి కనీస సమాచారమేదీ ఆయనకి అందజేయబడలేదు. 

    ఆ ప్రయత్నంలో ప్రలోభాలూ, ప్రమాదాలూ ఎదురవుతూ వచ్చాయి. 

    కానీ వాటన్నిటినీ హనుమ అధిగమిస్తూ, అప్పటికప్పుడు ఎదుర్కొన్న తీరూ - ముందుకు సాగిన పద్ధతులూ, ఆయన ఏకాగ్రతకూ కార్యదీక్షకూ అద్దం పడుతాయి. 

      అందులో కొన్ని 


అ) సముద్ర లంఘనము 


(i) ప్రలోభం:

    మైనాకునిపై విశ్రమించక సాగిపోవడం. 


    సముద్రుని కోరికమేరకు మైనాకుడు తనపై విశ్రమించి వెళ్ళమన్నాడు. 

    మధ్యలో ఆగనని (రామబాణం) ప్రమాణం చేశాననీ, సమయం కూడా మించిపోతోందనీ చెప్పి ముందుకు సాగాడు. 

(ii) పరీక్ష: 

    సురస పరీక్షించదలచి, తన నోటిలోకి ప్రవేశించమని హనుమని  కోరింది. 

    హనుమ బొటనవ్రేలు పరిమాణంలో అయి, సురస కోరినట్లు నోటిలోకి ప్రవేశించి, ఉపాయంతో బయటకు వచ్చాడు. 

(iii) అకస్మాత్ హింస: 

    నీడను బట్టీలాగే సింహికను మర్మావయవాలు ఛేదించి సంహరించాడు. 


ఆ) ప్రవేశ ప్రయత్నం: 

    లంకాధిదేవత అడ్డగించినప్పుడు, 

    ఆమెను ఎదుర్కొని, లంకలోనికి ప్రవేశించాడు. 


ఇ) నిగ్రహం: 

     అంతఃపురంలో స్త్రీలను చూడడమే ధర్మలోపం అనీ, 

    అయినా తన మనస్సు ఎట్టి వికారాలకూ లోనవలేదనీ తలచుకున్నాడు. 

    తప్పిపోయిన స్త్రీని స్త్రీల మధ్యలోనే కదా వెదకవలెననే సూత్రంతో వెదికాడు. 


ఈ) ఉత్సాహము: 

    సీతాన్వేషణలో ఫలితము కనబడనప్పుడు నిరాశ ఆవహించినా, 

"ఉత్సాహమే సంపదకు మూలమని" జ్ఞప్తికి తెచ్చుకొని, 

    ప్రార్థన చేసి, సీతాదర్శనాన్ని పొందగలిగాడు. .


ఉ) సంభాషణ ప్రణాళిక:  

    సీతాదేవితో మాట్లాడడానికి వివిధ విశ్లేషణలు చేసి, 

    ఆమెకు రామకథాగానం, అదీ కోసల భాషలో వినిపించి,  పనులు చక్కబెట్టాడు.

    

ఊ) రాక్షసులను రప్పించి దాడి: 

    అశోకవనం ధ్వంసంచేసి, పర్యవసానంగా, 

    రావణుడిచేత పంపబడ్డ కింకరులు, జంబుమాలి మొదలగు రాక్షసులతో తలపడి సంహరించాడు. 


ఋ) జయఘోష, హెచ్చరిక: 

    కింకరులు వచ్చినపుడు జయఘోష చేశాడు. అనంతరం వారిని సంహరించాడు.  

   "ఇక్ష్వాకు వంశీయులతో వైరం వల్ల లంకగానీ, లంకలోనివారుగానీ, రావణుడుగానీ ఉండబోరు" అని 

లంకలో అందరికీ హెచ్చరిక చేశాడు. 


ఋూ) సహనం - కార్యాలోచన:

    ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి 

  - చేష్టలుడిగినా తేరుకునీ, 

  - అస్త్రం విడిపోయినా బంధింపబడీ, 

    హింసని సహించాడు. 

    తద్వారా రావణ సభకు చేరుకోగలిగాడు. 

        

ఌ) ఉపదేశం: 

         రావణునికి ధైర్యంగా వాస్తవం తెలుపుతూ, సరియైన సలహా ఇచ్చాడు. 


ౡ) వచ్చిన అవకాశం - మెఱుపుదాడి: 

        (Surgical Strike) 


    తోకకు నిప్పంటిస్తే, వివిధ కోణాలలో ఆలోచించి, 

    త్రిజట కలలో చెప్పిన "వానరుడు లంకను తగులబెడుతున్న" విషయం జ్ఞప్తికి వచ్చిందేమో అన్నట్లు, 

    లంకా దహనం కావించాడు. 

           

ఎ) సమయపాలన: 

         సీతాదేవి విశ్రమించివెళ్ళమని అన్నా, వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. 


ఏ) నివేదిక: 

    తిరిగి వచ్చిన హనుమ వానరులతో "చూచాను సీతను" అంటూ, సుదీర్ఘంగా విషయాలు తెలిపాడు. 

    శ్రీరామునితో మాత్రం, తన గొప్ప చెప్పుకోక, తెలుపవలసిన ముఖ్యవిషయాలు  తెలియజేశాడు. 


కార్యాచరణ 


        హనుమంతుడు 

  - ఎప్పుడెప్పుడు 

  - ఎక్కడెక్కడ 

  - ఎవరెవరితో 

  - ఏఏవిధంగా ప్రవర్తించాలో, 

    పూర్తిగా క్షణాలలోనే సరియైన నిర్ణయం తీసుకుని, 

    కార్యాచరణ చేయగలిగిన అత్యంత సమర్థుడైన కార్య నిర్వాహకుడు. 

        

    మనం ఆయన్ని స్మరిస్తేచాలు. అవన్నీ మనకీ లభింపజేస్తాడు. 


బుద్ధిర్బలం యశోధైర్యం 

నిర్భయత్వం అరోగతా I 

అజాడ్యం వాక్పటుత్వంచ 

హనుమత్స్మరణాభవేత్ ॥ 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

కామెంట్‌లు లేవు: