🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 63*
మురాదేవి దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ "అవున్నాయనా ... ఇంతకాలానికి మన మొర ఆలకించగల మహానుభావుడు లభించాడన్న బాధతో నా దుఃఖాన్ని, కష్టాన్ని వారికి చెప్పుకునే ప్రయత్నంలో నా కంట కన్నీరు చిందింది. ఆనాడు నా ప్రాణాలకి తెగించి మీ తండ్రిగారి ఆన పాటించి, రహస్యమార్గం ద్వారా నిన్ను పిప్పలవనానికి చేర్చిందీ, వృషలుడనే మారుపేరు పెట్టి నిన్ను ఇంత వాడిని చేసిందీ, నీ వ్యర్ధావేశానికి నిన్ను బలిచెయ్యడానికి కాదు" అంటూ పమిట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. చంద్రుడు ఆవేశాన్ని వుగ్గడించుకుని గుడ్లప్పగించి తల్లిని చూసాడు.
"నాయనా, చంద్రా ! ఏ జన్మ పుణ్యఫలమో గానీ, ఘటనా ఘటన సమర్థులైన ఆర్య చాణక్యుల వారి సాహచర్యం, కృపాకటాక్షం నీకు లభించింది. ఇహనించీ నీకు తల్లీ, తండ్రీ, గురువూ, దైవం సర్వమూ చాణక్యుల వారే .... వారేం చెబితే అది చెయ్యి. వారెట్లా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకో.... మీ తండ్రి మహానందుల వారి అంతిమ కోరిక 'వారి రక్తమే' మగధ సింహాసనాన్ని అధిష్టించడం... దాన్ని నెరవేర్చే వరకూ దేనికీ చలించకు. జీవితాంతం వరకూ చాణుక్యుల వారి ఆశ్రయాన్ని వదలకు...." అని కుమారునికి హితబోధ చేసింది మురాదేవి.
చంద్రుడు తల్లి ముందు మోకరిల్లి ఆమె పాదాలను తాకి "మీ ఆజ్ఞను శిరసా వహిస్తానమ్మా" అని ప్రమాణం చేశాడు.
మురాదేవి కుమారుని లేవదీసి, అతడిని చాణక్యుడు ముందుకు తీసుకువెళ్లి "స్వామీ ! చంద్రుడు ఇంతవరకు మురా... మహానందుల వారి పుత్రుడు. ఈ క్షణం నుంచే మీ బిడ్డడు. స్వీకరించండి..." అంటూ చంద్రుని చేతిని చాణక్యుని చేతిలో పెట్టి అప్పగింత చేసింది.
అప్రతిహత ప్రతిభా సంపన్నుడైన చాణక్యుని నిష్టూర నేత్రాలు ఆ సంఘటనకు చిప్పిల్లి చెమ్మగిల్లాయి. అతడి విశాల నయనాల నిండుగా ఆనందాశ్రువులు గిర్రున సుడులు తిరుగుతుండ, భావావేశంతో అతని కంఠం గాద్గదికమైంది.
"అమ్మా ! అపూర్వమూ, అనిర్వచినీయమైన అద్భుత సంఘటన ఈ చాణక్యుని జీవితంలో చోటు చేసుకుంటుందని సృష్టికర్త అయిన ఆ పరమాత్మ కూడా ఊహించి ఉండడు. చంద్రుని కంటే ఐదారు సంవత్సరాలు పెద్దవాడినైన నాకు... ధర్మపత్ని వలన రేపో మాపో పితృస్థానం లభించనున్న నాకు... భగవంతుడు ప్రసాదించిన వరంలా... నీ దయవల్ల తండ్రినయిన భాగ్యం లభించింది. సోదరులలో జ్యేష్ఠుడు 'కనిష్ఠులకు' తండ్రితో సమానం... నిన్ను 'అమ్మా' అని పిలిచి, వయస్సు చేత నీకు జ్యేష్టుడినయ్యాను. ఆ విధంగానూ నేను చంద్రునికి తండ్రినయ్యాను. ఆ అధికారంతో... ఆ అభిమానంతో నా గాయత్రి సాక్షిగా నీకు మాటిస్తున్నాను... ఇకనుంచీ చంద్రుడు నా బిడ్డడు. నా అభిమాన పుత్రుడు. 'మురా - చంద్రగుప్తుల' ప్రతీకగా భాసిల్లే 'మౌర్య రాజ్యస్థాపనే' ఇక నా ధ్యేయం. మౌర్య సామ్రాజ్య సుస్థిరతయే ఏ నా జీవిత లక్ష్యం....."
చాణక్యుని ప్రమాణ వచనంతో మురా చంద్రగుప్తుల హృదయాలు ప్రశాంతత నందాయి. మురాదేవి ఆనందాశ్రువులను తుడుచుకుంటూ...
"చాలు నాయనా .... ! నీ చల్లని మాటతో ఇన్నేళ్ల నా పరితాపం ఒక్కసారిగా శాంతించింది. నీ వంటి మేరునగధీరుని అభిమాన పుత్రునిగా బడసి నేనూ ధన్యురాలినయ్యాను. ఈ క్షణం నుంచీ నాకూ నీ ఆదేశమే శిరోధార్యం. చెప్పు తండ్రీ... ఏమిటి నీ ఆజ్ఞ ?" అని అడిగింది సంతృప్త హృదయంతో.
చాణక్యుడు చిరునవ్వు నవ్వి "ఆజ్ఞ కాదమ్మా, అభ్యర్థన .... ఈ రాత్రి పాటలీపుత్రం ఉత్తర దిక్కునున్న కుసుమపుర ఉద్యానవనంలో మహానందుల వారి అభిమానులైన కొందరు ప్రముఖ రాజోద్యోగుల సమావేశం ఏర్పాటు చెయ్యబడింది. ఆ సమావేశానికి ప్రధాన అతిధి మహారాణి మురాదేవి...." అన్నాడు సాలోచనగా.
"నాయనా .... !" విస్తుపోయింది మురాదేవి.
చాణక్యుడు తలపంకిస్తూ "ఆ రహస్య సమావేశంలో మహారాణి మురాదేవి నందులవల్ల తమకు జరిగిన అన్యాయాన్ని, ద్రోహాన్ని ఆ రాజభక్తులకు హృదయవిదారకంగా వివరిస్తారు... మురాదేవి దుఃఖంతో తల్లడిల్లి, నందులపై కృద్దులైన రాజోద్యోగులు చంద్రగుప్త దిగ్విజయానికి తమ వంతు సాయం చేస్తామని ఆవేశంతో ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞా సారాంశంతో కూడిన లేఖపై ఆ రాజభక్తులచేత చేవ్రాలు చేయిస్తారు మురాదేవి. అది చేతికి రాగానే... రేపు ఉదయమే కార్యసాధనకు మా ప్రయాణం..." అని చెప్పి, సిద్ధంగా ఉంచుకున్న ఒక లేఖను మురాదేవి చేతుల్లో పెట్టి "ఇదే మీరు సంతకాలు చేయించవలసిన లేఖ.... రాత్రి తొలిఝాము దాటాక చాణక్య శిష్యులు వచ్చి తమరిని సురక్షితంగా కుసుమపురానికి తీసుకువెళ్లి, కార్యం ముగిసిన తదుపరి తిరిగి ఇక్కడికి చేరుస్తారు" అని చెప్పాడు గంభీరంగా.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి