మిత్రులకు శుభోదయం🙏
విశ్వనాధనిర్లిప్తత!
*శ్రీ విశ్వనాథలోని "నేను"*
*శ్రీ పేరాల భరతశర్మ*
ఆయన రాబడి మొదటి నుంచీ జాగ్రత్తపడితే కొన్ని లక్షలు మిగలవలసిందట. క్లాసులో ఎవడో ప్రక్కవాడితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే ఒకనాడు “ఒరేయ్! ఏమిటీ
దవడలాడిస్తున్నావ్. ఇంకోసారి మాట వినిపిస్తే ఆ దవడలు నీవి కావు” అని “చదువుకోండోయ్ ఉద్యోగాలు రావద్దా ఊళ్ళేలవద్దా. నేనూ మొన్నటిదాకా ఒళ్ళూ పాయా
తెలియకుండా తిరిగినవాణ్ణి ఒక ఏడాదిక్రితం నాకొక ఆలోచన వచ్చింది. మన జీవితంలో మిగిల్చింది ఏమిటి? ఇంత మహాకవినీ ఇప్పుడు పోతే నా భార్యకు పిల్లలకు తిండి కూడా కష్టమైపోతుంది. ఆ స్థితి ఊహిస్తే నాకు జాగ్రత్త పడాలన్న జ్ఞానోదయమైంది.
అప్పటి నుంచీ కొంచెం వెనకవేస్తున్నాను. జీవితంలో నాకు ఆలస్యంగా మొదలైంది
మిమ్మల్ని చిన్నప్పుడే జాగ్రత్తపడమని కోప్పడుతా” అని చమత్కారంగా చెప్పారు.
ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏ మాత్రం గర్వం లేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియో స్టేషనుకు కార్లో
పోతున్నాము. అప్పుడు మాస్టారు -- "ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూ వున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో
ఏవో తెప్పిస్తేగాని తృప్తిగా వుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టం వస్తే వానికి ఏమి
మర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదు గదా!
ఆ వేళకు మా ఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడి నుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమృతాయ మానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీద కాపురానికి అటువంటి సృష్టి చేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికి
ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956లో మేడ కట్టాను. అప్పటి
వరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడిన
కష్టం వాన కురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటి
మీద యింత ఉడకేసి పెట్టాల్సి వచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి
మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుః
ఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలా వుంటుంది?
(అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు
తక్కువ కాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనే వుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలామంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్య లేదు. ఆమెకీ అనుభవం లేదు. ఇప్పుడింత మహాకవిని.
అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె. “ఈ మాటలాయన కళ్ళల్లో
చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!
“వట్టి నీరసబుద్ది నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి
.... ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను
నేలుకొనిన నా పట్టమహిషి"
“నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా
లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు”
అని చెప్పారు.
శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరు ఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకు కూడా సరిగా అదే వయసులో ఆ భార్యా వియోగమహాదుఃఖం
సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం
చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.
“నీవఖిలోహమార్గముల నిండిన జానకిపై రఘూద్వహుం
గా వెలయించి నావునను, గట్టిగ ముప్పదియాఱు వత్సరా
లీవల భూమి గర్భమున నెప్పుడు చొచ్చితివో మఱప్పుడే
నా వెలయింపు లూర్మిపృతనా రభసాతిక్రమణంబులన్ జెడెన్”
అన్నారు వరలక్ష్మీ త్రిశతిలో,
తనను భారతప్రభుత్వం "పద్మభూషణ” అన్న రోజున ఆయన ఏదో యాదృచ్ఛికంగా
మా యింటికి వచ్చి నాతో కూర్చున్నారు. “ఇదేమిటి! మాష్టారూ! జనమంతా మిమ్మల్ని అభినందించడానికి మీ యింటికి వస్తుంటే మీరిక్కడికి వచ్చి కూర్చున్నారేమిటి?” అన్నాను.
“ఏమిటి నాయనా! నాలో మార్పు? నిన్నటికంటె యివ్వాళ నాలో పెరిగిన గొప్పయేమిటి?”
అని ఆయన అంటుండగానే రేడియోవారి కారు ఆయన కోసం మా యింటి దగ్గరకు
వచ్చింది. అప్పుడాయన యింటికిపోయి రేడియో వారికి, పత్రికలవారికి సందేశాలిచ్చారు.
ఎందుకు చెప్తానంటే ఆయనకు మనుష్యులపై ప్రేమ, ఆదరము, ఆర్ద్రత యివి పట్టినంతగా
యీ గొప్పతనాల పైన తన అంతస్థును అధికంగా భావించుకునే తత్వమే లేదు.
అంతటి మహాకవే కదా! ఎంతటి అల్పకవి అయినా సరే తన దగ్గరకు వినయంగా
వస్తే ఎంతో ఆదరించేవారు. ఎందరో ఆయన దగ్గరకు వచ్చేవారు. వారు తనంత మేధావులు కారు. ప్రసిద్ధులు కారు. కవితారసికులు కూడా కాకపోవచ్చు. అతి సామాన్యులు కావచ్చు.
వారిని చులకన చేసే వారు కాదు. కొందరు అంతంతమాత్రపు కవిత్వం వ్రాసేవారు. పట్టరానంత గర్వంతో ఎదరవాడు తన కవిత్వాన్ని ఆస్వాదించగల సమర్థుడు కాడన్నట్లుగా
ప్రవర్తిస్తారు.
రసజ్ఙ భారతి సౌజన్యంతో-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి