28, మే 2023, ఆదివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 73*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 73*


తనింకా రాజు కూడా కాకుండానే తనకి సార్వభౌమోచిత లాంఛనాలతో స్వాగతం పలుకుతుంటే విస్తుబోయిన చంద్రుడు ఆశ్చర్యంగా చాణక్యుని వైపు చూశాడు. చాణక్యుడు మందహాసం చేసి 'అప్పుడే ఏమైంది... ముందు ముందు ఇంకెన్నో విచిత్రాలు చూస్తావు' అన్నట్లు తల తాటించాడు. 


స్వాగత సత్కార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత పురుషోత్తముడు ఏకాంతంగా చాణక్యునితో సమావేశమై వారి రాకకు కారణం అడిగాడు. 


చాణుక్యుడు సైనిక సహాయాన్ని అర్ధిస్తూ, "మగధలోని ముఖ్యమైన రాజ్యాధికారులంతా చంద్రునికి తమ మద్దతు ప్రకటిస్తూ ఒక లేఖపై సంతకాలు చేశారు. ఇదే ఆ లేఖ చూడండి" అంటూ మురాదేవి రహస్యసమావేశంలో ప్రముఖులతో సంతకాలు చేయించిన లేఖను చూపించాడు. 


"మౌర్య చంద్రగుప్తుడే మహానందుల వారి అసలైన వారసుడని మేము గుర్తించాము. చంద్రగుప్తుని అభిమతము తీర్చడం మాకు సర్వసమ్మతము" అని రాయబడ్డ ఆ లేఖలో మగధ మంత్రులు, సేనానులైన భద్రభటుడు, బలగుప్తుడు, పురుషదత్తుడు, సింహబలుడు, చంద్రభానుడు, బాగురాయణుడు, నక్రనాసుడు, వీరసేనుడు తదితరుల సంతకములున్నాయి. అంతమంది మద్దతు కూడగట్టుకున్న చంద్రుని విజయమూ, నందులకు నాశనమూ తప్పదని నిశ్చయించుకున్నాడు పురుషోత్తముడు. 


"కుమార చంద్రగుప్తునికి బాసటగా మా సైనిక సమూహాలన్నింటిని అందిస్తాం. అతడు మగధ సింహాసనాన్ని అధిష్టించడానికి మా వంతు సహాయం చేస్తాం ఆర్యా... అలాగే తమరూ మాకొక సహాయం చెయ్యాలి" అన్నాడు పురుషోత్తముడు. 


చాణక్యుడు తలపంకించి "సహాయం కాదు ఆజ్ఞాపించండి" అన్నాడు. 


పురుషోత్తముడు నొచ్చుకుంటూ "తమరు పెద్దలు. అంతమాటనకండి. మరేం లేదు. మా బావమరిది సింహపురాదీశుడు విజయవర్మ ఏకైక పుత్రిక శాంతవతి మా వద్దనే పెరుగుతున్నది. మాకు సంతానం లేనందున మా మేనకోడలిని మా కన్నబిడ్డగా చూసుకుంటున్నాం. యుక్త వయస్కురాలైన మా కన్యను కుమార చంద్రగుప్తునికి కన్యాదానం చేసి తమతో బాంధవ్యం కలుపుకోవాలని మా ఆశ ..." అన్నాడు. 


"శుభం..." అన్నాడు చాణక్యుడు చిరునవ్వుతో. 

'ఈ వివాహంతో చంద్రుడు రెండు బలమైన రాజ్యాలకు అధిపతి అవుతాడు. రెండు రాజ్యాలకి రాజైన వానికి సాటి రాజులు సంకొచించకుండా సహాయ సహాకారాలందిస్తారు. ఈ పరిస్థితిలో చంద్రునికి ఇంతకన్నా ఇంకేం కావాలి ?' 


చాణక్యుడు కొద్దిగా బింకాన్ని ప్రదర్శిస్తూ 

"మగధ సింహాసనాన్ని అధిష్టించిన అనంతరమే వివాహం చేసుకోవాలని ఆలోచనలో నున్నాడే... మా చంద్రుడు..." అన్నాడు. 


పురుషోత్తముడు ఆ సంబంధం ఎక్కడ జారిపోతుందోనన్న భయంతో "రాజ్యాభిషేకమే ముందు జరగాలని చంద్రుడు అభిలాషిస్తే... వివాహము, సింహపురి పట్టాభిషేకమూ ఒకే ముహూర్తానికి జరిపిస్తాం. కాదనకండి" అన్నాడు. 


చాణక్యుడు ఆశించిన వాగ్దానం రాగానే మందహాసం చేస్తూ "శుభస్యశీఘ్రం... ముహూర్తాలు పెట్టించండి. చంద్రుడిని ఒప్పించే బాధ్యత మాది. ఏమైనా తమరు చాలా అదృష్టవంతులు భావిసార్వభౌముని అల్లుడిని చేసేసుకుంటున్నారు" అనేశాడు. 


పురుషోత్తముడికి తానే సార్వభౌముడైనంత సంతోషం కలిగింది. అతడు కృతజ్ఞతతో ఆర్యునికి నమస్కరిస్తూ "అంతా తమ దయ..." అన్నాడు వినయంగా. 


ఇక్కడీ సంభాషణ జరుగుతుండగానే పురుషోత్తముని ఆజ్ఞననుసరించి అతని భార్య స్వర్ణమయి అతిథి సత్కారమను మిషతో మేనకోడలు శాంతవతి ద్వారా చంద్రునికి ఫలహార పానీయములు ఏర్పాటు చేయించింది. వధూవరులిరువులూ అప్రయత్నముగా ఒకరినొకరు చూసుకుని ఒకరిపై మరొకరు మక్కువ పెంచుకున్నారు. అది తెరచాటు నుంచి గమనించిన స్వర్ణమయి తమ గుండెల మీదనుంచి పెద్ద బరువు తీరిపోయినట్లు తృప్తిగా నిట్టూర్చింది.


కాబోయే అల్లుడు, రాజు అయిన చంద్రగుప్త చాణక్యులకు రాజభవనంలో అన్ని హంగులతో కూడిన వసతి భవనంలో విడదీ ఏర్పాటు చెయ్యబడింది. అక్కడికి చేరాక చాణక్యుడు తాను పురుషోత్తమునకిచ్చిన మాట గురించి చెప్పాడు. 


చంద్రుడు విస్తుబోతూ "ఈ పరిస్థితిలో మా వివాహమా ?" అన్నాడు. 


చాణక్యుడు నవ్వి "ఇల్లు చూసి 'ఇల్లాలిని' చూడమన్నారు నీకు ఆ రెండూ కలిసొచ్చాయి. నీకు శుభం జరుగుతుందనే మేము పురుషోత్తమునికి మాటిచ్చాం" అన్నాడు. 


చంద్రుడు అంజలి ఘటిస్తూ "ఆర్యుల ఆజ్ఞ మాకు శిరోధార్యం..." చెప్పాడు నిస్సంకోచంగా. 


సరిగ్గా అప్పుడే ఒక పావురం ఎగురుకుంటూ వచ్చి చాణక్యుని ముందు వ్రాలింది. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: