28, మే 2023, ఆదివారం

ఆచార్య సద్బోధన:*

 


              *ఆచార్య సద్బోధన:*

                  ➖➖➖✍️


*మెరుపు లేకుండా పిడుగు రాదు... విత్తనం లేకుండా వృక్షం రాదు...  నిప్పు లేకుండా పొగ రాదు...*


*కారణం లేకుండా ఎవ్వరూ కూడా మీ జీవితంలోకి ప్రవేశించ లేరు...*


*ఈ అనాది సృష్టి చక్రంలో కొందరు లెక్క వేయడానికి, మరికొందరు లెక్క తీర్చడానికి వస్తుంటారు...*


*ఒకరు బాధ పెడతారు. మరొకరు బోధ చేస్తారు. ఒకరు ఆనందింప చేస్తారు. మరొకరు అవమాన పరుస్తారు...*


*ముంచేవారైనా, మురిపించే వారైనా, గతంలో మీరు చేసిన కర్మల ఫలితాన్ని ఇవ్వడానికే వస్తారు...*


*పరమాత్ముడు వినిపిస్తున్న కర్మల రహస్యాన్ని వింటే మనసు తేలిక అవుతుంది...*


*మనుగడ సాధ్యమవుతుంది..*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀


           *ఒత్తిడికి దివ్యౌషధం*

                ➖➖➖✍️


*ఒత్తిడికి దివ్యౌషధం.. ఏంటో తెలుసా?*


            

*ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి జీవనం యాంత్రికం అయిపోయింది. ఈ యాంత్రిక జీవితంలో వయసు, పేద, ధనిక, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరిగిపోతోంది.*


*ఈ ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద పడుతోంది. ఈ దశలో ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవడం చాలా ముఖ్యం.*


*ఒత్తిడిని తగ్గించే చిట్కాలేమిటో తెలుసుకుని వాటిని ఆచరిస్తే సరిపోతుంది... ఆ చిట్కాలు మీకోసం..*

 

**ఒత్తిడిని తగ్గించడంలో దివ్య ఔషధంగా పని చేసేది నవ్వు.*


*ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వితే 80శాతం ఒత్తిడి మటుమాయమైపోతుంది.*


*అంతేకాదు, నవ్వడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్‌ అనే రసాయనాలు వెలువడతాయి.*

 

**పెద్ద పెద్ద శబ్దాలు వినడం వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అటువంటి శబ్దాలకు దూరంగా ఉండాలి.*

 

**ప్రకృతిలోని పక్షుల కిలకిలారావాలు, శ్రావ్యమైన సంగీతం వినడం, నీటి ప్రవాహం, సముద్ర కెరటాలను చూస్తూ ఉండటం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు.*

 

**మనస్సులో ఎటువంటి ఆలోచనలు రానీయకుండా అన్నీ పక్కనపెట్టి శ్వాసమీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం, వేకువజామునే వాకింగ్ చేయడం ద్వారా మానసిక దృఢత్వాన్ని పొందవచ్చు.*

 

**క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో లాభం చేకూరుతుంది, వ్యాయామం చేయడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు కృంగి పోకుండా వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన మానసిక స్థైర్యం వస్తుంది.*

 

**కండరాలు, శరీర అవయవాలు బిగదీసి ఉండకుండా ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఒత్తిడి లేకుండా మనసు ఆహ్లాదంగా మారుతుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀



*“అహో ఇమం పశ్యత మే వినాశం”*

                ➖➖➖✍️



పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతను ఋగ్వేదం లో పేర్కొనబడ్డాడు, దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది. 'సౌభరి సంహిత' అనే ఒక గ్రంధం కూడా ఉంది. కావున అతను సామాన్యమైన ముని కాడు.


సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు. ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూసాడు. ఆ దృశ్యం అతని మనస్సు ఇంద్రియములను చలింపచేసింది, మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది. తన ఆధ్యాత్మిక సాధన పరిత్యజించి, ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు.


ఆ కాలంలో అయోధ్యకు రాజు మాంధాత, అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు. అతనికి యాభై మంది, ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు. సౌభరి ముని      ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై మందిలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు.


మాంధాత రాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళన పడి ఇలా అనుకున్నాడు…  "ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు!" అని. 


ఆ రాజు కి, సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు, కాబట్టి ఇతని కోరికని నిరాకరిస్తే, ముని అతనిని శపించవచ్చు. కానీ, తను ఒప్పుకుంటే, తన కుమర్తెలలో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది. ఎటూతోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడ.., "ఓ పుణ్యపురుషా, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దయచేసి కూర్చోండి. నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను, వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది". రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో ఎవరూ కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు, కాబట్టి ఈ ప్రకారంగా, ముని శాపాన్ని తప్పించుకోవచ్చు.


సౌభరికి రాజు ఉద్దేశ్యం పూర్తిగా తెలుసు. తను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు. ఆ సాయంత్రం తన యోగ శక్తి ఉపయోగించి అందమైన యువకుడిగా మారిపోయాడు. పర్యవసానంగా, మరుసటి రోజు రాజ మందిరం వెళ్ళినప్పుడు , ఆ యాభై మందీ రాకుమార్తెలు కూడా అతన్నే భర్తగా కోరుకున్నారు. ఇచ్చిన మాటకు బద్దుడై ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది.


ఇప్పుడు, తన యాభై మంది కుమార్తెలు ఒకే భర్త ని పంచుకోవటంలో తమలో తాము తగవు పడతారేమోనని ఆ రాజు చింతించాడు. కానీ, సౌభరి మరల తన యోగ శక్తి ని ఉపయోగించాడు. రాజు భయాన్ని తొలగించటానికి అతను యాభై రూపములు స్వీకరించి, తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి, వారందరితో వేర్వేరుగా నివసించాడు. 


ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచి పోయినవి. సౌభరికి ప్రతి భార్య తో చాలా మంది బిడ్డలు కలిగారని, వారికి మళ్ళీ ఇంకా పిల్లలు కలిగి, చివరకి ఒక చిన్న పట్టణం తయారయిందని పురాణములలో చెప్పబడింది. 


ఒక రోజు ఆ ముని తన అసలు స్పృహకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు:


“అహో ఇమం పశ్యత మే వినాశం” (భాగవతం 9.6.50)


"ఓ మానవులారా! భౌతిక వస్తువుల ఆర్జన ద్వారా ఆనంద ప్రాప్తి కోసం ప్రయత్నించే వాళ్లాలారా, జాగ్రత్త. నా భ్రష్టత్వం చూడండి. నేనెక్కడ ఉండేవాడిని, ఇప్పుడేమైపోయానో. నేను యాభై శరీరాలు సృష్టించాను మరియు యాభై స్త్రీ లతో వేల సంవత్సరాలు గడిపాను. అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు, సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి. నా పతనం చూసి నేర్చుకొని, ఆ దిశలో వెళ్ళవద్దు."


భగవద్గీత, భాగవతము చదవండి, సులభమైన భక్తి యోగాన్ని ఆచరించండి ఆనందంగా ఉండండి.

కలియుగ ధర్మం హరినామ సంకీర్తన చేస్తూ తరించండి.

వైకుంఠలోకాలలో శాశ్వత ఆనంద జీవితం పొందండి.

సదా జపించండి…

హరే కృష్ణ హరే కృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే!

హరే రామ హరే రామ రామ రామ హరే హరే!!

సంతోషంగా ఉండండి!✍️


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏





         *మూడు బొమ్మల రహస్యం*

                  ➖➖➖✍️



*ఒక వ్యక్తి అన్నిచోట్లా తిరుగుతూ బొమ్మలు అమ్ముకునేవాడు. ఒక రోజు, అతను ఒక రాజ్యానికి చేరుకున్నాడు, అక్కడ రాజుకు కొత్తవి, ప్రత్యేకమైన బొమ్మలంటే చాలా ఇష్టం అని తెలుసుకున్నాడు.*


*రాజభవనంకు వెళ్లి, ఆస్థానంలో ఉన్న రాజు వద్దకు వెళ్లి, "మహానుభావా, మీరు ఇంతకు ముందెన్నడూ చూడని బొమ్మలను ఈ రోజు నేను మీకు చూపిస్తాను" అని చెప్పాడు.*


*రాజు అతని బొమ్మలను ఆస్థానంలో  ప్రదర్శించడానికి అనుమతించాడు.*


*బొమ్మలు అమ్మేవాడు తన పెట్టెలోంచి మూడు బొమ్మలు తీశాడు.*


*రాజుగారి ముందు వాటిని ప్రదర్శిస్తూ, "ఈ బొమ్మలు తమలో తాము చాలా ప్రత్యేకమైనవి. చూడడానికి ఒకేలా కనిపించినప్పటికీ, వాస్తవానికి అవి చాలా భిన్నంగా ఉంటాయి." అని చెప్పాడు.*


*బొమ్మలను ఒక్కొక్కటిగా చూపిస్తూ, "మొదటి బొమ్మ వెయ్యి బంగారు నాణేలు, రెండవది వంద బంగారు నాణేలు, మూడవది ఒక్క బంగారు నాణెం మాత్రమే" అన్నాడు.*


*రాజు ఆ మూడు బొమ్మలను చాలా జాగ్రత్తగా చూసాడు, కానీ వాటిలో ఏ తేడా కనిపించలేదు, మరి ధరలో అంత వ్యత్యాసం ఎందుకు ఉందని ఆశ్చర్యపోయాడు!*


*తానేమీ కనుగొనలేక, రాజు తన మంత్రులను ఆ తేడాను కనుక్కోమన్నాడు.*


*మంత్రులు అన్ని వైపుల నుండి ఆ బొమ్మలను చూశారు కాని వాటిలో రహస్యాన్ని ఛేదించలేకపోయారు.*


*రాజు అప్పుడు రాజ పురోహితుడిని {రాజగురువుని} చూడమని అడిగాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఆ బొమ్మలను పరిశీలించి మూడు గడ్డి పరకలను తీసుకురమ్మని ఆదేశించాడు.*


*గడ్డి పరకలు తీసుకురాగానే, రాజపురోహితుడు మొదటి బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు.*

 

*అందరూ చూస్తూండగా ఆ పరక నేరుగా కడుపులోకి వెళ్లి, కొద్దిసేపటి తర్వాత, ఆ బొమ్మ పెదవులు కదిలి, ఆపై మూసుకుపోయాయి.*


*తరువాత, ఆయన పక్కన ఉన్న బొమ్మ చెవిలో ఒక గడ్డిపరకని దూర్చాడు, ఈసారి మరొక చెవి నుండి గడ్డిపరక బయటకు వచ్చింది తప్ప మరే కదలిక లేదు.*


*ఇది చూసిన ప్రతి ఒక్కరిలో తరవాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మరింత పెరిగింది.*


*ఇప్పుడు ఆయన మూడవ బొమ్మ చెవిలో గడ్డిపరకని దూర్చాడు, దాని నోరు ఒక్కసారిగా తెరుచుకుని  ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా కదులుతూ ఉంది.*


*ఇది చూసిన రాజు, "ఇదంతా ఏమిటి? ఈ బొమ్మల ధరలో ఎందుకు అంత తేడా ఉంది?" అని రాజ పురోహితుడిని అడిగాడు.*


*పురోహితుడు ఇలా సమాధానమిచ్చాడు, "సద్గుణవంతుడు ఎప్పుడూ తాను విన్నదాన్ని తనలోనే ఉంచుకుంటాడు, దానిని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే నోరు తెరుస్తాడు. అదే అతని గొప్పతనం.*


*ఇది మొదటి బొమ్మ నుండి మనకు లభించే జ్ఞానం. ఆ కారణం చేతనే దాని విలువ వెయ్యి బంగారు నాణేలు.”*


*కొంతమంది ఎప్పుడూ తమలో తాము నిమగ్నమై ఉండి, మిగిలినవేవీ పట్టించుకోరు. వారు ఇతరుల నుండి ఎటువంటి ఆసక్తి లేదా ప్రశంసలను కోరుకోరు. అలాంటి వ్యక్తులు ఎవరికీ హాని చేయరు.*


*రెండవ బొమ్మ నుండి మనం నేర్చుకునేది ఇదే, దాని విలువ వంద బంగారు నాణేలు అవడానికి కారణం ఇదే.*


*కొంతమందికి చెవులు బలహీనంగా ఉండి, నోరు వదులుగా ఉంటుంది. 

ఏదైనా విన్న వెంటనే, అది నిజమో కాదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా చుట్టుపక్కల వారికి చెప్పి, సమాజంలో తప్పుడు జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు.*

*అందుకే దాని విలువ ఒక్క బంగారు నాణెం మాత్రమే."


♾️♾♾♾♾♾♾♾♾


*స్పృహలో ఉండి చేసే పనులలో,  మనం వల్ల జరిగే అన్ని తప్పులు ఎక్కువగా మనం ఏమి మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం అన్నదాని మీదే ఆధారపడి ఉంటాయి.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



           *భగవన్నామ స్మరణ!*

                 ➖➖➖✍️


*ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు.    అవి ఏమిటి అంటే…ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి!*


*ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు. ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు.*


*అవి సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు!*


*అవునా ఎలా అంటారా..?*


*మీకు నచ్చిన వంశపారపర్యంగా వచ్చిన ఆ తండ్రి పరమాత్మ నామ స్మరణ చేస్తే చాలు!*

*ఆ వెలకట్టలేని రెండు సంపదలు ఇస్తాడు.*


*నిజం!      దైవ నామ స్మరణ!!*

*ఇందులో మాధుర్యము, గొప్పతనము నేను అనుభవించి మీకు చెప్తున్నాను.*


*ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే,  తరంగాలు మొదలవుతాయి.*

*అవి మన మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో, ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మదిలో నిలుపుతాయి.*


*నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం!*


*బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు. అలాగే, తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు.*


*బెల్లాన్ని కొరికి తినాలి.  తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి!*


*అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది.*


*దైవనామం, దైవం వేరు కాదు.  ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు.*


*అది నిజం అని భగవదనుభూతిపరులు తెలియజేశారు. ఉపనిషత్తుల్లో భగవన్నామ స్మరణ గురించి ఎన్నో వివరణలు ఉన్నాయి. పిలిస్తే పలికే భగవంతుడని ఎందరో భక్తులు ఋజువు చేశారు.*


*సరే, నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది.*

*మన రూపంలాగా రూపం కనిపించదు. ఎంతకాలం నిరీక్షించాలి.  ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని చాలామందికి సందేహం.*


*అందుకే కొంతకాలం నామం చెప్పి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు.*


*అక్కడే మనం నిలబడాలి.*

*దైవం ఒక అనుభవం.*

*ఇనుపముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది.*


*ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది.*


*అందులో వేడి కనిపించకపోవచ్చు. ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది.*


*నామస్మరణతో  మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారుతుంది.*


*కొన్నాళ్లకు మనసే మారిపోతుంది. పుట్టుక నుంచి వచ్చిన చెడ్డ గుణాలు ఒక్కొక్కటిగా మనల్ని వదిలిపోయి,  వాటి స్థానే ప్రేమ వచ్చి చేరుతూ ఉంటుంది.*


*నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది. బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది. ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది. పరవశించి దివ్య తన్మయత్వంతో చేసే పరమశివుడి పంచాక్షరి అవుతుంది.*


*భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు. పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది. దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామం గొప్పతనాన్ని విశ్వానికి చాటారు.*


*పురాణాల్లో శాస్త్రాల్లో చదివేము ఆ మహానుభావులు గురించి కానీ నేను స్వయంగా అనుభవించి చెప్తున్నాను  నామస్మరణం వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను, మీ అందరి అభిమానం పొందుతున్నాను నా తండ్రి శివయ్య నాతోనే నా పక్కన ఉన్నాడు అన్న చక్కని అనుభూతి పొందుతున్నాను.*


*పూజ నిమిత్తం సామగ్రి కొనాలి. నియమాలు పాటించాలి. ధనం ఉండాలి. వ్రతాలకు, నోములకు కఠోర నియమాలుంటాయి. యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి. అందుకే, కలియుగంలో నామస్మరణను మించింది లేదని ప్రతిపాదించారు పెద్దలు.*


*ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు. పనికి ముందు నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే, ఆ చేసే పని పవిత్రమవుతుంది. అందులోని దోషాలు హరించిపోతాయి. ఆ విధంగా చేసే కర్మ ఈశ్వరార్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.*


*ఎవరి పేరు వాళ్లకు ఇష్టం. మనందరికీ మనల్ని సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు?*

*తప్పక ఉంటుంది. *

*భయంలో, బాధలో, సుఖంలో, సంతోషంలో....  పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి.*

*దైవం ఎప్పుడూ కలవడానికి తొందరగా ఉంటాడు.*

*మన నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే అతడు మనకు చేరువవుతాడు. సందేహం లేదు. ఇది ఋషుల మాట. మన ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట. ఆ తండ్రి పరమాత్మ పాదాలు దగ్గర చోటు సంపాదించుకోవడానికి చేరుకోవటానికి చక్కని మార్గం.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


కామెంట్‌లు లేవు: