హృదయార్పణం అంటే !! ఎలా???
మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు.
పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించు కుంటూ ఉంటాడు.
ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమో గానీ.. అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా...
ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు... భగవంతుడిదే ఈ యావత్‌సృష్టి...
అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు...
పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.
పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు...
"పరమేశ్వరా... నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు, కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి..
అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి..
నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు..
పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా..
నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి..
ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి..
గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా..
ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి..
నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు..
మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా..
నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా..
జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా..
నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు..
విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తి పరచగలనా..
అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి..
అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి..
వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి.."
...ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు, భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే...
వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు. అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది...
నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, వస్తువులు అంతకన్నా కావు...
ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు, భక్తితో స్మరిస్తే చాలునంటాడు, కానీ మనిషి మనసు చంచలం, చపలం.
స్థిరంగా ఒకచోట ఉండదు, లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు. అందుకే... శంకరభగవత్పాదులు...
ఓ పరమేశ్వరా... నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది...
భార్యా పుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది...
క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది, అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను, దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు...
సామాన్య భక్తులను తరింప జేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది...
ఓ పరమేశ్వరా... బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది, అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు...
కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి, షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.
సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది.
కనుక నీకు నేనేమీ ఇవ్వలేను, నా దగ్గర ఉన్నది ఒక్క మనసే, అది నీకు సమర్పిస్తున్నాను..
అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.
అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు, భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.
అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు, హృదయార్పణమే పూజ, నిశ్చల ధ్యానమే భక్తి, అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు... ఈ సత్యాన్ని మనిషి గ్రహించాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి