భగవద్గీత అవతరించిన మాసం. అన్నదాతకు భౌతిక ఫలాలు, భక్తులకు ఆధ్యాత్మిక ఫలితాలు అందే కాలం. గోదాదేవి రంగనాథునిలో ఐక్యమైన మాసం. ధర్మరాజుకు విష్ణుసహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం... అదే ధనుర్మాసం. అతి శ్రేష్ఠమైన మాసం. భగవదారాధన అంటే నిష్ఠలు, నియమాలు, దీక్షలు, ఉపవాసాలు అనుకుంటాం. కానీ భక్తే గాక స్వచ్ఛమైన ప్రేమతోనూ దేవుణ్ణి వశం చేసుకోవచ్చని నిరూపించేదే గోదాదేవి వృత్తాంతం. అదే ధనుర్మాస వైశిష్ట్యం. మనల్ని ఉజ్జీవింప చేసేందుకు గోదాదేవి మానవ కన్యగా అవతరించింది. సాత్త్వికము, సులభము అయిన వ్రతాన్ని అందించింది. భగవంతుణ్ణే భర్తగా పొందింది.
శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే మహాభక్తుని కుమార్తె గోదాదేవి. కృష్ణుడి లీలలు తిలకిస్తూ ఆడుతూపాడుతూ పెరిగింది. యుక్తవయసు వచ్చేసరికి భక్తి కాస్తా ప్రేమగా మారింది. తన స్నేహితురాళ్లను గోపికలుగా, విల్లిపుత్తూరును గోకులంగా తలచేది. తండ్రి దేవుని కోసం తెచ్చే పుష్పమాలలను ధరించి, తనలో కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకనాడు విష్ణు చిత్తుని కంటపడింది. కూతురివల్ల అపచారం జరిగిందని వేదన చెందాడు. కానీ, కృష్ణుడు కలలో కనిపించి, గోదాదేవి ధరించిన పూలమాలలు అర్పించడం అపచారమేం కాదు, తనకు ఆనందం కలుగుతోంది అన్నాడు. దాంతో గోదా ప్రేమ మరింత పెరిగి, కృష్ణుని భర్తగా పొందాలని సంకల్పించింది. ద్వాపరంలో గోపికలు చేసిన కాత్యాయనీ వ్రతం ఆచరించింది. రోజుకో పాశురాన్ని (భక్తిగీతం) రచించి, గానం చేసింది. ఆ ప్రేమకు కృష్ణుడు లొంగక తప్పలేదు. గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, రంగనాథునిగా అవతరించి పెళ్లి చేసుకుంటానని విష్ణుచిత్తునికి స్వయంగా చెప్పాడు. శ్రీరంగంలో పెళ్లికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా కలియుగంలోనే మకర సంక్రాంతికి ముందురోజు భోగినాడు జరిగింది.
గోదాదేవి లక్ష్మీస్వరూపమని, తులసివనంలో స్వయంవ్యక్తమైనందున భూదేవి అవతారమని, భగవంతునికి సమర్పించే పుష్పమాలను తాను ధరించినందున ఆముక్తమాల్యద అంటారు. ఆమె తమిళంలో రచించిన పాశురాలే ‘తిరుప్పావై’ దివ్య ప్రబంధం. ద్రావిడంలో ‘తిరు’ అంటే పవిత్రం, ‘పావై’ అంటే వ్రతం. వేదాలు, ఉపనిషత్తుల సారభూతమే ఈ తిరుప్పావై.
కాలానికి కొలమానాలు
సూర్యుడు ఆయా రాశుల్లో ప్రవేశించే సమయం సంక్రమణం. ఆయా రాశుల్లో సంచరించే కాలం సౌరమాసం. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే సమయం ధనుస్సంక్రమణం. ఆ రాశిలో ఉండే కాలం ధనుర్మాసం. సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు భాగాలు. సూర్యుని సంచారం రెండు విధాలు. భూమధ్యరేఖకు ఉత్తర దిశలో సంచరించే కాలం ఉత్తరాయణం, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనం. మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్కరోజు. ‘అయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత్’ మకర సంక్రమణం మొదలు ఆరు మాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. అనంతరం కర్కాటక సంక్రమణం నుంచి ఆరునెలలు దక్షిణాయన సమయం రాత్రి. ‘గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్’ మన జుట్టు మృత్యువు చేతిలో ఉన్నట్లుగా భావిస్తూ ధర్మాన్ని ఆచరించాలి. ఉత్తరాయణంలో దైవీశక్తులు మేల్కొని ఉంటాయి. పుణ్యకార్యాలు, దానధర్మాలకు అనువైన కాలం. కురుక్షేత్ర యుద్ధంలో కుప్పకూలినా భీష్మాచార్యులు ఉత్తరాయణం వచ్చే వరకు ఊపిరి వదల్లేదు. ధర్మరాజుకు విష్ణుసహస్రనామాలు వినిపించిన పుణ్యకాలం ఇదే.
ఎంతో మహత్తరమైన ఉత్తరాయణానికి ముందు వచ్చే ధనుర్మాసం బ్రాహ్మీముహూర్తం లాంటిది. రోజులో పగటివేళ రజోగుణం, రాత్రి తమో గుణం, బ్రాహ్మీముహూర్తంలో సత్త్వగుణం వృద్ధిలో ఉంటాయి. సాత్త్విక ఫలాలు ఆశించేవారు అందుకు తగిన వ్రతాలు ఆచరించడానికి అనువైన కాలం. చాంద్రమానం ప్రకారం ఈ కాలం మార్గశీర్షమాసం అవుతుంది. భగవద్గీతలో ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు శ్రీకృష్ణుడు. రైతు శ్రమకు ఫలితం అందే కాలమిది. భౌతిక, ఆధ్యాత్మిక ఫలాల్ని అందించే పరమ పవిత్ర కాలం.
సిరినోముతో మంచి భర్త
ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి, శ్రీకృష్ణుని లేదా శ్రీరంగనాథులను అర్చించాలి. తిరుప్పావై పాశురాలను రోజుకొక్కటి గానం చేయాలి. పొంగలి నివేదించాలి. ఈ మాసంలో ఒక్కపూట భోజనం, బ్రహ్మచర్యం శ్రేష్ఠం. గోదాదేవి, శ్రీరంగనాథుల కల్యాణం చేయాలి. మనసు, వాక్కు, శరీరం అనే త్రికరణాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. భగవంతుని నామ కీర్తనం, పుష్పమాలా కైంకర్యాలతో సులభ భక్తి మార్గాన్ని సూచించి గోదాదేవి మార్గదర్శకురాలు అయ్యింది. ధనుర్మాస వ్రతం, మార్గశీర్ష వ్రతం, శ్రీవ్రతం, సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చే వ్యక్తిని భర్తగా పొందుతారని పెద్దలు చెబుతారు.
శాస్త్రీయదృక్కోణం
వైజ్ఞానికంగానూ ఈ వ్రతానికి ప్రాముఖ్యముంది. ఈ మాసం చలికాలమైనందున రాత్రి భాగం అధికం. ఉదయాన్నే ప్రసాదంగా పొంగలి, దధ్యోదనం తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. నెయ్యి, లవంగాలు, మిరియాలు ఉష్ణపదార్థాలు. వీటివల్ల దేహం సమశీతోష్ణంలో ఉండి, చర్మవ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. పెసలు బుద్ధికారకుడైన బుధునికి, బియ్యం మనఃకారకుడైన చంద్రునికి ప్రత్యేకించినవి. ఈ సాత్త్వికాహారాల ప్రభావంతో బుద్ధి వికసిస్తుంది. చలికాలంలో చర్మానికి పగుళ్లు వంటి ఇబ్బందుల నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యోదయానికి ముందే లేవడంతో స్వచ్ఛమైన గాలులతో శ్వాసక్రియ వేగవంతమై కొత్త ఉత్సాహం కలుగుతుంది.
ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ‘ముక్కోటి ఏకాదశి’ వస్తుంది. ఆరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనమున శ్రీమహావిష్ణువుని దర్శించుకుంటారు. స్వామి వారికి ఆ రోజు తులసి మాలను సమర్పిస్తారు. ఈ నెల రోజులు వైష్ణవ దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. ఉదయం, సాయంత్ర సమయాలలో స్త్రీలు తులసికోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు..
*ఈ సందేశాన్నీ యధావిధిగా ఫార్వర్డ్ చేస్తున్నాను*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి