దర్శన అనుభవాలు
నా వంటి సామాన్యునికి అనుగ్రహం
కంచిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న సర్వతీర్థం పశ్చిమ గట్టున ఒకసారి పరమాచార్య స్వామివారు పూజ చేస్తున్నారు. తామర ఆకులపై గంధం ముద్దలను శివ పంచాయతనంగా ఉంచి విస్తారంగా చేస్తున్న పూజ అది. దానిని చూస్తూ చుట్టూ ఒక యాభై అరవై మందిమి కూర్చుని ఉన్నాము. ఆ పూజ ఒక పందిరి క్రింద జరుగుతోంది.
ఆ భక్తుల గుంపులో కూర్చున్న నేను , నా భార్య చిన్న స్వరంతో లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాము. పూజ ముగిసిన తరువాత మా పారాయణ పూర్తయ్యే దాకా ఎటువంటి ఆటంకమూ కలగకూడదని కారున్యంతో ఎంతో ఓపికగా వేచియుండి, ధూప-దీప-నైవేదయాలు సమర్పించి హరతిచ్చారు స్వామివారు.
ఈ సంఘటన మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విషయం జరిగిన కొంత కాలం తరువాత మాకు శ్రీవిద్య ఉపదేశం లభించింది.
రామనామ మహిమ
పరమాచార్య స్వామివారు తెనంబాక్కంలో ఉన్నప్పుడు నేను నా భార్య అక్కడకు వెళ్ళాము. అప్పుడు నా పని, భక్తులు వ్రాసిన రామనామ ప్రతులని సేకరించి ‘ఐసిఎఫ్ కామకోటి సేవా సమితి’ అన్న సంస్థ ద్వారా జంషెడ్ పూర్ లో ‘రామకోటి’ అన్న మండపం నిర్మాణం చేస్తున్న ఒక భక్తునికి పంపడం. “ఎన్ని నామాలు పంపావు నువ్వు?” అని స్వామివారు అడుగగా, నేను చెప్పాను. వెంటనే స్వామివారు లోపలి గదిలోకి వెళ్లి, దాదాపు పన్నెండు కేజీలు ఉన్న రామనామం వ్రాసిన పుస్తకాలు ఉన్న ఒక పెద్ద పెట్టెను తీసుకుని వచ్చి, మమ్మల్ని పిలిచి, “ఇది నీకోసం తీసుకో” అన్నారు. శ్రీకంఠన్ వాటిని అందుకుని మాకు ఇవ్వడానికి ముందుకురాగా, స్వామివారే మాకు వాటిని ఇచ్చారు. మేము ఇద్దరమూ కలిసి వాటిని తీసుకున్నాము.
ఇది మహాస్వామి వారు మాకు ఇచ్చిన రామనామ ఉపదేశంగా భావించాము. దాన్ని మా పూజ గదిలో ఉంచుకుని కాపాడుకుంటున్నాము. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత ఈ విషయం గురించి జయేంద్ర సరస్వతి స్వామికి తెలుపగా, వెంటనే స్వామివారు, రామనామాలతో చిత్రించిన ‘సీతా-లక్ష్మణ-హనుమత్ సామెత శ్రీ రామచంద్ర మూర్తి’ ని ఇచ్చి, “ఇది కూడా ఉంచుకో” అని మమ్మల్ని అనుగ్తహించారు.
నేను కోరుకున్నట్టుగా
జనవరి 1976లో మా పెద్దమ్మాయి అఖిలాండేశ్వరి వివాహ నిశ్చితార్థం అయిన తరువాత, ఆశీస్సుల కోసం కలవైలో ఉన్న మహాస్వామివారిని కలవగా, “నీ కుమార్తె వివాహం కామాక్షి అమ్మవారి ఆలయంలోనే జరిపించు; కామాక్షి సన్నిధిలో మాంగల్యధారణం, జపం వంటి పూర్వాంగములు; సంతర్పణ దగ్గరలోని కొల్ల చత్రంలో; బంధువుల వసతి రాజవీధి చత్రం మరియు శ్రీమఠంలో; ఇలా నాలుగు స్థలాలలో. మంచిగా నిర్వహించు. నేను కోరుకున్నానని పుదు పెరియవా దగ్గర నుండి అనుమతి తీసుకో” అని చెప్పారు.
జయేంద్ర సరస్వతి స్వామివారికి మహాస్వామి వారు గురువైనా, అప్పుడు పుదు పెరియవానే పీఠాధిపతి కావున యుక్తంగా ఆలోచించి, వారి నుండి అనుమతి తీసుకొమ్మని తెలిపారు, స్వామివారు కోరుకున్నట్టుగా అని తెలిపి. స్వామివారి ఔదార్యము మరియు సరళత్వము నాకు తెలిసాయి.
పెళ్ళికి వచ్చిన బంధువులు కొందరు స్వామివారి దర్శనార్థం కలవై వెళ్ళగా, పెళ్ళి విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారని నాకు తెలవడంతో, స్వామివారికి మాపైగల ప్రేమ, కరుణను తలచుకుని ఆశ్చర్యపోయాము.
భిక్షావందనానికి ఏర్పాటు చెయ్యండి
పరమాచార్య స్వామివారు ఒరిక్కైలో ఉన్నప్పుడు, నేను కుటుంబంతో సహా స్వామివారి దర్శనం చేసుకున్నాను. అప్పుడు స్వామివారు దగ్గరే ఉన్న సేవకులు కుమరేశన్ కు ఎదో చెప్పారు. తరువాత నన్ను కుమరేశన్ పిలిచి, “చోళియులు అందరూ కలిసి భిక్షావందనం చెయ్యమని చెబుతున్నారు స్వామివారు” అని తెలిపాడు. ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నిస్తానని తెలిపాను. అంతేకాక ప్రతి చాతుర్మాస్యంలో తప్పకుండా చోళియుల భిక్షావందనం జరగాలని స్వామివారు కోరారు.
దీని విషయమై ఒక వారం తరువాత, పరమాచార్య స్వామి వారి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాము. చిత్తూరు గోపాలకృష్ణ అయ్యర్, నేను, సుందరం అయ్యర్ మరియు అతని తమ్ముడు, కుమరేశన్ మరి కొంతమంది సమావేశంలో ఉన్నాము. ‘చోళదేశీయ ఊర్ధ్వశిఖా బ్రహ్మణాళ్ భిక్ష’ అన్న పేరును స్వామివారే సూచించారు. “మీలో ప్రముఖుడు కృష్ణప్రేమి. అతణ్ణి పోషకుడిగా ఉంచి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరం మీ శాఖ తరుపున భిక్ష ఏర్పాటు చెయ్యండి” అని తెలిపారు. దాని ప్రకారమే ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం భిక్షావందనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ భిక్షావందనం పరమాచార్య స్వామివారి ఆదేశం వల్ల జరుగుతున్నది కావున, దాన్ని ఎంతో భక్తీ శ్రద్ధలతో చేస్తున్నాము మేమందరం.
‘గురురత్నమాలా’ అనే గ్రంథంలో శ్రీ కామకోటి పీఠం ఆచార్యులందరి గురించిన విషయాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో కొందరు పీఠాధిపతుల గురించి చెబుతూ, వారు ‘ద్రావిడ బ్రాహ్మణ’ శాఖకు చెందినవారుగా ఉంటుంది. అంటే, ఈ పీఠాన్ని అధిష్టించిన ఎందఱో ఆచార్యులు ద్రావిడ బ్రాహ్మణులు. ఊర్ధ్వశిఖ బ్రాహ్మణులు మాత్రమే ద్రావిడ బ్రాహ్మణులు కదా అన్న అనుమానం కలుగుతుంది. బహుశా అందుకే పరమాచార్య స్వామివారు చోళియుల భిక్షావందనం ఏర్పాటు చెయ్యమని తెలిపారేమో.
హగరిలో అప్పర్ గురించి
నది ఒడ్డున ఉన్న హగరి(నిజానికి అది ‘అఖ హరి’ - అంటే పాపనాశిని. అఖ అంటే పాపం, హరి అంటే నాశనం చెయ్యడం) అనే ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న ఒక దేవాలయం ప్రాంగణంలో పరమాచార్య స్వామివారు కొద్దికాలం బస చేశారు.
అప్పుడు స్వామివారు తమ శిష్యుడైన డన్ లాప్ కృష్ణన్ ను తేవారం చదవమని చెప్పి, స్వామివారు వినేవారు. ‘మూవర్ తేవారం’ - ముగ్గురు మహాత్ములు(అప్పర్, జ్ఞానసంబంధర్, సుందరర్) రచించిన తేవారం చాలా పెద్దది, చదవడానికి కొన్ని రోజులు పడుతుంది. అక్కడే ఉండి డన్ లాప్ కృష్ణన్ పరమాచార్య స్వామి వారి కోసం చదువుతుండేవాడు.
అప్పర్ చైత్ర మాసంలో శతభిష నక్షత్రం రోజున ముక్తి పొందారు. వారు తిరుప్పుగళూర్ అనే ఊరిలో ముక్తి పొందారు.
దీని గురించి స్వామివారు ఇలా చెప్పారు, “నీకు తెలుసు కదా? అప్పర్ ముక్తి పొందినది తిరుప్పుగళూర్ లో. అప్పర్ గర్భగృహం లోపలకు వెళ్ళాడు. అంతే! మరి తిరిగి రాలేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. కాని ఒక్క విషయం ఎవరికీ తెలియదు. శివుడు సింహంలా వచ్చాడు. ముక్కలుగా కొరికి తినేశాడు. అప్పర్ ఆన్నాడు, “తండ్రీ ఇది నాకు చాలా బాధగా ఉంది”. అందుకు స్వామి, “అప్పనే! నువ్వు నాకు చాలా తీయగా ఉన్నావు”. (గర్భగృహంలో శివలింగం వెనకాతల ఈ విషయాన్ని తెలిపే ఇత్తడి ఫలకం ఉండేది, ఇటీవల దాని తొలగించారు). తిరుప్పుగళూర్ పత్తికంలో అప్పర్, స్వామివారిని ‘సింగమే’ అని వర్ణిస్తాడు. దీనికి ఆధారం ఈ రెండు విషయాలే”.
ఈ విషయం నేను ఇప్పటిదాకా ఎక్కడా వినలేదు, చదవలేదు. ఈ రెండు ఆధారాలతో పాటుగా మనకు లభించైన మూడవ ఆధారం పరమాచార్య స్వామివారి వాక్కు.
సంబంధర్ తేవారం చదివినప్పుడు, అతను కౌండిన్య గోత్రానికి చెందినవాడుగా తెలిసింది. మహాస్వామి వారు నావైపు చూసి, “మీది ఏ గోత్రం?” అని అడిగారు. “కాశ్యప గోత్రం” అని చెప్పాను నేను.
ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడిగారు అని అనుకున్నాను. నేను ఊర్ధ్వశిఖ కుటుంబానికి చెందినవాణ్ణి. ఈనాడు చోళియులుగా పిలువబడే బ్రాహ్మణ శాఖ.
మహాగావ్ లో మాక్స్ ముల్లర్ గురించి
మహాగావ్ అనే పల్లె కర్ణాటక రాష్ట్రంలో ఉంది. గుల్బర్గా నుండి బస్సులో అక్కడకు వెళ్ళాలి. పరమాచార్య స్వామివారు అక్కడ ఉన్నాపుడు నేను ఒకసారి వెళ్లి దర్శనం చేసుకున్నాను. నాకు గుర్తున్నతవరకు 1982 లేదా 1983 అనుకుంటా.
నేను అక్కడకు వెళ్ళినప్పుడు మహాస్వామివారు విద్యారణ్యుల గురించి చెబుతున్నారు.
“శ్రీ విద్యారణ్యులు నాలుగు వేదాలకు భాష్యం వ్రాశారు. మాక్స్ ముల్లర్ అనే ఒక జర్మనీ దేశీయుడు కూడా భాష్యం వ్రాశాడు. తరువాత ఎంతోమంది పాశ్యాత్య మేధావులు, వాళ్ళ పుస్తకాల్లో వేదాల గురించి వ్రాశారు. వేదము శబ్ధ ప్రధానమైనది; అర్థ ప్రధానమైనది కాదు. ఇది ఆ పాశ్యాత్య మేధావులకు తెలిసే అవకాశమే లేదు. కాని, వారు ఎంతో శ్రద్ధతో, వేదాలను చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, అందుకోసం సంస్కృత భాషా జ్ఞానాన్ని, ఈ దేశ సంస్కృతిని తెలుసుకుని పుస్తకాల్లో వ్రాసుకున్నారు. ఇలాంటివి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వారి యొక్క దేశ సంస్కృతి దృష్ట్యా వారు మన వేదాలను, వాటి మార్గాలను అర్థం చేసుకుని పుస్తకాలలో వ్రాసుకున్న విషయాలలో తేడాలు ఉన్నాయి”.
“విద్యారణ్యుల భాష్యంలోనూ ఈ పడమటి మేధావులు వ్రాసిన పుస్తకాలలోనూ ఎక్కువ భేదాలు ఉండడం వల్ల శ్రీ విద్యారణ్యుల వేద భాష్యంలోని వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకోవడానికి తగిన పరిశోధన చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తే మనవారికి చాలా ఉపయోగ పడుతుంది. ఇద్దరు లేదా ముగ్గురు పండితులను ఈ పని కోసమే నియమించవలసి ఉన్నది”
దీనికనుగుణంగా మహాస్వామివారు, ‘వేదరక్షణ నిధి ట్రస్ట్’ ఎగ్సిగ్యూటివ్ ట్రస్టీ అయిన శ్రీ అన్నాదురై అయ్యంగార్, కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి అయిన శ్రీ సి.ఆర్ స్వామినాథన్ మరికొందరితో చర్చిస్తున్నారు. స్వామివారు సి.ఆర్ స్వామినాథన్ ను “ఇటువంటి పరిశోధనకి కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో దీనికి ఏమైనా అవకాశం ఉందా?” అని అడిగారు.
అందుకు స్వామినాథన్, “అవును ఉంది. ప్రస్తుతం వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఇటువంటి ఆర్ధిక సహాయం ఇస్తున్నాము” అని తెలిపారు.
ఈ సంబాషణ వల్లనే ‘విద్యారణ్య ట్రస్ట్’ ఏర్పాటు అయ్యింటుంది అన్నది తెలిసిన విషయం.
--- ఆర్. చిదంబరేసన్, చెన్నై - 40. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి