స్వానుభవాలు
పరమాచార్య స్వామివారిని నేను 18-3-1978న మొదటిసారి దర్శించుకున్నాను. అది పరమ పవిత్రమైన శుభదినం. ఆరోజు మహాస్వామి వారు నన్ను వారి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసిన రోజు.
వలాజలో ఉపాధ్యాయుడైన మా నాన్నగారు టి.ఆర్. సుందరమూర్తి గారు పరమాచార్య స్వామివారి గొప్పతనం గూర్చి ఎన్నోమార్లు నాకు చెప్పారు. వారితో పాటు నేను కూడా చాలాసార్లు మహాస్వామి వారిని దర్శించుకున్నాను. ఎటువంటి భక్తీ పారవశ్యము లేని కేవల దర్శనాలు అవి.
కాని మార్చి పద్దెనిమిదిన చేసుకున్న దర్శనం నన్ను స్వామివారి వైపుకి తిప్పింది. కైలాసనాథునికి సేవ చేసే శివగణాలలాగా పరమాచార్య స్వామివారి సేవ చేసుకునే గణాలలో నన్నూ చేర్చుకున్నారు.
అప్పుడు మహాస్వామి వారు శివాస్థానంలో ఉండేవారు. వారు నాకు అప్పగించిన పని ఏమిటో తెలుసా?
నీటి పని, అక్కడున్న బావిలో నుండి నీరు చేదడం, శ్రీమఠం ఆవులు దూడలకు మామిడి చెట్లకు పాదులకు నీరు పెట్టడం. దానితోపాటుగా పానకం తయారుచెయ్యడం - అక్కడకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి.
అప్పట్లో నాకు శ్రీమఠం ఆచార అనుష్టానాలు, సంప్రదాయాలు గురించి ఏమీ తెలియదు. మెట్టూర్ రాజగోపాల మామ(తరువాత మెట్టూర్ స్వామివారు), బాలు మామ వాటిలో నాకు తర్ఫీదుని ఇచ్చేవారు.
మహాస్వామి వారు శివాస్థానం బ్రహ్మపురీశ్వర ఆలయం ప్రదక్షిణం చేసేటప్పుడు అక్కడున్న ప్రతి చెట్టునీ, మొక్కని, ఆవులని, దూడలని ఎంతో ప్రేమతో చూసేవారు స్వామివారు. (తరువాత నాకు అర్థం అయ్యింది, పరమాచార్య స్వామివారి దీర్ఘదృష్టి సోకడానికి ఆ చెట్లు, పశువులు ఎంత పుణ్యం చేసుకున్నాయో).
అప్పుడు స్వామివారే స్వయంగా “ఈరోజు నువ్వు ఏం చేశావు?” అని అడిగేవారు. నా సమాధానానికి స్వామివారి వివరణ ఎన్నో ఉపదేశాల సారం. నేను ఏదైనా పొరపాటు చేస్తే, ఎంతో సున్నితంగా నన్ను బాధించకుండా తెలిపేవారు.
ప్రతి రోజూ తెల్లవారుఝామున మూడు గంటలప్పుడు శివాస్థానం నుండి మొదలుపెట్టి, శ్రీ వరదరాజ స్వామి ఆలయం నాలుగు మాడ వీధుల గుండా ప్రదక్షిణం చేసేవారు. మేమందరమూ చిన్న గొంతుతో విష్ణు సహస్రం పారాయణ చేస్తూ స్వామివారిని అనుసరించేవారం.
1978 ఏప్రిల్ 6
మామూలుగా తెల్లవారు మూడుగంటలకు మొదలుపెట్టి, కామాక్షి అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకుని, శ్రీమఠంలో ఉన్న సురేశ్వరాచార్యుల దర్శనం చేసుకుని పరమాచార్య స్వామివారు కీళంబి అనే గ్రామానికి పాదయాత్రను మొదలుపెట్టారు.
కాంచీపుర వాసులు పెద్ద ఎత్తున వచ్చి, అశ్రునయనాలతో చాలాదూరం పాదయాత్రకు వెళ్లరాదని ప్రార్థించారు. అప్పుడు మహాస్వామివారు కాష్టమౌనంలో ఉన్నారు. ఎటువంటి సంకేతములు చూపకుండా పాదయాత్ర కొనసాగించారు.
చిత్తూరు జిల్లా చిన్న తిప్ప సముద్రం నుండి అనంతపురం వైపు వెళ్తూ కదిరి అనే ఊరిలో మకాం చేశాము. ఈ గ్రామంలో పురాణ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది.
అనంతపురం నుండి మొదలుపెట్టి, సంగమేశ్వరం(అనంతపురం జిల్లా) చేరుకొని, అక్కడి నుండి బయలుదేరి తమ్మాపురం అనే ఊరిలో ఉన్న ఒక శిథిల మండపంలో బస చేశాము.
జూన్ 27, 1978 నా జేవితంలో మరచిపోలేని రోజు. అ శుభ దినాన, నేను మహాపెరియవా, పుదు పెరియవా ఇద్దరినీ జంటగా దర్శనం చేసుకున్నాను.
అది ఒక పాడుబడ్డ మండపం, అక్కడ ఎంతో వైభవంగా మూడు కాలాలపాటు చంద్రమౌళీశ్వర ఆరాధన జరిగింది.
తమ్మాపురం నుండి తాడిపత్రి అన్న ఊరి మీదుగా గుత్తి అనే ఊరు చేరుకున్నాము. ఆక్కడ పరమాచార్య స్వామివారికి పెద్ద ఉత్సవం చేశారు. సిబ్బంది మరియు పురప్రజలు మా మకాం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
తరువాత అక్కడి నుండి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాపురం చేరుకున్నాము. ఆరోజు అల్ప ద్వాదశి (13-7-78); అంటే ఆరోజు ఉదయం పదిగంటల వరకే ద్వాదశి ఉంది. కనుక పదిగంటల లోపే మా పారణను ముగించి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మంచర్ల గ్రామానికి బయలుదేరాము. దారిలో ఎక్కడా ఆగకుండా నిదానంగా నడుస్తున్నాము. చీకటి పడింది. దాంతో పాటు భోరున వర్షం! ఉరుములు మెరుపులతో!
ముందున్న దారి అస్సలు కనబడడం లేదు. ఎత్తు పల్లాలు ఏవీ కనబడకపోవడంతో కాళ్ళు తడబడుతున్నాయి. దగ్గర్లో ఒక మంచి భవనం కనబడింది. ‘అక్కడ ఉందాము’ అని మహాస్వామి వారు అంటారేమో అని ఆత్రుతతో నడుస్తున్నాము.
“విష్ణు సహస్రనామం చెబుతూ నడవండి” అని స్వామివారి ఆజ్ఞ అయ్యింది. అంటే దాని అర్థం మనం ఎక్కడా ఆగడంలేదు అని.
అప్పుడు నేను, పనాంపట్టు కణ్ణన్ సైకిల్ రిక్షాను లాగుతూ ముందర వెళ్తున్నాము. వెనకాల సైకిల్ రిక్షాను తోస్తూ శ్రీకంఠన్ మామ, బాలు మామ స్వామివారితో కలిసి వస్తున్నారు. రిక్షాకు కుడివైపున వెనుకగా మెట్టూర్ రాజగోపాల మామ వస్తున్నారు. ఒక ఎలక్ట్రిక్ టార్చిలైటుతో మాకు దారి చూపిస్తూ, శ్రీ చంద్రమౌళి (చీను మామ కొడుకు) మమల్ని ముందుకు నడిపిస్తున్నాడు.
తిమ్మంచర్ల చేరుకునేటప్పటికి రాత్రి పదకొండున్నర అయ్యింది. మరుసటి రోజు మరొక పెద్ద ఊరు గుంతకల్లు చేరుకున్నాము.
శ్రీమఠం మకాం గుంతకల్లులో. మరుసటి రోజు ఒక పని మీద నేను గుత్తికి వెళ్ళాల్సివచ్చింది. మేము వచ్చిన దారిని గమనిస్తూ వెళ్లాను. అది పక్కా అడవి దారి అని నాకు అప్పుడు తెలిసింది.
యాత్ర ముందుకు సాగింది. హగరి అనే ప్రాంతంలో పాణ్యం సీమెంట్ వారి పెద్ద భవనంలో మకాం చేశాము. అక్కడే పరమాచార్య స్వామివారు చాతుర్మాస్య వ్రతాన్ని మొదలుపెట్టారు. కనుక మరొక రెండు నెలల పాటు ఎక్కడికీ వెళ్ళడానికి వీలులేదు.
డన్ లాప్ కృష్ణన్ మామ, మా నాన్నతో పాటు నన్ను హంపికి వెళ్లి, చూసిరమ్మని ఆదేశించారు స్వామివారు. మేము హగరికి తిరిగొచ్చేటప్పుడు హోస్పేట నుండి హంపి జీర్ణోద్ధరణ సంస్థకు చెందినా ఇద్దరు ప్రముఖుల్ని పిలుచుకుని రమ్మన్నారు. వారు చాలా సంతోషంగా మాతోపాటు వచ్చారు.
వారితో స్వామివారు కీళంబి మరియు హంపి గురించి ఎంతగానో మాట్లాడారు. కీళంబి శాసనాలలో ఉన్న వైరుధ్యాన్ని వారికి వివరించారు. “హంపి జీర్ణోద్ధరణకు మీరు చేసుకున్న ప్రణాలికలు ఏమిటి?” అని వారిని అడిగారు.
సంభాషణ చాలాసేపు సాగింది. స్వామివారికి భిక్షా సమయం అవ్వడంతో లేచి లోపలకు వెళ్ళారు. భిక్ష ముగించుకుని తిరిగిరాగా హోస్పేట నుండి వచ్చిన వారిరువురు కనబడలేదు. “కొద్దిదూరం బయటకు వెళ్లి చూసి వారు కనబడితే వెంట తీసుకునిరా” అని సేవకుడికి చెప్పారు.
స్వామివారి నుండి సెలవు తీసుకోకుండా వారు వెళ్ళిపోవడం మాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. వారిని వెతకడం కోసం వెళ్ళిన వ్యక్తి తిరిగొచ్చి వారు కనబడలేదని చెప్పాడు.
ఆ హోస్పేట మిత్రులు బళ్ళారి దాటుతుండగా, వారి కారుకు ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు పెద్ద గాయాలతో తప్పించుకున్నారు అని వార్తా తెలిసింది. బహుశా స్వామివారు ఆ ప్రమాదం నుండి వారిని కాపాడాలి అనుకున్నారా? కాని వారి ప్రారబ్ధం చాలా గట్టిగా ఉంది.
1978 జులై 28
మా నలుగురికి - నాకు, డన్ లాప్ కృష్ణన్, డా. సుబ్రహ్మణియన్, చేనేత దుకాణం వెంకట్రామయ్యర్ కి పరమాచార్య స్వామివారు ఒక ఆదేశం ఇచ్చారు. “ప్రతి రోజూ తేవారం పారాయణ చెయ్యండి”
దానిపై వివరణలు మొదలయ్యాయి. పరమాచార్య స్వామివారు అంబలవాణ దేశికర్ (తిరువాడుతురై శైవ ఆధీనం పీఠాధిపతి మరియు నమచ్చివాయ పండారత్తార్) గురించి మాట్లాడారు. అంబలవాణ దేశికర్ చివరి రోజుల్లో మఠం పరిపాలన నుండి వైదొలగి వేరొక ప్రాంతంలో సమాధి చెందారు. మహాస్వామి వారు ఇంతటి చారిత్రిక విషయాలను ఎలా తెలుసుకుని వాటిని గుర్తు పెట్టుకుంటారో అని మాకందరికీ ఆశ్చర్యం కలిగింది.
1978 ఆగస్ట్ 2
పరమాచార్య స్వామివారు కాంచీపురం మరియు కుంభకోణం స్థలాల గొప్పదనాన్ని ఎంతగానో వివరించారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన వీధులు, మధ్యలో ఖాళీ లేకుండా కట్టిన గృహాలు కేవలం కాన్చేపురంలోనే కనబడతాయి. అలాగే, కుంభకోణం మరియు పరిసర ప్రాంతాలు చాలా ఎక్కువ సంఖ్యలో దేవాలయాలు ఉన్న ప్రాంతంగా మాకు తెలిపారు.
“తంజై (తంజావూరు) జిల్లాలో అసలు కొండలు లేవు. కాని ఆ ప్రదేశంలోనే మనకు రాళ్ళతో కట్టిన ఎక్కువ దేవాలయాలు కనబడతాయి. దీనికి కారణం కేవలం ఈశ్వర భక్తే. 274 పాడాల్ పెట్రా స్థలాల(అప్పర్, సుందరర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ పాడిన పవిత్ర స్థలాలు) లో 200 స్థలాలు తంజావూరు జిల్లా(ఇప్పటి తంజై, నాగపట్టినం, తిరువారూరు జిల్లాలు) లోనే ఉన్నాయి. కుడంధై (కుంభకోణం) లోని నాగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న శాసనాలలో శాస్త్రాలు అధ్యయనం చెయ్యడానికి మాన్యాలు ఇచ్చిన విషయం ఉంది”.
“చోళ రాజులు కావేరీ వరదలప్పుడు తెప్పలు నిర్మించి, కొల్లిమలై నుండి బండరాళ్ళను తెప్పించి దేవాలయలాను నిర్మించారు”.
“ఆండాన్ కోవిల్ అనే ఒక స్థలం ఉంది. ఆండాన్ అనే ఒక భక్తుడు అక్కడ నివసిస్తుండేవాడు అందుకనే ఆ పేరు. అక్కడ ఓడం పోక్కి అనే కాలువ పారుతుంది. తిరువారూరు దేవాలయాన్ని నిర్మిచడానికి ఓడంపోక్కి ద్వారా రాళ్లు తెచ్చినప్పుడు, ప్రతి సారి ఒక రాతిని తెచ్చి, శీర్కాలిలో దేవాలయాన్ని నిర్మించారు.ఇక్కడ చాలా శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలలో విషయం మొదట గ్రంథ లిపిలో, తరువాత తెలుగులో, తరువాత దేవనాగరి లిపిలో ఉంది”.
1978 ఆగస్ట్ 6
మేము అప్పర్ తేవారం చదువుతున్నాము. అప్పుడు పరమాచార్య స్వామివారు మాకు ఇలా చెప్పారు.
“స్వామి శివునికి ప్రాణనాథర్ అన్న పేరు ఉంది. తిరుమంగలక్కుడి దేవాలయంలో ప్రాణేశ్వరుడు. అక్కడి స్థల పురాణం ప్రకారం, అగస్త్య ముని ప్రాణాయామం చేస్తూ, నది నుండి నీరు తెచ్చి, రెండు చేతులతో ప్రాణేశ్వరునికి అభిషేకం చేసాడు. ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కేవలం ముక్కుని ముట్టుకుని మంత్రం చెప్పడం కాదు. గాయత్రీ జపం చేసేటప్పుడు ఊపిరి నియంత్రించి చెయ్యాలి.
చంద్రకం అంటే నెమలి తోక. కలశ చంద్రక నీలకంఠ విస్ఫూరితం కాళికా అన్న యొక వాక్యం ఉంది.
ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టినప్పుడు, నెమళ్ళు తమ పురి విప్పి ఆనందంతో నాట్యం చేస్తాయి. వరుసగా ఎగురుతున్న కొంగల గుంపు పూలదండలా కనిపిస్తుంది. పరమేశ్వరుని నాట్యం కూడా అటువంటిదే. నీలకంఠ అనే మేఘం, అస్థిమాల తెల్లని కొంగలులా స్వామివారి విస్ఫూరిత నటనం పురి విప్పిన నెమలి నాట్యంలా! ఎంతటి అద్న్హుతమైన ఉపమానం!!
తిరువీళైమలై శివునికి కురుంబర్ అనే ఒక వ్యక్తి వెలగపండును ఇచ్చాడు.
ఇక్కడున్న స్వామి కత్యాయనిని వివాహం చేసుకుని ఒక ముదుసలి వానిలా పెళ్లి ఊరెరిగింపు వెళ్ళాడు. అందరికీ దర్శనం ఇచ్చిన తరువాత దంపతీ సమేతంగా అదృశ్యమయ్యాడు. తరువాతా కాత్యాయన మహర్షికి అయిదువందల మంది ఋషులతో కలిసి దర్శనం ఇచ్చాడు. ఇక్కడి స్వామికి మాప్పిళ్లై స్వామి (పెళ్ళికొడుకు స్వామి) అన్న మారుపేరు కూడా ఉంది.
అమ్మవారి సన్నిధి వీధిలో శుక్ల యజుర్వేదం నేర్చుకున్న కాత్యాయన సూత్రకారులు ఉండేవారు. ఇక్కడ అయిదువందల మంది మగవారికి విళియాన్ అన్న ఒక్కటే పేరు. అయిదువందల ఒకటో వాడికి మాత్రమే స్వామివారి పేరు పెట్టేవారు.
వైశాఖ పూర్ణిమ రోజు దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. అయిదువందల మంది ఉంటే మాత్రమే ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
చోళ నాడు దేశంలో అయిదు అద్భుతాలు ఉన్నాయి. 1. ఆవుడయైర్ కోయిల్ కొడుంగై - పలుచని రాతి వంకర పైకప్పు, 2. తిరువలంచులి పలకణి - అల్లిన గ్రానైటు కిటికీ, 3. మండపాచ్ చెంకల్ - ఇటుక భవనము, తిరువీలైమలై లో 4. మధిల్ - ప్రహరీ గోడ, కిడారాన్ కొండాన్ లో 5. విష్ణుపురం దేవాలయం ఉత్సవ విగ్రహం కాళ్ళపై కన్ను, వెలగపండు చిత్రాలు
ఒకసారి కరువు కాలంలో, అప్పర్ సంబంధర్ భక్తులను పోషించడానికి కావాల్సిన ధనం కోసం శ్లోకాలు పాడారు. తిరువీలైమలై దేవాలయ బలిపీఠంపై రెండు బంగారు నాణాలను ఉంచి శివుడు అనుగ్రహించాడు. అప్పర్ కు లోపం లేని పూర్తీ నాణెం దొరకగా, సంబంధర్ కు లోపమున్న నాణెం దొరికింది.”
మేము పెరియ పురాణం పారాయణం చేస్తున్నప్పుడు స్వామివారు కంబర్ మరియు అంబికాపతి గురించి చెప్పారు.
“తిరువొట్రియూర్ మఠంలో పనిచేసే ఆమెకు కంబర్ పుట్టాడు.
అంబికై చెట్టి అనే ఒకామె కీళంబిలో ఒక శివలింగాన్ని పూజించేది. ఆ లింగానికి అంబికాపతీశ్వరుడు అని పేరు. అదే పేరును కంబర్ తన కుమారునికి పెట్టాడు. కంబర్ భార్య కూడా తిరువొట్రియూర్ కు చెందినావిడే.
పురాతన కాలంలో కళింగ్గ మానగరం అన్న ఊరే ఇప్పుడు టక్కోలం అని పిలవబడుతోంది.
తొండైమండలం అన్నది ఒక సత్య స్వరూపంగా ఉన్న దేశం. ఈ విషయం అశోకుని కాలం నాటి రాతి శాసనాలలో ఉంది.”
ఇలా మహాస్వామి వారు మాకు అప్పుడప్పుడు ఎన్నో విలువైన విషయాలను తెలిపేవారు.
1978 సెప్టెంబర్ 21
పరమాచార్య స్వామివారు ఒక కారు షెడ్డులో మకాం చేస్తున్నారు. అప్పటి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, వారితో పాటు శ్రీ పి. రామచంద్రన్, వాజ్ పేయ్, దేవరాజ్ అర్స్ వచ్చి ఆ కారుషెడ్డులో మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
యాత్ర ముందుకు సాగింది. సండూర్ అనే ఒక పాత సంస్థానం చేరుకున్నాము. రాజ పరంపరలో ఇప్పటివాడైన శ్రీ గోర్ఫడే, యువరాజు ఇద్దరూ పరమాచార్య స్వామివారికి వైభవంగా స్వాగతం పలికారు.
అక్కడ పదిహేను రోజుల పాటు మకాం. శ్రీ శంకర జయంతిని విశేషంగా ఆచరించాము.
సండూరులో రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కడ చేసుకున్నారు అని.
రాజా గోర్ఫడే వారు నిర్వహిస్తున్న గోశాలలోని జమ్మి చెట్టు కింద కూర్చుని దర్శనం ఇస్తున్నారు మహాస్వామి. స్వామివారి సరళత్వాన్ని, సమానత్వాన్ని చూసి రాష్ట్రపతి ఆశ్చర్యపోయారు. రాష్టపతి పర్యటనలో ఉండే హంగు ఆర్భాటం లేకుండా సాధారణంగా జరిగిన సమావేశం అది.
పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోట, స్వామివారి స్మృతిగా గోర్ఫడే రాజు మణిమండపం తరహాలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. గోర్ఫడే గురుభక్తికి ఎల్లలు లేవు.
చిత్తూరు నుండి మదనపల్లి వెళ్ళేదారిలో ఒక కుగ్రామం. ఆరోజు రాత్రికి మేము ఒక శివాలయంలో మకాం చేశాము. అది రాత్రి కావడంతో, నడక శ్రమ చేత పరమాచార్య స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధారణంగా ఉదయం పూట యాత్ర కొనసాగించడం ఆనవాయితీ కనుక మేమందరమూ సిద్ధంగా ఉన్నాము. “సాయంకాలం బయలుదేరుదాము” అని తెలిపారు స్వామివారు.
సూర్యోదయం అయిన తరువాత పరమాచార్య స్వామివారు దేవాలయం నుండి బయటకు వచ్చారు దర్శనం ఇవ్వడానికి. చుట్టుపక్కల నుండి వచ్చిన ఒక యాభై అరవై మంది స్వామివారిని చూడగానే దూరం నుండి సాష్టాంగం చేసి నిలుచున్నారు.
మాకు అందరికి ఆశ్చర్యం. ఆ గ్రామ ప్రజలు రాత్రే వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయమే స్వామివారు యాత్ర కొనసాగిస్తే, వారికి దర్శనం దొరకదని రాత్రే వచ్చి దర్శించుకున్నారు. మరి వీరు రాత్రే వచ్చి ఎందుకు దర్శించుకోలేదు?
మేము వారి వద్దకు వెళ్లి, “దగ్గరకు వచ్చి దర్శించుకోండి” అని పిలిచాము. అందుకు వారు అంగీకరించలేదు. “మేము దేవాలయం దగ్గరకు రాకూడదు. మేము సామి కోసం రాత్రి నుండి వేచి కాచుకున్నాము. ఇప్పుడే సామి బయటకు వచ్చారు” అని చెప్పారు.
మేము స్వామివారికి విషయం చెప్పడానికి వెళ్ళాము. “రాత్రి దర్శించుకున్న వాళ్ళు సమర్పించిన మామిడి పళ్ళు చాలా ఉన్నాయి. వాటిని ఒక సంచిలో వేసుకుని వీరికి ఇవ్వండి. రాత్రి నుండి ఏమీ తినలేదు కదా తిననివ్వండి” అన్నారు స్వామివారు.
మేము పళ్ళు ఇవ్వగానే, సంతోషంతో వాటిని స్వీకరించి తిన్నారు. “రాత్రి మీరు ఏమీ తినలేదా?” అని అడిగాము. “లేదు. మేము సామిని చూడడానికి వచ్చాము. సామి లోపల ఉన్నారు. తప్పక బయటకు వస్తారు కదా అని మేము ఇక్కడే ఉండిపోయాము”
వారు ఉపవాసం ఉన్నారని స్వామివారికి ఎలా తెలుసు? అదే బ్రహ్మ గ్రంథి.
--- ఇందువాసన్, వలాజపెట్టై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 3
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి